రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం....84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన తండ్రి ఇంట్లో ఆయన కనపడకపోవడంతో తల్లిని చూడటానికి భరతుడు ఆమె ఇంటికి వెళ్లాడు. దూరదేశం నించి తిరిగి వచ్చిన తన కొడుకుని చూడగానే సంతోషించిన కైకేయి, బంగారు ఆసనం మీంచి ఒక్క ఉదుటున లేచింది. ధర్మాత్ముడైన భరతుడు కళ తప్పిన తన ఇంట్లోకి ప్రవేశించి, తన తల్లి పాదాలని తాకి నమస్కరించాడు. ఆమె కీర్తివంతుడైన భరతుడిని కౌగిలించుకుని ఒళ్లో కూర్చోపెట్టుకుని ప్రశ్నించసాగింది.
‘నువ్వు తాత గారింటి నించి బయలుదేరి ఎన్ని రోజులైంది? రథం మీద వేగంగా ప్రయాణించటం వల్ల నీకేం అలసట కలగలేదు కదా?’
పద్మాల్లాంటి కళ్లు గల రాజకుమారుడు భరతుడు కైకేయి ప్రేమగా అడిగిన ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాడు.
‘తాతగారింటి నించి బయలుదేరి ఇవాళ్టికి ఆరు రోజులైంది. మీ నాన్న కేకయ రాజు, నా మేనమామ యుధాజిత్తు క్షేమంగా ఉన్నారు. శత్రుసంహారకుడైన కేకయ రాజు నాకు ఇచ్చిన ధనాన్ని, రత్నాలని తీసుకువచ్చే వారు దారిలో అలసట చెందడంతో వారిని వెనక రమ్మని, రాజసందేశం తీసుకువచ్చిన దూతలు తొందర చేయడంతో నేను ముందుగా వచ్చాను. కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పు. బంగారంతో అలంకరించబడ్డ పడుకోడానికి తగిన నీ శయ్య అందవిహీనంగా ఉంది. ఇక్కడి దశరథ రాజు పరివారంలో ఎవరూ ఆనందంగా ఉన్నట్లు కనపడటంలేదు. రాజు ఎక్కువగా నీ ఇంట్లో ఉంటూంటాడు. ఇవాళ ఆయన కనపడలేదు. ఆయన్ని చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్న కాళ్లకి నమస్కరించాలి. ఆయన గురించి చెప్పు. ఆయన ఇక్కడికి రాకపోతే నా పెత్తల్లి కౌసల్య ఇంట్లో ఉన్నాడా?’
అన్ని విషయాలు తెలిసినా, రాజ్యలోభంతో మోహితురాలైన కైకేయి ఆ విషయాలు ఏమీ తెలీని భరతుడికి, అతనికి ఇష్టంలేని ఆ భయంకరమైన విషయాన్ని మంచి విషయం చెప్పినట్లుగా చెప్పింది.
‘మహారాజు, మహాత్ముడు, తేజశాలి, యజ్ఞాలు చేసినవాడు, సత్పురుషులకి ఆశ్రయం ఇచ్చే మీ నాన్న ప్రాణులందరికీ ఏది చివరి గతో ఆ గతిని పొందాడు.’
ధర్మాత్ముడు, మంచి కులంలో పుట్టిన, పరిశుద్ధమైన చరిత్ర గల, ఆజానుబాహువైన భరతుడు ఆ మాట వినగానే పితృశోకంతో మిక్కిలి బాధపడుతూ వెంటనే ‘అయ్యో! చచ్చాను’ అని జాలి కలిగించేలా దీనంగా చెప్తూ చేతులు చాచి నేల మీద పడ్డాడు. తండ్రి మరణం వల్ల కలిగిన దుఃఖం భరించరానిదై అతని మనసు కలత చెంది, తీవ్ర విచారంతో విలపించాడు.
‘వర్షాకాలం గడిచాక నిర్మలంగా ఉన్న రాత్రి ఆకాశం చంద్రుడితో ప్రకాశించేట్లుగా అందమైన నా తండ్రి పక్క ప్రకాశించేది. బుద్ధిమంతుడైన నా తండ్రి లేకపోవడంతో ఈ శయ్య ఈనాడు చంద్రుడు లేని ఆకాశంలా, నీరు ఎండిన సముద్రంలా కళ తప్పి ఉంది’
అడవిలో గండ్రగొడ్డలి చేత నరకబడ్డ సాల వృక్షం మానులా నేల మీద పడి ఉన్న భరతుడు విచారిస్తూ మొహాన్ని బట్టతో కప్పుకుని మనసులో అధికంగా విచారించసాగాడు. సూర్యచంద్రులతో సమానుడైన, మదించిన ఏనుగులా ఉన్న భరతుడ్ని చూసి కైకేయి అతన్ని నేల మీంచి లేవదీసి ఇలా చెప్పింది.
‘గొప్ప కీర్తిగల రాజకుమారా! అలా పడుకుని ఉన్నావేమిటి? లే. లే. సభలలో సన్మానం పొందడానికి అర్హత గల నీ లాంటి సత్పురుషులు ఇలా విచారిస్తారా? శీలాన్ని, వేద వాక్యాలని అనుసరించే, దానయజ్ఞాదుల మీద అధికారం గల నీ వివేకం సూర్యుడి గృహంలోని కాంతిలా అవిచ్ఛిన్నంగా ప్రకాశిస్తోంది.’
అనేక విధాలైన శోకాలు చుట్టుముట్టిన భరతుడు నేల మీద దొర్లుతూ చాలాసేపు ఏడ్చి తల్లితో మళ్లీ చెప్పాడు.
‘రాజు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నాడో, లేదా ఏదైనా యజ్ఞం చేస్తున్నాడో అని అనుకుంటూ సంతోషంగా వచ్చాను. నేను అనుకున్నదంతా తారుమారైంది. నిత్యం నా మంచి కోరే మా నాన్నని చూడలేక పోవడం వల్ల నా మనసు బద్దలైపోయింది. అమ్మా! నేను ఇక్కడ లేనప్పుడు నాన్న ఏ వ్యాధితో పోయాడు? స్వయంగా తండ్రికి ప్రేత సంస్కారం చేసిన రాముడు మొదలైన వాళ్లు ధన్యులు కదా! కీర్తిమంతుడైన రాజుకి నిజంగా నేను వచ్చినట్లు తెలీదు. తెలిసి ఉంటే వెంటనే నా తలని వాసన చూసేవాడు. శ్రమ లేకుండా పనులని సాధించే మా నాన్న, బూడిద కప్పి ఉన్న నన్ను ఏ చేత్తో మాటిమాటికీ తుడుస్తూండేవాడో, సుఖకరమైన స్పర్శ గల ఆ చెయ్యి ఎక్కడ? ఏ రాముడు నాకు సోదరుడో, తండ్రో, బంధువో, ధీమంతుడైన ఏ రాముడికి నేను దాసుడినో, శ్రమ పడకుండా పనులు సాధించే ఆ రాముడికి వెంటనే నా గురించి చెప్పు. ధర్మాలు తెలిసిన పూజ్యులు అందరికీ అన్నగారు తండ్రి కదా. అలాంటి అన్నగారి పాదాలు పట్టుకుంటాను. ఇప్పుడు నాకు అతనే గతి కదా? ధర్మాలు తెలిసిన వాడు, నిత్యం ధర్మానే్న అనుసరించేవాడు, ఆడిన మాటని తప్పని వాడు, దృఢమైన నియమాలు కలవాడు, పూజ్యుడు, నిజ పరాక్రమం గలవాడు, మహారాజైన మా నాన్న ఏం చెప్పాడు? నాకు మా నాన్న ఇచ్చిన ఆఖరి సందేశాన్ని యథాతథంగా వినాలని అనుకుంటున్నాను’
భరతుడి ప్రశ్నలకి కైకేయి జరిగింది జరిగినట్లుగా చెప్పింది.
‘మహాత్ముడైన రాజు ‘హా రామా! హా సీతా! హా లక్ష్మణా!’ అని ఏడుస్తూ మరణించాడు. మీ నాన్న తాళ్లతో కట్టబడ్డ పెద్ద ఏనుగులా మృత్యుపాశాలతో చుట్టబడి ఈ చివరి మాటలుగా ఇలా చెప్పాడు. ‘సీతతో తిరిగి వచ్చిన రాముడ్ని, తిరిగి వచ్చిన మహాబాహువైన లక్ష్మణుడ్ని చూడగలిగిన వాళ్లు ధన్యులు కదా!’ అన్నాడు.’
ఆ రెండో చెడ్డ సమాచారాన్ని విన్న భరతుడు దుఃఖిస్తూ, దిగులు చెందిన మొహంతో మళ్లీ తల్లిని అడిగాడు.
‘్ధర్మాత్ముడు, కౌసల్యకి ఆనందాన్ని పెంచే రాముడు, సోదరుడు లక్ష్మణుడితో, సీతతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడు?’
చాలా చెడ్డ వార్తని జరిగింది జరిగినట్లుగా చెప్పడం ఆరంభించింది.
‘కుమారా! రాజకుమారుడైన ఆ రాముడు నారచీరలు ధరించి, సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యానికి వెళ్లాడు’
భరతుడు అది వినగానే రాముడు ఏదైనా అధర్మమైన పని చేయడం వల్ల దేశం నించి వెళ్లగొట్టబడ్డాడా అని అనుమానిస్తూ మళ్లీ తల్లిని అడిగాడు.
‘రాముడు ఎవరైనా బ్రాహ్మణుడి ధనాన్ని దొంగిలించలేదు కదా? తప్పు చేయని ఏ ధనవంతుడినైనా లేదా దరిద్రుడినైనా హింసించలేదు కదా? రాజకుమారుడైన రాముడు పరభార్యలని ఇష్టపడలేదు కదా? భ్రూణ హత్యా పాపం చేసిన వాడిలా రాముడ్ని దండకారణ్యానికి ఎందుకు పంపారు?’
చపల స్వభావురాలైన అతని తల్లి కైకేయి తను వెనక చూపిన స్ర్తి స్వభావాన్ని, తను చేసిన పనిని గురించి జరిగింది జరిగినట్లుగా చెప్పడం ప్రారంభించింది. బుద్ధిమంతురాలు అనే గర్వం కలదైన, మూర్ఖురాలైన కైకేయి మహాత్ముడైన భరతుడి మాటలు విని సంతోషిస్తూ చెప్పింది.
‘రాముడు ఏ బ్రాహ్మణుడి ధనాన్ని కొంచెమైనా దొంగిలించలేదు. పాపం చేయని ధనికుడ్ని కాని, దరిద్రుడ్ని కాని ఎవర్నీ హింసించలేదు. పరభార్యలని కంటితో చూడను కూడా చూడడు. కుమారా! రాముడికి అభిషేకం జరుగుతుందని వినగానే నేను మీ నాన్నని నీకు రాజ్యం ఇవ్వమని, రాముడ్ని అరణ్యానికి పంపమని కోరాను. మీ నాన్న తన నియమాన్ని పాటించి, ఆ విధంగానే చేసాడు. సీతాలక్ష్మణులతో రాముడ్ని అడవికి పంపేసాడు. కీర్తివంతుడైన మహారాజు తన ప్రియపుత్రుడైన రాముడు దూరం అవడంతో పుత్రశోకంతో బాధపడుతూ మరణించాడు. ధర్మాలు తెలిసిన భరతా! ఇప్పుడు నువ్వు రాజత్వాన్ని స్వీకరించు. ఈ విధంగా నేను నీ కోసమే ఇదంతా చేసాను. కుమారా! శోకాన్ని, విచారాన్ని విడిచి ధైర్యాన్ని తెచ్చుకో. ఈ నగరం, శత్రుబాధలు లేని ఈ రాజ్యం కూడా నీ అధీనంలో ఉన్నాయి. ఇందువల్ల శాస్త్ర విధానం తెలిసిన వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి త్వరగా రాజుకి యధావిధిగా సంస్కారం చేసి, మనసులో ఏ విచారం లేకుండా రాజ్యాభిషిక్తుడివి అవు’ (అయోధ్యకాండ సర్గ 72)
హరిదాసు ఆ రోజు చెప్పిన కథ విన్నాక ఆరుగురు శ్రోతలు ఆరు తప్పులని కనుక్కుని హరిదాసుకి చెప్పారు. ఆయన వెంటనే అయోధ్యకాండ పుస్తకం తెరిచి చదివి తన తప్పులని ఒప్పుకున్నాడు. మొదటి తప్పుని ఆశే్లష కనుక్కున్నాడు. వాటిని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న

సాల వృక్షాన్ని
తెలుగులో ఏమంటారు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

అయోధ్యా నగరానికి గల మరో పేరు ఏమిటి? సాకేత నగరం

1.‘కదంబ’ వృక్షాలు అధికంగా గల ఉజ్జిహాన అనే నగరంలోని ఉద్యానవనానికి చేరాడు అని వాల్మీకి రాసాడు. కాని హరిదాసు ‘ఔదుంబర’ వృక్షాలు అని చెప్పాడు.
2.్భరతుడు కుటికా నదిని దాటాడు. కాని హరిదాసు కుటిలా నది అని తప్పు చెప్పాడు.
3.ఏకసాల గ్రామంలో స్థాణుమతీ నది, వినత గ్రామంలో గోమతీ నదిని దాటాడు. కాని హరిదాసు అటుదిటుగా చెప్పాడు.
4.్భరతుడు ఏడు రోజులు ప్రయాణించి అయోధ్యని చేరాడు. ఇది హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి