రివ్యూ

‘రాజుగారి గది-2’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుగారి గది-2 ** ఫర్వాలేదు

**
తారాగణం:
నాగార్జున, సమంత, సీరత్‌కపూర్,
రావు రమేష్, నరేష్, అశ్విన్, నందు,
‘వెనె్నల’ కిషోర్, అభినయ, ప్రవీణ్,
షకలక శంకర్, అవినాష్ తదితరులు.
నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి
సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
సంగీతం: ఎస్.ఎస్ థమన్
దర్శకత్వం: ఓంకార్
**
రెండేళ్ల క్రితం ‘రాజుగారి గది’ సినిమాలో మాస్ కామెడీని పండించిన దర్శకుడు ఓంకార్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. అదే ఊపులో తొందరపడి వెంట వెంటనే సినిమాలు చేసేయకుండా, రెండేళ్ల గ్యాప్ తీసుకొని మరో హారర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముం దుకు వచ్చారు. ఆ చిత్రమే ‘రాజుగారి గది-2’. నాగార్జున, సమంత లాంటి క్రేజీ స్టార్లు తొలిసారిగా ఓ హారర్ కామెడీ కథలో నటించడం.. ‘రాజుగారి గది’ని సీరిస్‌గా మార్చిన చిత్రం కావడం.. సమంత పెళ్లి తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడం.. ఇవ న్నీ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేశాయి. ప్రచార చిత్రాలు కూడా ఈ అంచనాల్ని మరింత రెట్టింపు చేశాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు హారర్ కామెడీ చిత్రాల్లో నటించడం అరుదుగా చూస్తుంటాం. నటించడానికి ఇలాంటి కథలో హీరోయిజం ఏముంటుందనేది వాళ్ల అభిప్రాయం కావొచ్చు. అయితే నాగార్జున మాత్రం ఎప్పటికప్పుడూ కొత్త ప్రయోగాలను చేయడానికి ముందుంటారు. అలా చేసిన ప్రయత్నమే ‘రాజుగారి గది-2’. సమంత కూడా ఈ తరహా కథలో నటించడం ఇదే తొలిసారి. మలయాళ సినిమా ‘ప్రేతమ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మెంటలిస్ట్‌గా నాగార్జున, ఆత్మగా సమంత ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించారో చూద్దాం...
అశ్విన్ (అశ్విన్), కిశోర్ (వెనె్నల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీళ్లు ఇంట్లో ఒప్పించి సొంతగా ఓ రాజుగారి రిసార్ట్ కొని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఈ బిజినెస్‌లో ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలన్నది వారి ఆశయం. అలా వారి ఆలోచనకు ఓ దెయ్యంతో బ్రేక్ పడుతుంది. ఆ దెయ్యం రిసార్ట్‌లో వారిని భయపెడుతుంటుంది. కంగారుతో ఏం చేయాలో తోచని ఆ స్నేహితులు చర్చి ఫాదర్ (సీనియర్ నరేష్)ని కలుస్తారు. ఆయన ఇచ్చిన సలహాతో మెంటలిస్ట్ రుద్ర (నాగార్జున) రంగంలోకి ప్రవేశిస్తాడు. ఎవరినైనా కళ్లలోకి చూస్తూ మనసులో ఏముందో చెప్పగల సమర్థుడు రుద్ర. ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్‌లలో ఒకరైన ఈయన సైన్స్ గురించి ఎంత తెలిసినా.. మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. పోలీసులు కూడా పలు కేసులకు సంబంధించి రుద్ర సలహాలు తీసుకుంటుంటారు. ఫాదర్ కోరిక మేరకు రిస్టార్‌లో అడుగుపెట్టిన రుద్రకు సుహానిసా (సీరత్‌కపూర్)పై తొలుత అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ ప్రతీకారం కోసం తిరుగుతుందని తెలుసుకుంటా డు. ఇంతకీ ఆత్మ రూపంలో రిసార్ట్‌లో వున్న అమృత ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఆమె మరణానికి గల కారణాలేమిటి? ఆ రిసార్ట్‌కి ఆమెకి ఉన్న సంబంధం ఏమిటి? ఎవరిపైన ఆమె ప్రతీకారం? ఆత్మకు రుద్ర ఎలా సాయం చేశాడు? అన్నదే కథ.
నిజానికి కథ పెద్ద గొప్పదేం కాదు. రాబోయే సన్నివేశాల్ని ముందే ఊహించేయొచ్చు. అయినా అడుగడుగునా ఉత్కంఠకేమీ కొదవలేదు. నాగార్జున, సమంతలు కథలో వున్న రెండు ముఖ్యమైన క్యారెక్టర్‌లను చేయడమే సినిమాకి ప్రధాన బలం. వీరిద్దరినీ మినహాయిస్తే ఇది చిన్న సినిమాయే. రుద్రగా మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున నటన, న్యూలుక్ ఆకట్టుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ‘రాజుగారి’ మాయాజాలం! నాగార్జున కనిపిస్తున్నంత సేపూ ప్రేక్షకులకు ఉత్సాహంగానే అనిపిస్తుంటుంది. మోడ్రన్ సెయింట్ రుద్ర పాత్ర లో నాగార్జున విశ్వరూపం చూపించాడు. హీరోయిజమ్ బేస్ చేసుకుని కథను నడపకుండా, కథానుగుణంగా క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ఇక తన స్థితికి కారణమైన వాళ్లపై పగ తీర్చుకోవాలనే ఆత్మగా సమంత పెర్‌ఫార్మెన్స్ అదిరింది. నాగార్జున, సమంత కలిసి కనిపించే పతాక సన్నివేశంలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. హారర్ కామెడీలు అంటేనే ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. అయతే హారర్ బొత్తిగా లేని ఈ సినిమాలో కామెడీ కూడా సరైన రీతిలో పండలేదు. ఫస్ట్ఫా, సెకండాఫ్‌లలో అడపాదడపా వెనె్నల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్ నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ చిత్రం సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో కూడిన మిస్టరీ డ్రామా. ఈ సినిమాకి కథ, కథనాలు కాస్త నాసిరకంగా వున్నాయి. కథా పరంగా కొత్తదనమే కనిపించలేదు. కథనం మరీ బలహీనంగా వుంది. కారణం లేకుండా కష్టపడితే మనుషులు ఎంతలా బాధపడతారు, మంచి వాళ్లయినా సరే క్రోదంగా ఎలా మారతారు? అనే అంశాన్ని చూపించడం కొంత వరకు బాగానే వుంది. నాగార్జున సమంత కేసును డీల్ చేసిన విధానం, నిజాల్ని కనిపెట్టిన తీరు ఆసక్తికరంగా సాగాయి. ఆడపిల్లల గొప్పతనం గురించి చెబుతూనే, సమాజంలో చెడు ఎదురైనప్పుడు కూడా వాళ్లు ధైర్యంగా ఉండాలని చెప్పే సందర్భాల్లో రుద్రగా నాగార్జున నటన ఆకట్టుకుంది. సమంత పాత్ర సెకండాఫ్‌లో ఎక్కువగా కనిపించింది. సమంత తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో బబ్లీగా కనిపించిన సమంత, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ అయింది. ఉన్నంత సేపు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అమృత పాత్ర, ఆమె నేపథ్యం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆమె తండ్రి పాత్రలో రావురమేష్ కనిపించింది కొద్దిసేపే అయినా, వాహ్..అనిపించాడు. ఇక సీరత్‌కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయినా ఫస్ట్ఫాలో గ్లామర్‌షోతో కనువిందు చేసింది. ఆరంభ సన్నివేశాలు సాదాసీదాగానే వు న్నా, దెయ్యం భయపెట్టడంతోనే కథ ఊపందుకుంటుంది. ద్వితీయార్థం సినిమాకి ప్రధాన బలం. మహిళలకి రక్షణ, జీవితం అంటే ఏమిటి? అనే విషయాలపై ఇచ్చిన సందేశం కదిలిస్తుంది. నాగార్జున, సమంత మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు బాగున్నాయి. కిరణ్ అనే పాత్రలో అభినయ నటన ముఖ్యంగా పతాక సన్నివేశాలకు ప్రధాన బలం అయింది.
‘రాజుగారి గది’తో దర్శకుడిగా నిరూపించుకున్న ఓంకార్ మరోసారి మెప్పించాడు. నాగార్జున, సమంత లాంటి టాప్‌స్టార్స్ వున్నా, కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బావుంది. పూర్తిగా కొత్త టేకింగ్‌తో ఓకే అనిపించాడు. సమంత నుంచి చక్కటి నటనను రాబట్టాడు. అయితే తొలి సగభాగం సన్నివేశాల్లో వినోదంపై మరింత కసరత్తు చేస్తే బాగుండేది. పతాక సన్నివేశాల్లో ‘చిట్టితల్లి’ అంటూ సమంతతో నాగార్జున జరిపిన సంభాషణ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా వుంది. థమన్ సంగీతం, అబ్బూరి రవి మాటలు, దివాకరన్ కెమెరా పనితనం బాగా కుదిరాయి. పాటలు లేకుం డా తెరకెక్కిన ఈ సినిమాలో థమన్ బిట్‌సాంగ్స్‌తో అలరించాడు. తన నేపథ్య సంగీతం కూడా కుదిరింది. ‘చావడానికి కంటే బతకడానికి ఎక్కువ ధైర్యం కావాలి’, ‘నేను దూకి చావలేదు. చనిపోయాకే దూకాను’, ‘క్షమించడం బలవంతుడి లక్షణం’ వంటి మాటలు బాగా పేలాయి.. మనసుల్ని గెలిచాయి. నిర్మాణ విలువలు, గ్రాఫిక్ వర్క్స్ ఆకట్టుకున్నాయి.
హారర్ సినిమాలంటే కేవలం భయపెట్టడం మాత్రమే కాదు.. నవ్వించడం కూడా చేయొచ్చని దర్శకుడు చేసిన ప్రయత్నం బావుంది. ఫర్లేదు.. ఓంకార్ కూడా మంచి కమర్షియల్ సినిమా తీయగలడు అని ఈ చిత్రం ద్వారా నిరూపించాడు.

-ఎం.డి అబ్దుల్