రివ్యూ

భారీ.. బలశాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది *** బాహుబలి
ది కన్‌క్లూజన్
***
తారాగణం: ప్రభాస్, రానా, సత్యరాజ్, అనుష్క, రమకృష్ణ, తమన్నా, నాజర్, సుబ్బరాజు తదితరులు
కథ: వి విజయేంద్ర ప్రసాద్
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: కెకె సెంథిల్‌కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: సాబు శిరిల్
విఎఫ్‌ఎక్స్: కమల్ కణ్ణన్
ఎడిటింగ్: కె వెంకటేశ్వర రావు
నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ,
ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: ఎస్‌ఎస్ రాజవౌళి
***
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం -బాహుబలి. అందమైన జానపద కథకు సాంకేతిక సొబగులద్ది ‘విజువల్ వండర్’గా ఆవిష్కరించిన దర్శకుడు రాజవౌళి. ఐదేళ్ల కృషితో ‘మొదలు’ ‘ముగింపు’ అంటూ వచ్చిన మహా సినిమా కోసం వందలాది దేశవిదేశీ సాంకేతిక నిపుణులు కష్టపడ్డారు. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు కోట్లు కుమ్మరించారు. రెండేళ్ల కష్టంతో 2015లో వచ్చిన ‘బాహుబలి -ది బిగినింగ్’ అటు నిర్మాణపరంగాను, ఇటు వసూళ్లపరంగాను ‘్భరీ’తనాన్ని ప్రదర్శించటంతో సహజంగానే మలిభాగంపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అన్న చిత్రమైన ప్రశ్నతో ఆ క్యూరియాసిటీని మరింత పెంచింది బాహుబలి బృందం. రెండున్నరేళ్ల క్రితం సంధించిన చిన్న ప్రశ్నకు 170 నిమిషాల భారీ కథ చెప్పే ప్రయత్నమే -బాహుబలి ది కన్‌క్లూజన్.
బాహుబలి ది బిగినింగ్‌కు కొనసాగింపుగా ‘ముగింపు’ మొదలవుతుంది. అరివీర భయంకరులైన కాలకేయులను మట్టుబెట్టి మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడిన వీరుడు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)ని మహారాజుగా ప్రకటిస్తుంది రాజమాత శివగామి (రమ్యకృష్ణ). సొంత కొడుకును సింహాసనానికి దూరం చేయడం శివగామి భర్త బిజ్జల దేవుడి (నాజర్)కి ఏమాత్రం నచ్చదు. తల్లి నిర్ణయాన్ని కొడుకు భల్లాల దేవుడు జీర్ణించుకోలేకపోతాడు. దీంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే కుతంత్రాలకు పదును పెడతారు తండ్రీ కొడుకులు. పట్ట్భాషేక ముహూర్తానికి సమయం ఉండటంతో, కాబోయే మహారాజుగా ప్రజల బాగోగులు తెలుసుకోవాలన్న రాజమాత సూచనతో కట్టప్పను తీసుకుని దేశాటనకు బయలుదేరుతాడు అమరేంద్ర బాహుబలి. అలా పొరుగు రాజ్యం కుంతలకు చేరతాడు. అక్కడ పిండారీలనే దోపిడి దొంగలను ప్రతిఘటించడంలో మహా పరాక్రమాన్ని ప్రదర్శించిన కుంతల దేశపు రాజపుత్రిక దేవసేనను చూసి ఇష్టపడతాడు. ఆమె ప్రేమ కోసం కట్టప్ప సాయంతో అమాయకుడిగా నటించి కుంతల కొలువులో చోటు సంపాదిస్తాడు. వేగుల ద్వారా బాహుబలి ప్రేమ విషయం తెలుసుకున్న భల్లాలదేవుడు, రాజ్యాన్ని చేజిక్కించుకోడానికి ఇదే సమయమని భావిస్తాడు. తండ్రి బిజ్జలతో కలిసి కుతంత్రాన్ని పన్నుతాడు. అందులోభాగంగా, బాహుబలి ప్రేమిస్తున్న కుంతల దేశపు యువరాణి దేవసేనను తనకు భార్యగా చేయమని రాజమాత శివగామిని కోరతాడు. అసలు విషయం తెలియని శివగామి భారీ కానుకలతో కుంతలకు వర్తమానం పంపుతుంది. యువరాణి దేవసేన నుంచి నిరాకరణ ఎదురవ్వడంతో శివగామి ఆగ్రహిస్తుంది. దేవసేనను బంధించి తీసుకురమ్మని సేనను ఆజ్ఞాపిస్తుంది.
అలా కుంతలపై దండెత్తిన సేనను, అక్కడేవున్న బాహుబలి యుద్ధతంత్రంతో నిలువరిస్తాడు. ఆక్రమంలో బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యానికి కాబోయే మహారాజు అన్న నిజం దేవసేనకు తెలుస్తుంది. శివగామి ఆజ్ఞ మేరకు దేవసేనను ఒప్పించి మాహిష్మతికి తీసుకెళ్తాడు బాహుబలి. భల్లాల కుతంత్రం కారణంగా రాజ్యమా? దేవసేనా? అనే ప్రశ్న ఎదురవుతుంది బాహుబలికి. ఇచ్చిన మాటకు కట్టుబడి సింహాసనాన్ని వదులుకుంటాడు. దేవసేనను పెళ్లాడి, మాహిష్మతికి సర్వ సైన్యాధ్యక్షుడు అవుతాడు. ప్రజలంతా దేవుడిగా, వీరుడిగా కొలిచే బాహుబలితో ఎప్పటికైనా తనకు ప్రమాదమేనని యోచిస్తాడు భల్లాల. కుట్రతో సైన్యాధ్యక్ష పదవినుంచీ తప్పిస్తాడు. రాజ్యకాంక్షతో తనను అంతమొందించేందుకు బాహుబలే కుట్ర పన్నుతున్నట్టు రాజమాత శివగామిని నమ్మిస్తాడు. దీంతో బాహుబలిని చంపమని కట్టుబానిస కట్టప్పను శివగామి ఆజ్ఞాపిస్తుంది. శివగామి ఆజ్ఞమేరకు బాహుబలిని కట్టప్ప చంపాడా? తండ్రి గతం, గొప్పతనాన్ని కట్టప్పద్వారా తెలుసుకున్న శివుడు (మహేంద్ర బాహుబలి) భల్లాలదేవుడిని ఎలా ఎదుర్కొన్నాడు? తల్లి దేవసేనకు చెరనుంచి ఎలా విముక్తి కలిగించాడు అన్నది మిగతా అసలు కథ.
అమరేంద్ర బాహుబలి, కొడుకు మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ మంచి నటన ప్రదర్శించాడు. రాజవౌళి ఊహలోని ‘బాహుబలి’ పాత్రకు న్యాయం చేశాడు. భల్లాల దేవుడిగా రానా విలనిజం బావుంది. రాజ్యాధికార దాహంతో తమ్ముడినే కాదు, తల్లినీ మట్టుబెట్టేందుకు సిద్ధపడే రాజవంశీయుడిగా డైలాగుల్లేని హావభావాలు చూపించాడు. శివగామి పాత్రతో రమ్యకృష్ణ ‘బాహుబలి’ భారాన్ని పూర్తిగా మోసింది. మరొకరిని ఊహించుకోడానికి అవకాశం లేని నటన ప్రదర్శించింది. కట్టప్పగా సత్యరాజ్ తన అనుభవాన్ని ప్రదర్శించినా, పాత్రపరమైన కొన్ని కన్ఫ్యూజన్లు నిండుదనాన్ని తేలేకపోయాయి. సిట్యుయేషనల్ కామెడీని పండిస్తూనే, భావోద్వేగ సన్నివేశాల్లో సత్యరాజ్ చూపిన నటనను బావుంది. శివగామికి నిజం చెప్పే సందర్భంలో సత్యరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవసేనగా అనుష్క అందం, వీరోచితత్వంతో మెప్పించింది. తమన్నా పాత్ర పరిమితం. దేవసేన బావగా సుబ్బరాజు పాత్రోచిత నటన ప్రదర్శించినా, ఆకట్టుకోలేదు.
పాత్రల తీరును ఊహించుకుని రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన అందమైన జానపద కథకు పక్కా కమర్షియాలిటీని ఆపాదించటంలో దర్శకుడు రాజవౌళి సక్సెస్. గ్రాండియర్‌ను చూపించే గ్రాఫిక్స్‌ను జోడించడంలో జక్కన్న టీం కష్టం కనిపిస్తుంది. ‘ముగింపు’నూ రెండు భాగాలు చేసి తొలిభాగంలో యుద్ధం- ప్రేమ, మలిభాగంలో కుటుంబం- కుతంత్రం చూపించటంలో జక్కన్న మార్క్ కనిపిస్తుంది.
అయితే, రెండు భాగాలకు సరిపడా సత్తా కథలో లేదన్నది ‘కన్‌క్లూజన్’తో తేలిపోయింది. మొదటి భాగాన్ని లాగిలాగి వదిలారనడానికి.. ప్రాధాన్యత లేని సన్నివేశాలతో కాలయాపన చేయడమే నిదర్శనం. గ్రాఫిక్స్‌పరంగా ప్రపంచ సినిమా ప్రమాణాన్ని అందుకునేంత గొప్ప సినిమాగా ప్రచారం సాగినా, ‘హీల్ టచ్’ సన్నివేశాలూ కొనే్న కనిపిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు, ఇంటర్వెల్ సీక్వెన్స్‌ల్లో రమ్యకృష్ణ, అనుష్క, ప్రభాస్‌ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా రాజవౌళి మార్క్‌ను తలపిస్తుంది. మొత్తంగా సన్నివేశాల కనెక్టివిటీలో మాత్రం ‘ఆత్మ’ మిస్సయిందన్న ఫీలింగ్ కలగకపోదు. పిండారీలతో యుద్ధం, హంస నావ యుగళ గీతంలాంటి కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ గ్రాండియర్‌నెస్‌ను చెప్పుకోవచ్చు. భళి భళిరా, దండాలయ్యా పాటలు వినా సన్నివేశానికి తగిన బిజి ఇవ్వడంలో సంగీత దర్శకుడు కీరవాణి కృషి ఏమాత్రం ఫలించలేదు. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ, కమల్ కణ్ణన్ విఎఫ్‌ఎక్స్, సాబుశిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్, నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడని నిర్మాతల గట్స్.. ‘బాహుబలి’కి గొప్పదనాన్ని ఆపాదించాయి. 170 నిమిషాల ‘ముగింపు’ కథ వినడానికి కొంచెం ఓపిక అయితే కావాలి.

-మహాదేవ