రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..83 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరతుడు తోరణం అనే ప్రదేశానికి దక్షిణంగా వున్న జంబూప్రస్థ అనే గ్రామానికి, అక్కడ నించి వరూధం అనే అందమైన గ్రామానికి చేరాడు. అక్కడి అందమైన అడవుల్లో విడిది చేసి, అక్కడ నించి తూర్పు వైపు ప్రయాణించి ఔదుంబర వృక్షాలు అధికంగా గల ఉజ్జిహాన అనే నగరంలోని ఉద్యానవనానికి చేరాడు. అక్కడ సాల, ప్రియక వృక్షాల దగ్గర విశ్రాంతి తీసుకుని వేగంగా పరిగెత్తే గుర్రాలు కట్టిన రథం ఎక్కి సైన్యాన్ని వెనక రమ్మని ఆదేశించి తను తొందరగా వెళ్లాడు. నరశ్రేష్టం అనే ప్రదేశంలో బస చేసి తర్వాత ఉత్తానికా నదిని, ఇంకా అనేక ఇతర నదులని, పర్వతాల్లో పుట్టిన గుర్రాల సహాయంతో దాటి, ఏనుగు మీద కుటిలా నదిని దాటాడు. తర్వాత లౌహిత్యం అనే ప్రదేశంలో కపీవతీ నదిని దాటాడు. భరతుడు ఏకసాల గ్రామంలో గోమతీ నది, వినత గ్రామంలో స్థాణుమతీ నదిని దాటి గుర్రాలు అలసిపోవడంతో కులింగ నగరంలోని పాలవనంలో విశ్రాంతి తీసుకుని, మళ్లీ వెంటనే ప్రయాణం కొనసాగించాడు. ఆ రాత్రే వేగంగా సాలవనాన్ని దాటి తెల్లవారే సమయానికి మను చక్రవర్తితో నిర్మించబడ్డ అయోధ్యా నగరాన్ని చూశాడు.
చాలారోజులు ప్రయాణించిన భరతుడు ఎదురుగా కనపడే అయోధ్యని చూసి సారథితో చెప్పాడు.
‘సారథీ! పుణ్యమైన ఉద్యానవనాలతో నిండిన, మంచి కీర్తిగల అయోధ్యా నగరం నాకు దూరం నించి అస్పష్టంగా కనిపిస్తోంది. తెల్లటి మట్టిగల ఈ నగరాన్ని ఎందరో రాజర్షులు పాలించారు. ఉత్తమ గుణ సంపన్నులు, వేదవేత్తలు, చాలావరకు ధనవంతులు, ఎన్నో యజ్ఞాలు చేసిన బ్రాహ్మణులు ఇక్కడ నివసిస్తున్నారు. ఇదివరకు అయోధ్యలో స్ర్తి పురుషుల సంచారం వల్ల గొప్ప కలకలం వినపడేది. ఇవాళ అది వినపడటం లేదు. సాయంకాలంలో వచ్చి రాత్రంతా క్రీడించి, ఉదయానే్న ఇళ్లకి పరిగెత్తే జనాలతో ఉద్యానవనాలు పూర్వం నాకు వేరేగా కనిపించేవి. అవి ఇప్పుడు కాముకులు విడిచిపెట్టడం వల్ల ఏడుస్తున్నట్లు ఉన్నాయి. సారథీ! అయోధ్యానగరం నాకు ఇప్పుడు అరణ్యంలా కనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ మనుషులు పూర్వంలా వాహనాల మీద కాని, గుర్రాలు, ఏనుగుల మీద కాని ఎక్కి నగరంలోకి ప్రవేశించడం కాని, బయటకి వెళ్లడం కాని కనపడటంలేదు. ఇదివరకు ఉద్యానవనాలన్నీ ప్రజలు ఆనందంగా కలిసి విహరించడానికి అనుకూలంగా ఉండి, మదించి ఆనందభరితంగా కనిపించేవి. అవి నేడు ఆకులు రాలిపోయి, దారి పక్కన ఏడుస్తున్నట్లు నించున్న చెట్లతో అన్ని వైపులా ఆనందశూన్యంగా కనిపిస్తున్నాయి. సూర్యోదయమైనా మదించి, మధురమైన అనురాగం నిండిన ధ్వనులు చేసే మృగాలు, పక్షుల శబ్దాలు వినపడటంలేదు. చందనం, అగరు గంథాలతో కలిసి పొగతో వ్యాపించిన సుఖకరమైన గాలి పూర్వంలా ఈనాడు వీచడం లేదు. కారణం ఏమై ఉండచ్చు? గతంలో ఎన్నడూ తగ్గని భేరీ ధ్వనులతో మృదంగ, వీణా ధ్వనులు ఇప్పుడు ఎందువల్లో ఆగిపోయాయి. అప్రియమైన, క్రూరమైనవైన, అనేక విధాలైన చెడు శకునాలు కనిపిస్తున్నాయి. అందువల్ల నా మనసు చాలా బాధపడుతోంది. అన్ని విధాలా నా బంధువుల క్షేమం దుర్లభం అనిపిస్తోంది. ఎందుకంటే దుఃఖానికి కారణం కనిపించకపోయినా నాకు దిగులుగా ఉంది.’
ఇలా అలసిపోయిన హృదయంతో, నీరసించిన శరీరంతో భరతుడు భయపడుతూ అయోధ్యలోకి ప్రవేశించాడు. అలసిపోయిన గుర్రాలతో అతను వైజయంతం అనే ధ్వారం లోంచి లోపలకి ప్రవేశించాడు. ద్వారపాలకులు లేచి జయజయధ్వానాలు చేసాక, వారితో కలిసి వెళ్లాడు. మనసులో దిగులుగా ఉన్న భరతుడు ఆ ద్వారపాలకులని గౌరవించి, అశ్వపతికి ఇష్టుడైన సారథితో చెప్పాడు.
‘దోషాల్లేని ఓ సారథీ! ఏ కారణం లేకుండా నన్ను ఇంత తొందరగా ఎందుకు రప్పించారో? నా మనసు ఏదో కీడుని అనుమానిస్తోంది. నా పరువు కూడా పోయినట్లుంది. గతంలో రాజులు మరణించినప్పుడు ఎలాంటి చిహ్నాలు కనిపిస్తాయని వింటూండేవాళ్లమో అలాంటి చిహ్నాలన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. అయోధ్యలోని గృహస్థులు భవనాలన్నీ తుడవక పోవడంతో ఎబ్బెట్టుగా కనపడుతున్నాయి. వీటి తలుపులన్నీ తెరచి, అన్ని వైపులా అందవిహీనమై ఉన్నాయి. ఎవరూ పూజలకి సంబంధించిన బలులు మొదలైనవి ఇచ్చినట్లు లేదు. భవనాల నించి ధూపపు సువాసనలు లేవు. కుటుంబంలోని వారంతా భోజనాలు లేక కళావిహీనంగా ఉన్నారు. భవనాలకి ఉండాల్సిన ఐశ్వర్యం కనపడటంలేదు. దేవాలయాల్లో మాలికల అందం లేదు. వాటి ముంగిళ్లని కడిగి అలకలేదు. అవి శూన్యంగా ఉండి, పూర్వం ప్రకాశించినట్టు ప్రకాశించడం లేదు. దేవతా పూజలు ఆగిపోయి, దేవతా విగ్రహాలు కాంతిహీనంగా ఉన్నాయి. యజ్ఞాలు, గోష్టులు జరగడంలేదు. పూలమాలలు అమ్మే దుకాణాలు మాలలు లేక కళగా లేవు. వ్యాపారం లేకపోవడంతో ఉత్సాహం లేక ఆలోచనలతో దిగులు చెందిన మనసుతో వర్తకులు కూడా పూర్వంలా కనపడటంలేదు. దేవాలయాల్లోను, వీధుల మొదట్లోని కట్టడాల మీద, వీధుల్లోని మర్రిచెట్ల మీద నివసించే పక్షులు దీనంగా ఉన్నాయి. నగరంలోని స్ర్తి పురుషులంతా బెంగ పెట్టుకుని, మాసిన వస్త్రాలు ధరించి, కన్నీరు నిండిన కళ్లతో దీనులై బాధపడుతూ కృశించి ఉన్నారు.’
అయోధ్యలోని ఆ అపశకునాలని చూసి కలత చెందిన మనసుతో భరతుడు రాజభవనానికి వెళ్లాడు. ఇంద్రుడి అమరావతితో సమానమైన అయోధ్య దుమ్ముతో ఎర్రబడిన తలుపులతో నాలుగు వీధుల కూడళ్లు, ఇళ్లు, వీధులు నిర్మానుష్యంగా ఉండటం చూసిన భరతుడికి చాలా దుఃఖం కలిగింది. గతంలో ఎన్నడూ ఆ నగరంలో జరగని అప్రియమైన వాటిని ఎన్నిటినో చూస్తూ దైన్యం నిండిన మనసుతో, సంతోషం లేక తలవంచుకుని తండ్రి ఇంట్లోకి ప్రవేశించాడు. (అయోధ్యకాండ సర్గ 71 - 11 శ్లోకం నుంచి)
హరిదాసు ఆ రోజుకి ఆ కథ పూర్తి చేసి రామలక్ష్మణులకి, హనుమంతుడికి హారతి ఇచ్చాక కొందరు శ్రోతలు ఆయన చెప్పిన కథలోని కొన్ని తప్పులని ఎత్తి చూపారు. ఆ నలుగురు శ్రోతలు చెప్పిన ఆ తప్పులని మీరు కనుక్కోగలిగారా?
*
మీకో ప్రశ్న

అయోధ్యా నగరానికి గల
మరో పేరేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

కేకయ రాజు పేరేమిటి? అశ్వపతి
*
1. కైకేయి సోదరుడి పేరు యుధాజిత్. కాని హరిదాసు ఇంద్రజిత్‌గా తప్పు చెప్పాడు.
2. రాముడి తల్లి కౌసల్య. కాని హరిదాసు పొరపాటున సుమిత్ర క్షేమం అడిగాడని చెప్పాడు.
3. అలాగే మధ్యమ తల్లి కౌసల్యగా చెప్పాడు. మధ్యమ తల్లి సుమిత్ర.
4. కేకయ రాజు అయోధ్యకి వెళ్ళే భరతుడికి ఇష్టలు, విశ్వాసపాత్రులు, సద్గుణవంతులు, ఎప్పుడూ దగ్గరగా ఉండే అనుచరులని కూడా ఇచ్చాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
5. యుధాజిత్ భరతుడికి ఇచ్చిన ఏనుగు ఐరావత వంశానికి చెందినది అని వాల్మీకి రాసాడు. ఈ విశేషణం హరిదాసు చెప్పలేదు.
6. భరతుడు శరద్రూ నదిని 3ఏలాధానం అనే గ్రామంలో2దాటాడు. కాని ఇది హరిదాసు చెప్పడం విస్మరించాడు.
7. వీరమత్స్య దేశానికి ఉత్తరంగా ఉన్న భారుండం అనే అడవిలోకి ప్రవేశించాడు. ఈ అడవి పేరు హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి