రాజమండ్రి

తథాస్తు! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డీ వ్యాపారి వరహాలశెట్టి కవి తెనాలి రామకృష్ణకు అప్పించేందుకు వెనుకా ముందూ ఆలోచిస్తున్నాడు.
‘తీరా కవిగారికి అప్పు ఇచ్చాక.. ఎప్పటికీ ఆయన తీర్చకపోతే ఇస్తావా.. ఛస్తావా అని అడగకూడదు. అడిగితే రాజాశ్రయంతో తనని ఏదో ఒక సమస్యలో ఇరికించి అష్టకష్టాలు పెట్టవచ్చు. అంత్య నిష్టూరం కంటే.. ఆది నిష్టూరమే మేలన్న చందంగా.. అప్పిచ్చి నానా ఇబ్బందులు పడడం కంటే.. ఆయన కబురుపెట్టినప్పుడల్లా సొమ్ము నిండుకుందని చెబితే సరిపోతుంది’ అని అనుకుని వరహాలశెట్టి కవి రామకృష్ణ కబురుపెట్టిన ప్రతీ పర్యాయం ‘కవిగారికి నమస్సులు.. నన్ను అన్యధా భావించక మన్నించాలి.. ప్రస్తుతం నావద్ద ధనం అమారుగాలేదు. తమరు కబురంపిన వేళావిశేషమేమిటో గానీ.. ఆ సమయంలో నా వద్ద ఏగాణి కూడా ఉండడం లేదు. తమ వంటి వారికి రుణం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.. ఇకముందు మీ వార్త వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి నా బాకీ తీర్చిన సొమ్ము వస్తే తమకు తప్పక సమర్పించుకుంటానని మనవి చేసుకుంటున్నాను..’ అంటూ స్తుతించి తిరిగి సమాధానం ఇవ్వసాగాడు. పాపం తథాస్తు దేవతలుంటారనే విషయం మరిచిపోయాడు.
రామకృష్ణ కవికి శెట్టి పితకలాటక బుద్ధి పూర్తిగా అవగతమైంది. అసలు కవిగారికి అప్పు అవసరం లేదు. కాని శెట్టి నుండి అప్పు పొందడానికి పట్టుదల పట్టాడు. అందుకని చాలాసార్లు కావాలని కబురు పెట్టాడు. శెట్టి తెలివిగా తప్పించుకుంటున్నాడు.
అప్పివ్వకూడదని శెట్టి.. ఎలాగైనా తీసుకోవాలని రామకృష్ణ పోటీ పడ్డారు.
ఆ రీత్యా ఒకనాడు కవిగారు శెట్టి గృహానికి స్వయంగా బయల్దేరి ఆలోచించుకుంటూ నడచి వస్తూన్నాడు. దారిలో చాలామంది అభివాదాలు చేశారు.
‘అయ్యా! తమరెవరో నాకు తెలీదు. అయినా తమకు నా పాదాభివందనాలు..’ అంటూ ఒక పల్లె యువకుడు రామకృష్ణుడి కాళ్లకి అడ్డం పడడం వల్ల ఆగిపోయి ‘ఏ ఊరు వాడివి’ అని ప్రశ్నించాడు.
‘నాది అగ్రహారం.. నా పేరు గోపయ్య. మా తండ్రి గతించారు. చదువూ సంధ్యలేని వాడిని.. నాకు సాయం చెయ్యి స్వామీ’ అంటూ గబగబ తన వృత్తాంతం చెప్పుకొచ్చాడు. అంతా విన్న కవి రామకృష్ణ గోపయ్యని వెంటబెట్టుకుని తీసుకువెళుతూ గోపయ్యకి చెప్పాల్సింది చెప్పాడు. తర్వాత ఇద్దరూ శెట్టి ఇంట కాలుపెట్టారు. వరహాలశెట్టి కవిగారిని గౌరవించి కూర్చండబెట్టి ‘మహానుభావా! ఏమి శెలవు..’ అని నమస్కరించాడు. గోపయ్య చేతులు కట్టుకుని ఒక పక్కన నిలబడ్డాడు. శెట్టికి గోపయ్య ఎవరో తెలీదు. కవిగారి తాలూకూ అనుకుంటున్నాడు. గోపయ్యకు కూడా శెట్టి తెలీదు. చూడసాగాడు.
కవి రామకృష్ణ శెట్టి యోగక్షేమ సమాచారాలు విచారించాక వడ్డీ వ్యాపారం ఎలా ఉందని ప్రశ్నించాడు. వెంటనే శెట్టి ‘వ్యాపారం బాగా గడ్డుగా ఉంది.. అప్పు తీసుకున్నప్పుడు ఉన్న శ్రద్ధ తిరిగి తీర్చడంలో చూపించడం లేదు. అందుకే వడ్డీ మానేసి అసలు ఇస్తే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. దేవుడిపై ఒట్టేసి చెబుతున్నాను.. నన్ను నమ్మండి’ అని నోరు జారాడు. తథాస్తు మాట మర్చిపోయాడు.
‘శెట్టీ! నీ వడ్డీ వ్యాపారం సజావుగా లేదని నవ్వుచెప్పాక నిన్ను అప్పు కోరడానికి నాకు నోరు రావడం లేదు’ అని కవిగారు అన్న వెంటనే శెట్టి తన తెలివితేటలకు తానే మురిసిపోయాడు. ఇప్పుడు ఈ క్షణంలో నా బాకీదారుల్లో ఎవరైనా నా అప్పు తీర్చడానికి వచ్చినట్లయితే వడ్డీ అడగను.. అసలు తీసుకుంటాను. ఆ సొమ్ము మీరు వద్దన్నాగానీ మీకు అప్పిస్తాను. నా మాట నమ్మండి’ అని ఎవరూ రారన్న నమ్మకంతో దృఢంగా అన్నాడు. ఇప్పుడు కూడా తథాస్తు దేవతలని విస్మరించాడు.
మరుక్షణం గోపయ్య తన చేతి సంచి నుండి నగదు తీసి రామకృష్ణుడికిచ్చాడు. శెట్టి అయోమయంగా చూడసాగాడు.
‘శెట్టి! ఇతను గోపయ్య. ఇతడి తండ్రి గోవిందయ్యకి అప్పిచ్చావు. గోవిందయ్య చనిపోయే ముందు పొలం అమ్మి నీ అప్పు తీర్చమని చెప్పి కాలం చేశాడు. కర్మకాండలు ముగిసాక గోపయ్య పొలం అమ్మితే వచ్చిన సొమ్ము అసలుకి సరిపోతుంది. వడ్డీ మిగిలిపోతుంది. నీ ముఖ పరిచయం కూడా లేని గోపయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నిన్ను కలుసుకుని అసలు ఇచ్చి వడ్డీ రాయితీ అడగాలనుకున్నాడు. నాకు దారిలో తటస్తపడి ఇదంతా చెప్పాడు. ఈ తండ్రి కొడుకుల నిజాయితీ నన్ను ముగ్ధుడిని చేసింది. అందుకే వెంటబెట్టుకొచ్చాను. కాగల కార్యం గంథర్వులే తీర్చినట్టు నీ మాట నిలుబెట్టుకుంటావని ఆశిస్తున్నాను’ అని వివరించేసరికి వరహాలుశెట్టి గబగబ లోపలికి వెళ్లి గోవిందయ్య రాయించి ఇచ్చిన రుణపత్రాలు తెచ్చి కవిగారి చేతిలో పెట్టాడు. ఆయన పత్రాలు, నగదు గోపయ్యకిచ్చాడు. గోపయ్య ధనం శెట్టికిచ్చి దండం పెట్టాడు.
తర్వాత ఆ ధనాన్ని శెట్టి ఇవ్వగా తీసుకున్న రామకృష్ణుడు ‘వరహాలశెట్టి! నువ్వు చెప్పింది చెప్పినట్టు వడ్డీ మానేశావు. నాకు అప్పిచ్చావు. ఇలాగే జీవితాంతం మాట మీద నిలబడు. వరహాలశెట్టి దయార్ద్ర హృదయుడన్న మంచిపేరు గడించుకుంటావు. పేరు శాశ్వతం.. సంపద అశాశ్వతం. నీ వద్ద రుణం పొందాలన్న నా కోరిక తీరింది. తీసుకో’ అంటూ రామకృష్ణ కవి నగదు తిరిగి ఇచ్చేశాడు. ఇద్దరూ కవిగారికి పాదాభివందనం చేశారు.

- మాధవరపు కృష్ణ,
డోర్ నెంబరు- 8-21-12, పూళ్లవారి వీధి,
గాంధీనగరం, కాకినాడ -533004

పుస్తక సమీక్ష

కవిత్వ దాహార్తిని తీర్చేది..
‘దోసిలిలో నది’
ప్రతులకు
దాట్ల దేవదానంరాజు, 8-1-048, ఉదయిని
జక్రియనగర్, యానాం - 533464
సెల్ - 944015987
పేజీలు -84 - వెల: రూ.60/-

కవిత్వం చదివాక మనసు ఉప్పొంగాలి. తనవు పులకించాలి. ఆ కవిత్వం ఎక్కడ దొరుకుతుంది. ఏ ప్రాంతంలోది?, ఏ జాతీయత?, అని యోచించనవసరం లేదు. కవిత్వంతో మమేకమైపోయి కవితనే శ్వాసించడం అంటే ఏమిటో దాట్ల దేవదానంరాజుగారి కవిత్వం చదివితే చాలు. ఆయన కవిత్వాన్ని చదివి పలవరించవచ్చు. తర్వాత పరవశించవచ్చు. ఆశ్చర్యం అనుకుంటున్నారా?.. ఆనందించాక తెలుస్తుంది దాని అనుభూతి. అనుభవ సారమైనాక అర్ధం చేసుకునే అంతరంగం ఎంతో ఉత్సవ భరితమై ఉత్సాహగానం చేస్తుంది.
ఇంతకీ కవిత్వాన్ని ఎంతెలా చదవాలో కాదు.. ఎంతగా చదవాలి, ప్రశ్నించాలనిపిస్తే సమాధానం వెతుక్కోవడం కోసం..సమాచారం తెలుసుకోవడం కోసం ఆతృత పడనవసరం లేదు. అది దాట్ల వారి ‘దోసిలిలో నది’ చదివితే చాలు. ఆయన రాసిన పద నాలుగో పుస్తకం. కవిత్వంలో తొమ్మిదో పుస్తకం. ఇది ఆయన సీనియార్టినీ తెలిపే క్రమం కాదు.. కవిత్వం పట్ల సిన్సియార్టినీ బట్టబయలు చేసే విషయం. ఓ కవి మిత్రుడంటాడు..పుస్తకాల్ని చదవడం రెండు రకాలని. ఏకబిగిన చదివించేవి కొన్ని. పుస్తకం మూసినా మళ్లీ చదవాలనిపించేవి కొన్ని అంటూ. కొంత విభజన చేశాడు. అయితే మళ్లీమళ్లీ చదవడం, విరామం లేకుండా చదవడం.. విసిగించకుండా, తనవు తీరక చదవడం, చదివాక రీఛార్జి అవ్వడం లాంటివి చెప్పలేదు. అవన్నీ దాట్ల వారి కవిత్వం చదివితే చక్కగా సమృద్ధికరంగా అధిగమించే స్థాయిలో దొరుకుతాయి. ఆకలిగొన్న కవిత్వాన్ని ఆబగా చదవడమే కాక ఆకళింపు చేసుకోడానికి ఆలోచనాత్మకం చేసుకోవడానికి దేవదానంరాజుగారు ఒక చక్కని మార్గాన్ని సిద్ధం చేశారు. ఏమి చెబితే కవిత్వమవుతుందో ఏది కవిత్వమో చెబుతున్నారు చూడండి..‘అక్షరాల్ని వత్తి/ అతి సుతారంగా పదంచేసి/ ఒకింత భావుకత తాపి/ శిల్పిలా తదేక వీక్షణంతో బొమ్మ చెక్కితే’ కవిత్వవౌతుందట. ‘వెనె్నల వెలుగుల్ని/ మంచి గంధంలా/ అరగదీసి రంగరించి’తే కవిత్వం అవుతుందంటారు. ఎంత మనోహరంగా ఉంది. అంత కమ్మగాను ఉంది. అదే ‘దోసిలిలో నది’ చెప్పిన కవిత్వమర్మం.
కవిత్వం ఒక తీరని దాహం..అంటాడు మహాకవి శ్రీశ్రీ. దాట్ల వారయితే కవిత్వపు నదిని సృష్టించి దోసిలిలో పోశారు. కనుక బోలెడంత దాహార్తిని ఆబగా చదివి తీర్చుకోవచ్చు. ‘నదిని మొత్తం/ ఔపాసనపట్టి/ దోసలి నింపుకుంటాను/ ప్రతిబింబంగా నేను’ కవినంటూ చెప్పిన దాట్ల వారు, మనిషి గురించి చెప్తూ ‘కళ్ల నుండి జారిన దుఃఖం/ దోసిలి నిండింది’ అంటారు. అయితే ‘నదిని దోసిలి నింపుకోడం/ జీవన సమరంలో ఈదురాడటం/ రెండూ కష్టమే’నంటూ నదిని కన్నీటికి ప్రతీక చేసి ‘దోసిలిలో నది’ చూపారు.
‘ప్రకృతికి ఒడి ఒకింత ఊరట’ అని భావించే వారినే కాదు.. మరెందర్నో ‘మీరెప్పుడైనా../ వేయి చంద్రుల వెనె్నల్లో/ జలకాలాడారా..పోనీ విహరించారా?’ అని కవిగారు ప్రశ్నించే మాటకు, జవాబు 84 పుటల నదిలో ఈదులాడితే మనసు ఇట్టే చెప్పేస్తుంది. సాంత్వనపర్చిందో లేదో, అలాగే కళ్లతో విహరించిన మది చెప్తుందీ తన ఆహ్లాదనుభూతిని. కవిత్వాన్ని ఎలా ఒడిసి పట్టి చదవాలో చెబుతారు. కవిని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరు చెప్పగలరు? ఒక్క కవి తప్ప. ఆ కవి రాసిన కవిత్వాన్ని ఎలా పఠించాలో, అతన్ని ఎలా స్పర్శించాలో సుబోధ పరిచారు. మనకు తెలిసిన విషయాలే మనకు వచ్చిన అక్షరాలు, వాటినెలా సృజనాత్మకం చేసి మొగ్గ తొడిగించి అద్భుతపరుస్తాడో చెపుతారు దాట్ల వారు. ఓ చిన్న మర్మంతో మహత్తరపరిచే కవిని ఎలా మలిచారో చూడండి. ‘సరళ సుందరమైన పదాల అమరిక/ అజ్ఞాతంగా చిక్కుముళ్ల అగంతక కవి/ తనుగీసిన గీతల మధ్య/ ఏదీ అందనీయడు దాయడమే వాడి పని/’ అని చెప్తూనే ‘అతని భావనా ప్రపంచాన్ని చేరుకోవాలి’ అనటానికి ‘మనమే చొరవగా/ అతన్ని స్పర్శించాలి’ అనే సత్యదారిని యెరుక పరిచారు. కవిత్వాన్ని చదివితే ఏమి పొందుతామో విశదపరిచారు.
మనిషికి ప్రేరణ అవసరం. కవి అయితే మరింత అవసరం. నిలువెల్లా తడిసిన క్షణాలను సంగతులను అక్షర బద్ధం చేస్తే సరిపోదు.. మరేం చేయాలి?.. ‘అనుభూతిని కవిత్వం చేసే / రస విద్య తాళాలు కావాలి ఇప్పుడు’ అంటారు ప్రేరణ కవితలో. కవి స్వరాన్ని గురించి చెప్తు ‘హృదయ సీమను గెలుచుకొన్న/ గమ్మత్తు మాటల సవ్వడి అది’ అని చక్కని భాష్యం చెప్పారు. కవి ఎంత తపన పడతాడో చాలా గొప్పగా ఆవిష్కరించారు. చిక్కని కవిత్వ సారాన్ని రూపాన్ని ఎక్కడెక్కడ ఎంత బావుంటుందో రుచించి రచించి మరీ చెప్పారు. స్వీయానుభూతిని మనందరి నోళ్లల్లో పెట్టి సావధానపర్చారు. ‘మధురమైన మోహమేదో/ దేహాన్ని కుదుపుతుంది’ అన్న సత్యాన్ని అస్వాదపు రుచులతో ‘మోహం’ శీర్షికన సంగమపరిచారు. ఎన్ని కవితలు మనసులో మంచి అక్షరాలుగా ఇక్కడ ఆరబెట్టినా తడి సంగతులు ఎన్నో నిక్షిప్తమై ఉంటూనే ఉంటాయి. వాటిని మనసుకి అనువదించుకుంటేనే అనుభూతికరమవుతాయి. అలాంటి ఎన్నో గొప్ప అనుభూతికర సహానుభూతుల్ని నెమరువేసుకునే అవకాశం దాట్ల దేవదానంరాజు గారి దోసిలిలో నది’ కల్పిస్తుంది.

- రవికాంత్, 9642489244
జగన్మాత వైభవం

విజయములనిచ్చు
విజయదశమి!
కాంతారేష్య పపన్నానం, మగ్నానాంచ మహర్ణవే!
దుష్యుభిర్వానిరుద్దానాం త్వంగతిః పరమానృణామ్!!
త్రిశక్తులకు మూలభూతమైన పరమారాధ్య దేవత ఆ జగన్మాత. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి అని పిలుచుకునే త్రిశక్తులకు మూలపుటమ్మగా వెలుగొందుతోంది. అందుకనే జగన్మాతను ‘ముగురమ్మల కన్న మూలపుటమ్మ మా అమ్మ దుర్గమ్మ’.. అంటూ మనం భక్తితో ఈ నవరాత్రులూ కొలుచుకుంటాం. ఈ ఆదిపరాశక్తి సాత్విక, రాజస, తామస శక్తులైన మూలభూతము, ఈ మూడు గుణాల సమ్మేళనమై మూర్త్భీవించిన దుర్గమ్మను ఆరాధించటమంటే సర్వదేవతలను పూజించినట్లే! దేవీ నవరాత్రుల్లో అమ్మను పూజించటం వల్ల ఇహపర సుఖాలను త్వరగా పొందగలమని చెపుతారు.
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి జగన్మాతను ఈ ఆశ్వయుజ మాసంలో నవరాత్రులూ కొలుస్తారు. అశ్వనీ దేవతల అధిష్ఠానమైన, అశ్వనీ నక్షత్ర ప్రధానమైనది ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో అమ్మవారిని తొమ్మిదిరోజులూ తొమ్మిది అవతారాల్లో పూజించటాన్ని నవరాత్రులు అంటారు. అమ్మ మహిమలను గురించి వివరించటం ఎవరివల్లా కాదు. అది అనుభవించి తీరాల్సిందే. తల్లి ప్రేమను గురించి చెప్పమంటే చెప్పగలమా? ఆ ప్రేమను ఎవరికి వారు అందుకోవలసిందే. అదేవిధంగా ఆ జగన్మాత కరుణాకటాక్షాలను అందుకోవాలంటే ఆ మాతను పూజించే విధానాన్ని బట్టి ఆ తల్లి ప్రేమను, దయను, కటాక్షాన్ని పొందవచ్చు.
దేవీ నవరాత్రులను మూడు రకాలుగా జరుపుకోవటం ఆనవాయితీ. అందులో మొదటిది చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే శ్రీరామ నవరాత్రులు. వీటినే వసంత నవరాత్రులూ అంటారు. భాద్రపద మాసంలో వచ్చే చవితి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రులు రెండోవి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి జరుపుకునే నవరాత్రులను దేవి నవారాత్రోత్సవాలుగా జరుపుకుంటాము. భక్తిశ్రద్ధలతో నియమబద్ధ జీవితం గడుపుతూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ అకుంఠిత దీక్షతో ఈ నవరాత్రులూ ఆ తల్లిని ఆరాధిస్తే సకల పాపాల నుంచి విముక్తులవుతారని శాస్త్రం చెబుతోంది. మనకున్న రుతువుల్లో వసంత రుతువు, శరద్రుతువు గడ్డుకాలమని చెబుతారు. ఈ రెండూ యమదంష్టల్రు. ఈ కాలంలో మనుషులు రోగ పీడితులవుతుంటారు. ఈ రుతువుల్లో జననాశనం అవుతుందనీ, అందుకే రెండు రుతువుల్లోనూ దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో ఏకభుక్త వ్రతం (ఒంటిపూట భోజనం) చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఎక్కడా లోభితనం చూపకూడదు. అలా అని విచ్చలవిడిగా, తనకు మించిన ఖర్చుతో వైభవంగా ఆచరించమని కాదు. ఉన్నంతలో యథాశక్తిగా అమ్మవారిని పూజించాలి. యథాశక్తి పూజ వల్ల మాత్రమే ఆ మాత అనుగ్రహం లభించి పాపవిముక్తులు అవుతారు. భగవతి తత్వాన్ని మాతృభావంతో నవరాత్రులూ నవమూర్తులుగా ఆరాధించటం ప్రధానం.
మహకాళి : శ్రీమహావిష్ణువు చెవిలోని గుబిలి నుంచి మధుకైటభులనే రాక్షసులు ఉద్భవించారు. వారు దేవతలను ఓడించగా శ్రీమహావిష్ణువు శరణు వేడారు. ఆయన 6 వేల సంవత్సరాలు వారితో యుద్ధం చేయగా, మహాకాళి సహాయంతో మధుకైటభులను శ్రీమహావిష్ణువు సంహరించాడు.
మహిషాసురమర్దని : మాయాదేవి రెండో అవతారం మహిషాసురమర్దని. మహిషాసురుడనే రాక్షసుడు బలగర్వంతో దేవతలందరినీ జయించాడు. దేవతలు పరమేశ్వరుని, విష్ణువును ప్రార్థించగా, వారి నోటి నుంచి మంటలు వెలువడ్డాయి. ఆ మంటల నుంచి మహాశక్తి ఉద్భవించి తన వాహనమైన సింహంపై మహిషాసురుడిని వధించింది. ఈమె మహిషాసురమర్దని అయింది. ఈమెకు మహాలక్ష్మి అనే పేరూ వుంది.
మహాసరస్వతి: మూడో అవతారం శ్రీ మహాసరస్వతి. రుగ్వేదంలో, దేవీ భాగవతంలోనూ బ్రహ్మ వైవర్త పురాణంలో సరస్వతీ మాత గురించి అనేక గాధలున్నాయి. సృష్టికార్యంలో తనకు తోడుగా వుండటానికి తన జిహ్వపై బ్రహ్మ ఆమెను ధరించాడని ఒక గాధ.
నంద అవతారం : ఇక నాలుగో అవతారంగా దేవి నందుని ఇంట ‘నంద’ అనే పేరుతో జన్మించింది. శ్రీకృష్ణుని రక్షించటానికి వసుదేవుడు నందుని ఇంటి నుంచి నందని తీసుకొని చెరసాలకు చేరుస్తాడు. అష్టమ గర్భం వల్ల మరణం వుందని తెలుసుకున్న కంసుడు నందను చంపబోగా, కంసుని హెచ్చరించటం నాలుగో అవతారం.
రక్తదంతి : జగన్మాత ఐదో అవతారం రక్తదంతి. దంతి అంటే దంతాలు కలది. రక్తదంతి అంటే రక్తంతో కూడిన దంతాలు కలది. జగన్మాత అనేక మంది రాక్షసులను, అనేక రూపాలలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా సంహరించటం వల్ల అదే ఆమె రూపంగా, నామంగా పిలవబడుతోంది. జగన్మాత రాక్షసులను తన దంతాలతో సంహరించటం వల్ల ఆమె దంతాలు రక్తసిక్తములయ్యాయి. అందువల్ల ఆమెకు రక్తదంతి అనే పేరొచ్చింది.
శాకంబరీ : అమ్మవారి ఆరో అవతారం శాకంబరీ. దుర్గముడనే రాక్షసుడు దేవతలను జయించదలచి బ్రహ్మ నుంచి వరం పొందాడు. బ్రహ్మ వరంతో ముల్లోకాలను జయించి వేదాలు, మంత్రాలను తన స్వాధీనం చేసుకున్నాడు. దీంతో దేవతలు, బ్రాహ్మణులు పరమేశ్వరుని, జగన్మాతను ప్రార్థించారు. జగన్మాత మహాధనస్సు, తదితర ఆయుధాలతో దుర్గముని వధించి ఫలపుష్ప వనమూలికలను ధరించి ఆకలిదప్పికలు తీర్చే అమృత హస్తాలతో ఉద్భవించి లోకాన్ని అనావృష్టి నుంచి కాపాడింది. అందుకే ఆమెను శాకంబరిగా కొలుస్తాం.
దుర్గావతారం : జగన్మాత ఏడో అవతారం దుర్గావతారం. దుర్గముడనే రాక్షసుని గుండెను జగన్మాత ఐదు బాణాలతో చీల్చి సంహరించింది. దుర్గముడనే రాక్షసుణ్ని వధించటంతో దుర్గామాతగా పూజలందుకుంటోంది.
మాతంగి : జగన్మాత తన ఎనిమిదో అవతారంగా మాతంగి రూపంలో దర్శనమిస్తుంది. మాతంగి మహర్షి పుత్రికగా అవతరించినందున మాతంగిగా కొలుస్తారు.
భ్రామరి : జగన్మాత తొమ్మిదో అవతారం భ్రామరి. అరుణుడనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఎవ్వరి వల్లా మరణం లేకుండా వరం పొందాడు. జగన్మాత భ్రమర రూపం ధరించి అరుణుడిని సంహరించింది. భ్రమర రూపంలో రాక్షసుని సంహరించినందున ఈమెను భ్రామరిమాతగా కొలుస్తారు.
ఈ నవరాత్రులు జగన్మాతను వివిధ రూపాల్లో పూజిస్తే చివరిగా విజయదశమితో దేవీ నవరాత్రులు ముగుస్తాయి. జగన్మాతను నవరూపాలుగా ఈ నవరాత్రుల్లో కొలవటం వల్ల అన్ని పనులలో విజయాలు చేకూరతాయి.
‘సర్వం శ్రీ పరమేశ్వర జగన్మాతార్పణమస్తు’

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

మనోగీతికలు

జోహారులయ్యా! జోహార్!
వీరమాతలు కన్నవీరులారా!
జోహారులయ్యా! జోహారులు!
ధైర్య సాహసములే శ్వాసగా
నిస్వార్థ సేవకై తనువులర్పింప
సరిహద్దు చేరిన ధీరులారా! జననేతలారా!
జోహారులయ్యా! జోహారులు!
దేశమాతను చెరబట్ట ముష్కరులు మూర్ఖులై
మతిలేనివాదములు ఎనె్నన్నో సృష్టించి
క్షణక్షణం అనుక్షణం కల్లోలమే కాలగతిగా
చెలరేగి పేట్రేగి మారణకాండకు మారుపేరుగా
బరితెగించి బలికోరగ
ఒరిగినారా! నేలకొరిగినారా!
భరతమాత బడి నుండి జారినారా!
అమరులారా! జన మనోదీప్తులారా!
మీ త్యాగము వృథాకాదు
వ్యథ చెందిన ప్రజల హృదయ ఘోషతో
చెబుతాం బుద్ధిచెబుతాం
కర్కశాన్ని కాలరాస్తాం
రాజుపేద పండిత పామర
చిన్నాపెద్దా ఆడామగా తేడాలేదు
మీరు వదలిన తీపిగుర్తులను ఆదుకుంటాం
గుండెలకు హత్తుకుంటాం
కలలో ఇలలో మీ రక్తతర్పణను
మరువము గాక మరువం
కదం త్రొక్కుతాం పాదాక్రాంతమయే వరకు
ఆక్రమిస్తాం మాతో కలిసేవరకు
జోహార్! రణక్రాంతులారా జోహార్!
(ఉరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన
వీర జవానులకు అంకితం)

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరం, సెల్: 9491171327

ప్రకృతిని కాపాడదాం
గుమ్మం ముందు కూర్చున్నా....
మదిలో అలజడి రేగుతున్నా,
చినుకులు మీద పడుతున్నా,
కురులు గాలికి ఎగురుతున్నా,
అక్కడి నుంచి లేవలేకున్నా....
ఏదో ఆరాటం వెళ్లమంటున్నా,
కళ్లు మూసుకుని ప్రకృతిని
ఆస్వాదిస్తున్నా....
కాని ఆ వర్షంలోకి వెళ్లలేకున్నా,
ఎందుకంటే ప్రకృతి
కలుషితమవుతుందన్నా,
దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుందన్నా,
అందుకే అందరికీ నేనొక విజ్ఞప్తి
చేయాలనుకుంటున్నా,
దయచేసి ప్రకృతిని కలుషితం చేయొద్దన్నా....
కలుషితం చేయకపోవడం కూడా
ప్రకృతిని కాపాడటమే అన్నా....
‘వృక్షోః రక్షతి రక్షితః’

- కె లక్ష్మీప్రియాంక

స్వచ్ఛతే లక్ష్యంగా...

స్వచ్ఛతే లక్ష్యంగా సాగిపో
స్వచ్ఛ భారత్ ధ్యేయంగా మసలుకో

మీ ఇంట మా ఇంట తుక్కులు
ఏ పక్కన వేయొద్దు ఎప్పుడూ
మన చెంతే ఉన్నట్టి చెత్తలు
తెచ్చిపెట్టు ప్రతి ఇంటా తిప్పలు

స్వచ్ఛంగా ఉండడం నేర్చుకో
స్వార్ధమే లేకుండా నడచుకో
కష్టమొస్తె స్పందించ తెలుసుకో
ఓ మంచి మనిషల్లె వెలిగిపో

ఇంటా బయటా ఉండే శుభ్రత
ఇస్తుంది ఆరోగ్య భద్రత
ఆరోగ్యమే ఇస్తుంది సంపద
ఆరోగ్యవంతులే దేశ సంపద

జలమంత కాలుష్యం పొందగ
దుమ్ముధూళి చుట్టూర పెరగగ
ఏ జీవి బ్రతుకుతుంది స్వేచ్ఛగా
దేశప్రగతి ఆగుతుంది ముందుగ

- దర్భా వెంకటేశ్వరశర్మ
పెద్దాపురం, సెల్: 9396224463

ఆశోదయం
అందరికీ ఆలోచన కావాలి
సమాజ పరివర్తన రావాలి
సామాన్యుడు సమానత
కోరుకుంటున్నాడు
సాగివచ్చినవాడు స్వేచ్ఛ
కోరుకుంటున్నాడు
సమానతల వలన న్యాయం
సాధ్యవౌను!
స్వేచ్ఛ పేరుతో ప్రతి వ్యక్తి సాగించే
విశృంఖల నేరతత్వం హింసారూపమై
విషపూరితమైందీ సమాజము!!
ప్రజాస్వామ్యం పేర ధన స్వామ్యం
గోముఖ వ్యాఘ్రమని గుర్తించలేరా?
మనీ, మత, మద్యం బానిసలు.
అసమానతలు, అన్యాయాల పుట్ట
అరాచక అవినీతుల ఆటపట్టు
వృత్యాసాలు వివక్షతలు వెర్రిగా
భవిష్యత్తు ఎండిన రక్తంలా కర్రిగా
దర్శనమిస్తోంది మన సమాజము,
మానవుడనే స్పృహ వ్యక్తులే శక్తియని
చైతన్యంతో చేయగలిగితే
సమసమాజ నిర్మాణం సాధ్యవౌను.
- మహోదయ, 9441265845

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

email: merupurjy@andhrabhoomi.net

- మాధవరపు కృష్ణ