రివ్యూ

సహనానికి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* సరసుడు
*
తారాగణం: శింబు, నయనతార
ఆండ్రియా, ఆదాశర్మ
సత్యం రాజేష్, సూరి, జయప్రకాష్
అర్జునన్ తదితరులు.
సంగీతం: టి.ఆర్.కురల అరసన్
కెమెరా: బాలసుబ్రహ్మణ్యం
నిర్మాత: టి.రాజేందర్
దర్శకత్వం: పాండీరాజ్
*
అడుగడుగునా అంతరాయాల్ని ఎదుర్కొం టూ మూడున్నర సంవత్సరాల సుధీర్ఘ కాలంపాటు నిర్మాణం జరుపుకొని గతేడాది తమిళనాట విడుదలై విజయం దక్కించుకున్న ‘ఇదు నమ్మ ఆళ్’ చిత్రానికి అనువాదమే ఈ ‘సరసుడు’. అప్పట్లో తెరవెనుక రొమాన్స్‌తో తరచూ వార్తలతో వేడి సృష్టించిన శింబు-నయనతారల ద్వయం దాదాపు దశాబ్దకాలం తరువాత తెరపై జోడి కట్టడం, దీంతోపాటు నిజజీవితంలో వారి మధ్య నడిచిన ప్రేమకథే ఈ చిత్రానికి ‘ప్రధాన ట్రాక్’ అన్న ప్రచారం బాగా ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా సహజంగానే శింబు-నయనతారలు తమిళ ప్రేక్షకులకి ఆరాధ్య దేవుళ్ళు కావడంతో సినిమా విజయం నల్లేరుపై నడకలా సాగింది. తమిళ కమెడియన్ ‘సూరి’ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ సినిమాకి మరింత దోహదపడ్డాయి. ఐతే తెలుగుకి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా భిన్నం! ఇక్కడ సినిమాని సినిమాలాగే చూస్తాం! కథలో కంటెంట్ ఉందా? లేదా? కానె్సప్ట్ కొత్తదా? పాతదా? అంతే తప్ప నాయికా నాయకుల ‘ఆఫ్ ది స్క్రీన్ కెమిస్ట్రీ’ని లక్ష్యం చేయం. ఆన్ ది స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉందనేదే మనకి ముఖ్యం. జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడంటే కాస్తనమ్మడం కష్టమే! ఎన్నో సందేశాత్మక చిత్రాలని అందించిన ఈయన ఈ సినిమా విషయంలో ‘ప్రత్యేకించి కథంటూ ఏమీ లేదు’ అని చెప్పడంతోనే కేవలం శింబు-నయనతారల ‘లవ్‌ట్రాక్’పైనే పూర్తిగా ఆధారపడ్డాడని చెప్పకనే చెప్పినట్లయింది. మరి ఈ నాయిక నాయకులు అనువాద చిత్రమైన ‘సరసుడు’కి కూడా సరసమైన విజయాన్ని అందించగలుగుతారా? తెలుసుకునే ముందు....
శివ (శింబు) చెన్నైలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. స్నేహితుడు వాసు (సత్యం రాజేష్)తో కలసి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఇలా ఉండగా, ఓ రోజు పెళ్లిచూపులుకి ఇంటికి రావాల్సిందిగా వైజాగ్‌లో ఉన్న తండ్రి నుంచి కబురొస్తుంది. పెళ్లిచూపుల్లో మైలా (నయనతార) అందానికి మొదటిచూపులోనే మెస్మరైజ్ అయిపోతాడు శివ. మైలా కూడా శివని ఇష్టపడుతుంది. పెళ్లిచూపుల్లో భాగంగా మైలా అడిగిన ప్రశ్నలకి సమాధానాలిస్తూ గతంలో తనకి ప్రియ (ఆండ్రియా) అనే గర్లఫ్రెండ్ ఉండేదని, అయితే కొన్ని కారణాలవలన ప్రస్తుతం ఆమెని వదిలేశానంటాడు శివ. మైలా శివ మాటల్లోని బోల్డ్‌నెస్‌కి మరింత ఆకర్షితురాలవుతుంది. కొన్ని రోజులకి ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్లి మాత్రం మూడు నెలలు తరువాత! ఇక్కడినుంచే నాయికా నాయకులతోపాటు ప్రేక్షకులకి కూడా కష్టాలు మొదలవుతాయి. అపోహలు, అనుమానాలు, విభేదాలు, విరహవేదనలు, ప్రాధేయాలు, పవళింపులు- వీటితోపాటు ‘్ఫ్లష్‌బ్యాక్’లో వచ్చే శివ-ప్రియల లవ్‌సీన్లు సినిమాలోని తక్కిన అంశాలు. కథనం మొత్తం నిదానంగానే నడుస్తుంది. శింబు ఆండ్రియాల మధ్య సాగిన సన్నివేశాలు తప్ప తక్కిన భాగమంతా భరించ కష్టతరమే! ద్వితీయార్థం మరింత సాగతీతగా అనిపిస్తుంది. శింబు-నయనతారలమధ్య అరగంట పాటు సాగిన సెల్‌ఫోన్ సంభాషణ ఇందుకు మంచి ఉదాహరణ. తెరవెనుక కూడా లవర్స్ అయినంత మాత్రాన వాళ్ళ లవ్ ఫీలింగ్స్‌ని టిక్కెట్ కొన్న ప్రేక్షకులపై రుద్దడం ఎంతవరకు సబబు? శింబు నయనతారల తరువాత సెల్‌ఫోన్‌ని సినిమాలో మరో ముఖ్య పాత్రధారిగా చెప్పుకోవచ్చు. ముప్పావువంతు మాటలు ఫోన్ ద్వారానే సాగుతాయి. దీంతో తెరపై తలలు తప్ప మరేమీ కనిపించకపోవడంతో ప్రేక్షకులు తమ తలలు పట్టుకోవాల్సిన దుస్థితి! ఇక్కడొక విషయం- శింబు-నయనతార తారలు ఇద్దరూ కూడా థర్టీప్లస్ కావడంతో వారి మెచ్యూర్డ్ లవ్ సీన్లు ఫ్రెష్‌గా అనిపించవు! అయితే వారిమధ్య విభేదాలకి కారణాలు మాత్రం స్కూల్ పిల్లల స్థాయిలో సిల్లీగా, ఫ్రెష్‌గానే ఉంటాయి. వీళ్ళే అనుకుంటే వీళ్ల తండ్రులమధ్య గొడవకి కారణం మరీ ఘోరం! అలాగే శింబు-ఆండ్రియాల ‘బ్రేకప్’కి చూపిన రీజన్ రీజనబుల్‌గా అనిపించదు. ప్రథమార్థం చివరివరకూ కథని నడిపించిన దర్శకుడు పాండిరాజ్ ఆపై ‘కాంప్రమైజ్’ కాలేక ద్వితీయార్థంలో దర్శకత్వ బాధ్యతలని శింబుకి అప్పగించినట్టుగా తోస్తుంది. సినిమా ప్రారంభమైన ప్రతి అరగంటకి శుభం కార్డు వేసే అవకాశం వచ్చినా అలా జరగనేలేదు. బహుశా రీళ్ళు కనీసం రెండు గంటలైనా తిరగాలన్న నియమం అయ్యుండొచ్చు. కథనం ఒకడుగు ముందుకేస్తే, రెండడుగులు వెనక్కేస్తుంది. హీరో హీరోయిన్లు మూడుసార్లు పెళ్లి చేసుకోవడం దీనికి పరాకాష్ట!
ఫైట్లు, ఫారిన్ లొకేషన్లు, భారీ సెట్టింగులు ఏవీ లేని ఈ సినిమాలో శింబు తన సహజ ధోరణికి భిన్నమైన ఐటి ఉద్యోగి పాత్రలో నీట్‌గా కనిపిస్తాడు. నయనతార అందంగా ఉన్నప్పటికీ శింబు ప్రక్కన అక్కడక్కడ అక్కలా కనిపించడం కాస్త ఇబ్బందికర విషయమే! ఆండ్రియా ఫ్రెష్ లుక్‌లో చలాకీగా నటించింది. తమిళ కమెడియన్ సూరి స్థానంలో సత్యం రాజేష్‌ని పెట్టి రీషూట్ చెయ్యడం శుద్ధ దండగ. చెప్పాలంటే సత్యం రాజేష్‌కన్నా సూరి బాడీ లాంగ్వేజ్ బెటరైన కామెడీని పండించేది. ఐటెం సాంగ్‌లో ఆదా శర్మ అరగొట్టలేకపోయింది. శింబు తమ్ముడు కురలరసన్ సంగీతంలోని పాటలు సోసో. ‘నా రాగం ఒంటరి రాగం.. ఆ దేవుడికెందుకింత కోపం’ పాట ట్యూన్‌పరంగా బాగుంది. మొదటి సినిమా అయినప్పటికీ రీరికార్డింగ్‌లో సత్తా చాటాడు. బాలసుబ్రహ్మణ్యం కెమెరా పనితనం కలర్‌ఫుల్‌గా ఉంది. ఎడిటర్ ప్రవీణ్ నిస్సహాయత తెరపై స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఈ సరసుడు ప్రేక్షకులలో సరసలాడుతాడనుకుంటే నీరసాన్ని మిగిల్చాడు.

-మురళి