అక్షర

అందమైన భావాలకు అక్షర సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రెండో అధ్యాయానికి ముందుమాట!’
-విరించి విరివింటి
పేజీలు: 144.. వెల:రు.100/-
ప్రతులకు: విరించి విరివింటి
ప్లాట్ నెం.18, శ్రీనివాసం, విజయగార్డెన్స్ కాలనీ, బండ్లగూడ, నాగోల్
హైదరాబాద్ 500068

మనుషుల్లాగే అక్షరాలు కూడా గుంపులుగా ఒక చోట చేరాయంటే నిశ్శబ్దంగా ఉండలేవనీ, కవితంటే..నాకు తెలియకుండా నాలో దాక్కున్న నేనేనని వినమ్రంగా ప్రకటించుకున్న కవి విరించి విరివింటి ‘రెండో అధ్యాయానికి ముందుమాట!’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించారు.
ఒక ఎకరా పొలమంత జ్ఞాపకాల్లోకి అక్షరాల్ని విత్తులుగా చల్లినంత మాత్రాన పండ్లూ కాయల్లాగ కవితలు కోతకు వచ్చేస్తాయని అనుకోలేమన్న వాస్తవం తెలిసిన కవి విరించి ఈ గ్రంథంలోని కవితల్లో ఒక ‘ఎండిన బావి’ అంత అనుభవంలోంచి...మనసుని పొరలు పొరలుగా పూడిక తీసినట్టు...అందమైన భావాలకు అక్షర సొబగులద్దారు..
జీవితంలోను, సమాజంలోను నిజాయితీ కొరవడిన ఘటనలను, సన్నివేశాలను తమ కవిత్వంలో నిక్షిప్తం చేశారు. విలక్షణంగా కవిత్వాన్ని పండించాలన్న తపన ఆయన పద బంధాల్లో ప్రతిబింబిస్తుంది. కొత్తదనం తన కవిత్వపు నడకల్లో తొణికిసలాడాలన్న ఉబలాటం కానవస్తుంది. తనదైన శైలి...కవిత్వపు నిర్మాణం కోసం ఆరాటపడడాన్ని ఇందలి కవితల్లో గమనిస్తాం. వస్తు ఎంపికలో నవ్యత పాటించినప్పటికీ శిల్పం...రూపం..అభివ్యక్తిలో ఇంకా దృష్టిసారించవలసి ఉన్నప్పటికీ...ఆయన వయసు, అనుభవానికి మించి పరిణతితో ప్రకటించిన భావాలను పాఠకులు ప్రశంసించకుండా ఉండలేరు! భయంకర స్వప్నాల మధ్య ఊగిసలాడే/నడిరాతిరి నిదురను ప్రేమించే మనం/ మనుషులందరు కలిసి మెలిసి జీవించే/ఒక సుందర స్వప్నానె్నందుకనో ప్రేమించలేమని ‘్భయంకర స్వప్నం’ కవితలో కవి వెలిబుచ్చిన ఆలోచనలు ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి అద్దంపట్టేలా రూపుదిద్దుకున్నాయి.
‘కిటికీ’ కవిత కవి యొక్క కలం బలాన్ని సూచించేలా ఉంది.
ఈ పుస్తకం అల్మారాలో/దాచుకోవాల్సిందేమీ కాదు/ ప్రతి పేజీని ముక్కలుగా చింపి/ఒక మనిషినైనా చేయాల్సిందన్న పంక్తులు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
‘ఈ రాల్చేసిన జీవితమేమీ/జ్ఞాపకాల శవయాత్రకాదు/వైరాగ్యాన్ని తోడుగ పంపే స్మశానానికి/ఒక కిటికీగానైనా మారాల్సింది’ అన్న భావాలు కవి యొక్క తాత్వికతను చాటేలా ఉన్నాయి.
జీవితంలోని అనేక రంగులు శబ్దాల్లా మోగుతున్నప్పుడు పదాల్ని ఇటుకలుగా పేర్చి...నీవొక గుడి కట్టుకోవాలని నేటి కవికి ఆయన హితవు పలికారు. గుండెల నుండి ఒలికిపోయే సిరా! పదాలుగా పరుచుకున్నప్పుడు/కాగితంమీద వ్యక్తమయ్యే వ్యక్తిత్వం/నీ కవిత్వపుటద్దంలో అలంకరించుకోవాలని సూచించారు.
‘ప్రాస్టిట్యూట్’ కవితలో కవి ఆవిష్కరించిన భావాలు ఆర్ధ్రంగా ఉన్నాయి. వేశ్య గదిలో ఆత్రంగా అల్లుకునే వొళ్లు విరుపులు..వౌనంగా రోదించే అరుపులను ఈ కవితలో కవి విరించి బంధించిన తీరు బాగుంది. అభావంగా పలకరించే ఆ గది కప్పు కింద/్భవ ప్రాప్తిని మించిన ముభావంతో కొన్ని నీడలు ఎక్కి దిగుతుంటాయనీ..దిండ్ల గలేబులు మాటి మాటికీ బిగిసి జారుకుంటాయని రాసిన పదబంధాలు అందరినీ కదిలిస్తాయి.
గుల్కన్ అంతా జుర్రుకుని/గోడకి ఉమ్మేసిన స్వీట్ పాన్‌లా మరకైనప్పుడు/అనిపిస్తుంటుంది ఆకలి తీరేదెవరికి? ఆకలి మిగిలిందెవరికీ? అంటూ ఈ కవితకు కవి ఆలోచనాత్మక ముగింపునిచ్చారు.
‘పది అక్షరాలు’ కవితలో ప్రతి మత పుస్తకంలో...పవిత్ర దీపాల్లా వెలిగే అక్షరాలుంటాయన్న సంగతిని గుర్తు చేసారు. చిరిగిన పుటల్లో వుండగలిగే దేవుడు...మనుషుల్లో ఉండలేడేమని? ప్రశ్నించాడు.
‘మేలిమలుపు’ కవిత సందేశాత్మకంగా మలచబడింది. ‘అందం’ కవిత అందంగా ఆవిష్కరించబడింది. కవి/ఒక స్పందించగల కెమెరా/సమాజం వణికిపోతుంటే/తాను కాలి పోతుంటాడన్న పంక్తులు ఈ కవితకు నిండు శోభను కూర్చాయి. ప్రేమలేఖ కధ, ప్రియసఖి, రెం, పద సోదరి,ఏకాంతం, రెండో అధ్యాయానికి ముందు మాట తదితర కవితల్లోని కవి యొక్క భావుకతను మెచ్చుకోకుండా ఉండలేము!
మనందరం కలవటం కోసమే కవిత్వం రాసుకోవాల్సి ఉంటుందన్న విరించి గారి ఆలోచన ఆహ్వానించదగింది. ఇలా ఎన్నో కవితలు ఇందులో ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. కవిత్వంలో నవ్యత కోసం పాటుపడే క్రమంలో ఆయన మున్ముందు అన్వయశుద్ధి కొరవడకుండా జాగ్రత్త పడాలని కోరుకుందాం.

-దాస్యం సేనాధిపతి