రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 99 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేనని అక్కడ నిలిపిన భరతుడు అన్నని చూడాలనే ఆత్రంతో శతృఘు్నడికి గుర్తులని చూపించాడు. పెద్దల మీద అధిక ప్రేమ గల భరతుడు ‘నా తల్లులని త్వరగా తీసుకుని రండి’ అని వశిష్ఠుడ్ని ఆదేశించి తను ముందు తొందరగా వెళ్లాడు. సుమంత్రుడు కూడా శతృఘు్నడిని అనుసరించాడు. రాముడ్ని చూడాలనే కోరిక భరతుడికి ఎంతుందో సుమంత్రుడికి కూడా అంత ఉంది. శ్రీమంతుడైన భరతుడు నడిచి వెళ్తూండగానే అతనికి ముని ఆశ్రమంలో ఓ పెద్ద, ఓ చిన్న పర్ణశాలలు కనిపించాయి. వాటి ముందు విరిచి పడేసిన కట్టెలు, కోసిన పువ్వులు కూడా కనపడ్డాయి. పర్ణశాలకి దారి తెలీడం కోసం అక్కడక్కడా చెట్ల మీద రామలక్ష్మణులు గుర్తుగా కట్టుకున్న దర్భలని, నార చీరలని, చలి కాలం కోసం ఆ అడవిలో వాళ్లు పేడతో చేసిన పిడకల పోగుని కూడా చూశాడు.
ఆజానుబాహువు, కాంతివంతుడైన భరతుడు వాటన్నిటినీ చూసి, సంతోషించి శతృఘు్నడితో, తన చుట్టూ ఉన్న మంత్రులతో చెప్పాడు.
‘్భరద్వాజుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాము. మందాకినీ నది ఇక్కడికి దగ్గరలోనే ఉందని అనుకుంటాను. ఇక్కడి ఎతె్తైన ప్రదేశాల్లో నారచీరలు కట్టబడి ఉన్నాయి. సమయం కాని సమయంలో ఆశ్రమం నించి బయటకి వెళ్లి తిరిగి వచ్చేప్పుడు గుర్తుగా ఉండటానికి లక్ష్మణుడు ఈ దారిలో ఇలా చేసి ఉండచ్చు. పెద్ద పెద్ద దంతాలు గల గొప్ప బలమైన ఏనుగులు ఒక దాన్ని చూసి మరొకటి ఘీంకరిస్తూ ఇక్కడ కొండ పక్కన తిరుగుతున్నాయి. అరణ్యంలో నివసించే మునులు సదా రక్షించుకోడానికి ఉంచుకున్న అగ్ని నించి వెలువడ్డ దట్టమైన పొగ ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది. పురుష శ్రేష్ఠుడు, పెద్దల మీద గౌరవం కలవాడు, పూజ్యుడు, మహర్షి వంటి వాడైన రాముడ్ని నేను ఇక్కడ చూసి సంతోషించగలను’
భరతుడు చిత్రకూట పర్వతం వైపు కొంతసేపు మాత్రమే నడిచి మందాకినీ నదిని చేరుకుని మంత్రులతో చెప్పాడు.
‘ప్రజలకి ప్రభువు, పురుష శ్రేష్ఠుడైన రాముడు ఈ నిర్మానుష్యమైన చోట వీరాసనం వేసుకుని నేల మీద కూర్చుని ఉన్నాడు. ఛీ! నా జన్మ. నా జీవితం ఎందుకు? లోకానికి అధిపతి, మహా కాంతిశాలైన రాముడు నా వల్ల కష్టాలకి లోనై, భోగాలన్నీ విడిచి అడవిలో నివసిస్తున్నాడు. ఈ విధంగా లోకుల చేత నిందించబడే నేను ఇవాళ సీతారామలక్ష్మణుల పాదాల మీద పడి వాళ్లని అనుగ్రహింప చేసుకుంటాను.’
భరతుడు ఇలా విలపిస్తూ ఆ అడవిలోని పవిత్రమూ, సుందరమైన చక్కటి పర్ణశాలని చూశాడు. మెత్తటి దర్భలతో యజ్ఞ వేదిక కప్పబడినట్లుగా ఆ విశాలమైన పర్ణశాల ఆకులతో కప్పబడి ఉంది. మహా కార్యాన్ని సాధించేవి, బంగారం పూసిన వెనక భాగాలు గలవి, గొప్ప సారం కలవి, శత్రువులని బాధించేవి, వజ్రాయుధంతో సమానమైనవైన ధనస్సులు ఆ పర్ణశాలలో వున్నాయి. సూర్య కిరణాలతో సమానమై భయంకరమైనవి, అంబుల పొదిలో మెరిసే ముందు భాగాలు గల ఆ బాణాలతో ఆ పర్ణశాల సర్పాలతో ఉన్న భోగవతిలా ప్రకాశిస్తోంది. బంగారపు ఒరల్లోని రెండు కత్తులు, బంగారపు చుక్కలతో, చిత్రమైన రంగులతో ఉన్న రెండు డాళ్లు, బంగారంతో అలంకరించబడి, చిత్రవర్ణాలు గల గోడలకి వేలాడదీయబడిన అంగుళీ కవచాలు ఆ పర్ణశాలని ప్రకాశింప చేస్తున్నాయి. అది మృగాల చేత ఎదిరింప శక్యం కాని సింహం ఉండే గుహలా శత్రువులు ఎదిరించడానికి వీలుపడనిదై ఉంది.
రాముడి నివాసంలో ఈశాన్యం వైపు పల్లంగా, విశాలంగా ఉండి మండే అగ్ని కల పవిత్రమైన వేదిని ఉంది. భరతుడు క్షణకాలం పరిశీలించి ఆ పర్ణశాలలో జటామండలాలు ధరించి కూర్చున్న రాముడ్ని చూశాడు. ఆ రాముడు జింక చర్మాన్ని, నార చీరలని ధరించాడు. అతని చుట్టూ అగ్ని కాంతి లాంటి కాంతి వ్యాపించి ఉంది. సింహం లాంటి మూపురంతో, పొడవైన చేతులు, పద్మాల్లాంటి కళ్లతో ఉన్న ఆ రాముడు, సముద్రం దాకా విస్తరించిన భూమికి అధిపతైనా, ధర్మాన్ని ఆచరిస్తూ, రెండు వైపులా సీతాలక్ష్మణులు సేవిస్తూండగా, దర్భలు పరిచిన నేల మీద వీరాసనంలో స్థిరుడైన బ్రహ్మ దేవుడిలా కూర్చుని ఉన్న రాముడ్ని భరతుడు చూశాడు. ధర్మాత్ముడైన భరతుడు రాముడ్ని చూసి విచారంతో, మనస్థాపంతో అతని వైపు పరిగెత్తాడు. భరతుడు రాముడ్ని చూడగానే కన్నీళ్లతో అస్పష్టమైన మాటలతో ఏడిచాడు. విచారాన్ని అణచుకునే తగిన ధైర్యం లేక చెప్పాడు.
‘సభలో మంత్రులు మొదలైన వాళ్లు చుట్టూ కూర్చుని సేవించబడాల్సిన నా సోదరుడు అరణ్య మృగాలు చుట్టూ కూర్చుని ఉండగా ఇక్కడ ఉన్నాడు. ఏ మహాత్ముడు పూర్వం వేల కొద్దీ వస్త్రాలకి అలవాటు పడి ఉన్నాడో అలాంటి వాడు ఇప్పుడు ధర్మాచరణ చేస్తూ రెండు జింక చర్మాలని ధరించి ఉన్నాడు. ఆ కాలంలో చిత్రమైన రంగులు గల అనేక విధాలైన పువ్వులని ధరించిన రాముడు ఈనాడు జటాభారాన్ని ఎలా భరిస్తున్నాడో? ఏ రాముడు శాస్త్రోక్తమైన యజ్ఞాలు చేసి, ధర్మ సంపాదన చేయాల్సి ఉందో అలాంటి రాముడు శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా కలిగే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. అమూల్యమైన గంధం పూసుకోదగ్గ మా అన్న శరీరం ఇప్పుడు మురికిపట్టి ఉంది కదా! సుఖానికి అలవడ్డ రాముడు నా మూలంగా ఇలా కష్టపడుతున్నాడు. ఛీ! లోకులతో నిందించబడుతున్న, క్రూరుడినైన నా జీవితం ఎందుకు?’
భరతుడు దీనుడై, పద్మం లాంటి ముఖం లోంచి చెమటలు కారుతూండగా ఇలా ఏడుస్తూ రాముడి పాదాలు చేతికి అందకుండానే నేల మీద పడిపోయాడు. మహాబలశాలైన భరతుడు విచారంతో ‘ఆర్యా!’ అని ఒక్కసారి దీనంగా పలికి తర్వాత ఏమీ మాట్లాడలేక పోయాడు.
శతృఘు్నడు కూడా ఏడుస్తూ రాముడి పాదాలకి నమస్కరించాడు. రాముడు వాళ్లిద్దర్నీ కౌగిలించుకుని కన్నీరు కార్చాడు. తర్వాత రామలక్ష్మణులు ఆకాశంలోని సూర్యచంద్రులు, గురుడు, బృహస్పతులని కలిసినట్లు అడవిలో సుమంత్రుడ్ని, గుహుడ్ని కలిసారు. ఆ అడవిలో నివసించే ఋషులు మొదలైన వారంతా ఆ మహారణ్యంలో కలిసిన గొప్ప ఏనుగులతో సమానులైన ఆ రాజకుమారులని చూసి దుఃఖంతో కన్నీరు కార్చారు. (అయోధ్యకాండ 99 సర్గ)
జటలని ధరించి, నార చీరలని కట్టుకుని ప్రణయకాల సూర్యుడిలా, చూడశక్యం కాకుండా ఉన్న భరతుడు చేతులు జోడించి నేల మీద పడి ఉన్నాడు. ముఖం రంగు మారిపోయి కృశించి ఉన్న తమ్ముడు భరతుడ్ని రాముడు అతి కష్టం మీద గుర్తించి చేతులు పట్టుకుని లేవదీశాడు. భరతుడ్ని కౌగిలించుకుని, అతని తలని ముద్దాడి ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రశాంతంగా అడిగాడు.
‘నాయనా! నువ్వు ఇప్పుడు అడవికి వచ్చావేమిటి? నీ తండ్రి దశరథ మహారాజు ఎక్కడికి వెళ్లాడు. ఆయన జీవించి ఉండగా నువ్వు అడవికి రాలేవు కదా? కృశించి, గుర్తు పట్టలేని విధంగా చాలా దూరం నించి వచ్చిన భరతుడ్ని చాలా కాలానికి నేడు చూడగలుగుతున్నాను. సంతోషం నాయనా! నువ్వు అరణ్యానికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి వచ్చావే. రాజు జీవించే ఉన్నాడు కదా? ఆయన దుఃఖంతో పరలోకానికి వెళ్లలేదు కదా? సౌమ్యుడా! నువ్వు చిన్నవాడివి అవడం వల్ల శాశ్వతమైన రాజ్యాన్ని కోల్పోలేదు కదా? సత్యపరాక్రముడైన తండ్రికి సేవలు చేస్తున్నావు కదా? సత్యమైన ప్రతిజ్ఞ కల, రాజసూయ, అశ్వమేధ యాగాలని చేసిన, ధర్మం మీద స్థిరబుద్ధి గల దశరథ మహారాజు క్షేమంగా ఉన్నాడు కదా? వేదవేత్త, విద్వాంసుడు, ధర్మ నిరతుడు, మహాకాంతిశాలైన ఇక్ష్వాకు వంశ పురోహితుడు వశిష్ఠుడ్ని పూర్వంలా పూజిస్తున్నావు కదా? కౌసల్య, మంచి సంతానం కల సుమిత్ర సుఖంగా ఉన్నారు కదా? పూజ్యురాలు, రాణి అయిన కైకేయి సంతోషంగా ఉంది కదా?’
హరిదాసు ఆనాటి కథని చెప్పడం ఇలా పూర్తి చేశాడు.
‘రాముడు భరతుడితో ఇంకా ఏమన్నాడు? దానికి భరతుడు ఏం జవాబు చెప్పాడు? సమయాభావం వల్ల చెప్పడం లేదు. అయోధ్యకాండలోని 99వ సర్గలోని మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం’ అని హరిదాసు ఆ రోజు కథని పూర్తి చేశాడు.
-------------------------------------------------------------------------------------------------------------------------------
(అయోధ్య కాండ 100 సర్గ - 10వ శ్లోకం దాకా)

ఆశే్లష హరికథని తన సెల్ ఫోన్‌లో రికార్డు చేసుకుని ఇంటికి తీసుకెళ్లి తల్లికి వినిపించాడు. శారదాంబ మొత్తం విని చెప్పింది.
‘ఆయన చెప్పిన దాంట్లో ఐదు తప్పులు ఉన్నాయి. అవేమిటో తెలుసా?’
‘తెలీదు’ ఆశే్లష చెప్పాడు.
‘అవేమిటో చెప్తా విను’
ఆ ఐదు తప్పులని కనుక్కోగలిగారా?

1.దశరథుడి ఏనుగు పేరు శతృంగయం. దీన్ని హరిదాసు చెప్పలేదు.
2.సోదరుడు శతృఘు్నడితో సైన్యాన్ని ఆయా స్థానాల్లో నిలపమని భరతుడు చెప్పాడు తప్ప సుమంత్రుడితో కాదు.
3.నందనవనం కుబేరుడిది. ఇంద్రుడిది కాదు.
4.హిమవత్ పర్వతంతో సమానమైన చిత్రకూట పర్వతం మీద రాముడు నివసిస్తున్నాడు అని వాల్మీకి రాశాడు కాని హరిదాసు హిమవత్ పర్వతం మీద అని తప్పుగా చెప్పాడు.
5.రాముడి ఆశ్రమం నించి వచ్చే పొగని చూసి ‘నది అవతలి ఒడ్డుకి చేరిన ఈతగాడిలా’ భరతుడు చాలా సంతోషించాడు. కాని ఈ ఉపమానాన్ని హరిదాసు చెప్పలేదు.
*
మీకో ప్రశ్న

ఆ పర్ణశాల సర్పాలతో ఉన్న భోగవతిలా ప్రకాశిస్తోంది వాల్మీకి చేసిన ఈ వర్ణనలోని భోగవతి అంటే ఏమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

విష్ణుమూర్తికి చెందిన ఏ ఆయుధం భరతుడిగా జన్మించిందని కథనం?
సుదర్శన చక్రం

-మల్లాది వెంకట కృష్ణమూర్తి