రివ్యూ
బాలీవుడ్ బ్యాడ్ బాయ్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాగుంది*** సంజూ
***
తారాగణం:
రణ్‌బీర్‌కపూర్, అనుష్కశర్మ,
సోనమ్‌కపూర్, పరేష్‌రావల్
మనీషాకొయరాలా, విక్కీ కౌశల్
దియామీర్జా తదితరులు.
దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరానీ
***
సినీతారలను నింగిలోని తారల్లా తెర అనే ఆకాశంలో చూస్తూ వారిని రేయి జిగేళ్ళల్లో తప్ప పగటి వెలుగుల్లో ఓ కోణంలో వాళ్ళూ మనలా ఉంటారని కలలో కూడా ఆదమరచి అనుకోవడానికి వీలులేని పరంపరను వారసత్వంగా ప్రేక్షకులకి అందించే వైభవ రంగమే సినీరంగం.
తండ్రి క్రమశిక్షణ ‘స్వేచ్ఛ కోల్పోయాను, కోల్పోతున్నాను’ అన్న భావన అతనిలో కలిగించింది. చెడు సావాసాలకు దగ్గరై, ఆ క్రమంలో డ్రగ్స్ బానిసై చివరికి టెర్రరిస్టు అనే ముద్ర నీడలో కొన్నాళ్ళు ఉండి, అక్రమ ఆయుధాల కేసులో జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి అతను. ఇది పూర్తిగా వ్యక్తిగత కోణం. మరి రంగుల లోకంలో మాత్రం లోటులేని నటనామకుట వీరుడు. ఆయనే సంజయ్‌దత్. గొప్ప నటులైన సునీల్‌దత్, నర్గీస్‌దత్‌ల కుమారుడు.
ఇటువంటి బయోపిక్ అవసరమా? ఒరిగేదేమిటి? అతను ఏం చేసినా గొప్పవాడు అని చెప్పడానికి కంకణం కట్టుకొని ఈ సినిమా తీస్తున్నారా? ఖచ్చితంగా ఇటువంటి సందేహాలు వస్తాయి. బయోపిక్ అంటే ఓ వ్యక్తి గురించి తీసే సినిమా మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో తలెత్తే ప్రశ్నలకు సమాధానాలిచ్చే సాక్ష్యం కూడా. రాజ్‌కుమార్ హిరానీ కొంతమేరకు అదే చేశాడు కానీ సంజయ్‌దత్ జీవితంలో వివాదాస్పదమైన ఎన్నో కోణాలు అయితే చూపించలేదు. 1992-93 మధ్య జరిగిన బొంబాయి బాంబ్ బ్లాస్ట్‌లోని ఓ కోణానికి మాత్రమే ఈ సినిమా పరిమితం అయ్యింది. త్రీ ఇడియెట్స్, పీకె, మున్నాభాయి స్థాయి అంచనాలను మాత్రం ‘సంజూ’ అందుకోలేకపోయింది.
ఓ టెర్రరిస్టు కథను నేనెందుకు రాయాలి? అని ఓ పాత్ర ద్వారా ప్రేక్షకుల్లోకి పరకాయప్రవేశం చేసి కొంతమేరకు తన మోటివ్‌ను వ్యక్తపరిచాడు హిరానీ.
వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే సినిమాల్లో బయోపిక్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం కేవలం సంఘటననే ఆధారంగా తీసుకొని సినిమా తీసినపుడు సంఘటన గాడత మనిషి ప్రాధాన్యతను తగ్గిస్తుంది. కానీ మనీషినే పాత్రగా ఎన్నుకుంటే అప్పటికే ప్రేక్షకుల్లో వున్న అన్ని రకాల అభిప్రాయాలకు సమాధానాలు చెప్తూ కన్విన్స్ చేస్తూ సినిమాలో ప్రేక్షకుల్ని లీనం అయ్యేలా చేసే అధిక శ్రమ కూడా దర్శకుడి మీదే పడుతుంది. అందులోనూ ఎన్నో ఆరోపణలను ఎదుర్కొని, వాటిల్లో కొన్ని నిజం అని రుజువు అయిన ఓ స్టార్ గురించి సినిమా తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయి. రాజ్‌కుమార్ హిరానీకి ఈ ప్రయత్నంలో నూటికి నూరు ఇవ్వలేకపోయినా, ప్రయత్నానికే ఎక్కువ మార్కులు పడతాయి. దానికి కారణం కేవలం ఒక్క సంఘటన తప్ప వివాదాస్పదమైన ఎన్నో విషయాలు, వైవాహిక జీవితం లాంటి అంశాలు పక్కన పెట్టివేయబడ్డాయి. బాలీవుడ్ బ్యాడ్‌బాయ్‌కి కొంతమేరకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం కూడా ఒక్కోసారి అనిపిస్తుంది.
‘బయోపిక్’ అన్నది మనం టీవీలో చూసింది, పేపర్లలో చదివింది కాదు. అవన్నీ తెలిసిన, రుజువైన సంఘటనల ఆధారంగా వెలుగులోకి వచ్చేవి. కానీ బయోపిక్ ఎప్పుడూ ఆ వ్యక్తి స్వగతంగా ఆవిష్కరించుకునే కోణమే. ఆ కోణంలో తనను తాను సమర్థించుకునే అంశాలే ఎక్కువ ఉండవచ్చు కూడా. వీటితోపాటు చర్చించాల్సిన ఇంకో అంశం ఏమిటంటే ‘బయోపిక్’ను ఓ మామూలు సినిమాలా కాకుండా ఓ ప్రత్యేకమైన సినిమాలా చూడాలి.
ఓ సినిమాలోని పాత్రల ఔచిత్యంతో ప్రేక్షకులు తమను తాము చూసుకోవడం మామూలు చిత్రాల్లో జరిగేదే! కానీ బయోపిక్‌లో మాత్రం ఆ వ్యక్తి కోణం నుండి చూస్తేనే సినిమా ఆత్మను అర్థం చేసుకోగలుగుతాం. అలా కాకుండా మనకున్న అభిప్రాయాలు, జడ్జిమెంట్లు, అందరితో చర్చించిన అంశాలు కలగాపులం చేసుకుని చూస్తే బయోపిక్ తన ఉదాత్తతను కోల్పోయినట్లే.
సంజయ్‌దత్ జీవితం సినిమాకు నిజంగా మంచి కథ అవుతుందా? ‘బ్యాడ్ ఛాయిస్ మేక్ గుడ్ స్టోరీస్’ అన్న డైలాగ్ ద్వారా పై ప్రశ్నకు సమాధానం స్పష్టం చేశాడు దర్శకుడు. ఈ సినిమాలో నాయకుడి జీవితంలో ఎక్కువ శాతం ఉంది డ్రగ్సే. ‘బీస్ సాల్ జైల్ యం బీస్ గ్రామ్ కొకైయిన్’ అన్న డైలాగ్‌తో డ్రగ్స్ జీవితంలో సంజయ్‌దత్‌కి ఎంత సన్నిహితంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు హిరానీ. డ్రగ్స్ బారినుండి బయటపడటానికి అమెరికాలో వైద్యం కోసం వెళ్లినపుడు, అక్కడి డాక్టర్ ఓ ఫారమ్ ఇచ్చి అందులో అతను వాడిన డ్రగ్స్‌ను టిక్ చెయ్యమన్నాడు. దాదాపు అన్ని టిక్ చేయడం లాంటి సంఘటనల ద్వారా హిరానీ ఎంతో సౌమ్యంగా కొన్ని చీకటి కోణాలు చెప్పే ప్రయత్నం చేశాడు.
తండ్రి అతి క్రమశిక్షణతో వచ్చిన అసహనం, తల్లి మరణం, ప్రియురాలి బ్రేకప్ లాంటి కారణాలు కొంతమేరకు అతన్ని డ్రగ్స్‌కు బానిసగా మార్చాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో అంశం ఏమిటంటే మిగిలిన ఎన్నో కోణాలు పక్కన పెట్టేసినా, అటువంటి మార్గంలోకి మళ్లడానికి గల పరిస్థితులను, ప్రతి సందర్భంలోనూ అతని మనఃస్థితిని ప్రేక్షకుడికి తెలిసేలా చేయడం.
ఈ సినిమాకు ఇంకో కోణం కూడా వుంది. ఇది ఒక్క సంజయ్‌దత్ కథ మాత్రమే కాదు! తమ పిల్లలు వ్యసనపరులైనప్పుడు తీరని వ్యథను అనుభవించే ఎందరో తల్లిదండ్రుల కథ. ‘నువ్వో టెర్రరిస్టు తండ్రివి’ అని జనాలు అన్నపుడు ఆ తండ్రి పడే వేదన, తన తండ్రి టెర్రరిస్ట్ అని వినవచ్చే వార్తలను కడుపున పుట్టిన బిడ్డలు తెలుసుకోవడం లాంటి సన్నివేశాలు ఎంతో సున్నితంగా ప్రేక్షకుల్ని ఆలోచనలో పడవేస్తాయి.
‘యు డిజర్వ్‌డ్ ఎ బెటర్ సన్’ అన్న డైలాగ్‌తో తను తప్పు చేశాననే ఒప్పుకోలును, ఎటువంటి సమర్థింపులతో కప్పిపుచ్చుకోని సంజయ్‌దత్‌ను నిజాయితీగా చూపిస్తాడు దర్శకుడు. ఇవన్నీ సినిమాలోని వ్యక్తిగత భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు.
‘పరేష్ రావల్’ నిజ జీవితంలో సునీల్‌దత్ కూడా ఇంత బాగా తన మానసిక క్షోభను వ్యక్తపరచలేడేమో అన్నంత బాగా నటించడం సినిమాకు పాజిటివ్ పాయింట్. రణబీర్‌కపూర్ సంజయ్‌దత్ పాత్రకు ప్రాణం పోశాడు. సాధారణంగా బయోపిక్‌లో ఉండే బోర్‌డమ్ పోగొట్టడానికి వీలైనంత హాస్యాన్ని చొప్పించడం కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.
సినిమాలో చెప్పుకోవడానికి ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ, సినిమా చూసి బయటకు రాగానే చాలా సన్నివేశాలు జ్ఞప్తిలో ఉండవు. దానికి కారణం సునీల్‌దత్ పాత్ర చిత్రీకరణ ఉన్నంత గాఢంగా సంజయ్‌దత్ పాత్ర చిత్రీకరణ లేకపోవడం కావచ్చు. గ్యాంగ్‌స్టర్ ఆధారిత సినిమాలు చేసిన సంజయ్‌దత్‌ను వీలైనంత మేరకు చూపించలేదనే అనిపిస్తుంది. విపరీతమైన సున్నిత మనస్కుడిగా చూపించడం తెలియకుండానే వ్యక్తిత్వ గాఢతను పలుచనచేసింది.
ఏది ఏమైనప్పటికీ బయోపిక్‌లు తీయడమే పెద్ద సాహసం. అటువంటి సాహసం చేసిన హిరానీ ప్రయత్నం దాదాపు హిట్ టాక్‌నూ అందుకుంది. కానీ ప్రేక్షకులకు హిరానీ మీద వున్న అంచనాలు త్రీ ఇడియెట్స్, పీకె స్థాయివి కనుక, కొంతమేరకు ఆ దిశలో నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.