జాతీయ వార్తలు

అరుణాచల్‌లో రచ్చ.. రచ్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎంను, స్పీకర్‌ను ‘తొలగించిన’ రెబెల్ ఎమ్మెల్యేలు
‘ముఖ్యమంత్రి’గా తిరుగుబాటు ఎమ్మెల్యే ఎన్నిక
అడ్డుకున్న గౌహతి హైకోర్టు
ఇటానగర్, డిసెంబర్ 17: అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య ప్రతిపక్ష బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు, కొంతమంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి స్థానిక హోటల్‌లో సమావేశమై కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి నబమ్ టుకిని తొలగించడమే కాకుండా ఆయన స్థానంలో ఒక తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే గౌహతి హైకోర్టు జోక్యం చేసుకుని ‘తిరుగుబాటు’ సమావేశం తీసుకున్న అన్ని నిర్ణయాలను నిలిపివేసింది. గవర్నర్ జెపి రాజ్‌ఖోవా ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు స్పీకర్ నబమ్ రెబియాను అభిశంసిస్తూ బుధవారం ప్రతిపక్ష, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో జరిగిన ‘అసెంబ్లీ’ సమావేశం తీసుకున్న అన్ని నిర్ణయాలను నిలిపివేసింది. మామూలుగా జనవరి 24న జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 16 (బుధవారం)కు ముందుకు జరుపుతూ ఈ నెల 9న గవర్నర్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ స్పీకర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
గురువారం ఒక కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన ‘తాత్కాలిక’ అసెంబ్లీ సమావేశంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ నబమ్ రెబియాను అనిశంసిస్తూ తీర్మానం చేసారు. కాగా, బుధవారంనుంచి అసెంబ్లీని సీల్ చేసిన దృష్ట్యా ఒక హోటల్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశమైన 20 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో 11 మంది బిజెపి ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు చేతులు కలిపారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు గురువారం ముఖ్యమంత్రిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యే అయిన డిప్యూటీ స్పీకర్ టి నోర్బు తోంగ్‌డోక్ స్పీకర్ స్థానంలో ఉండగా ఆమోదించారు. అరవై మంది సభ్యులున్న అసెంబ్లీలో 20 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలతో కలుపుకొని మొత్తం 33 మంది సభ్యులు ఆ తర్వాత మరో అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిఖో పుల్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కూడా.
కాగా, ఈ సభా కార్యకలాపాలు చట్ట వ్యతిరేకమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవని పేర్కొంటూ ముఖ్యమంత్రి నబమ్ టుకి, ఆయనను సమర్థిస్తున్న 26 మంది ఎమ్మెల్యేలు వాటిని బహిష్కరించారు. ఆ తర్వాత వారు రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని అతిక్రమించి వ్యవహరించిన దృష్ట్యా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసారు కూడా. గవర్నర్ చర్యపై మండిపడిన కాంగ్రెస్ పార్టీ రెండు రోజులుగా రాజ్యసభ కార్యకలాపాలను స్తంభింపజేసింది కూడా.
కాగా, అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 16కు ముందుకు జరుపుతూ గవర్నర్ తీసుకున్న చర్య రాజ్యాంగంలోని 174, 175 అధికరణాలకు విరుద్ధమని హైకోర్టులో న్యాయమూర్తి హృషీకేశ్ రాయ్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌కు నోటీసు జారీ చేస్తూ న్యాయమూర్తి సస్పెండయిన 14 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూడిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను, అలాగే అసెంబ్లీకి వెలుపల సమావేశాన్ని నిర్వహించడం, ఆ సమావేశంలో స్పీకర్‌ను తొలగించడం సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలు తీసుకున్న అన్ని నిర్ణయాలను నిలిపివేసారు. కాగా, ఈ కేసులో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక ప్రతివాదిగా చేర్చడానికి పిటిషనర్ కపిల్ సిబల్‌ను న్యాయమూర్తి అనుమతించారు. అనంతరం ఆయన ఈ కేసు విచారణను వచ్చే ఏడాది పిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసారు. (చిత్రం) కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిని ‘ముఖ్యమంత్రి’గా ఎన్నుకునేందుకు సమావేశమైన 33మంది ఎమ్మెల్యేలు