రివ్యూ

భన్సాలీ మాయాజాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మావత్*** బాగుంది
తారాగణం:
దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ షాహిదీ కపూర్, అదితీరావు హైదరీ
సంగీతం: సంజయ్ లీలా బన్సాలీ, సంజిత్ బల్హార
కెమెరా: సుదీప్ చటర్జీ
నిర్మాతలు: సంజయ్ లీలా భన్సాలీ, సుధాంశ్ వత్స్, అజిత్ అంధారే
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ

***********************

బాలీవుడ్‌నే కాదు, యావత్ సినీ ప్రపంచాన్నీ కుదిపేసిన పేరు ‘పద్మావత్’! ఈ మధ్య కాలంలో అనేక వివాదాలు, విమర్శలతో ఈ పేరు మార్మోగిపోయింది. అందరి నోళ్లలో ‘పద్మావత్’పేరే..! ఈ వివాదాలు ఎంత వరకు వెళ్లాయంటే.. ఈ చిత్రంలో టైటిల్ పాత్రని పోషించిన కథానాయిక దీపికా పదుకొనే తల నరికేస్తాం.. చిత్ర బృందాన్ని చంపేస్తాం.. లాంటి హెచ్చరికలు సైతం ఈ చిత్రాన్ని చుట్టు ముట్టాయంటే ‘పద్మావత్’ ప్రకంపనలేమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక చిత్రంపై ఇంతగా వివాదం చెలరేగిందంటే ఈ చిత్రానికున్న పవరేమిటో.. ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘చరిత్రని చరిత్రగానే చూపిస్తున్నాం.. ఇందులో ఏ మాత్రం కల్పితాలు లేవు’ అని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ హామీ ఇచ్చేంత వరకూ ఈ వివాదం రేగుతూనే ఉంది. సినిమాలపై వివాదాలు రావడం.. మనం వినడం, ఎక్కడైనా చదవడం, టీవీల్లో చూసుంటాం. కానీ.. ‘పద్మావత్’ సినిమాపై వచ్చినన్ని వివాదాలు మరే సినిమాపై రాలేదు. రాజ్‌పుత్ రాణి పద్మావతి ఆత్మ త్యాగానికి సంబంధించిన కథ కావడంతో చిత్రం ప్రకటించినప్పటి నుంచి దీనిపై ఎంతో ఆసక్తినెలకొంది. మరో వైపు చిత్రీకరణ సమయంలో యూనిట్‌పై దాడులు కూడా జరిగాయి. తీరా విడుదల సమయంలోనైతే రాజ్‌పుత్ కర్ణిసేనలు పెద్ద ఆందోళనకు దిగాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమా విడుదలను ఆపేందుకు తెగ ప్రయత్నం చేశాయి. చిత్రం విడుదలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక లాభం లేదనుకున్న సెన్సార్ వారు తమ కత్తెరకు పదునుపెట్టారు. అణువణువూ వెతికి చూసి, గాలించి విమర్శలకు తావివ్వకుండా ఐదు కట్స్ చేసి విడుదలకు అనుమతులు ఇచ్చారు. అంతేకాదు, ముం దుగా అనుకున్న టైటిల్ ‘పద్మావతి’ని కాస్త ‘పద్మావత్’గా మార్చడం.. సుప్రీం కోర్టు జోక్యంతో సినిమా విడుదలకు నోచుకోవడం జరిగింది. దాంతో ఎన్నో రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘పద్మావత్’ వచ్చేసింది. మరి అంతలా వివాదాలు చుట్టుముట్టడానికి ఈ చిత్రంలో ఇంతకీ ఉన్నదేమిటి? ఈ వివాదాలు ఎందుకు చెలరేగాయి? కారణాలేంటి? తెలుసుకోవాలంటే.. కథలోకి వెళ్లాల్సిందే...
మేవాడ్ రాజు రావల్ రతన్‌సింగ్ (షాహిద్ కపూర్), సింహళ యువరాణి అత్యంత సౌందర్యవతి పద్మావతి (దీపికా పదుకొనే)ని మనసుపడి వివాహం చేసుకుంటాడు. ఆ యువరాణి కూడా అతడిని ఎంతో ఇష్టపడి ప్రాణంగా ప్రేమిస్తుంది. అలా వారి జీవితం ప్రేమమయమై ఉండగా ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ (రణ్‌వీర్ సింగ్) దురంహకారంతో పద్మావతిపై మనసుపడతాడు. అతడో కామ పిశాచి. ప్రపంచంలో అందమైనవీ, అద్భుతమైనవన్నీ తన దగ్గరే ఉండాలని ఆశపడేరకం. అందుకోసం ఎంతటి దుర్మార్గమైనా చేసేస్తాడు. అప్పటికే జలాలుద్దీన్ కుమార్తె మాలికా ఎ జనత్ (అదితిరావ్ హైదరీ)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ కొంత కాలం తర్వాత జలాలుద్దీన్‌ను చంపి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. కామాంధుడైన అల్లావుద్దీన్‌ను ఎవరూ ఎదిరించలేరు. చాలా మంది హిందూ రాజులు అతడికి సామంతులుగా మారిపోతారు. అదే సమయంలో మేవాడ్ రాజు రావల్ రతన్‌సింగ్ సింహళ యువరాణి పద్మావతిని పెళ్లి చేసుకొని తన రాజ్యానికి తీసుకుని వస్తాడు. మేవాడ్ రాజ గురువు రాఘవ చింతనుడు చేసిన అపరాధం వల్ల రతన్‌సింగ్ అతడిని దేశ బహిష్కరణ చేస్తాడు. రాఘవ కక్షతో అల్లావుద్దీన్ వద్దకు చేరి పద్మావతి అందం గురిం చి పొగడుతాడు. ఎలాగైనా ఆమెని దక్కించుకోమని చెబుతాడు. అల్లా వుద్దీన్ తన సైన్యంతో మేవాడ్‌పై దండెత్తుతాడు. ఎలాగైనా ఆమెను తన వశం చేసుకోవాలనే ఆలోచనతో రతన్ సింగ్‌కు చెందిన చిత్తూర్ కోటపై తన అసంఖ్యామైన సైన్యంతో యుద్ధానికి బయలుదేరతాడు. అలా బయలుదేరిన అల్లావుద్దీన్ ఖిల్జీ రావల్ రతన్ సింగ్‌తో యుద్ధం చేశాడా? రతన్‌సింగ్ అతడిని ఎలా ఎదుర్కొన్నాడు? పద్మావతిని దక్కించుకున్నాడా? అసలు పద్మావతి ఆత్మ త్యాగం ఎందుకు చేసింది? పద్మావతి యుద్ధం చేయకుండానే అతడిని ఎలా ఓడించింది? అనేదే అసలైన కథ.
చరిత్రపై అవగాహన ఉన్న వాళ్లకు అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన గురించి తెలిసిన వాళ్లకు ‘పద్మావత్’ కథ పరిచయమే. చారిత్రక గాథల్ని కమర్షియల్ విలువలతో అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించడం సామాన్యమైన విషయం కాదు. ఏ మాత్రం చరిత్రని వక్రీకరించకూడదు. అలాగని ప్రేక్షకుడికి అదేదో చరిత్ర పాఠం బోధిస్తున్నట్లు ఉండకూడదు. రెండింటి మధ్య ఎంతో సమతుల్యం పాటించాలి. అవన్నీ బాగా తెలిసిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. చరిత్ర పాఠం కాబట్టి, వీలైనంత సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి. ఆ విషయంలో భన్సాలీ విజయం సాధించాడు. చరిత్ర గురించి ఏ మాత్రం అవగాహన లేని ప్రేక్షకుడు కూడా కథలోకి తేలిగ్గా ప్రవేశిస్తాడు. సినిమాకు ప్రధాన బలం దర్శకుడు భన్సాలీ మాయాజాలమే. ఆయన సన్నివేశాల్ని షూట్ చేశారు అనడం కన్నా చెక్కారు అనొచ్చు. ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో అందంగా, హుందాగా కళ్లు మిరుమిట్లు గొలిపేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా చిత్తూరు కోట సెట్ అద్భుతంగా ఉంది. ఆనాటి రాజ్‌పుత్ వంశీయుల వైభవాన్ని కళ్లకు కట్టింది. రాణీ పద్మావతిగా దీపికా పదుకొనే వేషధారణ, రావల్ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్ ఆహార్యం అత్యంతగా ముచ్చట గొలుతూ గొప్పగా ఉన్నాయి. జోథా అక్బర్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు భన్సాలీ ఈ చిత్రాన్ని సైతం ఎంతో అం దంగా, అద్భుతంగా రూపొందించారు. ‘పద్మావత్’ కథలో కావల్సినంత ఎమోషన్ ఉంది. డ్రామా ఉంది. భావోద్వేగాలున్నాయి. వీటన్నింటినీ తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించాడు భన్సాలీ. సాధారణంగా రాజ్‌పుత్ కథ, యుద్ధాలు అంటే ఎక్కువగా యాక్షన్ ఘట్టాలపై మొగ్గు చూపిస్తారు. కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీలు, ఎత్తుగడలు, యుద్ధ నైపుణ్యాలు చూపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఈ చిత్రంలో దర్శకుడు వాటినన్నింటినీ పక్కన పెట్టాడు. తనకు డ్రామాపై పట్టు ఎక్కువ. అందుకే వీలైనంతగా డ్రామాను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఖిల్జీ అరాచకత్వం, అతని ఆలోచనలు, సింహాసనాన్ని అడ్డదారిలో అందుకున్న విధానం లాంటివన్నీ ఎంతో ఆసక్తికరంగా మలిచి ప్రేక్షకుడిని ఊపిరి బిగపట్టేలా చేశాడు. ఎనిమిది వందల మంది దాసీలతో పద్మావతి ఖిల్జీలపైకి దండెత్తే సన్నివేశంలో భన్సాలీ దర్శకత్వ ప్రతిభ అణువణువూ కనిపిస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో రాజ్‌పుత్‌ల త్యాగాన్ని బాగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాను నిలబెట్టే ఘట్టం అదే. తొలి భాగంలో కథని చెప్పడానికి, పాత్రల్ని పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో డ్రామాని పండించి తనదైన మార్క్‌ని ప్రదర్శించాడు. తెలిసిన కథని ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. చరిత్రని అటూ ఇటూ మార్చితే వివాదాలు తలెత్తుతాయని తెలుసు. వివాదాలకు దూరంగా ఈ కథని నడిపించాడు. సెన్సార్ కత్తెరకు సినిమా అక్కడక్క బలైన సంగతి తెలిసిపోతుంది. ఫస్ట్ఫాలో అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి అతను సుల్తాన్‌గా అవతరించడం, సెకండాఫ్ ఆరంభంలో ఖిల్జీ కోట నేపథ్యంలో జరిగే కీలకమైన సన్నివేశం వంటి కొ న్ని సీన్స్ లాజిక్‌కు అందకుండా ఉంటాయి. పైగా చిత్రానికి కీలకమనిపించే కొన్ని సన్నివేశాల్లో పెద్దగా లోతు ఉండదు. అన్నీ చాలా సింపుల్‌గా జరిగిపోతుంటాయి. ఇక ఆఖరున వచ్చే యుద్ధ సన్నివేశంలో ఆశ్చర్యపోయే, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఉండవు. చారిత్రక నేపథ్యంలో వచ్చే చిత్రం అందులోనే రాజులు రాజ్యాలు అంటే ఖచ్చితంగా యుద్ధ సన్నివేశాలని, గొప్ప హీరోయిజాన్ని ఆశిస్తాడు సగటు ప్రేక్షకుడు. కానీ అలాంటివేమీ ఇందులో పెద్దగా దొరకవు. భన్సాలీ చిత్రాల్లో మేజర్‌గా ఉండే డ్రామానే ఇందులో కూడా ఎక్కువ శాతం ఉంటుంది.
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, షాహిద్ కపూర్ పాత్రలు ఈ కథలో కీలకం. ఆ పాత్రల్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బావుంది. మూడు పాత్రల్ని ఎంతో శక్తిమంతంగా మలిచాడు. ఈ మూడింటిలో ఎక్కువ మార్కులు మాత్రం రణ్‌వీర్ సింగ్‌కే దక్కుతాయి. ఖిల్జీగా క్రూరత్వాన్ని అద్భుతంగా పండించాడు. పద్మావతిని దక్కించుకోవడానికి తాను వేసే ఎత్తుగడలు, ఆయా సన్నివేశాల్లో రణవీర్ నటన ఆకట్టుకుంటుంది. క్రూరత్వం, చాకచక్యం, జిత్తులమారితనం వంటి గుణాల్ని అలవోకగా పలికించి ప్రాతకు ప్రాణం పోశాడు. ఆ తర్వాత స్థానం దీపికా పదుకొనేదే. రాణీ పద్మావతిగా ఆమె ప్రదర్శన కూడా ముచ్చటపడేలా వుంది. ఆత్మగౌరవం, అందం, తెలివి కలిగిన రాణిగా ఆమె నటన అద్భుతం. ఆమె చేసిన అత్యుత్తమ పాత్రల్లో పద్మావతి కూడా ఒకటి. ఈ పాత్ర కోసం దీపికా పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. రొమాంటిక్ పాత్రల్లో కనిపించే షాహిద్ కపూర్ రాజ్‌పుత్ వీరుడిగా మారడం కొత్త అనుభవం. పస్ట్ఫాలో దీపికా, షాహిద్ కపూర్ మధ్య నడిచే లవ్‌డ్రామా అందంగా ఉంది. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఊహించని ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తించింది. సాంకేతికంగా చూస్తే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించకుండా, ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేలా కథ, కథనాల్ని తయారు చేసుకున్నాడు. గొప్ప విజన్‌తో సన్నివేశాలను అత్యున్నత సాంకేతికతో విజువల్ వండర్ అనేలా తీశారు. ప్రధాన తారాగణం డిజైనర్ మాక్సిమా బసు రూపొందించిన కాస్ట్యూ మ్స్ బాగున్నాయి. సంచిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. సుదీప్ ఛటర్జీ ప్రతి ఫ్రేమ్‌ను తన కెమెరాలో ఎంతో అందంగా, గొప్పగా బంధించాడు. రాజ్‌పుత్ కోటలను, సన్నివేశాలను చిత్రీకరించిన తీరు అహా..! అనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద చారిత్రక నేపథ్యం నుండి పుట్టిన చిత్రం ‘పద్మావత్’ గొప్ప విజువల్స్ కలిగిన ఎమోషనల్ డ్రామా. దర్శకుడి టేకింగ్, కథను నడిపించిన విధానం న ఆకట్టుకునేలా వుంది.

-ఉషశ్రీ తాల్క