రంగారెడ్డి

భానుడి ఉగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 19: భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.. ఉదయం ఎనిమిది గంటలకు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. భానుడి ప్రతాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు గొడుగులతో పాటు టోపీలను తలపై పెట్టుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. భానుడి ప్రతాపం గరిష్టం 41డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా కనిష్టం 28డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఎండల తీవ్రత వల్ల ప్రతిరోజు రద్దీగా ఉండే షాద్‌నగర్ ముఖ్యవీధులతో పాటు జాతీయ రహదారి సైతం బోసిపోతుంది. ఎండల వేడిమి కారణంగా మధ్యాహ్నం సమయంలో వడగాలులు వీస్తుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. దాంతో పట్టణంలోని ఏ వైద్యశాల చూసినా రోగులతో కిటకిటలాడి పోతున్నాయి. భానుడి ప్రతాపం నుంచి తట్టుకునేందుకు ప్రజలు చల్లదనం వైపు ఎక్కువగా పరుగులు తీసుకున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు శీతల పానీయాల వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మరికొంతమంది మధ్యాహ్నం సమయంలో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఎండల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే మే నెలలో ఎలా ఉంటుందోనని ప్రజలు భయం గుప్పిట్లో ఉండిపోతున్నారు.
పుట్టగొడుగుల్లా పండ్ల రసాల కేంద్రాలు
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పండ్ల రసాల కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలకు చల్లటి నీళ్లతో పాటు పండ్ల రసాలను రెట్టింపు ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. గత వేసవి కాలంలో 15రూపాయల పండ్ల రసాలు ప్రస్తుతం 20రూపాయలకు, కొబ్బరి బొండాలు గత సంవత్సరం ఒకటి 20రూపాయలు ఉండగా ప్రస్తుతం 25రూపాయల వరకు విక్రయిస్తుండటంతో త్రాగేందుకు వీలులేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ప్రధాన రహదారుల్లో ఎక్కడపడితే అక్కడ శీతల పానీయాల కేంద్రాలను నెలకొల్పి జీవనాధారంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ శ్రీనివాస్
భానుడి ప్రతాపం పెరుగుతున్న నేపధ్యంలో వడగాలులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని, వీటి భారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్లి పనులు చేసుకోవాలే తప్పా మధ్యాహ్నం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లరాదని తెలిపారు. ఎండలో బయటకు వెల్లితే తప్పని సరిగా ఓఆర్‌ఎస్ ప్యాకేట్లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు.