రివ్యూ

ఈ బాక్సర్... చాలా హాట్ గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది *** గురు
***
తారాగణం:
వెంకటేష్, రితికాసింగ్, ముంతాజ్ సర్కార్, తనికెళ్ల భరణి, నాజర్, రఘుబాబు, అనితాచౌదరి తదితరులు
కెమెరా: శక్తివేల్
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత: ఎస్ శశికాంత్
దర్శకత్వం: సుధ కొంగర
***
మాతృదేవోభవ శ్లోకంలో గురువు స్థానాన్నీ నిర్వచించారు. గురువు చూపిన మార్గంలో నడిచినవాడికి ఎదురుండదు. గురువు కూడా విద్యను ఆసాంతం అవగాహన చేసుకునే శిష్యుడికోసం వెదుకుతూనే ఉంటాడు. అదేంటి? ఎవరైనా శిష్యులే కదా అనుకోవచ్చు. కానీ జ్ఞానం నేర్పినంత మాత్రాన ఒంటబట్టేది కాదు. అర్థం చేసుకుని ఆచరించగలిగే శిష్యులు దొరికినప్పుడే గురువుకు నిజమైన గుర్తింపు. మట్టిలోనుంచి మాణిక్యాలను తీయగలిగిన గురు స్థానం ఎప్పటికైనా ఉన్నతమే. అటువంటి ఓ బాక్సింగ్ గురు కథే ఇది.
తన ప్రతిభపై ఎంతో నమ్మకంతో ఉంటాడు ఆదిత్య (వెంకటేష్). అది ఆత్మగౌరవమే కానీ అహంభావం కాదు. కానీ సమాజం మరోలా అర్థం చేసుకుంటుంది. దీంతో తనకు ఇష్టమైన బాక్సింగ్ రంగంలో కోచ్‌గా ఉన్నా, నిమిత్తమాత్రుడిగా ఉండాల్సి వస్తుంది. బాక్సింగే సర్వస్వం అనుకునే అతన్ని భార్య కూడా వదిలేస్తుంది. అయినా బాక్సింగ్ కోసం తపనపడుతుంటాడు ఆదిత్య. తాను సాధించలేకపోయిన విజయాలను శిష్యులతో సాధించాలని ఆరాటపడుతుంటాడు. అయితే, బాక్సింగ్ ఫెడరేషన్‌లో ఉన్న కుళ్లు రాజకీయాల కారణంగా వైజాగ్‌కు బదిలీపై వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కూరగాయలు అమ్ముకుంటూ తల్లిదండ్రులను పోషిస్తున్న రావుడు (రితికాసింగ్) గురుకు తారసపడుతుంది. ఆమెకు తర్ఫీదునిస్తే అద్భుతమైన బాక్సర్ అవుతుందన్న నమ్మకంతో ఆదరిస్తాడు. కానీ తాను బాక్సింగ్ నేర్చుకోవాలంటే ఎంత సమయం వెచ్చిస్తే అంత చెల్లించాలంటూ ఆమె అవహేళన చేస్తుంది. అయినా సహనంతో వ్యవహరిస్తాడు. ఆమె భవిష్యత్‌లో సాధించబోయే విజయాలకు ఇవి తొలిమెట్టు అనుకుంటాడు. గురువును చులకనగా చూసిన శిష్యురాలు, చివరికి గురువే దైవంగా భావించేలా ఏర్పడిన పరిణామాలు ఏమిటి అనేది అసలు కథ. బాక్సింగ్‌లో గురువు ఆశించిన ఉన్నత శిఖరాలకు శిష్యురాలు చేరుకుందా? ఫెడరేషన్ అధికారులు కల్పించే అవాంతరాలను ఇద్దరూ ఎలా ఎదుర్కొన్నారు? అన్న కథనంతో సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది.
క్రీడా నేపథ్యంలో మహిళా బాక్సర్ల పోటీ కథనంగా చిత్రాలు వచ్చినా, వాటిలో ప్రేమ, విరహం, ఫైట్లు, అశ్లీలంలాంటి అంశాలూ చోటుచేసుకున్నాయి. కానీ గురు మాత్రం ఆ ట్రాక్ తప్పలేదు. ప్రేక్షకుల అటెన్షన్ బాక్సింగ్ క్రీడపైనే ఉండేలా సినిమాను తీర్చిదిద్దారు. తమిళంలో, హిందీలో రూపొందించిన చిత్రాలకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం మాతృకలోని భావోద్వేగాలను చక్కగా పలికించింది. శిష్యురాలిని తీర్చిదిద్దడానికి గురువుపడే తపన, గురు నుంచి తప్పించుకోడానికి శిష్యురాలు వేసే ఎత్తులు లాంటి అంశాలు కథనంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ముఖ్యంగా క్రీడారంగంలో వినిపించే సెక్స్‌వల్ హెరాస్‌మెంట్, డోపింగ్ దోషుల కథనాలు, స్టెరాయిడ్స్‌లాంటి అంశాలను చిత్రంలో స్పృశించి ప్రేక్షకులలో ఆసక్తిని పెంచారు.
జీవితమంటే ఏదోక పనిచేసి బ్రతకడం కాదంటూనే ప్రపంచ విజేతగా నిలపటానికి గురువు పడిన ఆదుర్దా, ఆతృత, ఆర్ద్రత అన్నింటినీ మేళవించి చిత్రీకరించిన విధానం బావుంది.
వెంకటేష్‌కు తన కెరీర్‌లో ఈ పాత్ర ఓ మైలురాయి. గురువంటే ఎలా ఉండాలో అలానే నటించాడు. మార్షల్స్ బైటికి నెట్టేస్తున్నపుడు, బాక్సింగ్ పోరు జరుగుతున్నపుడు గురువుగా చూసిన చూపులో వెంకటేష్ అభినయాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక రామేశ్వరి పాత్రధారి రితికాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అచ్చమైన గ్రామీణ నేపథ్యం అమ్మాయిగా ప్రతి సన్నివేశంలో నటించి మెప్పించింది. పంచెస్ పాండుగా నాజర్, రావుడు అక్కగా ముంతాజ్ సర్కార్, తనికెళ్ల భరణి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ‘ఆడపిల్లలను టాలెంట్ చూసి సెలెక్ట్ చేస్తాను కానీ బాడీ చూసి కాదు’, ‘నువ్వు బాక్సింగ్ అడ్డం పెట్టుకొని బతకాలనుకున్నావ్. అది బాక్సింగ్ కోసం చచ్చిపోద్ది’ లాంటి డైలాగులు వెంటాడుతాయి. సంగీతపరంగా వెంకటేష్ ఆలపించిన ‘జింగిడి జింగిడి’ పాట మాటల రూపంలోనే ఆకట్టుకుంది. మాటలతోనే సాగిన మరో పాట ‘ఓ సక్కనోడా’ వైవిధ్యమైన బాణీనే. సన్నివేశాల్లోని ఆర్ద్రతను నేపథ్య సంగీతమే ప్రేక్షకుడికి అందించింది. కెమెరా పనితనం చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించింది. దర్శకత్వపరంగా ఓ మంచి థీమ్ తీసుకుని దానికి భావోద్వేగాలను అద్ది అంతేస్థాయిలో క్రీడాస్ఫూర్తిని రగిలించేలా తీర్చిదిద్దిన విధానం బావుంది. క్రీడానేపథ్యంలో వచ్చిన చిత్రాలలో ‘గురు’ ఒక్కడుగా నిలుస్తాడు.
*

-శేఖర్