రివ్యూ

శతకర్ణి గెలిచాడు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది *** గౌతమిపుత్ర శాతకర్ణి
***

తారాగణం: బాలకృష్ణ, శ్రీయ శరణ్, హేమమాలిని, కబీర్‌బేడి, రవిప్రకాష్, శివరాజ్‌కుమార్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, మిలింద్ గుణాజీ తదితరులు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: చిరంతన్ భట్
ఛాయాగ్రహహం: జ్ఞానశేఖర్ విఎస్
కళ: భూపేష్ భూపతి
నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి,
సాయిబాబు, ‘బిబో’ శ్రీనివాస్
రచన, దర్శకత్వం: క్రిష్
***
అఖండ భారతావనిని ఏక ఛత్ర ఏలుబడిలోకి తెచ్చి, విదేశీ దండయాత్రల భయం లేకుండా ప్రజలంతా శాంతియుత జీవనం సాగించేలా చేయాలని ‘కల’లుగన్న చక్రవర్తి శాతకర్ణి! తన కల నెరవేర్చుకోవడానికి విలక్షణ వ్యూహాలోచనలతో ఎన్నో యుద్ధాలు సాగించాడు. శాంతికాముకులైన బౌద్ధ సన్యాసుల ప్రశ్నలకు సమాధానాలు తన చేవలో చేసి చూపాడు. అయితే, శాతకర్ణి చక్రవర్తి చరిత్ర అసంగతంగా, అసంపూర్తిగా మరుగున పడిపోయింది.

అందుకే -దేశ క్షేమానికై ప్రాణాలు పణం పెట్టిన తెలుగు జాతి ముత్తాతల తరాల కథనాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిత్రం అని చెప్పుకున్నాడు దర్శకుడు క్రిష్. బాలకృష్ణ వందో చిత్రంగా ‘శత’కర్ణిని ఎంచుకోవడం రాజస లక్షణ సమన్వితమని గ్రహించిన దర్శకుడు క్రిష్, ఆ దిశగా అడుగులేసి చరిత్ర నుంచి దొరికిన కొద్దిపాటి ఆధారాలతో స్క్రిప్ట్ తయారు చేశారు. అయతే చరిత్రను ఎంత శోధించినా శాతకర్ణి సమాచారం పెద్దగా దొరికే అవకాశం లేకపోవడంతో -దొరికిన కొద్దిపాటి సమాచారాన్ని కమర్షియల్ ఫార్మాట్‌లోకి తీసుకొచ్చాడు క్రిష్. శాతకర్ణి డీటెయల్స్ తెలుసుకోవచ్చన్న అత్యాశను పక్కనపెడితే, శాతకర్ణి ఎంత గొప్పగా యుద్ధాలు చేసి ఉంటాడో చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. శాతకర్ణి పరిపాలనా దక్షత, రాజ్యపాలనా విధానం, శాసన వ్యవహార శైలి, తీసుకొచ్చిన సంస్కరణలు.. వగైరాలను పూర్తిగా పక్కనపెట్టేస్తే.. -దర్శక రచయితలు ఒకరకంగా చరిత్రలో శాతకర్ణి చేసిన షహరాటను వెండితెరపై ఆవిష్కరించారని అనుకోవచ్చు.
***
బాలుడిగా ఉన్నప్పుడే శాతకర్ణి (బాలకృష్ణ).. యుద్ధరహిత రాజ్యావిష్కరణ అనేది యుద్ధంతోనే సాధ్యమవుతుందన్న తలంపుతో ఉంటాడు. పెరిగి పెద్దయ్యాక ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ దక్షిణాపథాన్ని తన ఏలుబడి కిందకు తెస్తాడు. అప్పటికి 29 రాజ్యాలు జయించిన శాతకర్ణి, కళ్యాణదుర్గంపై దండెత్తుతాడు. బౌద్ధ సన్యాసి ఆనందుడు (శివరాజ్‌కుమార్) శాంతికి నిలయమైన అమరావతిని విడిచి వెళ్లడానికి రాజమాత గౌతమి బాలశ్రీ (హేమమాలిని) అనుమతి కోరతాడు. అందుకు బౌద్ధుల శాంతికై ఆరామాలు నిర్మిస్తున్న రాజు వచ్చేవరకు వేచి ఉండమని ఆమె సమాధానమిస్తుంది. కళ్యాణదుర్గం రాజు యవనవీరుడు ‘పరిటస్’ బలం చూసుకుని యుద్ధానికి దిగినా, శాతకర్ణి ముందు నిలువలేక సామంతుడిగా మారతాడు. కళ్యాణదుర్గం విజయంతో వింధ్య పర్వతాల ఆవలవున్న షహరాటుల రాజు నహపాలుడు (కబీర్‌బేడి)పై యుద్ధం ప్రకటిస్తాడు శాతకర్ణి. దూతను చంపిన ధూర్తుడు నహపాలుడు, శాతకర్ణి ప్రయాణించే రాజ్యాల యువరాజులను బందీలుగా చేసుకుంటాడు. అలా ఆ రాజ్యాలు దాటడానికి శాతకర్ణికి కష్టవౌతుందని నహపాలుడు భావించినా, శాతకర్ణి వింధ్య పర్వతాలు దాటి సింధు శాఖలో ప్రవేశించి శరణు వేడమని హెచ్చరిస్తాడు. నహపాలుడికి ఎదురు నిలవడానికి తన యువరాజు ‘పులోమావి’ని యుద్ధానికి తీసుకొస్తాడు. ఐదేళ్ల బిడ్డను యుద్ధానికి తీసుకెళ్లడాన్ని రాణి వాశిష్ఠిదేవి (శ్రీయా శరణ్) అంగీకరించదు. అయినా రాజ్య క్షేమం కోసం, ఇతర రాజ్యాల యువరాజుల కోసం కుమారుడు పులోమావిని యుద్ధంలో నిలబెడతాడు శాతకర్ణి. షహరాటుల సేన తన సేనను ముప్పుతిప్పలు పెట్టినా, గుండె ధైర్యంతో ఒక్కడే రాజ్యంలో ప్రవేశించి కోటను జయిస్తాడు.
ఇక శత్రుశేషం లేకుండా మారిందన్న ఆనందంతో రాజసూయాగం చేస్తాడు. అందులో అగ్రపూజ తల్లికి సమర్పించబోగా పండితులు ఒప్పుకోరు. కన్నతల్లి గొప్పతనాన్ని చాటి, ఇకనుంచి తాను ‘గౌతమిత్ర శాతకర్ణి’గా మారతానని ప్రకటిస్తాడు. అలిగిన ఆలికి యుద్ధ నేపథ్యంలో ఒనగూరిన గొప్పతనం తెలిపి తప్పుదిద్దుకునేలా చేస్తాడు శాతకర్ణి. ఇక విదేశీ దాడులు జరుగకుండా యవనరాజు డెమిత్రియస్‌తో తలపడతాడు శాతకర్ణి. ఓ అబల యుధిర మాయోపాయంతో విషప్రయోగం జరిగినా తట్టుకొని, తిరిగి విజృంభించి యవన రాజ్యాన్ని జయించి పరదేశీ రాజుల దాడులకు స్వస్తి చెబుతాడు. మొగలాయిలు, ఆంగ్లేయులు దాదాపు 1500 సంవత్సరాల వరకూ భారతదేశంవైపు కనె్నత్తి చూడకుండా శాతకర్ణి బిగించిన దేశ సార్వభౌమ పిడికిలి దెబ్బ అలా సాగుతుంది. ఇదీ శాతకర్ణి గురించి ఎన్నో అధ్యయనాలు చేశాక క్రిష్ చూపించిన కథ.
శాతకర్ణికి సంబంధించి సమాచారం అసంగతం, అసంపూర్తిగానే ఉంది కనుక.. సంభాషణా చాతుర్యాన్ని, యుద్ధ నేపథ్యాలపైనే దర్శక రచయితలు ఆధారపడాల్సి వచ్చింది. యుద్ధరీతుల్లో వైవిధ్యాన్ని చూపించినా -ఒకదశలో తెలుగు చక్రవర్తి శాతకర్ణి యుద్ధోన్మాది ఏమో అన్న సందేహాలు కలిగేంతగా సన్నివేశాలను చిత్రీకరించడం ఇబ్బంది కలిగించే అంశమే. అయతే యుద్ధంలో కత్తులు, శూలాలు, బరిసెలు, డాలులు, అమ్ములు, గుర్రాలు, అగ్నిగోళాల్లాంటి రొటీన్ దృశ్యాలను పక్కనపెట్టేసి -హీరో పరిచయ సన్నివేశంలో కళ్యాణదుర్గం యుద్ధాన్ని పడవలపై చిత్రీకరించడం బావుంది. పరిటస్ మరణాన్ని వైవిధ్యంగా చిత్రించడమూ ఒకే అనాలి. నహపాలుడితో యుద్ధం, పులోమావి రణభూమిపై నిలవడం, సామంతరాజులు, వాశిష్ఠిదేవి కన్నుల్లో కదలాడే ఆదుర్దా, ఆతృతను యుద్ధ సన్నివేశాలకు జతచేసి కమర్షియాలిటీని పెంచారు. రాజసూయ యాగంలో అమ్మ గొప్పతనాన్ని చక్కని మాటలతో, ఉదాహరణలతో ఎవరూ పేరుపెట్టని విధంగా రాసుకోవడం మరో మెట్టు. రాణీ వాశిష్ఠిదేవి కోపం, పరితాపం లాంటివి శృంగారాత్మకంగా తీర్చిదిద్ది మెలో డ్రామాను చొప్పించగలిగారు. డెమిత్రియస్‌తో యుద్ధ సమయంలో చీమ- సింహం కథను పెట్టి శాతకర్ణి హీరోయజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లడంలో దర్శకుడిగా క్రిష్ టాలెంట్ కనిపిస్తుంది.
శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడు. రౌద్ర, శృంగార, భీభత్స రసాలను సన్నివేశాలకు అనుగుణంగా పలికించాడు. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వాశిష్ఠిగా శ్రీయ పాత్రోచిత నటన ప్రదర్శించింది. ఆహార్యపరంగా గౌతమి పాత్రకు హేమమాలిని సరిపోయినా, నటనలో నిండైన తెలుగుదనం మిస్సయ్యింది. పాత్రపరంగా నటించే అవకాశం కూడా హేమకు దక్కలేదు. మిగతావాళ్ళలో కబీర్‌బేడి, మిలింద్ గుణాజీ, తనికెళ్ల భరణిలకు గుర్తింపు లభిస్తుంది.
సంభాషణల గురించి చెప్పాలంటే సమీక్షలో చాలా మాటలు రాయాలి. తలవంచకు.. అది నాది.. మగనాలికి గాజులందం- మగాడికి గాయాలందం.. మాతో సమానుణ్ణి కనేందుకు ఏ తల్లీ భూమీద పుట్టలేదు.. అడుగునవున్న జాతి బడుగు జాతికాదు.. అధములం కాదు ప్రథములం, భూభాగాన్ని మోస్తున్న వీరులం.. కాలం పురుడు పోసుకొని పుట్టే రేపటి తరాల కోసం కాలంచేసైనా కాలాన్ని కందాం.. ఏకత్వం అంటే మనుషులు కలవడం కాదు- మాండలికాలు కలవాలి.. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగుచూసిన రక్తపు ముద్దవి.. తండ్రిని మించిన కొడుకున్నాడు-కానీ తల్లిని మించిన కొడుకున్నాడా?.. కన్నీళ్లు మనసుకు పుట్టిల్లు- కళ్లు అత్తారిల్లు.. దొరికినవాణ్ణి తురుముదాం- దొరకనివాణ్ణీ తరుముదాం.. అక్కడక్కడా పడి కాలుతున్న అగ్ని కట్టెలన్నీ కలిపి అఖండదీపాన్ని వెలిగించాలి- అది కొడిగట్టకుండా కాలం కడగొట్టు తరానికి అందాలి.. మీ మొండాలపై మా జెండాలెగరేస్తాం.. మీరు అతని యుద్ధం చూశారు- నేను అతనిలో యుద్ధాన్ని చూశాను.. లాంటి సంభాషణలు తెలుగువాడి మనసు మూలాల్లో సెగ రగిలిస్తాయి. కథనంలో వున్న సంక్లిష్టతను సులభంగా అర్థం చేసుకోవడానికి మాటలు తూటాల్లా పేలాయి. జనపథాల్లో తన ఎకిమీడుతో సంచరించే రాణి పాట ‘ఎకిమీడా.. నా జతనే విడనని వరమీవా’, పరితాపంతో బాధపడుతున్న రాణితో ‘మృగనయనా.. భయమేలనే’ పాటలు ఆకట్టుకుంటాయి. యుద్ధ్భేరి మ్రోగించే పాటలు ఓకె. చిరంతన్ భట్ నేపథ్య సంగీతం సన్నివేశాలను పరిగెత్తించింది. సన్నివేశ బలం తగ్గినపుడు ఇటు మాటలు, అటు నేపథ్య సంగీతం చిత్రాన్ని పూర్తిగా నిలబెట్టేశాయి.
శాతకర్ణి యుద్ధ నేపథ్యంలో చెప్పిన తంత్రంలా సినిమా స్క్రిప్ట్‌ను దర్శక రచయితలు ఆవరించారు. ఒక క్రమాన్ని అనుసరిస్తూ రచన, మాటలు, సంగీతం, కెమెరా కోణాలు, నటీనటుల హావభావ విన్యాసాలతో ఓకె అనిపించారు. చూడటానికి కథ అస్తవ్యస్తంగా వున్నా హీరో నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రేక్షకుణ్ణి ఆలోచించనీయకుండా, సీటు వదిలిపోకుండా విస్తరిస్తూ వెళ్లారు. శాతకర్ణి గురించి చాలా తెలుసుకోవచ్చన్న ఆలోచనలు పక్కనపెట్టి యుద్ధ సన్నివేశాలు చూడాలనుకున్న ఆడియన్స్‌కు శాతకర్ణి నిజమైన పండుగ సినిమానే.

-శేఖర్