రివ్యూ

అమ్మకోసం ఆరాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: విజయ్ ఆంటోనీ, సత్నాటైటస్, దీపారామానుజమ్, భగవతీ పెరుమాళ్, ముత్తురామన్
కెమెరా: ప్రసన్నకుమార్
సంగీతం: విజయ్ ఆంటోనీ
నిర్మాతలు: చదలవాడ పద్మావతి, ఫాతిమా విజయ్ ఆంటోనీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశి
***
ఈ ప్రపంచంలో మొట్టమొదటి అనుబంధం తల్లితోనే ఉంటుంది. అటువంటి మదర్ సెంటిమెంట్‌తో సరికొత్త కథనంతో తెరకెక్కించిన బిచ్చగాడు చిత్రం పేరుకు ఏదోలావున్నా సినిమా కథనం మరోలా సాగడంతో ఆసక్తికరంగా మారింది. తల్లి ప్రేమను పొందడానికి కొడుకు పడే ఆరాటం, ఆమె మరణశయ్యపై ఉంటే రక్షించుకోడానికి పడే తపన, ఆమె ఆరోగ్యం కుదుట పడటానికి కంకణం కట్టుకున్న వైనం ఈ చిత్రంలో కొత్తగానే ఉన్నా ఇలాంటి కథలు జరుగుతాయా? అన్న అనుమానం ఉండేలానూ సినిమా సాగింది.
కథేంటి?
విదేశాల్లో చదువుకొని ఇంటికొచ్చిన అరుణ్ (విజయ్ ఆంటోనీ) ఓ పెద్ద కంపెనీకి కాబోయే జనరల్ మేనేజర్. అతని ఆస్తి విలువ కోట్లలో ఉంటుంది. తన కంపెనీ బరువు బాధ్యతలు తీసుకున్న సమయంలో తల్లికి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో కోమాలోకి వెళ్లడంతో కథ మొదలవుతుంది. కోట్లకొద్దీ డబ్బువున్నా బ్రతికించుకునే దారి లేకపోవడంతో, ఓ సన్యాసి చెప్పిన సలహాను పాటించడానికి ఒప్పుకుంటాడు అరుణ్. అదేంటంటే, అంత పెద్ద కోటీశ్వరుడైనా ఎవరికీ తెలియకుండా ఓ 48 రోజులపాటు బిచ్చగాడిగా బ్రతకాలని, అందువల్ల అతని తల్లికి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పడంతో తప్పనిసరైన పరిస్థితిలో ఒప్పుకుని, ఆవిధంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటాడు. వద్దంటే డబ్బు అన్న కథలో డబ్బు వద్దు అంటే లక్షలు లక్షలు మీదపడ్డట్టుగా ఇందులో బిచ్చగాడిగా నటించడానికి కథానాయకుడు పడినపాట్లు ఒక్కొక్కచోట హాస్యాన్ని సృష్టించినా మరోచోట ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. తన కంపెనీ బరువు బాధ్యతలన్నీ స్నేహితుడికి అప్పగించి, ఎవరికీ తెలియనిచోట బిచ్చగాడిగా బ్రతకడానికి వెళ్లిపోతాడు అరుణ్. అక్కడ తోటి బిచ్చగాళ్ల మధ్య వున్న అనుబంధాలు, రాత్రి సమయాల్లో మహిళా బిచ్చగత్తెలపై జరుగుతున్న అమానుషాలు, రౌడీల బాధ తప్పని బిచ్చగాళ్ల బ్రతుకులు అన్నీ చూస్తాడు. ఒక్కొక్కసారి తను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొంటాడు. కోటీశ్వరుడుగా బ్రతికిన అతను చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆకలి తీర్చుకోడానికి పడ్డ అగచాట్లు ఈ చిత్రంలో సరికొత్తగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో అతనికి స్నేహితురాలిగా మారిన పిజ్జా డెలివరీ గాళ్ మహి (సత్నాటైటస్)తో అరుణ్ ప్రేమ వ్యవహారాలు సరికొత్త సన్నివేశాలుగా కనపడతాయి. ఈ నేపథ్యంలో అతని ఆస్తి కొట్టేయడానికి ఎదురుచూస్తున్న అరుణ్ బాబాయి వేసిన ఎత్తులు, చివరికి బిచ్చగాడిగా ఉన్న సమయంలోనే అరుణ్‌ను అంతమొందించి, కోటీశ్వరుడు కావాలనుకున్న అతని ఆశలు ఏమయ్యాయి? చివరికి అరుణ్ తల్లి ఆరోగ్యం కుదుటపడిందా? బిచ్చగాడని తెలియక ప్రేమించిన మహి ప్రేమను అరుణ్ పొందగలిగాడా? అన్న ప్రశ్నలకు సినిమా ముగింపు సమాధానమిస్తుంది.
ఎలా వుంది?
సినిమాలో బిచ్చగాళ్ల సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా సన్నివేశాలను గ్రిప్‌గా రాసుకోవడంలో దర్శకుడు ఓకే అనిపిస్తాడు. ముఖ్యంగా మహితో బైక్‌పై వెళుతున్న బిచ్చగాడిని పోలీస్ ఆఫీసర్, ఆమె ఎవరు అని అడిగితే, తన గాళ్ ఫ్రెండ్ అని చెప్పడంతో 35 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న తనకే ఇంతవరకు ప్రియురాలు దొరకలేదని, బిచ్చగాడికి నీకెలా దొరికిందని అడిగిన సన్నివేశం నవ్విస్తుంది. అదేవిధంగా బిచ్చగాడి చేతిలో తన్నులుతిన్న రౌడీలు ఇతరులకు చెప్పుకోడానికి సిగ్గుపడుతూ, అనుచరుల నవ్వులకు ఇబ్బందిపడిన సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. అయితే సాధువు చెప్పిన అంశం కేవలం సినిమా సాగడానికే పనికొచ్చింది కానీ విదేశాల్లో గొప్ప చదువుల చదివిన కథానాయకుడు అతని మాట ఎలా విన్నాడు? అనేదే ఆలోచించాల్సిన విషయం. బిచ్చగాళ్ల మధ్య ఓవర్ సెంటిమెంట్ సన్నివేశాలు కాకుండా ఫ్రీస్టయిల్‌లోనే చిత్రీకరించిన విధానం బాగుంది. ఇక నటీనటుల్లో విజయ్ ఆంటోనీ సినిమా మొత్తం తానై నడిపించాడు. అతని నటన ఈ పాత్రలో కుదిరింది. ఇలాంటి పాత్రలే అతనికి సరిపోతాయని అనిపించింది. కథానాయికగా నటించిన సత్నాటైటస్ సినిమాకు తగిన విధంగా నటించింది. నేపథ్య సంగీతం అందించిన విజయ్ ఆంటోనీ సన్నివేశాలను పండించే ప్రయత్నం చేశాడు. ఒక్కపూట అన్నంకోసం ఎదురుచూడడం, నీకోసం వస్తా, నా ప్రాణం ఇస్తా అనే పాటలు ఆకట్టుకుంటాయి. దైవంకోసమో, ఇంకో ప్రయత్నంకోసమో లేక నా ప్రయత్నమో మొత్తానికి అమ్మను బ్రతికించుకోడానికి ఈ బిచ్చగాడి వేషం వేసుకున్నానన్నచోట చెప్పిన డైలాగులు బాగున్నాయి. తమిళ సినిమా అయినా అక్కడక్కడ తెలుగు బోర్డులు కనిపించేలా చేశారు. స్క్రీన్‌ప్లే ఓకే. ఎక్కడో నిజంగా జరిగిన కథనాన్ని ఇలా సినిమా తీశామని దర్శకుడు ప్రకటించినా కొన్నిచోట్ల లాజిక్‌లు దొరకవు. ఉన్నంతలో ఓ కొత్త కథనాన్ని తీసుకుని, ఎక్కడా అశ్లీలత లేకుండా బిచ్చగాణ్ణి తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది.

-సరయు