రివ్యూ

ఓ చీకటి దృశ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** మెట్రో
**

తారాగణం:
శిరీష్, బాబీసింహా, సత్య, సేంద్రయాన్, నిశాంత్ తదితరులు
సంగీతం: జోహాన్
సినిమాటోగ్రఫీ: ఎన్‌ఎస్ ఉత్తయ్యకుమార్
నిర్మాత: రజనీ తాళ్లూరి
దర్శకత్వం: ఆనంద కృష్ణన్
**
సినిమా కోసం కథ రాసుకోవడానికి తమిళులు సులువైన ప్రక్రియనే ఎంచుకున్నారు. మెలోడ్రామాను పూర్తిగా పక్కకు పెట్టేసి, నిజ జీవిత సంఘటనల సమాహారానికి వాస్తవిక కథనాన్ని జోడించి స్క్రీన్స్‌కు తీసుకురావడం తమిళ పరిశ్రమలో కనిపిస్తున్న కొత్త ప్రక్రియ. చాలా కథలు ఈకోవలోనే వస్తున్నాయ. నేటివిటీ దెబ్బతినకుండా బలమైన కథనాన్ని అందిస్తుండటంతో -తమిళ సినిమా కథలన్నీ ఆడియన్స్ ఆదరణకు నోచుకుంటున్నాయి. అందుకే -అక్కడి సినిమాలకు ఎక్కువ సక్సెస్ రేటు కనిపిస్తోంది. ఆ తరహాలోనే -పెరిగిపోతున్న ‘చైన్ స్నాచింగ్’ ఘటనలను కథగా మలచుకుని ‘మెట్రో’ వాతావరణం ప్రతిబింబించేలా కథనాన్ని అల్లుకుని స్క్రీన్స్‌కు తెచ్చాడు దర్శకుడు ఆనంద్ కృష్ణన్. తమిళంలో ఆదరణకు నోచుకోవడంతో, తెలుగు ఆడియన్స్‌కూ అదే పేరుతో అందించారు. ‘మెట్రో’ లైఫ్ ఎలా చూపించాడో చూద్దాం.
ఎగువ మధ్య తరగతి కుటుంబంలో పెద్ద కొడుకు ఆది (శిరీష్). జర్నలిస్టుగా పనిచేస్తుంటాడు. కాలేజీ చదువుతున్న చిన్న కొడుకు మధు (సత్య). ఇద్దరు పిల్లలతో అన్యోన్యమైన కుటుంబంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటారు తల్లిదండ్రులు. మెట్రో లైఫ్ ప్రభావంతో మధు విలాసాలకు దగ్గరవుతాడు. ఆ ఆశలు తీర్చుకునేంత ఉన్నతమైన కుటుంబం కాకపోవడంతో, చెడు స్నేహితుల సాంగత్యంలో చిక్కుకుంటాడు. నేరాల వైపు దృష్టి సారిస్తాడు. ‘ఈజీ మనీ’ వెతుకులాటలో ‘చైన్ స్నాచింగు’లపై దృష్టి పడుతుంది. ఆడవాళ్ల మెడలో గొలుసులు కొట్టేయడం, గ్యాంగ్ లీడర్ గుణ (బాబీ సింహా)కి అప్పగించటం, ఆ వచ్చిన మొత్తంతో జల్సాలు. ఒక్కసారిగా గాడితప్పిన మధు జీవితం గురించి కుటుంబానికి తెలిసిపోతుంది. ఆ పరిణామాల్లో కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది? ఆ నేరాలపై ఓ జర్నలిస్టు చేసిన పోరాటం ఏమిటన్నది మిగిలిన సినిమా.
మెట్రో ప్రాంతాల్లో పెచ్చుమీరుతోన్న ‘చైన్ స్నాచింగ్’లను టార్గెట్ చేసుకుని తయారు చేసుకున్న కథ ఇది. దీనికితోడు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు యువత ‘ఈజీ మనీ’ కోసం ఎలా పెడదోవ పడుతుందన్న కానె్సప్ట్‌ను మిళితం చేశారు. చెప్పుకోతగ్గ కథ లేకున్నా, ఒక సంఘటనతో ఒక కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న అంశాన్ని చిత్ర కథగా మలుచుకోవడం బావుంది. ఇంట్లో జరిగిన సంఘటన వెనుక ఎవరున్నారో తెలుసుకొని, వాళ్లని బయటికి తీసుకొచ్చే ప్రక్రియకి దృశ్యరూపమే -మెట్రో. ఈ అంశాన్ని మొత్తం వ్యవస్థకు అన్వయించి చూపకుండా, ఒక సంఘటనగానే వదిలేయడం అసంపూర్ణం అనిపిస్తుంది. నేరవ్యవస్థ రూపుమాపేలా జర్నలిస్టు పోరాటం సాగినట్టు అనిపించదు. చైన్ స్నాచింగ్‌ల నేపథ్యం, ఆ నేరం మూలాలు ఎక్కడ ఎలా ఉంటాయన్న విషయాన్ని కాస్త శోధన చేసినట్టు చూపించిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. చిన్న సంఘటన ద్వారా చివరిదాకా ఆసక్తిని కొనసాగించిన విషయంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. గ్యాంగ్‌లీడర్ పాత్ర కోసం అనుభవజ్ఞుడైన నటుడు బాబీసింహాను తీసుకున్నా, తగిన విధంగా పాత్రను మలచలేకపోడం వెలితిగా అనిపిస్తుంది. గ్యాంగులోని సభ్యుల చేతిలో దెబ్బలు తిన్నట్టు చూపించటంతో ఆ పాత్రకు ఉండాల్సిన బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. నేరప్రవృత్తిని నేపథ్యంగా తీసుకుని కథను అల్లుకున్నా -దానికి తగ్గట్టుగా పతాక సన్నివేశాలు అల్లుకోలేకపోవడంతో సన్నివేశాలు ఏమాత్రం ఉత్కంఠ కలిగించలేదు.
శిరీష్‌కి తొలి చిత్రమైనా ఫరవాలేదనిపించాడు. ప్రతి పాత్రనీ సహజంగా తీర్చిదిద్దాలన్న అతి జాగ్రత్త కూడాసినిమాకు మైనస్ అయ్యింది. కాలేజీ కుర్రాడిలా కనిపిస్తూ, బయట నేరాలుచేసి ఇంటికి మామూలుగా వచ్చే కుర్రాడి పాత్రను సత్య రక్తికట్టించాడు. తల్లి పాత్రలో తులసి ఒదిగిపోయింది. సాంకేతికతే సినిమాకి బలం. కథ మూడ్‌ని కెమెరా, మ్యూజిక్ ఎలివేట్ చేయగలిగాయి. దర్శకుడు మంచి నేపధ్యాన్ని ఎంచుకుని సమర్థంగానే చిత్రాన్ని తీర్చిదిద్దినా, సమస్యను సగంలో వదిలేయడంతో కొంతవరకు అసంతృప్తికి గురిచేసింది.

-ప్రవవి