రివ్యూ

అదోటైపు హుషారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుషారు * బాగోలేదు
*
తారాగణం: తేజస్ కంచెర్ల, అభినవ్, దినేష్‌తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నగార్కర్, ప్రియ వడ్లమాని, రమ్య,
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: రాజు తోట
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, రియాజ్
దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి
*
యూత్‌ని ఆకట్టుకునే సినిమాలు తీయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఉంటారు. తాజాగా హుషారు సినిమా కూడా కేవలం యూత్‌ని టార్గెట్ చేసి తెరకెక్కించిన చిత్రమే. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దనేష్‌తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన హుషారు ఆడియన్స్‌కి ఎంత వినోదం పంచిందో చూద్దాం.
కథ: చైతన్య (అభినవ్), ఆర్య (తేజస్ కంచెర్ల), ధ్రువ్ (దినేష్‌తేజ్), బంటీ (తేజ్), స్కూల్‌స్థాయి నుంచీ స్నేహితులు. ఆడుతూ పాడుతూ కాలేజీ జీవితాన్ని గడిపేస్తారు. చదువుమీద శ్రద్ధ పెట్టని వీళ్లంటే ఇంట్లో వాళ్లకేకాదు, ఊరందరికీ చిన్నచూపే. కానీ అదేం పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు జీవితాన్ని లాగించేస్తుంటారు ఈ కుర్రాళ్లు. అలాంటి సమయంలోనే చైతన్య క్యాన్సర్ బారిన పడతాడు. మిగతా వాళ్లనూ కష్టాలు చుట్టుముడతాయి. ఈ స్థితిలో సమస్యల నుంచి బయటపడటానికి నలుగురూ ఏం చేశారు. దానివల్ల ఎదురైన సంఘటనలు ఏమిటి? వీరి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అన్నది మిగతా కథ.
బుద్ధిగా చదువుకుని క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం తెచ్చుకుని, తర్వాత టైమ్ టు టైమ్ ఆఫీసుకెళ్లి, ఒక క్రమపద్ధతిలో జీవితాన్ని గడిపేయడమే సక్సెస్ కాదు. వయసుకుతగ్గ ఆటలు ఆడి, అన్ని అల్లర్లూ చేసి, ఒడుదొడుకులన్నీ చూసి, చివరగా అభిరుచికి తగిన ఉపాధి చూసుకుని జీవితంలో స్థిరపడమనే సందేశాన్నిచ్చే సినిమా ‘హుషారు’. జీవితంలో అన్ని రుచులూ ఉండాలని చెబుతూ, నలుగురు సగటు కుర్రాళ్ల జీవితంలోని అల్లరినంతా సినిమాలో చూపించారు. వాళ్లు చదువును నిర్లక్ష్యం చేస్తారు. చీటికి మాటికీ మందుకొడతారు. అమ్మాయిలకోసం వెంపర్లాడతారు. గొడవలు పడతారు. అడల్ట్ వీడియోలు చూస్తారు. బాధ్యత తెలియకుండా ప్రవర్తిస్తారు. మరీ ఇంత అల్లరేంటి? ఇంత జులాయితనం ఏంటి? అనిపిస్తారు. అయితే ఇలాంటి ప్రవర్తనకు చింతించాల్సిందేమీ లేదని, ఈ అల్లర్లు, జులాయితనమే ఒక దశ దాటాక జీవితంలో గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెప్పడానికి ప్రయత్నించిన చిత్రమిది.
ప్రధాన పాత్రధారులంతా బాగా చేశారు. అందరిలోకి తేజస్ హుషారుగా, తడబాటూ లేకుండా నటించాడు. అభినవ్ పాత్రకు తగ్గట్టుగా సాఫ్ట్‌గా కనిపించాడు. తేజ్, దినేష్ ఇద్దరూ కామెడీ పండించడంలో కీలకంగా వ్యవహరించారు. నలుగురి నటన సహజంగా అనిపించింది. రాహుల్ రామకృష్ణ గురించి చెప్పాల్సిన పని లేదు.అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ టైం తక్కువే కానీ, అతడి కెరీర్లో గుర్తుంచుకోదగ్గ పాత్ర. హీరోయిన్లలో ప్రియా వడ్లమాని గ్లామర్‌తో ఆకట్టుకుంది. దక్ష నగార్కర్ ఫర్వాలేదు. మిగతా నాయికలు నామమాత్రం. తారాగణమంతా పాత్రోచిత ప్రదర్శనే చేశారు.
సాంకేతికంగా చూస్తే -రథన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో మెప్పించాడు. ఇప్పటికే పాపులరైన ‘ఉండిపోరాదే’ పాట సినిమాలోనూ మంచి ఫీలింగ్ కలిగించింది. అదేకాక ‘పిచ్చాక్’ ‘నాననాననా’ పాటలూ వినసొంపుగానే ఉన్నాయి. పాటల చిత్రీకరణ ఓకే. రాజు తోట ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టే ఉన్నాయి. ఇక దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి ఈతరం పట్టణాల్లో ఉండే యూత్ ఆలోచనలపై, వాళ్ల అభిరుచులపై మంచి అవగాహనే ఉంది. వారికి నచ్చే అంశాలతో సినిమా తీశాడు. దర్శకుడిగా బలమైన ముద్ర వేయలేకపోయినా, తనకున్న పరిమితుల్లో టార్గెటెడ్ ఆడియన్స్‌ను మెప్పించగలిగే ప్రయత్నం చేస్తూనే, కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. సినిమాలో సగం చర్చ బీరు గురించే. ప్రతి రెండో సీన్లోనూ ఎవరో ఒకరి చేతిలో బీరు కనిపిస్తూనే ఉండటం సినిమాను మైనస్. సినిమాలో కీలక ఎపిసోడ్ మొత్తం బీరు చుట్టూ తిరుగడం బోరు కొడుతుంది. అభ్యంతరకర సన్నివేశాలు, ద్వందార్థ సంభాషణలు మంచి సినిమా అన్న ఫీల్‌కు అడ్డంపడ్డాయి. దర్శకుడి టార్గెట్ యూత్ అనుకుంటే -కుటుంబ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి దగ్గరకాలేరు. ప్రస్తుత సినిమాల్లో సమాజ సభ్యతపైనా దర్శకుడు దృష్టిపెడుతుంటే -శ్రీహర్ష ఆ విషయాన్ని విస్మరించడం ఒకవిధంగా ప్రమాదం. నిజానికి దీనిపై చర్చే అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే -ట్రైలర్‌లోనే సినిమా ఏమిటో చెప్పేశాడు కనుక.
ఇక -ద్వితీయార్థంలో నలుగురు కుర్రాళ్ల క్రైసిస్ సన్నివేశాలనూ -సీరియస్ టోన్‌తో నడిపించకపోవడం వికటించింది. కుర్రాళ్ల అల్లరి బోర్‌డమ్‌కు చేరుతున్న సమయంలో, రాహుల్ రామకృష్ణను దింపి వినోదం పంచే ప్రయత్నం చేశాడు. పిచ్చాక్ సాంగ్‌తోపాటు, కొన్ని సంభాషణలు యూత్‌ని ఆకట్టుకుంటాయి. యూత్, అడల్ట్స్‌కు మాత్రమేనంటూ చిత్ర బృందం ఇచ్చిన వార్నింగ్ నిజమైంది. అడల్ట్ కామెడీ విషయంలో హద్దులేకపోవడం కుర్రాళ్లకు కిర్రాక్ హుషారే. కథ ఒక తీరున నడవకున్నా, యూత్‌ను టార్గెట్ చేసిన సీన్లు పేలాయి. ప్రధాన పాత్రల్లో ఒక పాత్ర క్యాన్సర్‌తో బాధపడుతుంటే -అతడి మీద ‘నా పేరు ముఖేష్’ తరహా యాడ్ రూపొందించాడంటే దర్శకుడు ఏం కోరుకున్నాడో అర్థం చేసుకోలేకపోలేం. ఒకవర్గం ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఏం ఆశిస్తారో, దర్శకుడు ఆ విషయంలో మాత్రం నియమం తప్పిన వినోదానే్న అందించాడు.

-త్రివేది