రివ్యూ

అక్కరకురాని అతీత శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడియన్ * బాగోలేదు
*
తారాగణం: మోహన్‌లాల్, మంజువారియర్, ప్రకాష్‌రాజ్, మనోజ్‌జోష్, సనాఅల్త్ఫ్, సిద్ధిక్, నందు, కైలాస్, సంతోష్, ఇన్నోసెంట్
సంగీతం: ఎం.జయచంద్రన్,
నిర్మాతలు: రామ్ దగ్గుబాటి, ఎ.సంపత్‌కుమార్, ఆంటోనీ పెరంబవూర్.
దర్శకత్వం: వి.ఎ.శ్రీకుమార్ మీనన్.
*
వైరుధ్యమైన పాత్రనేదైనా, వైవిధ్యవంతంగా ప్రదర్శించగల ప్రజ్ఞ ఉన్న నటుల్లో మోహన్‌లాల్ ఒకరన్నది నిర్వివాదాంశం. అందుకనే ఆయన్ని ‘సంపూర్ణ నటుడు’ అని కూడా అంటారు. మరి అలాంటి సంపూర్ణ నటుణ్ణి ‘ఒడియన్’ (కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న తినేకురిసి గ్రామంలో ఉండే ఓ తెగకు చెందిన వ్యక్తులు) పాత్రలో చూపడంలో దర్శకుడు వి.ఎ.శ్రీకుమార్ మీనన్ పడిన తడబాటువల్ల అంతగా రాణించలేదు. బహుశా దర్శకుడికిది తొలి చిత్రమై వుండడంవల్ల కావచ్చు. ఇక వివరాల్లోకి వెళితే...
తమ శత్రువులను భయపెట్టి ఇబ్బందుల పాల్చేయడానికి కొన్ని అతీత శక్తులుగల ‘ఒడియన్’ తెగకు చెందిన వ్యక్తుల్ని కేరళ రాష్ట్రంలో కొందరు వినియోగిస్తుంటారు. అలాంటి వర్గానికి చెందిన వ్యక్తి ఒడియన్ మాణిక్యం (మోహన్‌లాల్). అయితే ఒడియన్ మాణిక్యం పేరిట తన స్వార్థంకోసం రాజారావు (ప్రకాష్‌రాజ్), ప్రభ (మంజువారియర్), ఆమె సోదరి భర్త రవిని అంతం చేస్తాడు. అలా తనపై పడిన నిష్కారణ నిందను చెరుపుకుని, ప్రభ కుటుంబాన్ని మాణిక్యం ఎలా రక్షించాడన్నది మిగతా కథ. ఎంచుకొన్న విషయంలోనే జన సమ్మతంకాని అంశాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ‘నేను నీకు అప్పచెప్పిన పనికి చెందిన వ్యక్తుల్ని భయపెడతానే కానీ చంపను’ అని మాటిమాటికీ అనే మాణిక్యం, అసలు అలా భయపెట్టడం, ఆసుపత్రిపాలు చేయడమన్నది ఎంతవరకూ ఒప్పుకోలు విషయమో ఆలోచించాలి. అలాగే తాను కోరుకునే జంతు రూపంలో మారే ప్రక్రియను పొందిన మాణిక్యం శక్తిని తెరపై చూపడంలో అదేదో ఫాన్సీ డ్రెస్ పోటీల్లో ముఖానికి మాస్క్‌వేసుకున్నట్లు ఉంది తప్ప అంతకుమించి స్థాయి కనపడలేదు. మరి సినిమాకు ఆయువుపట్టైన ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ ఇంతటి అలక్ష్యం డైరెక్టర్ ఎలా వహించారో అర్ధంకాదు. అదే విధంగా సినిమా నిడివి (దాదాపు రెండు గంటల నలభైఏడు నిమిషాలు) విషయంలోనూ చాలా ఉదాసీనత చూపారు. అనేకానేక సన్నివేశాలు అనవసరమైనవి తాండవించాయి. ఉదాహరణకు జ్యోతిష్యాలు చెప్పే శాస్ర్తీని భయపెట్టడానికి రాజారావు ప్రోద్బలంతో సాగే ఒడియన్ తరహా విన్యాసాలూ వగైరావి నిర్దాక్షిణ్యంగా తొలగించవచ్చు. అలాఅలా కనీసం అరగంట చిత్రాన్నైనా తొలగించి ఉంటే సినిమా కాస్తంత ఆసక్తిదాయకంగా ఉండేది. ఇక చివరలో పతాక సన్నివేశాల పోరాటం కూడా చాలా సుదీర్ఘంగా ఉండి విసుగు కలిగించింది. అదే రీతిలో ప్రభ అపారంగా నమ్మే మాణిక్యం, తన భర్తనెలా చంపుతాడన్న అణుమాత్రపు అనుమానమైనా వ్యక్తపరచకుండా వెంటనే అతనిపై అందరిలాగే నిందనువేసినట్లు చూపడం ఆ పాత్ర రూపకల్పనకే మచ్చ తెచ్చినట్లైంది. వీటన్నింటికీ మించి సినిమాలో కొన్ని వర్తమాన సన్నివేశాల వివరణలో లెక్కకుమించిన ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చూపడంతో అసలు ఏది ఇప్పటి సీనో, ఏది గడిచిపోయిన సంఘటనో అన్న దానిపై సామాన్య ప్రేక్షకుడు గందరగోళపడ్డాడు. ఇలాంటి అస్తవ్యస్థాలను పక్కకుపెట్టి మిగతా అంశాలు పరిశీలిస్తే- మోహన్‌లాల్ మాణిక్యం పాత్రలో సన్నివేశం- కథా అనుమతించినమేరకు చాలాబాగా నటించాడు అన్నది వేరే చెప్పనక్కరలేని అంశం. అయితే ముందు పేర్కొన్నట్లు అది ఇంకా బాగా శోభిల్లడానికి దర్శకుడు సమర్ధ విధానంలో కృషిచేసి తెరపై ఆవిష్కృతం చేసినట్లైతే మరీ బాగుండేది. మోహన్‌లాల్‌కు దీటుగా చెప్పుకోవాల్సిన పాత్ర ప్రభది. మాణిక్యంమీద అనురాగం, అంధురాలైన చెల్లెలు ఇతర కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతను వ్యక్తీకరించడంలో సమగ్ర నటనని ఈ పాత్ర పోషించిన మంజువారియర్ చూపారు. ముఖ్యంగా తాను భర్తపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబంపై తనకున్న బాధ్యతను ఏమాత్రం విస్మరించకుండా చూసిన నిగ్రహపూర్వక నటన ప్రశంసార్హమైనది. ప్రత్యేకంగా భావప్రకటనలో చూపిన క్లారిటీ ఎన్నదగినది. రాజారావుగా ప్రకాష్‌రాజ్‌కిలాంటివి షరామామూలు పాత్రమే. తన మార్కు నటన మరోసారి ఇందులో చూపారు. సినిమాకు పెట్టని ఆభరణాలు షాజీకుమార్ కెమేరా, పీటర్‌హైన్స్ పోరాట సన్నివేశాలు కేరళ అందాల్ని చూపడంలో షాజీ బేష్ అనిపించారు. ‘మేఘం కురిసెలే, కుసుమం విరిసిలే’ పాటలో కెమేరా పనితనం బాగుంది. కళ్లులేనివారి అంతరంగాన్ని సంభాషణాకర్త ఇందులో బాగా పలికించారు. (కళ్లులేని నాకు మీనాక్షి (చేప వంటి కనులు కలది) అని పేరుపెట్టడమేమిటో, చేపల్ని నేను చూడలేను, కానీ నన్ను అవి చూడగలవు.. అనడం లాంటవి, అలాగే ‘చీకట్లో ఒడియన్’కాదు చీకటే ఒడియన్ అన్న డైలాగ్సూ సినిమా విధానానికి పనికివచ్చాయి. జయచంద్రన్ స్వరాల్లో పెద్దగా చెప్పుకోదగ్గవి లేవు. టైటిల్ సాంగే కాస్తంత ఉత్తేజకరంగా ఉంది. ‘అంబారీ, అంబారీ, తెచ్చేలే పూల అంబారీ, పాట రచనాపరంగా బాగుంది. ఒక ప్రత్యేకమైన ‘తెగ’వివరాల్ని తెరకెక్కించే ఈ తరహా ప్రక్రియలో అంతేస్థాయి ప్రత్యేక పటిష్టతలను రూపకల్పనలో అవలంభించి ఉంటే ‘ఒడియన్’ ఓవరాల్‌గా అందర్నీ అలరించేది.

- అన్వేషి