రివ్యూ

అసలులక్ష్మి మిస్సు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి * బాగోలేదు
*
తారాగణం: రాయ్‌లక్ష్మి, ప్రవీణ్, మధునందన్, రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ తదితరులు
సంగీతం: హరి గౌర
ఛాయాగ్రహణం: వెంకట్ శాఖమూరి
నిర్మాతలు: శ్రీ్ధర్‌రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్‌కె రెడ్డి
స్క్రీన్‌ప్లే, మాటలు: తటవర్తి కిరణ్
దర్శకత్వం: వై కిషోర్‌కుమార్
*
గ్లామర్ గాళ్‌గా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మిరాయ్ స్టార్ హీరోలతో ఐటెం సాంగ్స్‌తో చిందేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఆమె లీడ్ పాత్రలో వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమెడియన్లు ప్రవీణ్, మధునందన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను కొత్త దర్శకుడు కిషోర్ కుమార్ తెరకెక్కించాడు. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన వెంకటలక్ష్మి గురించి కథేంటో చూద్దాం.
కథ: చంటిగాడు (ప్రవీణ్), పండుగాడు (మధునందన్) ఇద్దరూ తమ గ్రామంలోని వాళ్లందరికీ పెద్ద తలనొప్పిలా తయారవుతారు. వాళ్లవల్ల ఊళ్లో ఇబ్బంది పడనివాళ్లంటూ ఉండరు. అలాంటి ఊరికి వెంకటలక్ష్మి టీచర్‌గా వస్తుంది. చంటి, పండు ఆమె మాయలో పడతారు. వెంకటలక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ చివరికి చూస్తే ఆమె మనిషి కాదు దెయ్యమని తెలుస్తుంది. అది తెలుసుకునేలోగానే చంటి, పండు ఆమె ఉచ్చులో పడతారు. తననుంచి బయటపడాలంటే ఒక పని చేసి పెట్టాలని వెంకటలక్ష్మి వాళ్లని బెదరిస్తుంది. ఇంతకీ ఆమె చెప్పిన పనేంటి? వీళ్లు ఆ పని చేసి వెంకటలక్ష్మి నుంచి బయటపడ్డారా? లేదా? అన్నది మిగతా కథ.
సినిమాలో వెంకటలక్ష్మి పాత్రలో రాయ్‌లక్ష్మి నటనే కాదు, గ్లామర్ కూడా డల్‌గానే అనిపించింది. ఆమె లుక్‌లో ఇంతకుముందున్న చరిష్మా మిస్సవ్వడం సినిమాకు పెద్ద మైనస్. నటనాపరంగానూ ఆమె నుంచి ఆశించడానికేమీ లేదు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్‌లో ఆమె పాత్ర తేలిపోవడంతో కథ కంచికి చేరుతుంది. కమెడియన్స్ ప్రవీణ్, మధునందన్ తమ కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల టాలెంట్‌ని పెద్దగా ఉపయోగించుకోలేదనే చెప్పాలి. హీరోగా రామ్‌కార్తీక్ గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు. అతడికి జోడీగా నటించిన పూజిత మాత్రం ఆకట్టుకుంది. ఆమెలోని గ్లామర్ యాంగిల్ కొత్తగా అనిపిస్తుంది. నటన కూడా బాగుంది. ఇక మిగతా పాత్రలు చేసిన వాళ్లు కాస్త ఓవర్ యాక్షన్ చేసేశారు. సినిమాలో మొదటగా దెయ్యాన్ని భయానకంగా చూపిస్తారు. తర్వాతేమో దెయ్యంతో పాత్రలు చాలా మామూలుగా మాట్లాడేస్తుంటాయి. అప్పుడప్పుడూ అది దెయ్యం అని మనకు గుర్తు చేస్తున్నట్టుగా భయం నటిస్తుంటారు తప్పితే పాత్రల్లో ఏరకమైన ఫీల్ కనిపించదు. ప్రతి సన్నివేశాన్నీ సిల్లీగా డీల్ చేశారు. కథ కథనాలు ఎక్కడా కూడా పద్ధతిగా సాగక, క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ సరిగా జరగలేదు.
సాంకేతికంగా, హరి గౌర సంగీతం యావరేజ్. ప్రథమార్థంలో రెండు పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకోదు. వెంకట్ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత లేదు. నిర్మాణ విలువలు ఓకె. తటవర్తి కిరణ్ అందించిన కథ బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకోలేకపోయారు. దర్శకుడు కిషోర్ కుమార్ దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలోనూ ప్రత్యేకత చూపించలేకపోయాడు. అతడి అనుభవలేమి చాలాచోట్ల కనిపించింది. కొన్ని ఐడియాలు వినడానికి బాగుంటాయి కానీ ఎగ్జైటింగ్‌గా అనిపించే ఐడియాను రెండున్నర గంటల సినిమాగా మలచాలంటే చూపించాల్సిన పనితనం కరవైంది. ఐడియాను బేస్ చేసుకుని బిగువైన కథ కథనాలు అల్లడం, తెరపై ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలాంటి ప్రక్రియలో సీరియస్‌నెస్ లోపించింది. ఐడియాను మాత్రమే నమ్ముకుని మొక్కుబడి వ్యవహారం లాగించేస్తే అది అచ్చగా ఈ సినిమాలాగే ఉంటుంది.
చివరగా.. దర్శకుడు కిషోర్‌కుమార్ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, కథనంలో కొన్ని సీక్వెన్స్‌లో ఫ్లో మిస్సయ్యింది. ఏ సీన్‌కి ఆ సీన్ బాగుందనిపించినా.. ఓవరాల్‌గా కథలో మిళితమై ఉండవు. దీనికితోడు కథనం స్లోగా సాగుతూ బోర్‌కొట్టేసింది. సెకెండ్ హాఫ్‌లో ట్విస్ట్‌లు బాగానే పెట్టినా, ఆశించిన స్థాయిలో థ్రిల్ అందించలేదు. గ్లామర్ గాళ్‌గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మీరాయ్ గ్లామర్‌ని, అలాగే హీరోయిన్ పూజితలని గ్లామరస్‌గా చూపించి ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. దీంతోపాటు డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గారిటీ కామెడీతో ఆ తరహా వినోదాన్ని ఆశించేవాళ్లను కొంత మెప్పించే ప్రయత్నం చేశారు. అంతకుమించి ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’లో చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. ద్వితీయార్థం అంతా ప్రతి సీన్ సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సంగతైతే చెప్పాల్సిన పనిలేదు. పైగా చాలా సన్నివేశాల్లో లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. ఇంట్రెస్ట్‌గా సాగని స్క్రీన్‌ప్లే సినిమాపై వున్న ఆసక్తినీ నీరుగారుస్తుంది. ఓవరాల్‌గా వెంకటలక్ష్మి ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది. కథపరంగా భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశమున్నా, దర్శకుడు ఆ చాయలకు పోలేదు.

-త్రివేది