రివ్యూ

అస్పష్ట వెలుతురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లూసిఫర్ * బాగోలేదు
*
తారాగణం: మోహన్‌లాల్, మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, సచిన్ ఖేద్కర్, సాయికుమార్, టోవినోథామస్, ఇంద్రజిత్ సుకుమారన్, కళాభవన్ ఫాజోమ్, శివాజీ గరువయ్యూరే..
సంగీతం: దీపక్ దేవ్
రచన: గోపీమురళి
నిర్మాత: ఆంటోనీ పెరంబవూర్
దర్శకత్వం: పృధ్వీరాజ్ సుకుమారన్
*
లూసిఫర్ -అంటే వెలుగునిచ్చేవాడు. సినిమా భాషలో చెప్పాలంటే -కథానాయకుడు. అంతకుమించి లూసిఫర్‌కు అదనపు ఆకర్షణాంశాలేవీ లేవు. ఈ చిత్రంలోనూ కీలక పాత్రధారిని అలాగే చూపారు. ఎలాంటి అవరోధాలనైనా చిటికెన వేలితో తీసిపారేసే స్ట్రాంగ్‌మ్యాన్‌గా చూపించటానికే దర్శకుడు సుకుమారన్ ఇష్టపడ్డాడు. కాకపోతే చూపించిన సన్నివేశాల్లో స్పష్టతాలోపం అయోమయానికి తావిచ్చింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి పికె రామదాసు (సచిన్ ఖేద్కర్) అకాల మరణంతో పార్టీలో ఏర్పడిన సంక్షోభం. అంటే తదుపరి ఎవర్ని ముఖ్యమంత్రి చెయ్యాలా? అన్న దానితో చిత్రం మొదలైంది. కూతురు ప్రయదర్శిని (మంజు వారియర్), ఆమె రెండో భర్త బాబి (వివేక్ ఒబెరాయ్) కలిసి కొడుడు జితన్ రామదాస్‌ని విదేశాల నుంచి రప్పిస్తారు. అలా చేస్తే పార్టీపై తనకు అనధికారికంగా సర్వ హక్కులూ దాఖలుపడి లాభపడవచ్చనే ఆకాంక్ష బాబిది. కానీ ఆ కుటుంభానికి సన్నిహితుడైన స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్‌లాల్) బాబి ఆటలు కట్టించి, ఆ కుటుంబంలో అతనివల్ల ఏర్పడిన అంధకారం నుంచి ఎలా వెలుగు చూపించాడు అన్నదానితో కథ చివరికొస్తుంది. రాజకీయ చిత్రంగా ప్రారంభమైనా కథాంశాలు, నడక కుటుంబాశాల దిశగానే ఎక్కువ నడించాయి. సో, దీన్ని రాజకీయ చిత్రమనలేం. కేవలం రాజకీయం ఆలంబనగా చేసుకున్నారంతే. ఆక్రమంలో కొన్ని మంచి పాత్రలకీ చెడుని, చెడ్డపాత్రలకి మంచిని కట్టబెట్టారు. దీంతో ఇందాక మనం ప్రస్తావించుకున్న స్పష్టతాలేమి పలుచోట్ల తేటతెల్లమైంది. ఉదాహరణకు పోలీస్ అధికారి మహాలింగం పాత్ర. ఓపక్క హీరోని ఎదిరిస్తుంటుంది. ఇంకోపక్క అతనికి జైల్లో మొబైల్ ఫోన్ అందిస్తుంటుంది. అదే పాత్ర ‘నార్కొటిక్స్ కేసులో నీ కూతుర్ని ఇరికిస్తా’నన్న బెదిరింపుతో మాజీ సీఎం కూతుర్నే లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక లాజిక్‌కు అందని అంశాలను ప్రస్తావిస్తే -రామదాసు కుటుంబాన్ని అంటిపెట్టుకుని తిరిగాననే స్టీఫెన్, రాందాసు మనుమరాలు మత్తుకు బానిసయ్యే వరకూ ఎందుకు చూస్తూ ఊరుకున్నట్టు? అలాగే తనకు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్న అలెక్స్ ఆనుపానులు కనిపెట్టకుండా, అతనే తన ఆశ్రమం నుంచి అమ్మాయిని తీసుకెళ్లి ఆమె కొడుక్కి తానే తండ్రినని ఛానెళ్లలో ఇంటర్వ్యూలిచ్చేంత వరకూ ఎందుకు ఊరుకున్నట్టు? అన్నవాటికి సమాధానాలు దొరకవు. అదేరీతిగా స్టీఫెన్ ‘నేనే మీవెంట వస్తాను’ అని చెప్పినా సంకెళ్లు వేసి తీసుకెళ్లడం, దానికి ఐపీసీ సెక్షన్ 376 అంటూ చెప్పడం సరికాదు. ఎందుకంటే ఆ సెక్షన్.. అమ్మాయిని బలాత్కరిస్తే ఇచ్చే శిక్ష గురించి చెబుతుంది తప్ప సంకెళ్లు వేసి తీసుకెళ్లమని చెప్పదు. అలాగే పోస్కో చట్టాన్ని సినిమాలో ప్రస్తావించారు. అదీ సరికాదు. అయితే ఇవన్నీ సన్నివేశంలో ఉత్కంఠ తీసుకొచ్చేందుకు అని మనం అనుకోవాలి. ఇక మారుటి తండ్రి, తననాసిస్తున్న సంగతి తల్లికి చెప్పకపోడానికి అతనిచ్చే మత్తుమందులే కారణమా? అని అనుకుంటే.. ‘ఈ కాలంలో ఇలాంటివి అన్నిచోట్లా దొరుకుతున్నాయి’ అన్న డైలాగ్‌ని హాస్పిటల్‌లో డాక్టర్ పాత్ర ద్వారా చెప్పించి ఆ భావనకు ప్రేక్షకుడిని రానివ్వకుండా చేశారు. ఇక స్టీఫెన్ రాందాసు కొడుకేనన్న విషయం సామాన్య ప్రేక్షకుడికీ చిత్ర గమనం ఆరంభమైన కొంతసేపటికే తెలిసినా, అది చివర్లో ఫాదర్ -స్టీఫెన్ సంవాదం ద్వారా తెలిసినట్టు చూపడం -చిత్ర నిడివి పెంచడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడలేదు. అన్నిటికీ మించి ఓ అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా.. పెద్దగా వనరులులేని వ్యక్తి చేతిలో అవలీలగా చిత్తయినట్టు చూపడం మరీ వింత. చిత్రంలో టీవీ వ్యాఖ్యాతగా చూపిన గోవర్ధన పాత్ర చిత్రణలోనూ సమగ్రత లేదు. పెర్‌ఫార్మెన్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది మోహన్‌లాల్ గురించే. ఆ పాత్రకు ప్రథమార్థంలో అంతగా ప్రాధాన్యత నివ్వకున్నా, రెండో సగం కేవలం మోహన్‌లాల్ మెస్మరిజంవల్లే ఆమాత్రమైనా నిలబడింది. కొన్ని సన్నివేశాల్లో మోహన్‌లాల్ నిగ్రహపూర్వక నటన ఆడియన్స్‌ను కట్టిపడేసింది. రాందాస్‌గా సచిన్‌ఖేద్కర్ ఇంతకుముందు ఎన్టీఆర్ మహానాయకుడిలో నాదెండ్ల భాస్కరరావు పాత్ర ద్వారా సుపరిచితుడే. పాత్రకు తగ్గట్టు నటించాడు. బాబీగా వివేక్ ఒబెరాయ్ పాత్రకు కావల్సిన మేకవనె్న పులితత్వాన్ని బాగా పండించాడు. ప్రియదర్శినిగా మంజు వారియర్‌కు నటించడానికి అంతగా పరిధిలేకపోయినా ఉన్నంతలో రాణించారు. సంభాషణల్లో చెప్పుకోతగ్గ పంచ్‌లకు పెద్దగా ప్రయత్నించలేదు. అయితే, ఒకచోట ‘రాజకీయాలూ మీడియా ఒకే ఎముకను ఇటువైపు, అటువైపు తినేస్తున్న గుంటనక్కల వంటివి’ అనడం బావులేదు. మంచిచెడ్డలు అన్ని రంగాల్లో ఉన్నట్లే, సమాజంలో అంతర్భాగాలైన అందులోనూ ఉన్నాయి. ముఖ్యంగా మీడియా ఆరకంగా కుళ్లిపోతే, ఈ సినిమాలోనే చూపినట్లు గోవర్ధన్ లాంటి ఉన్నత విలువలు గలిగినవాళ్లు ఎక్కడినుండి వస్తారో అన్నది గమనించాలి. కానీ ఇంకోచోట ‘ఈ దేశంలో చానల్సు ఎవరు ఫండింగ్‌చేస్తే వారిముందు చేతులు కట్టుకుని నిలబడతాయి’ అన్న మాటా ప్రేక్షకుణ్ణి, ఓ రకంగా బాగా ఆలోచింపచేసింది. ఈ పరిస్థితి ఎందుకు ఇలాఅయ్యిందో అన్నదాన్నీ పట్టించుకోవాలి. నా షర్ట్‌పై రక్తపు మరకలు ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘కర్షకుణ్ణికదా, కలుపుతీస్తోంటే...’ అన్న సంభాషణ బాగుంది. పాటల్లో ఓచోట, మలయాళం పాట, ఆఖర్లో హిందీ సాంగ్ పెట్టడంవల్ల ప్రేక్షకుడికి మనం ఏ భాషా చిత్రానికొచ్చామన్న సందేహమూ కలిగింది. ఈ సంగతి వదిలేస్తే పాట బాణీపరంగా ‘కదిలిరారా సోదరా...’ బావుంది. చెడుకీ, చెడుకీ మధ్య జరుగుతున్న సంఘర్షణ అన్న ఈ చిత్రంలో డైలాగులాగే ఆ సంఘర్షణని స్పష్టతాసహితంగా, తెరపై చూపించి ఉంటే ‘లూసిఫర్’ పేరుకు తగ్గట్లే నిజమైన వెలుగుని అందించే వాడేమో!

-అన్వేషి