రివ్యూ

మహా ముగింపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవెంజర్స్-ఎండ్‌గేమ్ *** బాగుంది
***
తారాగణం: రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రఫెలో, క్రిస్ ఇవాన్స్, స్కార్లెట్ జోహాన్సన్, టామ్ హోలాండ్. విన్ డీసిల్, క్రిస్‌పాట్ తదితరులు
సంగీతం: అలెన్ సిల్వస్ట్రీ
సినిమాటోగ్రఫీ: ట్రెంట్ ఆప్లాచ్
ఎడిటింగ్ జెఫ్రీ ఫోర్డ్, మాథ్యూస్
నిర్మాత: కెవిన్ ఫిజీ
దర్శకత్వం: ఆంటోనీ రుస్సో, జో రుస్సో
బ్యానర్: మార్వెల్ స్టూడియోస్
***
మంచి చెడు, ప్లస్సు మైనస్సు, అటు ఇటు, దైవం దెయ్యం -ఇలాంటి పొడి పదాలను హాలీవుడ్ ముందు పడేస్తే అద్భుతాలు తీసేయగలరు. అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నారు కూడా. అంతెందుకు సింగిల్ లైన్ స్టోరీతో మూడు గంటల మాయ చూపడం హాలీవుడ్‌కే సాధ్యం. దానికి ‘సూపర్ హీరోస్’ టాగ్ తగిలిస్తే చెప్పాల్సిన పనేలేదు. విశ్వ రక్షణకు మనిషినే ప్రతినిథిని చేసి -విశే్వతర శక్తులతో పోరాటం చేసే కథలల్లుకోవాల్సి వస్తే హాలీవుడ్ టీంకి ఎక్కడలేని ఊపొచ్చేస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని అలౌకిక ఆనందంలో ముంచితేలుస్తున్న ‘అవెంజర్స్’ కథ అలాంటిదే. తాజా ప్రాజెక్టుకి ‘ఎండ్ గేమ్’ టాగ్ తగిలించటంతో -మార్వెల్ కూడా ఊహించనంత పాపులార్టీ వచ్చేసింది. మార్వెల్ సంస్థ తెస్తున్న ‘అవెంజర్స్’ సిరీస్‌లో చివరిది ‘ఎండ్‌గేమ్’ కావడంతో -కథను ఎలా ముగించారు, సూపర్ హీరోలు ఏమయ్యారు? అన్న ప్రశ్నలకు ఆన్ స్క్రీన్ ఆన్సర్ కోసం ప్రపంచం ఆతృతగా ఎదురు చూసింది. ఆ టైంలో థియేటర్లకు వచ్చిన సినిమా -అవెంజర్స్ ఎండ్‌గేమ్.
***
విశ్వాధిపత్యం కోసం శక్తివంతమైన ఆరు ఇన్ఫినిటీ స్టోన్స్ (మణులు) సాధిస్తాడు థానోస్. అతన్ని అడ్డుకునే పోరాటంలో ‘అవెంజర్స్’ విఫలమవుతారు. కొందరు సూపర్ హీరోలు అదృశ్యమైపోతారు. ఈ సింపుల్ థాట్‌తో తెరకెక్కిన ఇన్ఫినిటీ వార్ బాక్సాఫీస్‌ను ఊపేసింది. కాసుల వర్షం కురిపించింది. ఇన్ఫినిటీ వార్‌ని ముగించిన చోటునుంచే -ఎండ్‌గేమ్‌ను మొదలెట్టి దర్శకులు ఆంటోనీ, జో రుస్సోలు మరో అద్భుతాన్ని వదిలారు. మాయమైన సూపర్ హీరోలు ముగింపు కథలోకి ఎలా వచ్చారు? విశ్వ నాశనాన్ని అడ్డుకుని థానోస్‌ను ఎలా అంతమొందించారన్నదే -ఎండ్‌గేమ్.
***
అంతరిక్షంలో చిక్కుకున్న టోనీ స్టార్క్‌ను కెప్టెన్ మార్వెల్ రక్షిస్తుంది. భూమిపైకి చేరుకుని బ్లాక్‌విడో, హల్క్, కెప్టెన్ అమెరికా, రాకెట్, థార్ బృందాన్ని కలుస్తారు. ప్రతీకారేచ్ఛతో థానోస్‌పై యుద్ధానికెళ్తారు. అప్పటికే మణుల సాయంతో సగం మానవాళిని నాశనం చేస్తాడు థానోస్. మణులను చేజిక్కించుకుని వినాశనాన్ని ఆపాలనుకుంటారు అవెంజర్స్. అయితే, వాళ్లకో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. మరెవ్వరూ వాడేందుకు అవకాశం లేకుండా మణులను నాశనం చేసేశానంటాడు థానోస్. అవెంజర్స్‌కి దిమ్మ తిరిగిపోతుంది. అలా కోపోద్రిక్తుడైన థార్, థానోస్ తల నరికేస్తాడు. ఇది జరిగిన ఐదేళ్లకు అవెంజర్స్‌కు ఓ విషయం తెలుస్తుంది. గతంలోకి ప్రయాణించి ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సాధిస్తే, నాశనమైన ప్రాణికోటిని తిరిగి బతికించొచ్చని. ఏడు బృందాలుగా విడిపోయిన అవెంజర్స్ మణులను సాధించారా? నాశమనమైన మానవాళిని రక్షించారా? తల నరికేసిన థానోస్ మళ్లీ బతికివస్తే ఎలా అంతమొందించారు? అన్న ప్రశ్నలకు భావోద్వేగ సమాధానమే -ఎండ్‌గేమ్.
గత చిత్రాల్లోని సన్నివేశాలు హీరోయిజం, కామెడీ, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కితే -ఎండ్‌గేమ్‌లో మాత్రం అనుబంధాలు, భావోద్వేగాలకు ఆస్కారమిచ్చారు దర్శకులు. అదృశ్యమైన సూపర్ హీరోలు కలవడం, థానోస్‌నుంచి ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సాధించటం, థానోస్‌ను నియంత్రించటానికి చేసే సాహసాలు.. ఇలా అన్నింటినీ భావోద్వేగ ప్రాతిపదికనే నడిపించటంతో ‘ఎండ్‌గేమ్’ సంపూర్ణమైంది. ఇన్ఫినిటీ స్టోన్స్‌ను మరెవ్వరూ వాడకుండా నాశనం చేసినట్టు థానోస్ చెప్పినప్పుడు -వాటిని సూపర్ హీరోలు ఎలా సాధించగలరన్న ప్రశ్నతో ఆడియన్స్‌లో ఉత్కంఠ రేకెత్తించారు. కాలంలోకి ప్రయాణించటం, అక్కడ ఎదురయ్యే సమస్యలు, సంభవించే సంఘటనలు అన్నీ తెలీని ఆనందాన్ని, ఉత్కంఠను రేకెత్తించాయి. ప్రేక్షకుడిపై భారం మోపకుండా -హల్క్, రాకెట్‌ల మధ్య కామెడీతో ఉపశమనాన్నీ కలిగించారు రుస్సో బ్రదర్స్. దాదాపు 3 గంటల సినిమాలో పర్ఫెక్షన్ చూస్తాం. ప్రథమార్థాన్ని స్లోనేరేషన్‌తో నడిపించటంలో దర్శకుల వ్యూహం కనిపిస్తుంది. అదృశ్యమైన సూపర్ హీరోలంతా తిరిగి ఎలా కలిశారన్న కంటెంట్‌కే ప్రథమార్ధాన్ని పరిమితం చేశారు. ద్వితీయార్థాన్ని వేగంగా క్లైమాక్స్‌వైపునకు నడిపించేందుకే -ప్రథమార్థాన్ని వ్యూహాత్మకంగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సంపాదించిన అవెంజర్స్ -్థనోస్‌ను ఎలా అంతమొందించారన్న కంటెంట్‌తో సాగే ద్వితీయార్థం ఊపిరి తీసుకోడానికి అవకాశమివ్వని తీరులో సాగింది.
ఎండ్‌గేమ్‌తో -వెండితెరపై రుస్సో బ్రదర్స్ స్టామినా కనిపించింది. ప్రాజెక్టు ప్రకటించినపుడే భారీ అంచనాలు తలెత్తడంతో -అందుకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేను నడిపించారు. ప్రతీ ఫ్రేమ్‌లో ఆడియన్స్‌కి అనుభూతిని అందిస్తూనే, ప్రతి సన్నివేశానికీ తర్వాత ఏమిటన్న ఉత్కంఠ రేకెత్తించారు. అవెంజర్స్ బృందంలో ఎవరినీ తక్కువ చేయకుండా -ప్రతి సూపర్ హీరోనూ క్లైమాక్స్‌లో భాగం చేయడం దర్శకుల పనితనానికి పరాకాష్ట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు అలెన్ సిల్వస్ట్రీ. యాక్షన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.
ఎండ్‌గేమ్‌ను హాలీవుడ్ స్టార్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రఫెలో, క్రిస్ ఇవాన్స్, స్కార్లెట్ జోహాన్సన్, టామ్ హోలాండ్, విన్ డీసిల్, క్రిస్‌పాట్, బెనిక్టిడ్ కంబర్, జోష్ బ్రోలిన్, బ్రీ లార్సన్‌లు మరింత సమర్థంగా ముగిస్తే -టెక్నీషియన్స్ కోణంలో గ్రాఫిక్స్, సెట్స్ సినిమాకు విజువల్ వండర్‌ను ఆపాదించాయి. కళ్లు చెదరే భారీ యాక్షన్‌తో క్లైమాక్స్ సాగుతున్నా -ఆడియన్స్‌ని కంటతడి పెట్టించింది. మార్వెల్ నిర్మాణ విలువలు సంస్థ ప్రతిష్టకు తగినట్టుగా ఉన్నాయి.

-మహాదేవ