రాజమండ్రి

నాడు సాహితీ సౌరభం.. నేడు శిక్షణకే పరిమితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేద విద్యార్థులకు వరంగా మారిన
విశాఖ హిందూ రీడింగ్ రూం

సాహితీపరులకు చర్చా వేదికై, గొప్ప గొప్ప సాహితీవేత్తలకు స్ఫూర్తినిచ్చి, మహిళల్లో సామాజిక చైతన్యం నింపి, విశాఖపట్నంలో ఓ ‘సాహితీ చిహ్నం’గా నిలిచిన ‘ది హిందూ రీడింగ్ రూం’ (హిందూ పఠన మందిరం) వర్తమానంలో ఏ స్థాయిలో ఉందో గమనించినవారికి ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహముల’నే కవి వ్యాఖ్యానం స్ఫురణకు రాకతప్పదు. రావి శాస్ర్తీ, శ్రీశ్రీ, అరుద్ర, కా.రా మాస్టారు, పురిపండ అప్పలస్వామి, భరాగో, చాసో, చందు సుబ్బారావు, గొల్లపూడి వంటి సాహితీ స్రష్టలు ‘నడయాడిన’ సాహిత్యపు రణరంగ వేదిక- ప్రస్తుతం ‘కళవెలిసిన’.. సాహితీ సమరాంగణ వాటిక కావటం విచారించ దగ్గ అంశం. 1917కు పూర్వం నుంచి అత్యంత వేడుకగా ‘సాహితీ సుమసౌరభాల వేదిక’గా, ‘అభినవ భువన విజయము’గా తన అస్తిత్వాన్ని ఘనంగా చాటుకుంది. ప్రస్తుతం వైపుగా చూస్తే గుండె కలుక్కుమంటోందని సాహితీమిత్రులు మదనపడుతున్నారు.
గతమెంతో ఘనం
ఆంగ్లేయుల పాలన అది. 1836 విశాఖపట్నంలోని ప్రధాన రహదారి (నేటి వన్‌టౌన్ రోడ్డు) పక్కన ‘లండన్ మిషన్ మెమోరియల్ చర్చి’ నిర్మించి, బలవంతపు మతమార్పిడులకు పాల్పడ్డారు. స్థానికులకు ఈ వ్యవహారం పుండుమీద కారం చల్లినట్టయింది. చేయి చేయి కలిపారు. సర్ గోడే నారాయణ గజపతిరావు సహకారాన్ని అర్థించారు. గోడే ఆర్థిక సాయంతో అదే చర్చికి ఎదురుగా ‘ది హిందూ రీడింగ్ రూం’ అనే పేరుతో ఒక అమూల్యమైన గ్రంథాలయాన్ని స్థాపించారు. ప్రతీ రోజు పురాణపఠనం లేదా ఆధ్యాత్మిక విషయాలపై ఉపన్యాసాలు, సాహితీ చర్చలు నిర్వహించాలన్న ప్రధాన ఉద్దేశంగా నిర్ణయించారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే పండితులు, పౌరాణికులు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా సౌకర్యాలు కల్పించారు. సంస్కృతాంధ్ర భాషల్లో ఉన్న పురాణాలు, వేదాంత గ్రంథాలు, స్మృతులు, ఆనాటి కవులకృతులు, హిందూ మత ఔన్నత్యాన్ని తెలిపే అమూల్య ఇతిహాసాలను పొందుపరిచారు.
మహానీయుడు సర్ గోడే నారాయణ గజపతిరావు జీవించి ఉన్నంత వరకూ- అంటే 1903 వరకు వసతులు, సభలు జరిగేవి. కవులు, పండితులు, పౌరాణికులతో చర్చా గోష్ఠులు నిర్వహించి జమీందారు గోడే స్వయంగా సత్కరించేవారు.
కొనే్నళ్ళ తర్వాత అంటే, 1909 నాటికి ఈ మందిరం శిథిలావస్థకు చేరుకుంది. విక్రమదేవ వర్మ, మారేపల్లి రామచంద్రకవి, బొడ్డు రామయ్య, మరికొందరు ప్రముఖులు మందిరాన్ని రామచంద్రకవి ధర్మాశ్రమానికి తరలించారు. కొన్నాళ్ళ తర్వాత వారంతా గోడే కుమార్తె సీతాబాయి ఆర్థిక సాయాన్ని ఆర్థించారు. మహారాణి సీతాబాయి సొంత నిధులతో కొత్త భవనాన్ని(అదే ఇప్పటి భవనం) నిర్మించారు. ఈ పనులు 1917 నాటికి పూర్తయ్యాయి. రీడింగ్ రూంను తమ తండ్రి స్మృతి చిహ్నంగా ‘మహరాజా సర్ జి.ఎస్.గజపతిరావు హిందూ రీడింగ్ రూమ్’ అనే పేరుతో వ్యవహరించాలని సీతాబాయ కోరారు. భవనంలో పై అంతస్తు రీడింగ్ రూంగా ఉపయోగించాలని, కింది భాగం సామాజిక, సాంస్కృతిక, హిందూ మతపరమైన సభలకు, సమావేశాలకు ట్రస్ట్‌బోర్డు ఆమోదించిన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని షరతులు పెట్టారు. రాజకీయ సభలు నిషేధమని నిర్దేశిస్తూ, ఒక ట్రస్టు డీడ్ రాసి 1917 ఏప్రిల్ 13న రిజిస్ట్రర్ చేయించారు. ఒక ట్రస్ట్ బోర్డును నియమించి, నిర్వహణ బాధ్యతలన్నీ ట్రస్టీకు అప్పగించారు. ఈ ట్రస్ట్ బోర్డుకు విశాఖపట్నం కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. రీడింగ్ రూం దైనందిన వ్యవహారాలు చూడడానికి మేనేజింగ్ కమిటీ ఒకటి ఉన్నప్పటికీ తుది నిర్ణయం ట్రస్ట్ బోర్డుదే.
రెండో ఘట్టం మొదలు..
రీడింగ్ రూం 1917 ఫిబ్రవరి 24న ఆనాటి మద్రాస్ గవర్నర్ ద రైట్ ఆనరబుల్ జాన్ బారన్ పెంట్లాండ్ దొర ప్రారంభించారు. ఇలా.. ది హిందూ రీడింగ్ రూం 1917 నుంచి రెండో ఘట్టం మొదలైందని చెప్పొచ్చు. అనునిత్యం సాహితీ సుగంధాలతో పరిమళభరితం కావాలని ఆశించి, దాతలు, ప్రముఖులు, సాహితీ ప్రియులు సొంత ఖర్చుతో అమూల్యమైన గ్రంథాలను విరాళాలుగా అందజేశారు. అలా హిందూ పఠన మందిరం దినదిన ప్రవర్ధమానం చెందింది. అనంతర కాలంలో ప్రభుత్వం నుంచి నిధులు కూడా రాసాగాయి. తెలుగు గ్రంథాలతోపాటు ఆంగ్ల భాషలో ఉన్న అనేకమైన విజ్ఞాన గ్రంథాలు, నవలలు, నాటకాలు, కవితలు, కథ సంకలనాలు కూడా చేరాయి. సుమారు అరవై ఏళ్ళపాటు స్వర్ణయుగమనే చెప్పుకోవాలి. ఆంధ్రదేశంలో ఎక్కడా లభ్యంకాని అపూర్వ గ్రంథాలు కూడా ఇక్కడ దొరికేవి. స్థానిక ఎయు విద్యార్థులు, పరిశోధకులు, దూరప్రాంతాల పరిశోధకులు వచ్చి, వారాలు, నెలలు తరబడి ఇక్కడ ఉండి, కొన్ని గ్రంథాలకు నకళ్ళు రాసుకుని వెళ్ళేవారంటే, ఇది ఎంత ప్రసిద్ధిచెందినదో అర్థం చేసుకోవచ్చు.
రీడింగ్ రూం పై సెక్షన్‌లో లైఫ్, టైమ్, నేషనల్ జాగ్రఫిక్, రీడర్స్ డైజస్ట్ వంటి విదేశీ పత్రికలు, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ఫిల్మిండియా, కేరవాన్ వంటి మాసపత్రికలు, అనేక తెలుగు పత్రికలు ఉండేవి. ప్రతి నెలా చందా కట్టే సభ్యులు 800 మందికిపైగా ఉండేవారు. క్రైస్తవులు, ముస్లింలు, బెంగాలీలు, ఆంగ్లో ఇండియన్లు కూడా సభ్యులుగా ఉండేవారు.
పతనం మొదలు..
హిందూ రీడింగ్ రూంలో స్వార్థపరులు అడుగుపెట్టారు. బైలాస్‌ను అనుకూలంగా మార్చుకున్నారు. కొత్త సభ్యులు చేరడానికి వీలు లేకుండా డిపాజిట్ మొత్తాన్ని, నెల చందాను అమాంతం పెంచేశారు. ఫిక్సెడ్ డిపాజిట్లను భవన మరమ్మతుల పేరిట ఖర్చు చేసేశారు. జూదశాలగా మార్చి ప్రతిరోజూ వేల మీద ఆర్జన వచ్చేలా వ్యవహారం నడిపారు. లోగడ కొందరు పోలీసు ఉన్నతాధికారులు జూదాలను నిలుపుచేశారు. ఆ అధికారులకు బదిలీ అయిన వెంటనే మళ్ళీ పేకాట చప్పుళ్ళు మొదలయ్యేవి. 2005లో కూడా కొత్త పోలీస్ కమిషనర్ దాడులు చేయించారు. జూదరులను అరెస్టు చేశారు. గ్రంథాలయం క్షీణించిపోయింది. బీరువాలకు చెదలు పట్టాయి. ఫర్నీచర్‌తో సహా ఎవరికి కావలసిన పుస్తకాలు వారు పట్టుకుపోయారు. రీడింగ్ రూం ముద్రతో ఉన్న పుస్తకాలు అనేకం సెకండ్‌హ్యాండ్ పుస్తకాల షాపుల ద్వారా అమ్ముడయ్యాయని అంటారు.
వర్తమానంలో కొంత మెరుగు...
సాహితీ సుగంధాలు కోల్పోయిన ది హిందూ రీడింగ్ రూంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. అరకొరగా ఉన్న తలుపులు, ద్వారాలు, కిటికీలకు చెదలు పట్టాయి. చెడు వాసనలు భరించలేని శ్లాబు పెచ్చులూడడం మొదలెట్టింది. విశాఖ సాహితీ సౌధం ఇలా కూలిపోతుండడాన్ని జీర్ణించుకోలేని స్థానిక ప్రముఖులు, దాతలు దీనిని నిలబెట్టేందుకు, తమ శక్తియుక్తులు ధారపోశారు. కలెక్టర్‌కు వివరించి కమిటీని వేయించేందుకు పూనుకొన్నారు. అలా.. కమిటీ ఏర్పడింది. మరమ్మతులకు కోసం నిధులు అవసరమయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ను సంప్రదించి రూ. 50 లక్షలు మంజూరు చేయించారు. భవనంలోని కొంతమేర మరమ్మతులు చేయించి, ఒక రూపం తెచ్చారు. కమిటీకి అధ్యక్షుడిగా తమ్మిరెడ్డి శివశంకరరావు, కార్యదర్శిగా సింహాద్రి సూరిబాబు ఉన్నారు. ఇతర కార్యవర్గాన్నీ ఎనుకున్నారు. కింది భాగంలో ఉన్న విశాలమైన మందిరాన్ని ప్రజలకు అద్దెకు ఇస్తున్నారు. ఇలా వచ్చిన నిధులను భవనం మరమ్మతులకు, ఇతర నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా, క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా మేడపైన ఉన్న మందిరాన్ని శివశంకరరావు తీర్చిదిద్దారు. ఈయనకు అలిండియా సంఘమిత్ర స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పాండ్రంగి రుక్మాకరరావు, ఇతరులు సాయాన్ని అందిస్తున్నారు.

- గున్న కృష్ణమూర్తి, 9493802010

అందరినీ భాగస్వాములను చేయాలి
1942లో నేను విశాఖపట్నం వెళ్ళాను. నాకు రీడింగ్ రూంతో ఎక్కువగా అనుబంధం ఉన్నది. పదిహేనేళ్ళకు తక్కువ కాకుండా సంబంధం ఉన్నదని నాకు గుర్తు. అక్కడ పెద్ద టేబుల్ ఉండేది. దీనిపై రక రకాల మేగ్‌జైన్స్, పత్రికలు ఉండేవి. మేగజైన్స్ నన్ను బాగా ఆకర్షించేవి. రీడింగ్ రూం రెండు భాగాలుగా ఉండేది. మేడమీద రీడింగ్ రూం. కిందన లైబ్రరీ. ఈ లైబ్రరీ నాకు చాలా ఉపకారం చేసింది. కుటుంబ బాధ్యత వల్ల నేను దూరప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. దాని వల్ల ఆ గ్రంథాలయానికి అనుబంధం కట్ అయింది. అయితే, అప్పుడప్పుడు మీటింగ్‌లకు వెళ్ళేవాడిని. రీడింగ్ రూంకు పూర్వవైభవం రావాలంటే, స్థానికులను, పెద్ద పెద్ద వాళ్ళను భాగస్వాములను చేయాలి. జోలి పట్టాలి.
- కాళీపట్నం రామారావు

వందలాది బుక్స్ చదివాం
1952-58 ప్రాంతం.. అంటే నేను చదువుకునే రోజుల్లో హిందూ రీడింగ్ రూంలో వందలాది పుస్తకాలు చదివాం. సూర్యానారాయణ అనే మేనేజర్ ఉండేవాడు. నాన్న సుబ్బారావు గారు రీడింగ్ రూంలో సభ్యులు. మేడపైన క్యారమ్స్ ఆడేవారు. ఈ గ్రంథాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. అప్పట్లో హిందూ రీడింగ్ రూం విశాఖకు పెద్ద లాండ్‌మార్క్. ఇక్కడ సాహిత్య సభలు జరిగేవి. గొర్రిపాటి వెంకటసుబ్బయ్య, మల్లాది రామచంద్రమూర్తి, అవంత్స సోమసుందర్, అబ్బూరి రామకృష్ణ, కోనంగి శ్రీరామఅప్పారావు, నేనూ, మసూనా, తదితరులు ఆ సభల్లో పాల్గొనడం గుర్తు. చిన్నతనంలో, చదువుకునే రోజుల్లో చదువుకోవడానికి ఆస్కారం కల్పించిన ఒకే ఒక్క పెద్ద గ్రంథాలయం ది హిందూ రీడింగ్ రూం.
- గొల్లపూడి మారుతీరావు

‘నవీన హిందూ
రీడింగ్ రూం’ అవసరం
చరిత్రాత్మకమైన నేటి హిందూ రీడింగ్ రూంను కాపాడుకోవడం కష్టమే. సాహిత్యాభిలాష ఉండి, సంపన్నులు, దాతలు ముందుకు వచ్చి పూర్వవైభవం తెచ్చినా, పోర్టు విస్తరణంలో భాగంగా ఆ ప్రాంతమంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పోర్టు వారు స్థానికులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఒకవేళ ప్రస్తుత రీడింగ్ రూంను పూర్వంలా తీర్చిదిద్దాలంటే చాలా సమస్యలు ఉన్నాయ. ఈ పరిస్థితుల దృష్ట్యా, టర్నర్ చౌట్రీ లేదా కొత్తగా ‘నవీన హిందూ రీడింగ్ రూం’ను నిర్మించాల్సిన అవశ్యకత ఉన్నది.
- వంకాయల సత్యనారాయణ
పరిశోధనకు వెళ్ళేవాళ్ళం
1962, 63, 64 సంవత్సరాల్లో ఎయులో చదువుకునే రోజుల్లో రీడింగ్ రూంకు వెళ్ళాను. ఇతిహాసాలపై పరిశోధన చేసేందుకు అక్కడి పుస్తకాలు ఎంతో ఉపకరించాయి. విశాఖనగరంలో ప్రాచీన, ప్రసిద్ధి చెందిన గ్రంథాలయం ఇది. అప్పట్లో ఇదే గొప్పది. ఎటువంటి పుస్తకమైనా రీడింగ్ రూంకు వెళ్తేనే దొరికేది. కొన్ని పుస్తకాలు ఫస్ట్ ఎడిషన్ కూడా దొరికేవి.
- ఆచార్య కోలవెన్ను మలయవాసిని
స్వల్ప రుసుంతో
సాహితీ సభలకు ఇవ్వాలి
స్వాతంత్య్ర లేదా సాహిత్య ఉద్యమం జరిగినా హిందూ రీడింగ్ రూం ప్రాంతంలోనే ప్రారంభమయ్యేది. రోజులు మారడంతో దూరప్రాంతమైంది. నేటి రచయితలు, సాహితీప్రియులు సభలు నిర్వహించుకోవాలంటే, ఖర్చు తడిసిమోపుడవుతుంది. స్వల్ప రుసుంతో సభలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలి. అప్పుడే సాహితీ సుగంధాలు పరిమళిస్తాయ.
- అంగర కృష్ణారావు

నిధులు వస్తురూపంలో ఇవ్వాలి
40 ఏళ్ళుగా సభ్యుడిగా ఉండేవాడిని. తర్వాత కార్యదర్శి పదవి చేపట్టాను. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించాం. దాతలు ఆదుకోవాలి. అయితే, నేరుగా నిధుల రూపంలో కాకుండా వస్తురూపంలో అందజేయాలని కోరుతున్నాం.
- సింహాద్రి సూరిబాబు, రీడింగ్ రూం కార్యదర్శి
సేవాదృక్పథంతో ముందుకు వెళ్తున్నాం
కమిటీ సభ్యులు వచ్చి అధ్యక్షపదవి స్వీకరించమని కోరారు. దాంతో ఓ రోజు రీడింగ్ రూంను సందర్శించాను. అక్కడ పరిస్థితి చూసి, బాధ కలిగింది. అభివృద్ధి నడుంకట్టాను. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాను. కొంతమంది సేవాదృక్పథం కలిగిన మిత్రులతో రీడింగ్ రూం మేడపై పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతీయువకులకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాం. సమాజానికి ఉపయోగపడే సాహితీ సభలు కూడా నిర్వహించుకోవచ్చు. హిందూ రీడింగ్ రూంకు మచ్చ లేనివిధంగా జరుపుకోవచ్చు.
- తమ్మిరెడ్డి శివశంకరరావు
డిప్యూటీ కమర్షియల్ టాక్స్ కమిషనర్,
ది హిందూ రీడింగ్ రూం అధ్యక్షుడు.

రీడింగ్ రూం జ్ఞాపకాలు
* ఆంధ్ర సాహిత్యంలో నండూరి వెంకటసుబ్బారావు ‘ఎంకిపాటలు’కు విశిష్ట స్థానం ఉంది. 1953 మే 31న ఆయనను విశాఖ రచయితల సంఘం ఆహ్వానించింది. సాయంత్రం హిందూ రీడింగ్ రూంలో సభ జరిగింది. సుబ్బారావు తన ప్రసంగంలో కొన్ని ఎంకిపాటలను వినిపించారు.

* 1953 సెప్టెంబర్ 15న సాయంత్రం కొత్త తరహా సాహిత్య సభ జరిగింది. లండన్‌లో ఉంటున్న గూటాల కృష్ణమూర్తి నిర్వహించారు. ఆ రోజుల్లో శరత్‌బాబు బెంగాలీ నవలలకు తెలుగు అనువాదాలు చాలా ప్రచారంలో ఉండేవి. ఆ రోజు జరిగిన శరత్‌బాబు జయంతి సభకు బెంగాలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. వీరిలో మహిళలూ కూడా ఉండడం విశేషం. ఎవిఎన్ కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ పాండురంగారావు ఆ సభకు అధ్యక్షత వహించారు. మూడు భాషాల్లో ఉపన్యాసాలు సాగాయి. మల్లాది వసుంధర, మసునా, అంగర సూర్యారావు తెలుగులోనూ, బెనర్జీ, మరొక రచయిత బెంగాలీలోనూ, పాండురంగారావు, ఇంకొకరు ఆంగ్లంలోను మాట్లాడారు.

* ఇదే ఏడాది డిసెంబర్ 23న మరో సాహిత్య సభ జరిగింది. పుట్టపర్తి నారాయణాచార్యులు తమిళ, కన్నడ, తెలుగు సాహిత్యాల గురించి మాట్లాడారు.

* స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చి విశాఖపట్నంలో బసచేశారు. విశాఖ రచయితల సంఘం ఆహ్వానం మేరకు 1954 మే 27న సాయంత్రం సభ జరిపారు. పురిపండ అప్పలస్వామి సభాధ్యక్షుడు. గోపాలకృష్ణయ్య ఉపన్యాసం శ్రోతలను ఆనందపరిచింది.

* 1954 ఆగస్టు 19వ తేదీన శ్రీశ్రీ ఏదో పనిమీద మద్రాసు నుంచి విశాఖ విచ్చేశారు. వచ్చీ రావడంతోనే రీడింగ్ రూంకు వచ్చి పురిపండా ఎక్కడ అంటూ అంగర సూర్యారావుని అడిగారు. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పదిమంది రచయితలతో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేశారు. శ్రీశ్రీ తాను రాసిన ‘సిపాయి చిన్నయ్య’ కథ చెప్పాడు.

* అదే ఏడాది అదే నెల 22తేదీ ఆదివారం ఉదయం రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ అధ్యక్షతన సారస్వత సభ జరిగింది. శ్రీశ్రీ తన ఉపన్యాసంలో రచయితల బాధ్యత గురించి, కష్టసుఖాల విషయమై మాట్లాడారు. అంగసూర్యారావు, కృష్ణారావు, బలివాడ కాంతారావుతోపాటు పలువురు మాట్లాడారు.

* చంద్రసేన నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా 1979 ఫిబ్రవరి నాలుగోతేదీన నాటక రచయిత అంగర సూర్యారావుకు రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ అధ్యక్షత అభినందన సభ జరిగింది.

* ‘శంకరాభరణం’ సోమయాజులుకు కూడా ఇక్కడే ఘన సత్కారం జరిగింది. ప్రముఖ కవులు, రచయితలు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ, అరుద్ర, చాసో, రోణంకి అప్పలస్వామి వంటివారికి రీడింగ్ రూంతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది.

పుస్తక సమీక్ష

తెలుగునాట చిగుర్చిన చిలకమర్తి

ప్రతులకు
పెరుమాళ్లు జానకి,
25- 15- 3/2/1
మార్కెట్ యార్డు ప్రక్కన,
సుభాష్ నగర్,
రాజమహేంద్రవరం- 533 105.
సెల్ -9440991790

ఏ దేశ మేగినా ఎందుకాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవం అంటారు రాయప్రోలు సుబ్బారావు. నిజమే మన తెలుగు జాతి గౌరవాన్ని పొగిడే మాట పక్కన పెట్టి కాపాడ్డం కూడా జరగడం లేదు. మాతృభాష కోసం మాతృభాషలో రచనలు చేసి జాతీయోద్యమంలోనే కాదు..సంఘ సంస్కరణలోను నాటక కళ ద్వారా వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించిన మన జాతీయ కవి2 శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గురించి వచ్చిన వ్యాస సంకలనం జాతీయ కవి శ్రీ చిలకమర్తి2 ఆయన మనవడు పెరుమాళ్లు రఘునాధ్ దీన్ని సంకలన పరిచారు. చిలకమర్తి 150వ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం తెలుగు భాషాభిమానాన్ని చాటే గొప్ప ప్రయత్నం..
భరత ఖండంబు చక్కని పాడియావు/ హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ/ పితుకుచున్నారు మూతులు బిగయకట్టి2..ఈ పద్యం ఎంత ప్రాచుర్యం పొందిందో అంత ప్రత్యేకను తెచ్చిపెట్టింది. జాతీయోద్యమానికి ఈ పద్యం ఊతం అయిందంటే ఆ నాటి యువతను ఎంత చైతన్యవంతం చేసే ఉద్యమం వైపు పోయేలా చేసింది.
1907లో బిపిన్ చంద్రపాల్ గోదావరీ తీరాన్న ప్రసంగించడానికి వచ్చినప్పుడు ఆ శువుగా చెప్పిన పద్యం ఇది..దేశభక్తి ప్రేరేపితానికే కాదు..దేశాన్ని జ్వలిత మానంచేశారు. ఇక ఆయన రాసిన గయోపాఖ్యానం నాటకం ఎంత ఆదరణ పొందిందంటే ఆంధ్ర దేశంలో అది ప్రదర్శించని ఊరు ఉండదంటే అతి శయోక్తి అవుతుంది. ఎందుకంటే లక్షా పాతికవేల కాపీలు అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. రంగస్థలంపై రక్తికట్టిన నాటకాల్లో ఇదే మొట్టమొదటిదంటారు మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ. ఇంతకీ అది చిలకమర్తి వారు ఇరవై రెండో ప్రాయంలో రాసిన నాటకం. అట్లానే నవలా రచనలోను అందెవేసిన చేయి. ఎక్కువ భాగం స్వతంత్ర రచనలు కావడం పేర్కొన దగినది. ఇవే గాక 83 ప్రహసనాలు రాసి హాస్య చతురతకు పెద్ద పీట వేసిన ఘనాపాటి. నలభై సంవత్సరాల వయసు వరకూ బాగానే ఉన్న వీరి కంటి చూపు 1909 నుంచి మారిపోయింది. అలాగని తన గ్రంథ రచనలేమీ ఆపలేదు. వల్లెవేసుకున్న పద్యాలను ఒకరితో రాయించుకుని గ్రంథ రచనలు చేశారు. గ్రీకు జాతీయ కవి హూమర్, విల్టన్‌లాగ ప్రకృతి రహస్యాల్ని తన ప్రతిభా బలముచే ప్రత్యక్ష పరుచుకుని కవిత్వం చెప్పిన సహజకవి. తన గ్రంథాలతో లక్షలాది రూపాయలు సంపాదించుకొనడం అంటే మాటలు కాదు. అదీ ఆ ప్రతిభాశీలురుని ప్రజ్ఞ. యుగ పురుషుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి అన్ని సంస్కరణోద్యమాల్లోనూ వారి భాషా సేవలోను కుడి భుజంగా పనిచేశారు. గురువు వీరేశలింగం గార్నే ఆశ్చర్య చకితుల్ని చేసిన గొప్ప శిష్యుడు. దానికిదే ఉదాహరణ. తంజావూరు నించి నాచన సోమనాధుని ఉత్తర హరి వంశము2 తెచ్చి రాజమహేంద్రవరంలో ముద్రించే పనిలో చేపట్టారు. ప్రింట్ అయ్యాక ఓ ప్రతి ఇవ్వబోగా దానిలోని కవిత్వ విషయాలు, పద్యాలు, ఉపన్యాస ధోరణిలో చిలకమర్తి వారు చెప్తుంటే అనుమానం వచ్చిన వీరేశలింగం గారు మరోప్రతి నీ దగ్గరుందా?..అని అడిగారట. విషయమేమిటంటే ప్రెస్ ఫ్రూఫ్ రీడర్ నుంచి సేకరించిన కాగితాలను ధారణ పట్టారన్నమాట. అంత జ్ఞాపకశీలి. కుటుంబ మిత్రులు, బంధువుల జన్మదిన ఘడియలు అన్ని కంఠతా వచ్చిన సంగతులు. వాటిని ఆయా సందర్భాల్లో ప్రస్తావించి మరీ ఆశ్చర్యపరిచేవారు.
తెలిసిన వారి దగ్గర ఫలానా పుస్తకం ఉందంటే లేదా ఎక్కడో ఉన్న గ్రంథాలయంలో ఆ పుస్తకం దొరుకుతుందంటే ఎంతో శ్రమపడి ఆ గ్రంథాల్ని చదివి నోట్సు తదితర సంగతులకు అర్రులుచాచేవారు. అయితే నేటి యువతకు శాస్త్ర సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఓ కుగ్రామం అయిపోవటం ఏమోగానీ, అంతర్జాలంలోగాని, వాట్సప్‌లోగాని మరో మాద్యమంలో వచ్చే కథలు వగైరాలను చూడటం వెంటనే మిత్రులకు షేర్ చేస్తున్నారే కానీ పరిశీలనా దృష్టితో చదవడం మాని, అసలు కంటెంటును చూడకుండానే తోసేయడం చేస్తున్నారు. నెట్ ఎంత అందుబాటులో ఉన్నా చదవడం, రాయడం చేయకపోతే భాషలోని మాధుర్యమే కాదు..్భషే మాయమైపోయే పరిస్థితి ఉందని భాషావేత్తలు గగ్గోలు పెట్టడం చూస్తున్నదే.
ఆంధ్ర అభ్యుదయ రచయతల రెండో మహా సభలో చిలకమర్తి వారికి జరిగిన సన్మాన సభలో దేవులపల్లి కృష్ణశాస్ర్తీ మాట్లాడుతూ ఓ మాట అంటారు. ఒక్కొక్కరు కొన్ని విషయాల్లో ముందుకు నడుస్తారు..కొన్ని విషయాల్లో వెనుకంజ వేస్తారు. మనిషి వెనక్కు నడుస్తూ చేయి ముంధుకు పెట్టితే లాభం లేదంటారు2. సాహిత్యానికీ, సమాజానికీ గల సన్నిహిత సంబంధాన్ని గ్రహించి, చిలకమర్తి వారు సాహిత్యాన్ని సృష్టించారంటారు. ఇంకా మాట్లాడుతూ చిలకమర్తి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మహా సందేశం ఒకటి ఉంది. అది ఆశావాదం. ఆయనకెప్పుడూ నిరాశ జనించలేదనే ఓ మహత్తరమైన మాట చెప్పారు. అది ఈ తరం యువతకు ముఖ్యంగా విద్యార్థి లోకానికి అవసరమైన టానిక్ లాంటిమాట.
చిలకమర్తి వారి వ్యక్తిత్వం గురించి వారి రచనల గురించి వారు చేసిన సమాజ సేవ గురించి లబ్ధప్రతిష్ఠులైన సాహితీ వేత్తల వ్యాసాలున్నాయి. దేవులపల్లి, మధునాపంతుల, బందా కనకలింగేశ్వరరావు, ఇంటూరి వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు రాసిన వ్యాసాలు చిలకమర్తి ప్రసహనాలు, నాటకం, పద్యం, నవల అనేక ప్రక్రియలతో సాహితీ సేవచేసారో విధితమవుతుంది. ఇక చిలకమర్తి వారి మనవలు పెరుమాళ్లు రఘునాధ రాసిన ప్రత్యేక వ్యాసం చిలకమర్తి వార్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దానితోపాటు చిలకమర్తి ఫౌండేషన్ పేరుతో వారు చేస్తున్న అనేక కార్యక్రమాల వివరాలు మనకు కనపడతాయి. ఈ వ్యాసకర్తకు ఈ పుస్తకం బహుమతిగా అందుకోవడం జరిగింది. ప్రజాపత్రిక 90 వార్షికోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించి పాల్గొన్న వారందరికీ అనేక మంది రచయతలు, కవుల పుస్తకాలను బహుమతిగా ఇచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పుస్తక ప్రియులంతా చదువరులను చేసే ప్రయత్నంలో మంచి పనిగా పుస్తక బహుకరణను కానుకగా అందిస్తారని ఆశిద్దాం!

- రవికాంత్, సెల్: 9642489244

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- గున్న కృష్ణమూర్తి, 9493802010