రివ్యూ

వృథా ప్రయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* గులేబకావళి
*
తారాగణం:
ప్రభుదేవా, హన్సిక,
రేవతి, ఆనంద్‌రాజ్,
మన్సూర్ అలీఖాన్, రాజేంద్రన్,
మధుసూదనన్, యోగిబాబు,
మనీష్‌కాంత్, రాందాస్ తదితరులు
సంగీతం: వివేక్ - మెర్విన్
నిర్మాత: కోటపాడి జె.రాజేష్
రచన, దర్శకత్వం: కల్యాణ్
*
నిధి అనే్వషణ (ట్రెజర్ హంట్) కీలక కథాంశంగా గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. ఆ జాబితాలో చేరిన మరో చిత్రం ‘గులేబకావళి’. అయితే దాదాపు ఇదే నేపథ్యంతో గత సంవత్సరం ఆది పినిశెట్టి నాయకుడిగా వచ్చిన ‘మరకతమణి’ చిత్రం కూడా ఈ సందర్భంలో ప్రేక్షకులకు గుర్తుకురావడం సహజం. ఈ రెండు చిత్రాలు తమిళ అనువాద చిత్రాలే కావడం గమనార్హం. ఇక చిత్ర వివరాల్లోకి వెళితే...
తెల్లదొరలనే బురిడీకొట్టించి 1945లోనే అత్యంత విలువైన వజ్రాలు తదితరాలు ఏనుగు దంతాలతో చేసిన అస్థిపంజరంలో భద్రపరిచి, దాన్ని ఓ పెట్టెలో పెట్టి ‘గులేబకావళి’ గుడిలో దాస్తాడు ఓ పెద్దమనిషి. ఆ రహస్యాన్ని 2018లో మెక్సికోలో వుంటున్న మనమడు (మధుసూదన్) తన తండ్రి ద్వారా తెలుసుకొని, ఇండియాలో వున్న బావమరిది (ఆనంద్‌రాజ్) ద్వారా తెప్పించే ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రక్రియలో భాగంగా ఆ పనిని చిన్నసైజు దొంగతనాలు చేసే బద్రి (ప్రభుదేవా), అలాంటి పనులే చేసే విజ్జి (హన్సిక), మనీష్, కార్ల దొంగతనాలలో ఆరితేరిన మాఫా (రేవతి) కలిసి, దాన్ని సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు, వగైరాలతో గులేబకావళి కథ కంచికి చేరిపోతుంది. ఇలాంటి నిధి అనే్వషణ కథల్లో ప్రధానంగా, హారర్ లేదా కామెడీ సింహభాగం వహిస్తాయి. అయితే హారర్ కొన్ని వర్గాలే ఇష్టపడతాయి కనుక ఎక్కువశాతం కామెడీ ద్వారా ఆకర్షించి అందర్నీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ పద్ధతే ఇందులో నడిచింది. అందులోనూ ప్రభుదేవా నాయకుడు కనుక సహజంగా హాస్యాన్ని అనుసరిస్తాడు. కానీ ఇందులో కల్పించిన కామెడీ సీన్లు చాలావరకూ చాలా సిల్లీగా ఉండడంతో కొన్ని చోట్ల విసుగు వస్తుంది. అసలు దర్శకుడి సినిమా ఆరంభమైన పదిహేను నిమిషాల వరకూ చిత్రంలో పాత్రల పరిచయం పేరిట సన్నివేశాలు చూపడంతోనే సరిపోయింది. అనంతరం వజ్రాల వేటలో వ్యక్తులు కలుసుకోవడం వగైరాతో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. కాస్తంత ద్వితీయార్థంలోనే ఫిలిమ్ టెంపోకి వచ్చింది. ఈలోగా చిత్రం ముగిసిపోయింది. వెరసి సినిమా చూసే వీక్షకుడికి ‘ఏమిటీ సినిమా పర్పస్?’ అన్న భావనా కలిగింది. అవడానికి నాయకుడు ప్రభుదేవా అయినా మాఫా పాత్రలో రేవతి ఇపుడు వాడుకలో వున్న భాషలో చెప్పాలంటే ‘ఇరగదీసేసింది’ అనొచ్చు. ఎన్నో ప్రతిభావంతమైన పాత్రలలో అటు ప్రేక్షకుల ప్రశంసలూ, విమర్శకుల అభినందనలతో పాటు ఎన్నో అవార్డులూ పొందిన రేవతికీ తరహా పాత్ర కొత్త. అయినా ఎంతో ఈజ్‌తో, అసలామె చెప్పేదంతా నిజమేనన్న భావన కలిగేలా చేశారు. ‘ఆంటీ’కాదు ‘మాఫా’ అంటూ రజనీకాంత్ స్టైల్‌లో నటించడం.. దాన్నీ వీక్షకులు బాగా ఆస్వాదించారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, పాత్రలో ఎంతటి మోసకారితనం వగైరా వున్నా, చిత్రాంతానికి అదంతా పోయి సవ్యమార్గంలో వెళ్లినట్లు చూపించడం సినిమాల్లో సాధారణంగా జరిగే సంగతికి విరుద్ధంగా ఇందులో జరగడం. అదెలాగంటే ‘‘అందరూ పోండి’’ అని చివరల్లో చెప్పేసిన రేవతి పాత్ర నైజం నిజమేనేమోనన్న భావంతో ప్రభుదేవా బృందం వెళ్లిపోతుంటారు. ఈలోగా లోపల వున్న హన్సిక చెల్లెలు పాత్రధారిణి చేత్తో అంతకుముందు వరకూ జరిగిన అస్థిపంజరం చెయ్యి (అందులో వీళ్లందరూ వెదుక్కుంటున్న వజ్రాలు ఉంటాయి) తీసుకువచ్చి ‘ఇదేమిటి ఆంటీ’ అని అడుగుతుంది. దాంతో మాఫా పాత్రలో మాయదారితనం పోలేదు అని చెప్పడం దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌కు సంకేతం. ప్రభుదేవా తనకలవాటైన డాన్సు, కామెడీ టైమింగ్‌ను మరోసారి ప్రదర్శించాడు. హన్సిక పాటలకు ఉపయోగపడింది. మిగిలిన పాత్రధారుల్లో అన్నాజీ పాత్రధారి (రాజేంద్రన్) కొన్నిచోట్ల అలరించాడు. వివేక్-మెర్విన్ స్వరాల్లో అన్నీ దూకుడుగానే వాయిద్యాల హోరుతోనే సాగాయి. ఉన్నంతలో ‘నాకు నువ్వేనంట- నీకు నేనేనంట’ బాగుంది. మరో పాటలో ‘నువ్ కాదన్న రోజే నా శ్వాస ఆగిపోదా’ అన్న పద ప్రయోగం ఎన్నదగినదిగా ఉంది. అలాగే సంభాషణా రచయిత కలం కూడా ‘కర్మ అయ్యేవరకూ కర్మ పట్టే పనులు చేయను’, ‘కారు తోలుతున్నావా తోలుతున్నట్లు తూలున్నావా’ అన్నచోట్ల బాగా పనిచేసింది. కానీ మన్సూర్ అలీఖాన్ పాత్రతో మాటిమాటికీ ‘పనె్నండేళ్లప్పుడే నా ఐస్‌క్రీమ్ తినేసాడని నా తమ్ముణ్ణే చంపేశాను.’ అంటూ చెప్పించడం అసలు బావులేదు. ఎంత హాస్యం కోసమే అయినా లాజిక్‌కు ఏ మాత్రం అందకుండా సన్నివేశాలు పేర్చేసి చూపడం బదులు కాస్తంత అర్థవంతంగా సీన్స్‌ను మలచి ఉంటే ‘గులేబకావళి’ని ప్రేక్షకులు డైజెస్టు చేసుకునేవారేమో!

-అనే్వషి