రివ్యూ

ఆత్మలు చెప్పే కబుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* త్రివిక్రమన్
***
తారాగణం: రవిబాబు, నాగబాబు, గెహనా వశిష్ట, నేహాదేశ్‌పాండే, సనాషాలిని, అమూల్యారెడ్డి, ధన్‌రాజ్, చలాకీ చంటి, గెటప్ శ్రీను, శ్రీ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు
సంగీతం: రింకూ గోసామి
కథ, కథనం, మాటలు, నిర్మాత, దర్శకత్వం:
క్రాంతికుమార్ సిహెచ్
**
పరిశ్రమలో కొనసాగుతున్న ట్రెండ్ ఆత్మల కథల్ని వీలైనంత భయంకరంగా తెరకు అందించటం. ఆ ట్రెండ్‌కు కొంత వెరైటీ జోడించిన నిరర్ధక ప్రయత్నం ‘త్రివిక్రమన్’. ఇప్పటివరకూ ఆత్మలు మనుషుల్ని ఆవహించటం, తర్వాత అవి చేసే అలజడిని గ్రాఫిక్ టెక్నిక్‌తో చివరి రీలు వరకూ చూపడం చూశాం. అయితే ‘త్రివిక్రమన్’లో ఇంకో అడుగు ముందుకేశారు. ఆత్మలే తమ కథల్ని చెప్పడం చూపించారు.
**
ఓ సినిమా దర్శకుడు రవిబాబు (రవిబాబు) తాను దర్శకత్వం వహించబోయే చిత్రం బాపతు కథా చర్చల కోసం చిత్ర బృందాన్ని ఓ పురాతన బంగ్లాకు తీసుకెళ్తాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన త్రివిక్రమ పాండ్యన్‌కు చెందిన భవంతి అది. ఆ విశేషాలు చెబుతూనే, అక్కడ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల ఆత్మలతో తాము ఏ పరిస్థితుల్లో వచ్చిందీ చెప్పిస్తాడు. ఆఖర్లో ఆ బంగ్లాలో బలైపోయిన రవిబాబు తమ్ముడు సూర్య విషయాన్ని చెప్తాడు. ఇవన్నీ నీకెలా తెలిసాయన్న ప్రశ్నకు పూర్తి స్పష్టత ‘త్రివిక్రమన్-2’లో తెలుస్తుందన్న సూచనప్రాయపు వెల్లడితో సినిమా ముగుస్తుంది. అసలు ‘ఆత్మల’ కథ అంటేనే అనేకానేక గందరగోళాలు. ఇది ‘ఆత్మ’లు చెప్పిన కథలు కావడంతో ఆ ‘కన్‌ఫ్యూజన్’ స్థాయి ఇంకాస్త పెరిగింది. ఈ చిత్రంలో ధన్‌రాజ్ పాత్రతో ‘అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. కాస్త క్లారిటీగా చెప్పండి’ అన్న డైలాగును చెప్పించారు. కన్ఫ్యూజన్ కథను చూసిన తరువాత ఆడియన్స్‌కూ ‘కాస్త క్లారిటీగా చెప్పాల్సింది’ అనిపిస్తుంది.
చిత్రంలో ఓ పురాతన దేవాలయం విషయంపై క్రాంతి, గీత, శ్రీను పరిశోధన చేస్తుంటారు. ఆక్రమంలో వారు చనిపోతారు. అది బంగ్లా (సినిమా కథాకేంద్రమైన త్రివిక్రమ పాండ్యన్‌కు చెందినది)కు చెందిన మరణమా, కాదా? అన్న దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు. సందట్లో సడేమియాలా మధ్యలో ‘చిత్రం చూపిస్తా రారాకన్నా...’ అంటూ ఓ ఐటమ్‌సాంగూ పెట్టారు. దీనికీ, కథకీ ఏమిటి సంబంధం అన్న దానిపైనా స్పష్టత ఉండదు. అంతకన్నా సినిమాకు పెద్ద మైనస్ పాయింట్, భరించలేనంతగా రవిబాబు వివరణతో నడవటం. ఇదే వీక్షకులకి ఎక్కువ అనాసక్తి కలిగించింది. పెర్ఫార్మెన్స్ విషయంలో రవిబాబు తనకిచ్చిన ఉపాధ్యాయ పాత్ర తాలూకు అభినయాన్ని బాగానే చేశాడు. మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌తో 99 దొంగతనాలు చేసి, వందో చోరీని నైపుణ్యంతో ఎలాచేయాలో అన్నదానిపై విపరీత కసరత్తు చేసి చావు చేతిలో ఖర్చయిపోయిన పాత్రలో చలాకీ చంటి కాస్తంత గుర్తుండిపోయే తీరులో నటించాడు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా కట్‌చేసే కేకులోనే విషం కలిపి భార్యా పిల్లల్ని హత్యచేసే ఉద్దేశ్యం కలిగిన పాత్రలో నాగబాబు ఓకే. గెటప్ శ్రీను, ధన్‌రాజ్ ధరించిన పాత్రల నిడివి తక్కువే. ఇలాంటి సినిమాలకు ప్రధానంగా సస్పెన్స్, భయం కల్పించడం వంటివే కీలకాంశాలు కనుక, అవే ప్రధాన భూమిక పోషించాయి. టైటిల్ సాంగ్‌ని హేమచంద్ర లోతైన గొంతుతో పాడి అలరించారు. ‘బిజినెస్ మాగ్నెట్’కు అనువాదంగా ‘వ్యాపారపు అయిస్కాంతం’లాంటి సంభాషణా చాతుర్యం బావుంది. మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’కు పేరడీగా ఒక ‘ఆత్మ’కు చెందిన కథలో కూరగాయల మార్కెట్‌లో పలికించిన డైలాగులూ సరదాగా సాగాయి. హారర్ సినిమాలకు కెమెరా పనితనమే ప్రాణం. ముగ్గురు కెమెరామెన్లు తమ బాధ్యతను ఏకాగ్రతతోనే చేశారు. ‘ఉన్నదున్నట్టు చూపితే ఎవ్వరూ చూడరు. లేనిది ఉన్నట్టు చూపితేనే టీఆర్పీలు పెరుగుతాయి’ (సినిమాలో డైలాగే) అన్న అంశాన్ని ఆకళింపు చేసుకుని పనిచేశారనిపిస్తుంది. అయితే, ‘త్రివిక్రమన్’లో ఆసక్తి అన్న అతి ప్రధాన దినుసు ఆడియన్స్‌కి కనిపించని కారణంగా సినిమా నిరాసక్తంగా తయారైంది.

-అనే్వషి