రివ్యూ

మురిపించె మహాతల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ బేబీ ** ఫర్వాలేదు
**
తారాగణం: సమంత, లక్ష్మి, రావురమేష్, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, ప్రగతి, ఊర్వశి, సునయన, జగపతిబాబు, ధన్‌రాజ్, మెరుపు పాత్రలో నాగచైతన్య.
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాతలు: డి సురేష్‌బాబు, సునీత తాటి, టిజి విశ్వప్రసాద్, హావ్‌మన్ థామస్ కిమ్
దర్శకత్వం: బివి నందినిరెడ్డి
**
తాను జీవితకాలంలో.. అదీ యవ్వనంలో వున్నపుడు తీరని కోరికలు, లక్ష్యాలూ అవలేదని చింతించే ఓ స్ర్తికి ఒక్కసారిగా తన 70 ఏళ్ల వయసు నుంచి 24 ఏళ్ల ప్రాయానికి మారిపోయిన వైనాన్ని కీలక కథా సూత్రంగా మన ముందుకొచ్చిన చిత్రం ఓ బేబీ.
చిన్నతనంలోనే వివాహమైన సావిత్రి (లక్ష్మి.. ఈమెనే ఓ బేబీ అని ముద్దుగా పిలుస్తారు) ఓ బిడ్డకు తల్లి అయ్యాక, భర్త కాలం చేస్తాడు. నా అనేవాళ్లు లేక కొడుకును పెంచి పెద్ద చేస్తుంది. ఈ నిరంతర కృషిలో కాల సహజంగా వార్థక్యం వస్తుంది. దాని దరిమిలా కోడలు (ప్రగతి)ని ఇలా చేయి, అలా చేయి కాస్తంత అథార్టీ చెలాయిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితికి హడలిపోయిన కోడలికి గుండెపోటూ వస్తుంది. ఇంక నేను కోలుకోవాలంటే, అత్తగార్ని వేరే ఉంచాలన్న నియమమూ పెడుతుంది. ఈ తతంగం విన్న సావిత్రి ఇల్లొదిలి వెళ్లిపోతుంది. ఈ వెళ్లే ప్రక్రియలో ఓ ఎగ్జిబిషన్‌లోవున్న ఫొటో స్టూడియోకి వెళ్లి నన్ను అందంగా ఓ పడుచుపిల్లలా ఫోటో తీయి అంటే, అక్కడి వ్యక్తి (జగపతిబాబు) 24 ఏళ్ల పడుచుపిల్ల (సమంత)లా చేస్తాడు. తర్వాత ఏమైందన్నది మిగతా కథ. ఇది ప్రధానంగా ఒకరికి మరొకరులా అవడం అంటే పరకాయ ప్రవేశం చుట్టూ తిరిగే కథాక్రమం. అయితే ఇలా పరకాయ ప్రవేశం మ్యాటర్‌ని కొరియానుంచి (ఈ చిత్రానికి మాతృక దక్షిణ కొరియాకు చెందిన మిస్‌గ్రానీ చిత్రం) దిగుమతి చేసుకోనక్కరలేదు. ఎందుకంటే, ఇంచుమించుగా ఇలా ఒకరిలో ఒకరు చేరడమన్నది గతంలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘రావుగోపాలరావు’లో జరిగింది. ఇంకా వెనక్కివెళ్తే, జానపదబ్రహ్మ విఠలాచార్య చిత్రాల్లో అనేకం ఈ తరహా పరకాయ ప్రవేశాలు చూసేశాం. ఇక మాయాబజార్‌లో ఘటోత్కచుడు శశిరేఖగా మారడం తదితరాల సంగతి అందరికీ తెలిసిందే! అయితే దానికీ, దీనికి వున్న తేడా వాటన్నిటిలోనూ ఇలా మారిన పాత్రలన్నీ వేటికవి ప్రత్యేక ఉనికి ఉన్నవే. కాని ఇందులో సావిత్రి అనే పాత్ర ఉంది. స్వాతి (సమంత) పాత్ర సెపరేట్‌గా లేదు. సావిత్రి యవ్వన రూపమే స్వాతి. అదే ఇందులో మ్యాజిక్. ఈ మ్యాజిక్‌కి లాజిక్ అడగడం మన మ్యాడ్‌నెస్ అవుతుంది కనుక దానిజోలికి వెళ్లడం వేస్టు. కానీ వాళ్లనుసరించిన మ్యాజిక్ లాజిక్ నుంచి చూసినా కొన్ని కొన్ని కొట్టొచ్చే సంగతులు మనల్ని వెక్కిరించాయి. ఉదాహరణకు సావిత్రి (బేబి) స్వాతిగా మారిన తొలి సన్నివేశాల్లో బేబీ ఎలాగైతే కాళ్లు ఎడమపెట్టి నడిచినట్టు చూపి అనంతరం కొన్ని సన్నివేశాల్లో ఆ సంగతిని విస్మరించారు. అలాగే ఆమెకు చిన్నతనంనుంచీ పాడాలన్న తదితర అభిలాషలున్నాయి తప్ప మరొకరిపట్ల ఆకర్షితురాలవుదాం, అవడం అన్న కానె్సప్టు లేదు. కానీ స్వాతిగా మారిన బేబీ మాత్రం ఓ దశలో విక్రం (నాగశౌర్య)పట్ల అట్రాక్ట్ అవుతున్నట్టు చూపారు. కథాంతంలో అది కాదని చూపినా, ముందు సీన్స్‌లో అలా చూపడం పాత్ర ఔన్నత్యాన్ని తక్కువ చేసినట్టే. అలాగే బేబీ- చంటి (రాజేంద్రప్రసాద్) మధ్య వున్నది స్నేహం మాత్రమే తప్ప ఒకర్నొకరు వివాహం చేసుకుందామని కాదు. కానీ ఒక్కసారిగా యవ్వనం వచ్చిన బేబీని చంటి వివాహం చేసుకుందామని ప్రయత్నం చేయడం- దానికి ఓ సందర్భంలో ఆమె కూడా సమ్మతిస్తున్న ఛాయలు చూపడం, రెండు పాత్రల ఉన్నతత్వాన్ని పల్చన చేసినట్టైంది. ఇక మనవడు సిగరెట్ తాగినా, మందుకొట్టినా బెంబేలెత్తిపోయే బేబీ, స్వాతిరూపంలో విక్రంతో మద్యపానం చేస్తున్నట్టు చూపడం కూడా పాత్రకిచ్చిన లక్షణాలకు విరుద్ధంగా వుంది. అయితే ఈ విరుద్ధాల్నీ, అసంగతాల్ని త్రోసిరాజని సినిమాను చాలావరకు ఆస్వాదించగలిగేలా చేసిన సంగతి మాత్రం సమంత విశ్వరూప నట ప్రదర్శన అని చెప్పొచ్చు. సినిమాలో మొదటి ముప్ఫై ఐదు నిమిషాలు తప్ప, మిగతా భాగంలో ఆమె ఉండే చిన్న చిన్న అంశాల్ని కూడా ఆసక్తికరంగా చేసింది.
స్వాతిపై మనవడు రాఖీ (తేజ సజ్జ) మనసు పడుతున్న సంగతి వివరించే వైనంలో సమంత వారిస్తూ చూపిన హావభావాలు సింప్లీ సూపర్బ్. తాను తానుగా చేయడమన్నది ఏ నటైనా కొద్దో గొప్పో సాధన చేస్తే చేయగలరు. కానీ మనకు పూర్తి విరుద్ధమైన శైలి (70 ఏళ్లు-24 ఏళ్లు)ని ఆవహింపచేసుకుని నటించడం క్లిష్టమైన పని. ఆ క్లిష్టతను ఎంతో ఇష్టంతో అధిగమించి సమంత సక్సెస్ అయ్యింది. ఇక లక్ష్మి గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అటు ఫ్రెండ్ చంటిపై అభిమానం, కొడుకు నాని (రావురమేష్)పై ఎడతెగని ప్రేమ, అంతకుమించి ఆ పరివారంపై తనకున్న అంతులేని ఆత్మీయతనూ చిరస్మరణీయ తరహాలో లక్ష్మి బేబీ పాత్రలో నటించారు. చంటిగా రాజేంద్రప్రసాద్ తనకున్న సాటిలేని కామెడీ టైమింగ్‌తో మరోసారి తన ముద్ర వేశారు. నానిగా రావురమేష్ అటు తల్లి అనురాగాన్ని వదులుకోలేక, ఇటు కుటుంబ సభ్యుల వాదాన్ని ప్రతిఘటించలేని సంకట పరిస్థితిని ప్రతిబింబిస్తూ సహజంగా నటించాడు. విక్రం తల్లి పాత్రలో నటించిన ఐశ్వర్య గొంతు బొంగురుగా ఉండి ఇబ్బంది పెట్టింది. చివర్లో ఓల్డ్ బేబీని, యంగ్ చంటిగా నాగచైతన్య వచ్చి బైక్‌పై తీసుకెళ్లడం ఓ చిన్న బ్రేకింగ్ సీన్. సినిమాకు పెద్ద ప్రతిబంధకంగా మారినది చిత్ర నిడివి (రెండు గంటల నలభై నిమిషాలు). జునాయిడ్ సిద్ధిక్యూ (ఎడిటర్) సిజర్స్‌కి పని చెప్పి ఓ ఇరవై నిమిషాల చిత్రాన్ని తగ్గిస్తే ఇంకా బావుండేది. నస, చాదస్తం, చెప్పిందే చెప్పడం వంటి ముసలివారి లక్షణాల్ని పాజిటివ్‌గా ఎలా తీసుకోవాలో సినిమా ఫస్ట్‌సీన్‌లోనే రావురమేష్ పాత్రపరంగా చెప్పడం బావుంది. చేపల పులుసు రుచి చూడకుండానే కేవలం అది స్టౌమీదవున్న తీరుని చూసీ, అందులో బేబీ ఉప్పు ఎలా ఎక్కువ వుందో వివరించిన తీరూ సరదాగా వుంది. అనుకున్నా, అక్కున చేర్చుకున్నా, నాకది, దానికి నేను, మొలతాడుకీ, మోకాలికీ మధ్య కొవ్వు ఎక్కువైంది వీడికి, ఒకే జన్మలో ఇన్ని చూసిన నాకు సుఖం కూడా నరకంలా వుంది అన్న సంభాషణలు అలరించాయి. సందర్భానుసారంగా మంచి సామెతలూ బేబీ పాత్రపరంగా పలికించడమూ సినిమాకు వనె్న తెచ్చింది. మిక్కీ జె మేయర్ సంగీతమే కొంత నిరాశకు గురిచేసింది. ఎంత మ్యూజిక్ ట్రూప్ పాటలైనా అంతంత రణగొణధ్వనులు అనవసరం. ఉన్నంతలో అనగనగా.. పాట బావుంది. ఎంచుకున్న ఫార్మెట్‌లో ఎంపిక చేసిన నటీనటుల చక్కటి నటనతో ఓ బేబీ ఆకట్టుకున్నా, కథాక్రమంలో వాస్తవికత పాళ్లువుండివుంటే మరీ బావుండేది. సృజనాత్మకత స్వాగతించతగ్గ రీతిలోవున్న నందినీ రెడ్డి (దర్శకురాలు) తన రాబోయే చిత్రాల్లో ఈ అంశంపైనా ఫోకస్ చేస్తారని ఆశిద్దాం.

-అన్వేషి