రంగారెడ్డి

రాందాస్ సేవలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 25: గురుకుల విద్యాపీఠ్ హైస్కూల్ వ్యవస్థాపకులు, విద్యావేత్త గొళ్ళపుడి రాందాస్ విద్యాభివృద్ధికి, సమాజానికి చేసిన సేవలు మరువలేనివని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పేర్కొన్నారు. నగరపంచాయతీ పరిధిలోని ఖానాపూర్‌లో ఉన్న గురుకుల విద్యాపీఠ్ హైస్కూల్‌లో విద్యాపీఠ్ వ్యవస్థాపకులు రాందాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ రాందాస్‌ను యోగి, విద్యావేత్త, సందేశకర్తగా అభివర్ణించారు. విజయనగరం జిల్లా మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆయన చిన్నతనం నుండే క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారని చెప్పారు. విద్యావేత్తగా మారి విద్యాభివృద్ధి కోసం గురుకుల విద్యాపీఠ్‌ను స్థాపించారని పేర్కొన్నారు. నలబై ఏళ్ళ క్రితమే విద్యాసంస్థను ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు. విద్యాభివృద్ధికి రాందాస్ చేసిన సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు. గురుకుల విద్యాపీఠ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రాందాస్ ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఉత్తమపౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాందాస్ కుటుంబ సభ్యులు పుష్పాంజలి, తేజ, విద్యాపీఠ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ పున్నం కుమార్, సీతారాంపేట్, ఖానాపూర్ మాజీ సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, సత్తయ్య, నగరపంచాయతీ కౌన్సిలర్లు ముత్యాల భాస్కర్, టేకుల రాంరెడ్డి, బిజెపి నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, అర్జున్‌రెడ్డి, డాక్టర్ అబ్బయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేక మహోత్సవం
వికారాబాద్, డిసెంబర్ 25: విశ్వకల్యాణ సంకల్పం, పరమేశ్వరుని అనుగ్రహంతో లభించే ప్రేరణతో గత ఐదు సంవత్సరాలుగా పరమ పవిత్ర కాశీ నుండి తెచ్చి, నిత్యం పూజలందుకున్న శివలింగానికి ప్రస్తుత మన్మథనామ సంవత్సరంలో పవిత్ర కార్తీక, మార్గశిర మాసాల్లో 45 రోజులపాటు భక్తుల స్వగృహాల్లో రుద్రాభిషేక మహత్తర ముగింపు కార్యక్రమం గంగవరం ఆధ్యాత్మిక సేవామండలి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక శ్రీరామమందిరంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం మహిళలచే భజన, భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, గణపతిపూజ, నగర సంకీర్తన, గణపతిహోమం, రుద్రహోమం, మహాన్యాసము, పంచామృతాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రుద్రాభిషేకంలో భాగంగా పట్టణం నుండే కాకుండా పరిసర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి శివుడిని అభిషేకించారు. అనంతరం చేపట్టిన పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఓం నమఃశివాయ నామస్మరణతో రామమందిరం మారుమోగింది. తర్వాత రుమంచి ప్రణతిచే సాంస్కృతిక నృత్యరూపకం అందరినీ అలరించింది. అనంతరం భజన కార్యక్రమం చేపట్టగా, పుట్టపర్తి ప్రశాంతి నిలయం అనువాదకులు ప్రొఫెసర్ కామరాజు అనిల్‌కుమార్, శ్రీసత్యసాయి సేవాసమితి జిల్లా అధ్యక్షుడు రాంకుచేల్ సందేశం ఇచ్చారు.
ఆ తర్వాత ఆలయంలో చేపట్టిన మహాప్రసాదం(అన్నదాన) కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు మహిళల కోలాటం, దాండియా, భజనల మధ్య పార్వతీ పరమేశ్వరుల దివ్య రథోత్సవం శ్రీరామమందిరం, శ్రీమల్లికార్జునభవనం, బస్టాండ్ కూడలి, శ్రీహనుమాన్ మందిరం మీదుగా సాగింది. భక్తులు భారీ సంఖ్యలో ఊరేగింపుకు హాజరయ్యారు. శ్రీరామమందిరంలో రుద్రాభిషేక మహోత్సవంతో పండుగ వాతావరణం నెలకొంది.