రాజమండ్రి

శుభప్రదం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసుమతి డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ పెళ్లి సంబంధం వచ్చింది... పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి ఆనంద్. పవర్ ప్లాంటులో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు
‘అమ్మాయి బాగుంది’ అని ఆనంద్ అనగానే ఇరు కుటుంబాల వారు ఆనందపడ్డారు.
‘మీరు డిగ్రీలో ఏ గ్రూపు’ అడిగాడు ఆనంద్ వసుమతిని.
‘బిఎ స్పెషల్ తెలుగు’ సమాధానమిచ్చింది వసుమతి.
ఆనంద్‌తో పాటు పెళ్లిచూపులకు వచ్చిన వారంతా ఫక్కున నవ్వేశారు.
‘మా అన్నయ్య ఎంటెక్’... గొప్పగా చెప్పింది ఆనంద్ చెల్లి.
వసుమతి నవ్వుతూనే తలాడించింది...
ఇతర వ్యవహారాలన్నీ మాట్లాడుకుని సంబంధం ఖాయం చేసుకున్నారు.
వసుమతికి మాత్రం ఎంఎ తెలుగు చేయాలని ఎంతో కోరికగా ఉంది...
మంచి సంబంధం కావడంతో ఆమె తల్లిదండ్రులు మారుమాట్లాడకుండా కుదిర్చేసుకున్నారు...
పెళ్లి ఘనంగా జరిగిపోయింది
‘ఏమండీ నాకు తెలుగు అంటే ఇష్టం... ఎంఎ చేద్దాం అనుకున్నాను.. మీ సంబంధం మావాళ్లకి నచ్చడంతో పెళ్లిచేసేశారు... మీరు ఒప్పుకుంటే దూరవిద్యలో పిజి చేస్తాను’ పెళ్లయిన రెండు నెలల తర్వాత ఓ రోజు భర్తను అడిగింది వసుమతి...
‘ఇప్పుడు నువ్వు తెలుగు పిజి చేసి, ఉద్ధరించాల్సిన అవసరం లేదు’ అని చెప్పిన ఆనంద్ అదే విషయాన్ని తన తల్లిదండ్రులు, చెల్లెలికి చెప్పడంతో వారంతా నవ్వుకున్నారు...
‘ఏమండీ ఇంట్లో ఏమీ తోచడంలేదు.. ఎంతసేపని టివి చూస్తాను... అత్తయ్య, మావయ్య వాళ్లతో మాట్లాడతాను... నేను పిజి చేస్తానండీ..’ మళ్లీ ఓ వారం తర్వాత వసుమతి భర్తను అడిగింది
‘వసూ.. తెలుగు ఎందుకు... కావాలంటే కంప్యూటర్ నేర్చుకో... మనం అమెరికా వెళ్లిన తర్వాత ఉపయోగపడుతుంది...’ ఆనంద్ మాటలు వసుమతికి చిరాకు కలిగించాయి... చేసేది లేక మారుమాట్లాడలేదు.
పత్రిక చదువుతున్న వసుమతికి అందులో కథల పోటీ ప్రకటన కనిపించడంతో ఆసక్తిగా చూసింది...
నేటి సమాజంలో స్ర్తిల పట్ల వివక్షపై ఓ కథ రాయాలని నిర్ణయించుకుంది.
రెండు మూడు రోజులు బాగా ఆలోచించి, కథ రాయడం మొదలుపెట్టింది.. ఓ వారం తర్వాత పూర్తిచేసి, పోస్టుచేసింది..
రెండు నెలలు గడిచాయి... కథ రాసిన సంగతే వసుమతి మరచిపోయింది.
ఓ రోజు ఆనంద్‌కు ఫోన్ వచ్చింది.. వసుమతి రాసిన కథకు మొదటి బహుమతి వచ్చిందని.. రూ.50 వేలు బహుమతి అని, 20వ తారీఖున రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి అందిస్తామనేది ఆ ఫోన్ సారాంశం..
ఆనంద్‌కు నోట మాట రాలేదు.
వెంటనే వసుమతికి చెప్పడంతో తెగ సంబరపడిపోయింది.
ఆనంద్ ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పండంతో వసుమతికి అభినందనలు చెప్పడానికి పోటీపడ్డారు.
పత్రిక మార్కెట్‌లోకి వచ్చాక అందులో అచ్చయిన కథ చదివి చలించిపోయాడు ఆనంద్.
వసుమతిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు.
20వ తారీఖు రానేవచ్చింది... అంగరంగ వైభవంగా బహుమతి ప్రదానం జరిగింది.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం అంటే మాటలు కాదు.. వసుమతి విషయంలో తప్పుచేశాను అనే భావన ఆనంద్‌కు కలిగింది..
అలాగే మాతృభాష తెలుగు అంటే ఉన్న చులకన భావం వెంటనే తొలగిపోయింది.
‘ఎంఎ తెలుగుకు ఎప్పుడు అప్లయ్‌చేస్తున్నావు...’ ఓ రోజు ఉదయం తనను అడుగుతున్న ఆనంద్‌ను చూసి వసుమతి ఆశ్చర్యపోయింది.
‘నీ కోసం ఆంధ్రా యూనివర్శిటీ దూర విద్య దరఖాస్తు తెప్పించాను. నిన్ను చాలా తేలికగా తీసుకున్నాను... నన్ను మన్నించు’ అన్నాడు ఆనంద్
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన వసుమతి వెంటనే దరఖాస్తు పూర్తిచేసింది. తెలుగు అంటే ఉన్న మక్కువతో చాలా శ్రద్ధగా చదవడంతో 80 శాతం మార్కులతో ఎంఎ పూర్తిచేసింది..
ఆ తర్వాత నెట్ రాయడం, ఎంఫిల్, పిహెచ్‌డి పూర్తిచేయడం అంతా కలలా జరిగిపోయింది..
స్ర్తి సాహిత్యంపై పరిశోధన చేసే అదృష్టం కలిగింది వసుమతికి.
ఆ పరిశోధన సమయంలో ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
కథలపై ఉన్న ఆసక్తితో రచనలు ప్రారంభించింది... వరుసగా కథలు, నవలలతో ఎవరూ ఊహించని ఉన్నత స్థానానికి చేరుకుంది.
తెలుగు అంటేనే నవ్వుకునే అత్త, మామ, ఆడపడుచులు ఇప్పుడు వసుమతి అంటే ఎంతో గౌరవంగా చూస్తున్నారు.
తనకు వెన్నంటివుండి ప్రోత్సహించిన భర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంది.
ఐదేళ్ల తర్వాత ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన వసుమతి మహిళగా మరో విజయాన్ని తన సొంతం చేసుకుంది.
తెలుగు భాష అంటే ప్రాణంగా భావించే వసుమతి తన కుమార్తెకు ‘సంహవ్య శుభాన్విత’ అని పేరు పెట్టింది... అంటే శుభప్రదమైన అని అర్థం.

- నల్లపాటి సురేంద్ర
94907 92553

అమ్మాయి నవ్వితే...

కథానిక

ఈ తరం కుర్రకారు ఎవరైనా అమ్మాయి అలవోకగా చూసి ఏమరుపాటుగా ఎవరినో చూసి నవ్వితే తననే చూసి నవ్విందని తెగ ఫీలయి వింత చేష్టలు చేస్తూ వెర్రెక్కిపోతుంటారు.
శ్రీ్ధర్ శ్రీకాకుళం నుండి ఎక్స్‌ప్రెస్ బస్సులో నుండి గురుద్వారా బస్టాప్ వద్ద దిగాడు.
ఇంతలో ఫోన్ వచ్చింది. మాట్లాడుతూ బస్టాప్ వైపు చూశాడు. ముగ్గురమ్మాయిలు శ్రీ్ధర్ వైపు చూస్తూ వారిలో వారు ఏదో మాట్లాడుకుంటున్నారు. కాని వారు తన వైపే చూసి నవ్వారని శ్రీ్ధర్ అనుకున్నాడు.
బైక్ తీసుకురమ్మని ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడు.
ఇంతలో ఆ అమ్మాయిలు ముగ్గురు బస్సెక్కేశారు. శ్రీ్ధర్ కూడా పరుగు పరుగున వెళ్లి ఆ బస్సు ఎక్కాడు. కాంప్లెక్స్ టర్నింగులో బస్సు కొంచెం స్లో అయింది. ఆ ముగ్గురు అమ్మాయిలు బస్సు దిగిపోయారు. శ్రీ్ధర్ కూడా అమ్మాయిలను ఫాలో అవుతూ బస్సు దిగాడు. ఇంతలో శ్రీ్ధర్ ఫ్రెండ్ కరుణాకర్ కూడా బైక్ మీద శ్రీ్ధర్ చెప్పిన చోటుకు వచ్చాడు.
అతన్ని చూసి శ్రీ్ధర్‌లో హుషారు పెరిగింది. ధైర్యం కూడా వచ్చింది. ఆ అమ్మాయిల దగ్గరకు వెళ్లి ‘‘హాయ్’’ అన్నాడు.
‘‘ఎవరూ?’’ అన్నట్లు వారు అతని వైపు చూశారు.
‘‘పిలిచారు కదా వచ్చేసాము. మేమిద్దరము, మీరు ముగ్గురు. ఫర్వాలేదు సర్దుకుపోదాం రండి. ఎక్కడికి వెళదాం? రండి రండి’’ అంటూ వాళ్లని విపరీత చేష్టలతో కవ్వించసాగాడు.
తమలో తాము నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న ఆ అమ్మాయిలు వాళ్ల వెకిలి చేష్టలకు సైలెంటైపోయారు. అప్పటికి వారు ఏదో నిశ్చయించుకున్నారు. ఒకమ్మాయి పక్కన ఉన్న పబ్లిక్ టెలిఫోన్‌బూత్ వద్దకు వెళ్లి ఎక్కడికో ఫోన్ చేసింది.
సమయం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పోలీసు మొబైల్ స్క్వాడ్ వాళ్ల ముందు ఆగింది. ఎదురుగా ఉన్న శ్రీ్ధర్, కరుణాకర్‌లను చూపించారు. లాఠీలు శ్రీ్ధర్, కరుణాకర్ల ఒంటిపై నాట్యం చేయసాగాయి. నాలుగు లాఠీదెబ్బలు ఒంటి మీద పడగానే టెంపరితనం, పొగరు తగ్గిపోయింది వారికి. అంతా జరిగాక పోలీసు లాకప్పులో ఉన్నారు మిత్రద్వయం.
అమ్మాయి ఎర్రగా, బుర్రగా కనిపిస్తే చాలు, అలవోకగా ఏమరుపాటుగా ఆ అమ్మాయి అనుకోకుండా నవ్వితే చాలు కుర్రకారు ఒంటి మీద తెలివి ఉండదు. ప్రతి అమ్మాయి బజారులో దొరికే రెడీమేడ్ రబ్బరుబొమ్మ అనుకుంటారు. ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒకమ్మాయి శ్రీ్ధర్ అన్న జగన్ క్లాస్‌మేట్. పేరు సుజాత. ఎప్పుడో జగన్‌తో పాటు శ్రీ్ధర్‌ను చూసింది. పలకరింపుగా ఓ చిన్న చిరు మందహాసం చేసింది. అంతే శ్రీ్ధర్ తననే చూసి నవ్విందనుకుని లాకప్ పాలయ్యాడు అతని మిత్రుడితో సహా.
కొంత సేపటికి తేరుకుని సుజాత శ్రీ్ధర్ అన్నయ్య జగన్‌కు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. జరిగిన విషయం విన్న జగన్ కంగుతిని పోలీసు స్టేషన్‌కు వెళ్లి నానా అగచాట్లు పడి శ్రీ్ధర్, కరుణాకర్‌లను సొంత పూచీకత్తుపై విడిపించి ఇంటికి తీసుకెళ్లి నానా చీవాట్లు పెట్టాడు.
‘‘ఏరా! ఆ అమ్మాయి నా క్లాస్‌మేట్ కనుక చూసి నవ్వింది. అంత మాత్రానికే ఆ అమ్మాయి నినే్న చూసి నవ్విందని డిసైడ్ అయిపోయి ఆ అమ్మాయి నీ వలలో పడిపోయిందని తోక తెగిన పాములా ఒంటి మీద స్పృహ లేకుండా ఆ అమ్మాయిని ఏడిపిస్తావా? సిగ్గులేని జన్మ’’ అంటూ చీవాట్లు పెట్టాడు.
‘అమ్మాయిలు ఎందుకో నవ్వుతారు. తమని చూసే ఆమె నవ్విందని అనుకోవడం పొరపాటు. వాళ్ల నవ్వుల వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి’ చీవాట్లు తిని బొప్పి కట్టిన తలని నిమురుకుంటూ అనుకున్నాడు శ్రీ్ధర్.

- వేగి నూకరాజు,
సెల్ : 7702141014.

పుస్తక పరిచయం

ముత్యాలు పరచిన
అక్షర చిత్రాలు
ప్రతులకు:
ఎం.ఎల్.శ్రీదేవి
78-4-36, గాంధీపురం-3
ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర,
రాజమహేంద్రవరం-533103
వెల-35/-, పేజీలు: 24

కవిత్వంలో పదచిత్రాలు ఆవిష్కరించడం కవి రచనా సామర్థ్యాన్ని తెలుపుతుంది. అదే అక్షరాలతో చిత్రాలు లిఖిస్తే కవి ప్రతిభను ప్రస్ఫుటిస్తుంది. దాన్ని అక్షరాలు ఆస్వాదించే లక్ష్యంతో ఎం.వి.రమేష్ రాసిన ‘అక్షర చిత్రాలు’ ఎలా గీసారో చదివితే చాలు. చిత్రాలుగా అక్షరం శ్రీశ్రీ ప్రవచించిన బుక్కులు కవి రమేష్‌లోని కవితామయాన్ని బలపరిచి చూపిస్తాయి. ఈ విషయానే్న ముఖచిత్రంగా కవి చిత్రకారుడి ‘బ్నిం’ చక్కగా రూపికరించారు. కవితను సొగసీకరించడం అక్షర చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తుంది.
మనసు అనగానే మనకు ఆత్రేయ కనపడతారు. అయితే ‘విశ్వరూపిణి’ కవిత చదివాక మరో మనసు కవి రమేష్ అనిపించి తీరుతారు. భాష ప్రకటించలేని / భావాన్ని భద్రపరిచే.. భాండాగారం అనడం ఆయనకే చెల్లుతుంది. ఆత్మ గురించి చెప్పే పోలికను మనసుకు అన్వయించి రమ్యమైన డైరీగా వర్ణించడం బాగుంది. ఆయనెంత ప్రగతికరవాదో ఈ కవితే దానికి అద్దంపడుతుంది. ‘కొండకు / గర్వంగా ఛాతి విరుచుకు / నిలబడటం తప్ప / తన పాదాల వద్ద / పడివున్న / పేదలను పైకి తీసుకురావడం / తెలీదు’ అని ‘ఆకార పుష్టి’ కవితలో ఈ పోలిక ఎంత వ్యంగ్యత ఉందో అంత వ్యథ ఉంది.
కన్యాశుల్కం ఆనాడు - ఈనాడేమో వరకట్నంగా మారింది. పేరే కాని మార్పు కాదు. శుల్కం ఇచ్చి ఇప్పుడు కట్నం తెచ్చింది. ఇప్పుడు స్ర్తి బతుకు బుగ్గిపాలయింది మాత్రం నిజం. త్రేతాయుగంలో శివధనస్సు విరిచి ద్వాపరయుగంలో మత్స్య యంత్రాన్ని పడగొట్టి వివాహాలాడిన వారి గొప్ప చెప్పుకుంటున్నాం. అదే కవి యుగంలో మనిషి కట్నాన్ని ఎందుకు భగ్నం చేయలేకపోతున్నాడో మగ ఆధిపత్యం మీద ‘ప్రశ్న’ మిస్సైల్‌లా వేశారు పెళ్లి కోసం కవిత. చాలా అవసరమయింది. అందరికీ ప్రయోజనకరమైనది. సమస్యను విశాలత్వం చేసి, మహిమాన్వితాన్ని సాధారణీకం చేయటంలో సమస్య తీవ్రతకు అద్దంపట్టి విశ్వనీయం అయింది ఆ కవిత.
ఎంత సాంప్రదాయపు కుటుంబం నుంచి వచ్చినా మానవతకు ముందు స్థానం ఇచ్చిన సంస్కృతి రమేష్ ఇంట వెల్లివిరిసిందనటంలో సందేహం లేదు. ‘ఆశ కొత్త’ కవితలో ఇలా అంటారు ‘అనురాగ బంధాలను / చాదస్తపు ఛందస్సుల్లో / బంధించలేను’ అని ప్రగతికరమైన ఆలోచన మనసులో పురుడు పోసుకున్నాక ప్రవచించేది మానవీయమే అవుతుంది.
మంచి ప్రతీకతో చెప్పిన కవిత ‘ఉష్ణం’. ఆకలి మంటల అవసరతను ఉష్ణం తీరుస్తుంది. కడుపు చల్లపర్చిన అసూయాగ్నిని వెళ్లగక్కటం మనిషితనం. నాలుగు లైన్లలో మొత్తం మనిషి నైజాన్ని బాగా బయటపెట్టారు.
ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అవుతుందో ఇదంతా ఎవరి స్వామ్యమో చెప్పిన కవిత ‘ఘనతంత్ర’ రాజ్యం. నేటి భారతాన్ని కళ్లకు కట్టి చూపారు. రాజమండ్రిలో కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జరిగిన శతకవి సమ్మేళనంలో చదివిన కవిత మేడుపండు స్వాతంత్య్రాన్ని పొట్టవిప్పి చూపిన కవిత.
ఇనే్నళ్ల లౌకిక రాజ్యంలో / మత కలహాల షష్టిపూర్తి ఉత్సవ / సన్నాహాలు’ అంటూ ఎద్దేవాతో నడిపారు. అంతర్జాతీయ సంస్థలకు / సలాములు కొట్టి / సర్క సత్తాక ప్రభుత్వాలు’ అని ఎగతాళి చేసి చెప్పిన నేటి భారతాన్ని చాలా పదునుగా చెప్పారు. కవితలోని లోతైన గుణం గణతకెక్కిన వైనం ఈ కవిత. రెండు పేజీల్లో అమరిన రెండో కవిత.
ప్రగతికర దృక్పథం మెండుగా ఉన్న కవి రమేష్ పురోగమన శక్తులకు దోహదం చేసే దిశగా తన కవిత్వాన్ని రాయబూనారు.
కవిలోని తాత్వికను బయటపెట్టిన కవిత ‘చీపురు సవాల్’ క్రింది వర్గాల్లోని సంఘర్షణను బట్టబయలుచేసింది. ఇది నూటికి నూరు మార్కులు ఇచ్చే అంతర్గత దృష్టి చిత్రం ‘శ్రమజీవుల కష్టంపై బ్రతికే / పరాన్న భుక్కువి నీవు’ / వెక్కిరించడమే కాదు నేను లేకుండా / ఒక్కరోజు / జీవించు చూద్దాం అని సవాల్ విసురుతున్నారు. ఈసడించుకుంటాం, అసహ్యించుకుంటాం ఆనక అవసరం కోసం వెంపర్లాడతాం. వస్తువుల యెడలే కాదు మనుష్యుల పట్ల కొంత అలా దిగువస్థాయి మనుషుల వైపు నుంచి కూడా ఈ కవితను అన్వయించవచ్చు.
చుట్టూ ఉన్న సమాజాన్ని పరికించడంలో చాలా జాగ్రత్తగా గమనించారు రమేష్. అందుకే కవిగా ఆయన అభివ్యక్తీకరణ ఆలోచనకు సానుకూలం అయింది. శబ్దాల విరుపుతో చమత్కరించడం అలవడిందంటే ఆయన వృత్తి దానికి కొంత దోహదం చేసిందనవచ్చు. వృత్తి రీత్యా పాత్రికేయుడు కావడం వల్ల పాఠకుల మనసులోకి ఎలా దూసుకెళ్లాలనే యోచన ఉంటుంది.
అలా సులభంగా పాఠకుల మనసుల్లోకి దిగిపోయాయి ఆయన కవితలు. వాడుక భాషలోనే మనం మాట్లాడుకున్నా భావాల వ్యక్తీకరణలో సులభశైలిలోనే రాస్తున్నప్పుడు విషయం అర్ధవంతం అవుతుంది. పత్రికల భాష మరింత అర్ధవంతంగా ఉంటుంది. ఇంచుమించు రెండున్నర దశాబ్దాలు పత్రికలలో పనిచేసిన అనుభవం కవిత్వంలోని సృజనాత్మకత కోసం పక్కకు వెళ్లకుండా ఆయన భావాల పరిధిలోనే కవిత్వ సృష్టి చేశారు. శీర్షిక దగ్గర్నుంచి మేటర్ వరకు అంతా క్యాచిగా ఉంటేనే చదువరులకు ఆసక్తి. దాన్ని ఆసరా తీసుకునే ఆయన రచనలు చేశారు. భాష మీద పట్టు ఒకటే కాదు ప్రేమ ఉండటం వలన దానిపై సాధికారత సంపాదించారు.
మనిషి గురించి మూడు ముక్కల్లో చెప్పారు. రామాయణం గురించి మూడు ముక్కల్లో చెప్పుకుంటే కట్టే-కొట్టే-తెచ్చే అన్న చందంగా మనిషిని సాదాకరించి చెప్పటం రమేష్‌కే చెల్లింది. చూడండి దాన్ని ‘పుట్టి ఏడుస్తాడు / గిట్టి ఏడిపిస్తాడు / వట్టి ఏడుపుగొట్టు’ అని ఎలా తేల్చేశారో. చాలా మందికి తెలిసిందే ఆయన సూత్రీకరణ ఎంత సాదానో అంత బిగి ఉంటుంది. మూడు పాదాలు మొదలు పది పాదాల్లో రాసిన మినీ కవితలే ఎక్కువ. మొత్తం ఇరవై ఏడు కవితలు. వేటికవే ప్రత్యేకత కలిగినవి. అవన్నీ శబ్ద సౌందర్యంతో వాక్య విన్యాసాలతో అందచందాలతో అలరించడం వల్ల పుస్తకం కవితా మాధుర్యం అందుకుంది. కవితా ప్రపంచంలో కొంతలో ‘చూపు’ ఉండటం వల్ల రావలసినంత ప్రాముఖ్యతతో కావలసినంత ప్రచారం రాలేదేమోననిపిస్తుంది. ఏది ఏమైనా ఓ మంచి కవితానుభూతిని మిగిల్చిన ఆనందం కలుగుతుంది. ఆయన కలం నుంచి మరిన్ని మంచి కవితా సంకలనాలు రావాలని ఆశిద్దాం.

- రవికాంత్, సెల్: 9642489244

మనోగీతికలు

కార్పొరేటు వైద్యం
కార్పొరేటు చికిత్సాలయం
సరికొత్త వాణిజ్య మార్గం
పెద్దలను ఒద్దికపరచు వైద్యం
బడ్జెట్టు ఉన్నా వైద్యవ్యవస్థ నిస్సారం

బలే వ్యాపారం కార్పొరేటు ఆరోగ్యం
అయ్యవారల అండదండలు పుష్కలం
నిబంధనలు సదస్సుకు అనుకూలం
చెల్లింపులు, నిధులు దుర్వినియోగం

సామాన్య జీవనం రోగగ్రస్థం
అశాస్ర్తియ వైద్యమే శరణ్యం
పాలకుల ఉదారత - ప్రవేటుకు వరం
ప్రభుత్వ వైద్యానికదే శాపం

వృద్ధులకు వెంటిలేటర్ల వినియోగం
ఆరోగ్యశ్రీతో సగం వైద్యం
అదుపు లేని ఔషధాల వాడకం
శరీరం సహకరించక అచేతనం

వైద్యుని విజ్ఞత, వ్యాధి నిర్ధారణ
రోగస్థితి వీటితో పనిలేదు
పలుకుబడి, స్థోమత బీమా ఉంటే
కొండమీద కోతి గుండె కూడా సొంతం

అవసరాలు - అనవసరాలు లేవు
గుండెకు స్టంట్లు, రంధ్ర చికిత్సలు
అత్యవసర సేవలు అవయవ మార్పిడులు
అండదండలున్న వారికి అడ్డేలేదు

ప్రతీ సంస్థకు ప్రత్యేకం పరీక్షలు
రెండో అభిప్రాయం ఉండాలంటారు
కొత్త డాక్టర్లు మారు పరీక్షలు
అవగాహన లేని రోగి అంగీకారాలు

అవినీతి అనైతికతకు నిలయం
కార్పొరేటు ప్రవేటు వైద్యం
వివిధ వ్యాపారాలకది నిలయం
కాదన్న వైద్యుల మనుగడ కష్టం
నవనాగరిక చికిత్స విధానం
సరికొత్త వ్యాధులకు నిలయం
వారు చెప్పిందే మన ఇష్టం
లేదు నిపుణుల కమిటీ ప్రమేయం

అంతా తెలిసినట్లే ఉంటుంది
జరుగుతున్నది మాత్రం తెలియదు
రోడ్డున పడి నా ప్రాణం దక్కింది
ఇదే నేటి కార్పొరేటు వైద్యం

- డాక్టర్ జనపాల కాళేశ్వర్రావు
రాజమహేంద్రవరం
చరవాణి: 9848142428

ప్రణయ దిగ్దర్శనం
ఆశలు
గుండెల నిండా
గుసగుసలాడతాయి

కోరికలు
మానస సరోవరంపై
పురివిప్పి నాట్యమాడతాయి

యవ్వనం
పరిమళభరిత సుమమై
పరిణపు పాన్పు అవుతుంది
తులంపులన్నీ
ఊసులాడి
వ్యామోహనపరుస్తాయి

అలంకరించుకున్న తనువులు
తపనల ప్రేమలో ఒలలాడి
జీవిత బంధంలో
తన్మయమవుతుంది

ప్రణయ మార్గంలోకి
తియ్యని సంగతులు చేరి
దిగ్ద దర్శనమవుతాయి

- అమృత్, సెల్: 9494842274

నెమలీక
నెమలీకను
చూడగానే
బాల్యం గుర్తుకొస్తుంది
కళ్లల్లో
ఇంద్ర ధనస్సు వెలుగుతుంది
కాలం సీతాకోకలా రెప్పపాటులో
ఎగిరిపోయింది
బాధల జీవితంల్లోంచి
మళ్లీ
బాల్యంలోకి ప్రవహించాలని ఉంది
అక్షరంలో నెమలీక
బాల్యాన్ని తాగి ఎదిగే వృక్షమైంది
నెమలీకను తాకితే
గుండె తడిలా, అమ్మ ఒడిలా
పాత అనుభూతి
మళ్లీ చిగురించింది
కాలం
నా పుస్తకంల్లోంచి నడిచి
వెళ్లిపోయినట్లుంది
విజ్ఞాన అక్షర కాంతిలో
ఇంకా ప్రకాశిస్తోంది
చిరిగిన బతుకులోని ఆకలి అలల
హోరు
గాయాల తీరానికి చేరలేదు
నేడు
నెమలీక వౌన ప్రపంచం లేదు
సెల్ రణగోల మధ్య
క్షణాలు జైలు గోడలై నవ్వుతున్నాయ్

- నల్లా నరసింహమూర్తి, అమలాపురం, సెల్: 9247577501

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net

- నల్లపాటి సురేంద్ర