రాజమండ్రి

ఓ నూతన సంవత్సరమా! (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడిచిపోయిన రోజులను
ఎదగుడిలో భద్రంగా దాచుకొని
రేపటి రోజు నీ కోసం
ఎదనిండా ఆశలతో...
కళ్లలో కోటి కాంతులు
వెలుగు నింపుకొని...
ఆహ్వానిస్తున్నాము
ఓ నూతన సంవత్సరమా !
మా జీవితాలలో సంతోషాలు నింపి
బంధాలు, బంధుత్వాలు మరిచిపోకుండా
ప్రక్కవారిని ప్రేమించే తత్వాన్ని పెంచుతూ...
నిత్యం టెన్షన్లతో సతమతమయ్యే మాకు
హాయిగా, తనివితీరా నవ్వుకునేలా చేసి
విపత్తుల నుండి మమ్ము కాపాడతావని
ఆశతో... ఆకాంక్షతో...
ఆహ్వానిస్తున్నాము ఓ నూతన సంవత్సరమా !

- చింతా రాంబాబు, కాట్రేనికోన, తూ.గో. జిల్లా

మహాకవి శ్రీశ్రీ
శ్రీశ్రీ
రెండక్షరాలకు శక్తిని
కొలిచే సాధనాలు లేవు
తెలుగు సాహిత్యానికి
వెలుగు దివ్వె
అభ్యుదయ కవిత్వానికి
ఆర్యుడు మహాకవి, మహాశక్తి శ్రీశ్రీ
ఆకాశపు దారులంట హడావిడిగా
వెళ్లిపోయే
జగన్నాధ రథచక్రాలను
భూమార్గం పట్టించి
శ్రామిక వర్గానికి కవిత్వం పట్టం కట్టిన
చైతన్య కిరణం
ప్రాచీన కవిత్వం రథమైతే
వచన కవిత్వం రాకెట్టు- అన్న
శ్రీశ్రీ
కవితా లోకంలో
రాకెట్‌లా దూసుకుపోయాడు
శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’
ఆధునిక కవులకు లక్షణ గ్రంథం
తెలుగు కవిత్వానికి
యుగ కవిగా రవిగా
అడుగుజాడ గురజాడ అంటూ
కవిత్వానికి నిలిచాడు
మహాకవి శ్రీశ్రీ
(2-1-2016న మహాకవి శ్రీశ్రీ
జయంతి సందర్భంగా)

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం
చరవాణి - 92475 77501

మీలోకి తొంగి చూచుకోండి

అన్నీ మన కళ్ల ముందరే దృశ్యాలౌతాయి
కొన్ని మేడిపండు అందాన్ని ప్రదర్శిస్తాయి
లోపల ఉన్నవి పురుగులేనని తెలిసినా
దృష్టి మరల్చనివ్వని ధ్యాస
శృంగార సౌఖ్యాన్ని తలపిస్తుంది
మధువిప్పుడు ప్రాచీన సంప్రదాయపు
ఆనవాళ్లని అనుసరిస్తూ అహంకారంతో
పరవళ్ళు త్రొక్కుతున్న సముద్రం
ఎందరు ఇష్టపడి క్రీడించినా
పొంగుకొచ్చే వరదాయని
మనిషి జీవన రేఖలో భాగమైంది
ఒకప్పుడు తాగే వాళ్ల సంఖ్య లెక్కకి దొరికేది
ఇప్పుడు తాగని వాళ్లని లెక్కించడమే తేలిక
వీధి వీధిన విస్తరించిన వాణిజ్యమైంది
చీప్ లిక్కర్ సేవిస్తున్న వాళ్ళు
దేశం పాలన సాగడానికి
మేలిమి రాజబాటను నిర్మిస్తున్నారు
ఖరీదైన మద్యాన్ని సేవించే వాళ్ళు
బాటకిరువైపులా వజ్రాలు పొదుగుతున్నారు
నిర్మాణ వ్యయాన్ని సమకూరుస్తున్న వాళ్ళకి
అనారోగ్యపు ముళ్ళు గుచ్చుకుని
అందమైన కుటుంబ చిత్రం నలిగి
వాళ్ళ చేతుల్లోనే చిరిగిపోతుంది
ఆర్థిక అలజడి, నిప్పురవ్వలు పడి
తగల బడి పోతుంటే-
ఓర్వలేని స్థితి శిలగా నిలుచునుంది
త్రాగుబోతుల్లారా ఇటు చూడండి
ఒక్కసారి మీ బ్రతుకుల్లోకి తొంగి చూసుకోండి
తియ్యటి ఊహల మధు మంటల్లో
ఆహుతి అవుతున్న
కుటుంబ చిత్రం కనిపిస్తుంది
భార్యా పిల్లల దైన్యం కనిపిస్తుంది
అవయవాలు ఒక్కొక్కటిగా
కరిగిపోవడం కనిపిస్తుంది
చూచి తట్టుకుంటే రాక్షసుడివి
అల్లాడిపోతే మనిషివి

- ఎస్.ఆర్. పృథ్వీ, రాజమహేంద్రవరం

విజ్ఞత

పుస్తకాన్ని ‘కొని’ చదువుదాం!
‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’
అని సుభాషితం. అది ఒక సంపద. దాన్ని గడించటానికి పుస్తక పఠనం మేలైన సాధనం. అన్నిటినీ మించి పుస్తక పఠనం విజ్ఞతని
పెంచుతుంది అని విదురనీతిలో
ఒక పరోక్ష ఉటంకింపూ ఉంది.
మనిషి ఉన్న తత్వాన్ని విజ్ఞతే
నిరూపిస్తుంది.
పుస్తకాన్ని ‘కొని’ చదివే విజ్ఞతని
పరిరక్షించుకుందాం. కదలండి!!

పుస్తక పఠన ఫలితం ఒక జ్ఞాన సమాహారం. విజ్ఞానం, వినోదాహ్లాదం, సమాచారం, లోకవృత్తం, రీతీరివాజూ, మనిషీ, సమాజం, మనిషి స్వభావం, సమాజం పోకడ... ఇలా ఎన్నిటినైనా అందుకోవచ్చు. అది వ్యక్తి చైతన్య పరిధిని విస్తరింపచేస్తుంది. హృదయ పరివర్తనకూ దోహదం చేస్తుంది.
బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిందని సినారె గారి ఉవాచ! పుస్తక ప్రదర్శనలో కూడా లుక్ కల్చర్ కలిసే వుంది. విండో షాపింగ్ కూడా ఎక్కువే. పుస్తకాన్ని ‘కొని’ చదువుదాం. కొనటం కేవలం ‘పుస్తకం హస్త్భూషణం’ కోసం కాకూడదు. చదవటం ఒక అనుభవం. అనుభవం ఆనందాన్నిస్తుంది. ఆనందం అనుభూతిని కలిగిస్తుంది. అనుభూతి మనసుకూ, గుండెకీ ఒక చెప్పలేని అనిర్వచనీయతని పంచుతుంది. ‘కథలు చదివితే కళ్లకు వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనసుకు ఉత్సాహమూ, ఉల్లాసమూ కలిగిస్తాయి’ అని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు అంటారు. కథలనే కాదు, విషయం ఏదైనా పుస్తక పఠనం ఈ ‘రసాయన క్రియ’ని జరుపుతుంది. చదువు ప్రతిఫలాన్ని అక్షరాలతో చెప్పలేము. ఆ భావస్పందన వర్ణనాతీతం’! అందుకనే చదువు ఆవశ్యకతని అంతనూ కలగలిపి - భాగవతంలో హిరణ్యకశిపుడంతటి వాడు ఇలా చెప్పేశాడు. ‘చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్/ చదువగ వలయును జనులకు...’ అని! చదివితేనే- మంచీ చెడూ తెలిసేది మరి!
పుస్తకం మంచి మిత్రుడు అంటారు. మాటా, మనసూ కలబోసుకుంటేనే మిత్రుడైనా ‘మంచి’ చేయగలుగుతాడు. పుస్తకమూ అంతే. దానితో మాట్లాడాలి. అది చూపే దృశ్యాన్ని చూడగలగాలి. అది చెప్పే రహస్యాల్ని అంతరాంతర జ్యోతిస్సీమలో అందుకోవాలి. ఆ ‘మూడ్’ని స్వీకరించాలి. అప్పుడు పుస్తక పఠనం చెత్త ఆలోచనల్నీ, నెగెటివ్ భావాల్నీ ఊడ్చేస్తుంది. అనారోగ్యాన్ని కలిగించే ఒత్తిడి స్థాయినీ, ఉద్వేగ ఉద్రేకాల్నీ తగ్గిస్తుంది. పుస్తకం మంచి మిత్రుడు. ఒంటరితనంలో ఆప్తమిత్రుడు. అయితే ‘మంచి’ని అందించే పుస్తకం ఎంపిక- మనం ఇప్పటికే సంపాదించుకున్న చదువూ, సంస్కారం మీద ఆధారపడి వుంటుంది. వేపవిత్తు నాటుకుని మామిడి పండుని ఇమ్మంటే ఇవ్వదు కదా! సుప్రసిద్ధ కవి బాలగంగాధర తిలక్ అంటాడు, ‘తెరిచే కిటికీని బట్టి పరతెంచే పరాగం ఉంటుంది’ అని.
‘యు లివ్ సెవరల్ లైవ్స్ వైల్ రీడింగ్’ అంటాడు ఒక ఆంగ్ల కవి. ఏకకాలంలో అనేక అనుభవాల్ని ప్రసాదించే మహత్తర శక్తి పుస్తకానికి వుంది. కాగ్నిటివ్ లెవల్‌లో పఠనం అలాంటి కుదుపుని కలిగిస్తుంది. జ్ఞాపక శక్తినీ పెంచుతుంది. ఇటీవలి వైద్యశాస్త్ర పరీక్షలు పుస్తక పఠనాన్ని ఆల్జీమర్స్ వ్యాధి చికిత్సలో ఒక సాధనంగా పరిగణిస్తున్నాయి. అలాగే పఠనంలో మనం సమకూర్చుకునే ఏకాగ్రత్త, చిత్తశుద్ధికీ, సానుకూల భావభావనలకీ అవకాశం కలిగిస్తుందంటున్నారు వైజ్ఞానికులు. జ్ఞాన సాధనకు కేవలం మూడే మార్గాలున్నై. వాటిలో విద్యార్జన (పఠనం) ముఖ్యమైనది. మిగిలినవి ఇతరులు చెప్పేది వినటం, తనకు తానుగా అనుభవాన్ని పొందటం. ఎగైన్ ఆ అనుభవానికి పఠనమే తోడ్పడవచ్చు!
‘అరచేతిలో (స్వర్గం.. కాదు!) సమాచారం’ యుగం కదా ఇది! అన్నీ ఒక్క క్లిక్‌తో లభ్యం.. అంటారు, అనుకుంటారు గానీ, నూరుపాళ్లు నిజం కాదు. ఇంతకుముందే ఎవరన్నా చదివి, రాసిపెట్టి వుంటేనే కదా ఆ సమాచారం మన ‘క్లిక్’కి ‘సిద్ధము సుమతీ’ అనేది! అలాగే, పుస్తకం ‘కొని’ చదువుకోవాల్సిన అవసరం లేదు అనే భావనా ఉంది. నెట్‌లో కూరుకుపోయిన కనుచూపుకీ, పుస్తక పఠనాన్ని అంగీకరించే చూపుకీ- రానున్న ఆరోగ్య స్థితిలో చాలా తేడావుంది. (ఉంటుంది కాదు). నెట్ పరిమిత స్థాయిలో వుంటే మాత్రమే సౌలభ్యాన్ని కూరుస్తుంది. జోక్ అనుకోకూడని ఒక నిర్వచనాన్ని ఎన్నడో ఇచ్చారు ఆరుద్ర, ‘ఆధునికుడు ఒక జిరాఫీలా తయారవుతున్నాడు. రోజురోజుకూ అతని మెదడుకీ, హృదయానికీ దూరమెక్కువవుతోంది’ అని. ఎంతో అర్థవంతమైన భావం!
పుస్తక ప్రదర్శనలో అనేకానేక విషయ ప్రాధాన్యతని సంతరించుకున్న వేలవేల పుస్తకాలు. మనకు (అభి)రుచికరమైన పుస్తకాన్ని మనం ఎంచుకుంటాం. మంచిది! అయితే, మనం ఎన్నుకున్న పుస్తకం మెదడులో ఆచరణాత్మకమైన, ఆరోగ్యదాయకమైన ఆలోచనల్ని కలిగించేదిగా ఉండి, మనల్ని క్రియాశీలురుగా పురోగమింపచేసేదిగా ఉంటే- ఇంకా ఇంకా.. మంచిది అవుతుంది! పుస్తకం చదవగానే ఉద్యానవనంలో విహరించినట్లయింది అనీ, జీవితం, ప్రపంచం సరికొత్తగా గోచరించాయి- అనీ శ్రీమతి కసిరెడ్డి లలిత అనే విదుషీమణి తమ ఆనందాన్ని వెల్లడించారట. అదీ అసలైన పుస్తకానందం! ఈ వాస్తవాన్ని సాహితీ మిత్రుడు కోట పురుషోత్తం తమ ‘వ్యక్తిత్వ వికాసానికి సంఘటనే మూలం’ అనే పుస్తకంలో నమోదు చేశారు!.
‘విద్య నిగూఢగుప్తమగు విత్తము’ అని సుభాషితం. అది ఒక సంపద. దాన్ని గడించటానికి పుస్తక పఠనం మేలైన సాధనం. అన్నిటికీ మించి పుస్తక పఠనం విజ్ఞతని పెంచుతుంది అని విదురనీతిలో ఒక పరోక్ష ఉటంకింపూ ఉంది. మనిషి ఉన్నతత్వాన్ని విజ్ఞతే నిరూపిస్తుంది. పుస్తకాన్ని ‘కొని’ చదివే విజ్ఞతని పరిరక్షించుకుందాం. కదలండి!!

- విహారి,
చరవాణి : 9848025600

పుస్తక పండుగ...
ఆనందం దండిగ!

పుస్తకం అక్షర విషయాల సమస్తం
పుస్తకం మనిషిలోని సు-వర్ణాల మస్తకం
అచ్చంగా అచ్చుయంత్రాలు
పుస్తెకట్టగా ఏర్పడింది పుస్తకం
పురాతన తాళపత్ర ప్రతులకు
మారురూపమైన వాస్తవం పుస్తకం
పొత్తపుగుడిలో విగ్రహం పుస్తకం
చైతన్య సింధూరం
అది జ్ఞానానుగ్రహ బంధురం
పుస్తకం సత్యం-శివం-సుందరం
మానసికానందారోగ్యభాగ్యాన్ని
సమకూర్చడంలో
బుక్ కల్చర్ పల్లెతల్లి అయితే-
గరంగరం నగరంలోని
ప్రియురాలి రాగవల్లి లుక్ కల్చర్
గాజులూ-ఉంగరాలూ-గడియారాలూ
కావు హస్తాలకు భూషణాలు
పుస్తకమే నిజమైన శాశ్వతమైన భూషణం
దాన్ని సరిగా వినియోగించుకుంటే
మనిషి సమస్త పరిజ్ఞాన భోషాణమే మరి
పుస్తకంతో కరచాలనం చేస్తే
సకల కళా ప్రపంచమంతా
అవుతుంది మనిషి ఆస్తి
అంతర్జాల మహేంద్రజాలాలు
ఎన్ని దాడిచేసినా
పుస్తకమిచ్చే ఆరోగ్య భాగ్యశీలం
వాడిపోదు - వీడిపోదు
పుస్తకం నరునికి మిత్రుడు
ప్రశాంతి గుణ పాత్రుడు
మంచి పుస్తకం ఒక్కటైనా లేని గేహం
ఆత్మలేని దేహం
ఇందులో లేదు ఆవంతైనా సందేహం
చినిగిన చొక్కానైనా తొడుక్కో
మంచి పుస్తకాన్ని ఒక్కటైనా కొనుక్కో
ఇది స-రసాల పుస్తకాల సంబరం
ఇది చదువరుల
‘విజయా‘ల’వాడ’ల సువర్ణ వర్ణాంబరం
ఇది పుస్తకం పండుగ
ఇక్కడ ఆనందం దండిగ!
వివేకానందం మెడుగ!

- డా.రామడుగు వేంకటేశ్వరశర్మ
గుంటూరు, చరవాణి : 9866944287

పుస్తక పరిచయం

సామాజిక సంఘర్షణల వేదిక... ‘తెలుగు కథానిక’
‘తెలుగు కథానిక-2014’
సంపాదకులు:
ఎంఆర్‌వి సత్యనారాయణమూర్తి,
పుటలు: 248. వెల: రూ.150/-
ప్రతులకు: ఎం.రాజేశ్వరి, జె.వి.ఎల్.రావు నగర్,
పెనుగొండ - 534320, ప.గో. జిల్లా

ప్రతి సంవత్సరం వివిధ పత్రికల్లో వందలాది కథలు ప్రచురితమవుతున్నాయి. కొన్ని సంకలనాలు, సంపుటాలుగా వన్నాయి. కాని చాలా కథలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో కొందరు కథాప్రియులు, కథా రచయితలు, సాహిత్య సంస్థలు ఆ సంవత్సరంలో వచ్చిన ఉత్తమ కథలు కొన్నిటిని ఏరి ‘కథా వార్షికలు’ వెలువరిస్తున్నాయి. అలా చెయ్యడం వల్ల ఆయా సంవత్సర కాలంలో జరిగే వివిధ పరిణామాలు, ఆనాటి పరిస్థితులు, సంఘటనలు, జీవన నాగరికతలో ఏర్పడ్డ మార్పులు భవిష్యత్ తరాలవారికి తెలియజేసి వాళ్లు నాటి కాలానికి, అప్పటి కాలానికి వచ్చిన తేడాలను బేరీజు వేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
ఇప్పటికీ రెండు మూడు సంస్థలు ఇలాంటి కథా వార్షికలు టంఛనుగా వెలువరిస్తూ అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. ఈ కోవలో ఇప్పుడు మరో సాహితీ సంస్థ ప్రవేశించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో కవితా సంకలనాలు, కథా పారిజాతాలు, ఉత్తమ కథలకు, కవితలకు జాతీయస్థాయి పురస్కారాలిస్తూ వస్తూన్న పెనుగొండకు చెందిన ‘రమ్యసాహితి’ సంస్థ ఇప్పుడు కథా వార్షికలను పోలిన ‘తెలుగు కథానిక - 2014’ను ప్రచురించి, ఒక సంవత్సరకాలంపాటు వచ్చిన ఉత్తమ కథలను తెలుగు పాఠకులకు అందించే బృహత్తర బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుంది. ఈ సంస్థకు అధ్యక్షులైన ఎంఆర్‌వి సత్యనారాయణమూర్తి సంపాదకత్వంలో వెలువడిన ఈ ‘తెలుగు కథానిక-2014’ 2014 సంవత్సరంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథలను వడబోయగా, ఈ సంస్థ వారికి వచ్చినవి, నచ్చినవి, మెచ్చినవి కేవలం 24 కథలు మాత్రమే మిగిలాయి! ఇందులో ప్రచురించిన ఈ 24లో కూడా మళ్లీ వడబోస్తే, ఐదారు కథలు మాత్రం అత్యద్భుతంగా... పాఠకుల మనస్సులను హత్తుకునే విధమైనవిగా నిలుస్తాయి.
అవి - రంగనాథ రామచంద్రరావు రచన ‘అడవి పిలిచింది’, డా. దిలావర్ రచన ‘పాటకు మరణం లేదు’, జయంతి పాపారావు రచన ‘జీవన సౌందర్యం’, విఎస్ పాణి రచన ‘ది వైట్ టైగర్’లను చెప్పుకోవచ్చు. ‘అడవి పిలిచింది’ కథలో అతను ఉన్నతికి సహకరించిన ఆవును ముసలిదైపోయిందని కొడుకు అమ్మేయ్యడానికి ప్రయత్నిస్తే, ఆ తండ్రి ఒప్పుకోకపోగా చివరికి ఆ ఆవుతో పాటు ఇల్లొదిలి అడవికి పోవడం... చెప్పడం కంటే ‘చదివితే మనస్సు ద్రవించకమానదు. ‘పాటకు మరణం లేదు’ కథ ఒక పల్లెలోని పాటగాడిని ఉద్యమకారుడిగా చిత్రించి పోలీసులు అతని కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన తీరు పాఠకుడి మనసుని కదిలిస్తుంది. ‘ది వైట్ టైగర్’ కథలో ఒక మధ్యతరగతి జీవితం అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు ఏవిధంగా మదనపడి, జూలో పులికి ఆహారంగా.. ఆత్మహత్య చేసుకుంటే.. పులిముందున్న అతని ప్రవర్తన, మనసులో చెలరేగే సంఘర్షణ, భయం ఎలా ఉంటాయో, అతి భయంకరంగా కళ్లకు కట్టినట్లు చూపించారు రచయిత. వ్యవసాయం చేసుకునే వ్యక్తికి రిటైర్మెంట్ ఉండదని నిరూపిస్తూ... వ్యవసాయం ప్రజాసేవ మాత్రమే కాదు, జీవన సౌందర్యమని నిరూపించిన కథ ‘జీవన సౌందర్యం’. జానపద కళాకారుల జీవితాల్లో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వాళ్ల బతుకుల్లో ఎంత వెలుగుల్ని, ఆనందాల్ని అందించగలవో ఐతా చంద్రయ్య రాసిన ‘పొద్దు తిరిగింది’, త్యాగం, ప్రేమను మిళితం చేసి చూపిన పిడుగు పాపిరెడ్డి ‘సినక్క’... ఇలా ప్రతి కథా ఏదోఒక సామాజిక సంఘర్షణను ఆవిష్కరించి, మనస్సుకు హత్తుకునే, కళ్లు ఒత్తుకునేవిగా ఈ ‘తెలుగు కథానిక-2014’లో చోటుచేసుకున్నాయి. సంపాదకులు ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా వచ్చే ఏడాది కూడా మరిన్ని మంచి కథలతో కాలాన్ని రికార్డు పరుస్తారని ఆశిద్దాం.
- చలపాక ప్రకాష్

మినీ కథ

గురజాడ - జాడ

యువత వీడలేదు
పర భాషా మోజు
ఇంటికే పరిమితం
మాతృభాష వినియోగం

కవిరాజు తాత్విక భావం
భాషకు అద్దిన కౌశలం
ఆయన దేశభక్తి గీతం
విశ్వమానవ గేయం

సాహిత్య వెలుగుబాట
గురజాడ వారి మాట
సరళతరం ఆయన భాష
పరిణామ ప్రాతినిధ్యం వారి జాడ

కవితకు కొత్తదనం
కవ్యపోకడ ఇతివృత్తం
భావ వ్యక్తీకరణ క్లుప్తం
అప్పారావుగారి ఆత్మీయం

స్వచ్ఛ వాజ్మయం నాటి తరం
గుర్తింపే లక్ష్యం నేటి తరం
కానరాని సృజన నేడు
భజన లేకుండా ‘కైత’ లేదు

పరిచయాలకే ప్రాముఖ్యం
ప్రతిభకు లేని ప్రాభవం
తర్కం కవిత్వమైన వేళ
జీవనసారం మాయం

సాహిత్య సభలు
నిర్వహణ వ్యవస్థలు
‘కాసు’కు లేదు అసాధ్యం
కృతులేంటి అవార్డులే సొంతం

సాహిత్య విమర్శలు
నాడు అనుభవసారాలు
నేడు అసంబద్ధ గమకాలు
పరిజ్ఞానం లోపం పరిశీలనా దోషాలు

భాషితం కాదు కవిత్వం
భాషకు వెలుగు సాహిత్యం
అనుభూతే కవితకు ప్రాణం
నేటి కవనానికది దూరం

మారుతున్న సాహిత్యాగమనం
చదువరుల కంటే కవివరులే అధికం
అభిమానుల ఆలంబనలే ప్రాపకం
దొడ్డి సంభావనలే అధికరణం

దిగజారుతున్న సాహిత్యం
ప్రపంచీకరణ బందీ సమయం
కానరాని పుస్తక పఠనం
వాణి భవితకు గ్రహణం

ప్రబంధ మూలాలు కలుషితం
భాష పలుకుతున్నదంటే
సాహితి చిగురిస్తున్నదంటే
పెద్దల మేధాశక్తి సారస్వత అనాసక్తి
- డాక్టర్ జనపాల కామేశ్వరరావు
98481 42428

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- చింతా రాంబాబు