రివ్యూ

అర్థం ‘కాలా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* కాలా
*
తారాగణం:
*
రజనీకాంత్, నానా పాటేకర్,
సముద్రఖని, హుమా ఖురేషి,
ఈశ్వరీరావు, అంజలి పాటిల్,
సంపత్‌రాజ్, పంకజ్ త్రిపాఠి,
షాయాజీ షిండే, రవి కాలె,
తదితరులు.
మాటలు: శ్రీరామకృష్ణ
పాటలు: చంద్రబోస్, వనమాలి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: మురళి జి.
నిర్మాణం: వండర్‌బార్ ఫిలింస్
నిర్మాత: ధనుష్
రచన, దర్శకత్వం: పా.రంజిత్
*
సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి సినిమా వస్తోందంటే అభిమానుల్లో పండుగ వాతావరణమే కనిపిస్తుంది. అంతటి క్రేజ్ వున్న హీరో చిత్రంపై అభిమానులు అంచనాలు పెంచుకోవడడం సహజం. కోలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ రజనీకి మంచి మార్కెట్ ఉంది. ఆయన స్టయిల్, మేనరిజమ్స్ అభిమానులనే కాదు, ప్రతీ ఒక్కరినీ అలరిస్తాయి. అలాంటి కథానాయకుడు నుంచి వచ్చిన తాజా చిత్రం ‘కాలా’. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కావడంతో అందరి చూపు ‘కాలా’పైనే నెలకొంది. రజనీ నటించిన గత చిత్రం ‘కబాలి’ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టి అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఆ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. ఈ ‘కాలా’ కూడా మళ్లీ అదే కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం ‘కబాలి’ పరాజయం పాలైనా, మళ్లీ అదే కలయికలో సినిమా వస్తోందటేనే అందరూ ఆశ్చర్యపోయారు.. వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మరి ఇలాంటి కాంబినేషన్ ‘కాలా’ను కాపాడిందా? అభిమానుల్ని అలరించిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
మహానగరం ముంబయిలోని ధారావి అనే స్లంప్ ఏరియాలో జరిగేకథ. ఆ ఏరియాకు చెందిన నాయకుడు కరికాలన్..కాలా (రజనీకాంత్). హరిదాదా (నానాపాటేకర్) ఓ రాజకీయ నాయకుడు. హరిదాదా తన అధికార బలంతో, కుట్రలు, కుతంత్రాలతో ఆ స్లంప్ ఏరియాను తన హస్తగతం చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తుంటాడు. అయితే, ప్రతిసారీ కాలా, దాదాను అడ్డుకుంటాడు. దాంతో కోపోద్రిక్తుడైన దాదా, కాలాపై పగను పెంచుకుంటాడు. అలా హరిదాదా, కాలాల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? ఈ పోరాటంలో కాలా ఏం కోల్పోయాడు? దాదా కుట్రల్లో కాలా కుటుంబం ఏమైంది? ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంది? మురికివాడ దాదా హస్తగతం కాకుండా కాలా ఏం చేశాడు? అన్నదే క్లైమాక్స్.
వినడానికి ఆసక్తికరంగానే అనిపించింది. చూస్తేనే భయమేస్తుంది. మురికావాడల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. రజనీ ఏజ్‌కు, ఇమేజ్‌కు తగ్గ కథతోనే ‘కాలా’ రూపుదిద్దుకుంది. కానీ, చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేరీతిలో మాత్రం దర్శకుడు తీర్చిదిద్దలేకపోయాడు. దర్శకుడి మీద నమ్మకంతో మరోసారి ధైర్యం చేసిన రజనీ బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లాపడక తప్పలేదు. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎందుకుతీశాడో..? ఏం చెప్పాలనుకున్నాడో..? చివరకు ఏం చెప్పాడో కూడా ఎవరికీ అర్థం ‘కాలా’! అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రం వారినీ సంతృప్తి పరచలేకపోయింది. భూమి ప్రాధాన్యం, భూమిని లాక్కోవడానికి పెద్దలు అనబడే వారు చేసే కుట్రలు, కుతంత్రాలు అన్నీ రొటీన్‌గానే సాగాయి. మురికివాడలోని ప్రజల కష్టాలు, ఆ వాడపై వాళ్లకున్న మమకారం.. వాటి కోసం జరిగే పోరాటం తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు చేసిన ప్రయత్నం హర్షించతగ్గదే అయినా, దానిని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. రజనీకాంత్ నుంచి కోరుకునే హీరోయిజం, రొమాంటిక్ సన్నివేశాలు, డైలాగ్‌లు దాంతోపాటు ఓ సామాజిక సమస్య ఇవన్నీ
వున్నా కానీ.. ‘కాలా’ను కాపాడలేకపోయాయి. ‘కబాలి’ తర్వాత రజనీ ఇచ్చిన మరో అవకాశాన్ని దర్శకుడు పా. రంజిత్ ఏ మాత్రం వినియోగించుకోలేకపోయాడు. రజనీ నుంచి అభిమానులు ఆశించే మాస్, కమర్షియల్ అంశాలేవీ లేకుండా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పూర్తిగా నిరాశపరిచాడు. ఓ స్టార్ హీరో ఎంట్రీ ఎలా వుండాలో కూడా దర్శకుడికి తెలియదా? అనిపించింది. పెద్దగా హడావిడి లేకుండా సాదాసీదాగా కాలా క్యారెక్టర్‌ను పరిచయం చేశాడు. తొలి భాగంలో అసలు కథ ఏంటో కూడా చెప్పలేకపోయాడు. సాదాసీదాగా ఫ్యామిలీ సీన్స్‌తో నెట్టుకొచ్చాడు. ఇంటర్వెల్ సీన్‌తో కాస్త ఆసక్తికలిగించేలా చేసినా ద్వితీయార్థంలోకి వచ్చేసరికి అదే టెంపోనూ కొనసాగించ లేక చతికిలపడ్డాడు. సినిమాకు ప్రధాన బలం అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్‌స్టార్ రజనీకాంతే. అసలే.. రాజకీయంగా ముందుకు వచ్చిన తరుణం.. ఇలాంటి సమయంలో అతడి సినిమా వస్తుందంటే దర్శకుడు ఆ చిత్రాన్ని ఏ విధంగా తెరకెక్కించాలి? ఆయన రాజకీయ నేపథ్యానికి సినిమా ఎలా ఉపయోగపడాలి? అనే విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఆయన అదేం చేయలేదు. పైగా కథను, క్యారెక్టర్‌ను తుంగలో తొక్కేశాడు? వాటి ఛాయలకే వెళ్లలేదు. ఈ చిత్రంలోని మైనస్ పాయింట్ల గురించి చెప్పుకోకపోవడమే బెటర్. ఎందుకంటే వాటికి కొదువేలేదు. ముఖ్యంగా స్లో నెరేషన్ ‘కాలా’ని అర్థం కాకుండా చేసింది. కరికాలుడు అలియాస్ కాలాగా రజనీకాంత్ తనదైన మాస్ పెర్‌ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. ఈ సినిమాలో ఓ కోర్ పాయింట్.. పేదవాడు ఉండటానికి చోటు కావాలి. ఇంత పెద్ద దేశంలో ఇంకా పేదవాడికి ఉండటానికి ఇళ్లు ఎందుకులేవు అనే ప్రశ్నను రైజ్ చేయించాడు దర్శకుడు పా.రంజిత్. అయితే దానిని చివరి వరకూ సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. రజనీకాంత్ సినిమా అంటే కేవలం ఆయనను చూడటానికి మాత్రమే థియేటర్‌కు వస్తారు అభిమానులు. ఆ విషయం దర్శకుడు పా.రంజిత్‌కు బాగా తెలుసు. అయితే రజనీని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. సూపర్‌స్టార్ విశ్వరూపం ఎక్కడా కనిపించదు. చిట్టెమ్మ (హుమా ఖురేషి)ల మధ్య నడిచిన లవ్‌ట్రాక్ కథకు దూరంగా సాగి విసిగించింది. ఇంటర్వెల్ ఘట్టంలో నానా పాటేకర్-రజనీ మంధ్య సాగే సన్నివేశం ఈ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. నానా పాటేకర్ లాంటి నటుడు ఉన్నప్పుడు ఆ పాత్రను దర్శకుడు ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది. ఈ చిత్రంలోని ఏ పాత్రా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండదు. పోరాట సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానంలో మాత్రం దర్శకుడు, సాంకేతిక నిపుణుల ప్రతిభ కనపడుతుంది. రజనీ భార్యగా ఈశ్వరీరావు నవ్వించింది. హుమా ఖురేషి, సముద్రఖని వీరంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ సోసోనే. సంతోష్ నారాయణ్ తన నేపథ్య సంగీతంలో పాటల్లో‘కబాలి’ ఛాయలు కనిపిస్తాయి. మురికివాడ సెట్ కళా దర్శకుడి నైపుణ్యాన్ని తెలియజేసింది. నిర్మాణ విలువలు బావున్నాయి. అయితే నేం? సినిమా చూస్తున్నంత సేపూ ఎప్పుడు అయిపోతుందిరా బాబోయ్.. అనిపించడం ఖాయం! ప్చ్..కాలా!!
*

--ఎం.డి.అబ్దుల్