అక్షర

సలక్షణ విశే్లషణల సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రస రాజధాని
-కోవెల సుప్రసన్నాచార్య
వెల: రు.120/-
ప్రతులకు- రచయిత
ఇం.నెం. 9-1-190
రాధిక థియేటర్ ఎదురు
గిర్మాజీపేట్,
వరంగల్- 506002

‘‘ఎవని యాకృతి మించు హిమశైల శిఖరమై
కవులలో పుడమి మానవుల లోన
ఎవని భారతి వెల్గునేకైక దీపమై
జగములందాగామి యుగములందు
ఎవని మన్గడ యొప్పు శ్రవణ పీయూషమై
కథలలో సూరివాక్సుధలలోన
ఎవని స్థానము గ్రాలు నవనవోనే్మషమై
ఋషులలో నిఖిలా నిమిషులలోన
అతడు కవియును ఋషియు దేవతగాడు
కవులు ఋషులును దివిజులుంగలసిమెలసి
మ్రొక్కు సాక్షాత్ పరబ్రహ్మమూర్తిగాక
విశ్వనాధుండు కేవలావిర్భవుండె’’...
ఇది విశ్వనాధవారి విరాడ్రూపము. అట్టివాని రచనా వైశిష్ట్యముల గూర్చి మరొక ధీమంతుని వ్యాస వాజపేయము. దాని పేరు ‘‘రస రాజధాని’’ ఔచిత్య దీపితము. ఎందరు ఎన్నివిధాల వ్రాసినా మరల నింకొకమారు వ్రాయవలెనన్న ఇంకొకర్ని ఔత్సుక్వము. ఇట్టిదీ ‘‘రసరాజధాని’’ కోవెల సుప్రసన్నాచార్యులవారి ఉత్కృష్ట వ్యాస పరంపర. ఏ కావ్యమునైనను కవి ప్రతిజ్ఞనుబట్టి యనుశీలింపనగును. లేదా అనూచానముగా వచ్చు మహాకవి సంప్రదాయమునుబట్టి పరిశీలింపతగును. అనుశీలనము- పరిశీలనము పదములలో సంప్రదాయ నిర్మాతలైన పూర్వ కావ్యమర్మజ్ఞులు అనుశీలన పదమునే అభిమానించిరి. ఆనందించిరి. సహృదయ శబ్దమును వ్యాఖ్యానించుచు ఆలంకారిక సరణి వ్యవస్థాపకులలో ప్రధానుడైన అభినవ గుప్తుడు ఇలా అన్నాడు. ‘‘అనవరత కావ్యానుశీలనాభ్యాసవశా ద్విశదీభూతే మనోముకురే తన్మరుూభవన యోగ్యతాయేషాంతే సహృదయాః’’ నిరంతరము కావ్యములను అనుశీలించుటవలన స్వచ్ఛమైన మనోదర్పణమునందు తన్మయత్వము చెందు యోగ్యతగలవాడు సహృదయుడు. ఇచట అనుశీలనమంటే కవి అభిప్రాయానుకూలముగా కావ్యార్థము భావించుట. శీలశబ్దము సమాధిని చెప్పును. (శీల సమాధౌ) అనుసరించి సమాధిని పొందుట అనుశీలనము. ఎవరిననుసరించి..? కావ్యముననుసరించి లేదా కవిననుసరించి. రెండూ నొకటియే. కవి కర్మకావ్యము. అనగా కవిమార్గము. ఈ మార్గమును శ్రీ కోవెల వారనుసరించినదియే. ‘‘మహాకవి విశ్వనాథ’’ మొదటి వ్యాసం. రెండవది ‘‘శ్రీ మంజూషిక’’. (పే 21).
‘‘శ్రీ మంజూషిక భక్తరక్షణ కళాశ్రీ చుంచువానంద.. వల్లీ.... .... ఇదీ పద్యం. మంగళాచరణము అవశ్యకర్తవ్యం. ‘‘నిర్విఘ్నపరిసమాప్తికామో మంగళ మాచరేత్’’అను శ్రుతి మంగళాచరణమందు ప్రమాణమైయున్నది. విశ్వనాథవారి ఈ పద్యమును కోవెలవారు అనుశీలించియే యున్నారు. విశ్వనాథ హృదయమును సుప్రసన్నాచార్యులవారు దర్శించిన తీరే అమోఘము. అది శ్రీ మంజూషికలో ప్రస్ఫుటము. గన్నమనేని వారన్నట్లు ‘‘తలస్పర్శి పాండిత్యంతో భారతీయతత్త్వ చింతనమయ హృదయం’’వుంటే తప్ప ఈ రచన సాగదు.
‘‘మంగళం వేద బోధితా భీష్టోపాయతాకమ్ అలౌకికావిగీత శిష్టాచారత్వాత్ దర్శాదివత్’’అనగా మంగళాచరణము వేదమందే బోధింపబడిన నిర్విఘ్న సమాప్తి రూపాభిష్టోపాయమైయుండునది. అలౌకికావిగీత శిష్టాచారమగుట వలన ఏదిఏది అలౌకికావిగీత శిష్టాచారమై యున్నదో అది యది వేదముచే బోధింపబడిన యిష్ట ప్రాప్త్యుపాయమై యున్నది. శ్రీ మంజూషిక తత్త్వమునందున్న యొకానొక పరమార్ధమును శ్రీ కోవెల సుప్రసన్నగారు సాధిష్టయోగముగా దర్శించిరి. ఇచట హేతువునందుండు అలౌకిక- అవిగీత- శిష్ట అనుమూడు పదముల యొక్క అర్ధమును రచయిత తేటతెల్లము చేసిరి. ఈ మంగళాచరణమును అనుభవములోనికి తెచ్చుకొను విశే్లషణమును విడమరుచుటలో- రచయిత వైశారద్యము స్ఫుటమే. ఒక్కొక పదబంధమును ఉటంకించు సందర్భమును చెప్పుచో -గ్రంథ విస్తరణ భీతి. (సమీక్షకునకు). ఆత్మానంద యోగకారకమైన శ్రీ విశ్వనాథవారి ప్రతి ప్రయోగమును సుప్రసన్నగారు యధార్థ సంపద్విభూతిగా ననుభవించిరనుట నిజము.
‘‘నాది వ్యవహార భాష మంధరముశైలి
తత్త్వము. రసధ్వనులకు ప్రాధాన్యమిత్తు
రసము పుట్టింపగ వ్యవహారము నెఱుగ
జనను- లోకమ్ము వీడి రసమ్ము లేదు-’’
ఇంత పద్యమునకున్న అర్థ సంపత్తిని నొక వాక్యమున కోవెలవారు నిబద్ధించిరి. ‘‘లోక జీవన భూమిక మీద రసజగత్తు నిలబడుచున్నది’’. (పే. 58)
విశ్వనాథను వ్యాసప్రోతం చేసే ప్రతి సహృదయుడు రామాయణాన్ని వేయిపడగల్లో స్పృశించకుండా యుండడు. వస్తు పరిణామమట్టిది. వేయి పడగల పుట్టుపూర్వోత్తరాల గురించి రచయిత క్షుణ్ణంగానే చెప్పారు. ఇకపోతే రామాయణం కాండాత్కాండ ప్రరోహంగా ఎందరెందరో చెప్పారు. విడమరిచారు. విశే్లషించారు. వ్యాఖ్యానించారు. కోవెల వారున్నూ అంతియే. లోకంలో రామాయణగాధ బహుధా వ్యాపకత్వం పొందింది. ప్రసిద్ధమైన ఆ కథాభాగాన్ని పలువురు పలువిధాలుగా మలచి జీవిత ధ్యేయాలకు- శాశ్వత ధర్మాలకు అర్ధవాదాలుగా వాక్యాలు వ్రాసుకున్నారు. ఒక్కొక్క కావ్యం ఒక్కొక విధంగా లోకంలో వైశిష్ట్యాన్ని సంచరించుకుంది. శాశ్వతమైన ఏ సత్యానికో ప్రతీకాప్రాయంగా కావ్యాలు మలచబడతాయి. మన దేశంలో కావ్యలక్షణ పరమావధి అది. తాత్కాలిక సన్నివేశాలకు- క్షణిక ఆవేశాలకు కావ్యకళను దుర్వినియోగం చేయటం మన సంప్రదాయం కాదు. అట్టిదే అగుబో ఆ దరిద్రం వేరు. వారిచట ప్రస్తావించబడరు. సంస్కృతంలో భాసుడు- మురారి రాజశేఖరుడు- భవభూతి మొదలయినవారు రామాయణ గాథను అంతో యింతో మార్పుచేసి వ్రాసినవారే. ప్రధాన కథకు భంగంలేకుండా జీవిత ధ్యేయాలైన పరమ సత్యాలను విపరీతం చేయకుండా కథను చెప్పుకుపోయారు. తెలుగులో కూడా భాస్కర రామాయణం- రంగనాథ రామాయణం- మొల్ల రామాయణం- యిత్యాదులు ఈ విధంగా బహుళ ప్రచారం పొందాయి. ఐతే విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం శిఖరాయమాణమే. ఈ విషయాన్ని సాధికారముద్రతో సంకలితం చేసిన వ్యాస సంపుటి కోవెల వారిది.
తెలుగు ప్రతివాడు చదవ వలసిన ఈ పొత్తం నిజంగానే రసరాజధాని. అసలు విషయంతోపాటు విశ్వనాథ వారితో తమకున్న పరిచయం- అనుబంధం- ఇవి కూడ ఇందులో పొందుపరచబడ్డాయి. ఈ తరహా పుస్తకాలను సమీక్ష చేయాలంటే, కత్తిమీద సామే. మూల రచయితను ప్రస్తావించకుండా వ్యాసకర్త వైదుష్యాన్ని మాత్రమే వెలిగించలేము. అందునా గ్రంథ రచయిత శేముషీ సంపన్నుడైతే మరీ యిబ్బంది. కోవెలవారి విశే్లషణము సలక్షణముగానున్నది. వారి ప్రతిభకు ఇది సానరాయి. ఈ రచయిత యట్టిడు. ఈ పొత్తమట్టిది.

-సాంధ్యశ్రీ