హైదరాబాద్

చెత్తకుప్పల స్థానంలో ముగ్గులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: మహానగరంలో ఎక్కడబడితే అక్కడ విచక్షణరహితంగా చెత్త పడటం మనం చూస్తాం.. ఈ రకంగా ఓపెన్ ప్లేస్‌లలో చెత్త వేయటం ఆరోగ్యానికే గాక, పర్యావరణ పరంగా కూడా మంచిది కాదని మహానగర పాలక సంస్థ అధికారులు ఎన్ని రకాల ప్రచారం చేసినా, ఫలించటం లేదు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు మున్సిపల్ మంత్రి కెటిఆర్ రూపకల్పన చేసిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా నగరంలో ప్రస్తుతం తరుచూ కుప్పలుగా చెత్త పడుతున్న వెయ్యి 116 ప్రాంతాల్లో చెత్త పడకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసి అధికారులు సరికొత్త ప్రయత్నానికి తెర దీశారు. కుప్పలు కుప్పలుగా చెత్త పడే పలు మెయిన్ రోడ్లలో చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి, అక్కడ అందమైన ముగ్గులు వేయటం, ఇక్కడ చెత్త వేయరాదంటూ ముగ్గుతో రాయటం వంటి ప్రయత్నాలను ప్రారంభించారు. ఆ ప్రాంతంలో మొక్కలు నాటడం, తరుచూ చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు వసూలు చేయటం వంటి చర్యలు చేపట్టారు. మరికొన్ని సర్కిళ్లలో మహిళా డిప్యూటీ కమిషనర్లు ఇంటింటి బొట్టుపెట్టి చెత్త ఎక్కడబడితే అక్కడ వేయరాదని, తడి,పొడి చెత్తను వేరు చేసి ఆటో టిప్పర్ల కార్మికులకు ఇవ్వాలని కోరుతున్నారు. భారీగా చెత్త పడే ప్రాంతాల వద్ధ ఇక్కడ చెత్త వేయరాదంటూ చాటింపు కూడా చేయిస్తున్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్ని ప్రతి సర్కిల్‌లో, జోన్లలో తప్పకుండా అమలు చేయాలని కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంత చేసిన తర్వాత కూడా ప్రజల్లో మార్పు రాకపోతే చెత్త పడే ప్రాంతాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు.
289 ప్రాంతాలను తొలగించాం: కమిషనర్ జనార్దన్‌రెడ్డి
మున్సిపల్ మంత్రి కెటిఆర్ వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు గ్రేటర్‌లో తరుచూ చెత్త పడే 289ప్రాంతాల్లో చెత్తను తొలగించి, మళ్లీ అక్కడ చెత్త పడకుండా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి గ్యార్బెజీ పాయింట్లు సుమారు వెయ్యి 116 ఉండేవని ఆయన వివరించారు. ఉప్పల్ సర్కిల్‌లోని కాలనీలో స్థానిక రెసిడెన్షియల్ అసొసియేషన్లు సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు.

ప్రతిపాదనల్లో మూడో వంతు
హైదరాబాద్, మార్చి 14: గ్లోబల్ సిటీ దిశగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరంలో ప్రజలకు అత్యవసరమైన, అతిముఖ్యమైన సేవలందించే వివిధ ప్రభుత్వ విభాగాలకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం వారు పంపిన ప్రతిపాదనలకు మూడో వంతు నిధులను కేటాయించింది. ముఖ్యంగా కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరావాసులకు అతి ముఖ్యమైన పారిశుద్ధ్య, వీది ధీపాలు, రోడ్లు వంటి ఇతర కీలకమైన పౌరసేవలందించే మహానగర పాలక సంస్థకు మొండి చేయి చూపిన ప్రభుత్వం ఇతర శాఖలైన జలమండలి, హెచ్‌ఎండిఏ, మెట్రోరైలు, పోలీసు శాఖ వంటి విభాగాలు అభ్యర్థించిన దానిలో సగానికి సగం నిధులను కేటాయించింది. శాంతిభద్రతల పరిరక్షణను మెరుగుపరిచేందుకు శాంతిభద్రతల పరిరక్షణ, ఆధునిక పోలీసింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ఈసారి బడ్జెట్‌లోనూ ఆ శాఖకు పెద్దపీట వేసింది. ఇప్పటికే రూ. 480 కోట్లను వెచ్చించి కొత్త వాహనాలను సమకూర్చిన సంగతి తెలిసిందే! తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిష్నరేట్‌లో రూ. 245 కోట్ల ప్రతిపాదనలను సర్కారుకు పంపగా, ఇందులో బంజారాహిల్స్‌లోని పోలీస్ ట్విన్ సెంటర్‌కు రూ. 70 కోట్లు, కమాండ్ కంట్రోల్‌కు రూ. 140 కోట్లను కేటాయించటంతో పాటు పోలీస్ క్వార్టర్స్‌ల నిర్మాణం కోసం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు పెద్దగా నిధుల కేటాయింపు, ప్రత్యేకమైన విధులంటూ లేని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ) పనితీరును మెరుగుపరుస్తామని ఇటీవలే ప్రకటించిన మున్సిపల్ మంత్రి కెటిఆర్ చొరవతో ఆ శాఖకు రానున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సుమారు రూ. 650 కోట్లను కేటాయించింది. ఈ శాఖ సుమారు రూ. 1776 కోట్ల ప్రతిపాదనలు పంపగా, అందులో రూ. 650 కోట్లను మాత్రమే కేటాయించారు. అలాగే మెట్రోరైలు అధికారులు రూ. 500 కోట్ల ప్రతిపాదనలు పంపగా, అందులో 40శాతం అంటే రూ. 200 కోట్లు, అలాగే జలమండలి రూ. 1750 కోట్ల ప్రతిపాదనలు పంపగా, అందులో సగం కన్నా తక్కువ రూ. వెయ్యి కోట్లను కేటాయించినట్లు, దీన్ని తాగునీటి అవసరాలకు వినియోగించనున్నట్లు మంత్రి ఈటల తన బడ్జెట్ ప్రసంగంలో సైతం పేర్కొన్నారు. అంతేగాక, యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ రైలును అందుబాటులోకి తెచ్చేందుకు గాను భువనగిరి వరకు విస్తరించేందుకు రూ. 764 కోట్ల ప్రతిపాదనలు పంపగా, తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 220 కోట్లు కేటాయించింది.
ప్రస్తావనే తప్ప.. పైసా కేటాయించలేదు
సుమారు కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో పేదలకు మెరుగైన సూపర్ స్పెషాల్టీ వైద్యం అందించేందుకు మరో నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు బడ్జెట్‌లో ప్రస్తావన వచ్చిందే తప్ప, ఎక్కడ నిర్మిస్తున్నది? ఎంత నిధులు కేటాయించారన్న దానిపై స్పష్టత లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం, ఆరోగ్యానికి కేటాయించిన రూ. 5967 కోట్లలోనే వీటికి నిధులు కేటాయిస్తారేమోనని అధికారులంటున్నారు.
అంతటా నిఘా నేత్రాలు
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పౌరసేవలను మెరుగుపరిచేందుకు నగరంలో లక్ష సిసి కెమెరాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఎట్టకేలకు వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో మోక్షం కలించారు. ఇప్పటి వరకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్న విషయంపై జిహెచ్‌ఎంసి, నగర పోలీసు శాఖలు ఎవరికి వారే ప్రకటనలు చేశారే తప్ప, నిధులు ఎవరు వెచ్చించాలన్న దానిపై అస్పష్టత ఉండేది. ఇపుడు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 225 కోట్లను కేటాయించటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో నగరమంతటా నిఘా నేత్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

నీటి కష్టాల నివారణకు రూ.వెయ్యి కోట్లు
* శివార్లలో నీటి సరఫరాకు రూ. 100 కోట్లు
* గోదావరి జలాల పనులకు రూ. 750 కోట్లు
* రుణాల చెల్లింపులకు రూ. 150 కోట్లు
హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, మార్చి 14: ఈసారి ఎండలు కాస్త ముందుగానే మండిపోవటంతో మున్ముందు నగరంలో తాగునీటి సమస్య తీవ్రమవుతుందన్న విషయాన్ని సర్కారు గుర్తించింది. ఇందుకు గాను కాస్త ముందుగానే కళ్లు తెరిచింది. వేసవిలో నీటి కష్టాలను నివారించేందుకు రానున్న ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో జలమండలికి ప్రణాళికేతర నిధుల కింద రూ. వెయ్యి కోట్లను కేటాయించింది. ఎంతో కాలంగా కొనసాగుతున్న ప్రయత్నం కొంత వరకు ఫలించి ఇప్పటికే నగరానికి గోదావరి జలాలను తీసుకువచ్చినా, శివార్లలో నీటి సమస్య పూర్తి స్థాయిలో మెరుగుపడకపోవటం, పలు ప్రాంతాల్లో నేటికీ ప్యాకేజీ నీళ్లే అందుబాటులో ఉన్నందున, అక్కడ పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూ. వంద కోట్లను వెచ్చించేందుకు జలమండలి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జలమండలి చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే బోర్డు జైకా, ప్రపంచ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 150 కోట్లు కేటాయించింది. అదే విధంగా గోదావరి జలాలలను నగరానికి తరలింపు పథకానికి గాను రూ.750 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
కార్యచరణపై కసరత్తు
మున్ముందు పొంచి ఉన్న తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్.. జలమండలికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు నగరవాసులకు మెరుగైన సేవలందించేందుకు గాను కెటిఆర్ వంద రోజుల కార్యచరణను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్లాన్ కింద నీటి సమస్య పరిష్కారానికి ప్రారంభమైన ప్రయత్నాలు, తాజాగా నిధుల కేటాయింపుతో మరింత ముమ్మరం అవుతాయని చెప్పవచ్చు. ఈ ప్లాన్ కింద ఇప్పటికే నగరంలో నీటి సమస్యను అధిగమించేందుకు జలమండలి, జిహెచ్‌ఎంసి అధికారులు గత కొద్దిరోజులుగా సమష్టి కృషిని ఆరంభించారు. ఇక తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులను మంజూరు చేయటంతో గోదావరి జలాల తరలింపు పనులను వేగవంతం చేయటంతో పాటు శివార్లలో మంచినీటి సమస్య పరిష్కారానికి మార్గాలను అనే్వషించే పనిలో పడ్డారు జలమండలి అధికారులు.

ఆకట్టుకున్న సౌమ్య సంకీర్తనాలాపన
హైదరాబాద్, మార్చి 14: నగరంలో మహిళా సాధికారత సాధనలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠి విభాగం తనవంతు కృషి చేస్తోంది. ఇప్పటికే మొదటి బ్యాచిగా ఎంపిక చేసిన మహిళలకు తొలుత కుట్టులో శిక్షణనిచ్చి, ఆ తర్వాత వారికి కుట్టుమిషన్లను కూడా ఉచితంగా పంపిణీ చేసింది. ఆబిడ్స్‌లోని జి.పుల్లారెడ్డి భవన్‌లోని సత్యసాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలోని ఆరవ అంతస్తులో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత సౌమ్య, అనిత, సునందలు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతర సౌమ్య సంకీర్తనాలాపన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సత్యసాయిసేవా సంస్థల కోఠి విభాగం కన్వీనర్ విశే్వశ్వరశాస్ర్తీ మాట్లాడుతూ మహిళలకు తమ సేవా సంస్థల తరపున బాసటగా నిలిచేందుకు ఎంజెమార్కెట్‌లో ప్రత్యేకంగా కుట్టుశిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి బ్యాచ్‌లో 20మంది ఎంపిక చేయగా, వీరిలో 16మంది మహిళలు రెగ్యులర్‌గా కోచింగా హజరై మెళుకువలు నేర్చుకున్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దర్ని ఎంపిక చేసి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశామని వివరించారు. అనంతరం సంకీర్తనాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌమ్యకు తబలాపై శ్రీ విజయకుమార్, వయోలిన్‌పై రాజన్ సహకరించటంతో ఆమె ముత్తుస్వామి దీక్షితర్ ‘ఆనందామృత ఆకర్షిని...కల్యాణి రాగంలో శ్రీ త్యాగరాజస్వామి సంకీర్తన, అన్న ఆనందాయని వర్ణం అంటూ గంభీరసత రాగంలో డా.మంగళంపల్లి బాలమురళికృష్ణ కీర్తన ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది.

చెత్తరహిత నగరంగా గ్రేటర్
నేరేడ్‌మెట్, మార్చి 14: గ్రేటర్ హైదరాబాద్‌ను చెత్త రహిత నగరంగా తీర్చి దిద్దెందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి పేర్కోన్నారు. జిహెచ్‌యంసి మల్కాజిగిరి సర్కిల్ అధికారులు సోమవారం సైనిక్‌పురి జ్యోతిరావు పూలే విగ్రహం నుండి మల్కాజిగిరి గాంధీపార్కు వరకు చెపట్టిన చెత్త పై అవగహన ర్యాలీని జెండా ఉపి ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ ప్రారంభించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరాదన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే నగరం పరిశుభ్రంగా ఉంటుందని దినిపై ప్రతి ఒక్కరు అవగహన కల్గి ఉండాలని అన్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో నివసించే ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారని దిని వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయని తెలిపారు. గ్రేటర్ అధికారులు చెత్త సేకరణ కోసం డబ్బాలు, ఆటో రిక్షాలను ప్రవేశపెట్టిన చాలా మంది చెత్తను ఖాళీ ప్రదేశాలు, ఓపెన్ నాలాలలో పడవేస్తున్నారని గుర్తు చేశారు. జిహచ్‌యంసి అధికారులు తడి చెత్త, పొడి చెత్త కోసం ప్రజలకు రెండు రంగుల డబ్బాలను పంపిణీ చేశారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కర తమకెందుకులే అని అనుకోవడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయన్నారు. శానిటేషన్ సిబ్బంది చెత్తను తగులబెట్ట కూడదన్నారు. చెత్తను తగులబెట్టడం వల్ల భవిష్యత్‌లో పర్యావరణంలో అనేక మార్పులు వస్తాయని అన్నారు. ర్యాలీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మిడియా, పలువురు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు శ్రీదేవి, ఎన్.జగదీష్‌గౌడ్, ఆకుల నర్సింగ్‌రావు నాయకులు మురుగేష్, పరశురాంరెడ్డి డిసి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

'భామనే.... సత్యభామనే’ సిద్దేంద్రయోగి అపూర్వ సృష్టి
హైదరాబాద్, మార్చి 14: కూచిపూడి నృత్య సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన బామాకలాపం అంశాన్ని పూర్వం పురుష నర్తకులు మాత్రమే ప్రదర్శించేవారు. కాలానుగుణంగా నాట్యాచార్యులలోకూడా కొంత పరివర్తనకు రావడంతో స్ర్తిలకుకూడా శిక్షణ ఇవ్వడంతో ప్రస్తుతం స్ర్తి కళాకారిణులే భామా కలాపాన్ని ప్రదర్శిస్తున్నారని, కాలక్రమేణ కొంతమంది నాట్యాచార్యులు వ్యాపారపరంగా శిక్షణ ప్రారంభించడంతో ఈ నృత్యంలోని మూలాలను అభినయంలోను మార్పులు చేస్తున్నారని నృత్యకళాకారుడు శ్రీనివాస చక్రవర్తి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కొంతమంది ఉత్సాహవంతులైన యువ నృత్య కళాకారులు పాత సంప్రదాయాలను వెలుగులోకి తెస్తూ ప్రదర్శనలు ఇస్తున్నారని, అటువంటివారిని ప్రోత్సహించడానికి తన సహకారం అందిస్తున్నానన్నారు. బామా కలాపం ఒక నృత్య గేయరూపకం. ఇందులో భావ ప్రకటన ప్రదానంగావుంటుంది. శృంగార రసం మోతాదు ఎక్కువుగా ఉంటుంది. భామా కలాపంలో మాధవీ పాత్రతోపాటు హాస్యం మనోహరంగా కనిపిస్తుంది. ఈ కలాపంలో విప్రలంభ, సమాగములు రెండూ సమానంగా ఉంటాయి. సత్యభామ నృత్యం లాస్యం ప్రదానంగా వుంటుంది. ద్విపద, ధరువులు కలిసి గానంతోపాటు ఆభినయంకూడా ప్రదానంగా కనిపిస్తాయి. ముఖ, ప్రతిముఖ రవళితోపాటు ఆంగిక, వాచిక, సాత్వికాభినయాలు ఈ నృత్యానికి ముఖ్యం అని శ్రీనివాస్ అన్నారు. గతంలో ఈ ప్రదర్శనకు హడావుడి ఎక్కువుగా ఉండేది. తొలుత సూత్రధారుడు వేదికపైకి వచ్చి జరుగుబోయే కార్యక్రమాన్ని వివరించడం, సత్యభామ పాత్ర గురించి తెలియజేయడం, అనంతరం సత్యభామ రంగప్రవేశం చేయడం జరిగేది. కాలక్రమేణా ఈ పద్దతులన్నీ మారిపోయి ఏకపాత్ర నర్తనంగా కనిపిస్తుందని శ్రీనివాస్ అన్నారు.ఈ అంశంలో నృత్యానికి ప్రాధాన్యత పెంచుతూ కళను నేర్పించిన గురువుకు కీర్తి, గౌరవాన్ని పెంచగలిగే శిష్యులు ఉన్నంతకాలం సిద్దేంద్రయోగి సృష్టించిన భామాకలాపం పతాకస్థాయిలో ప్రాచుర్యం పొందుతూనే ఉంటుందని నాట్యకోవిదుడు శ్రీనివాస చక్రవర్తి అన్నారు.