రివ్యూ

మెడికల్ మార్షల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్షల్ ** ఫర్వాలేదు
**
తారాగణం: అభయ్ అడక, శ్రీకాంత్, మేఘా చౌదరి, రవిప్రకాష్, ప్రియదర్శినీ రామ్, పృధ్వీరాజ్, ప్రగతి, శరణ్య ప్రదీప్, సుమన్, వినోద్‌కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: స్వామి ఆర్‌ఎన్
సంగీతం: యాదగిరి వరికుప్పల
నిర్మాత: అభయ్ అడక
దర్శకత్వం: జై రాజాసింగ్
**
స్ర్తి శరీరం దేవాలయం. గర్భాశయం ఓ గర్భగుడి. ప్రాణాలు పోయగల దేవుడు సైతం తన ప్రాణాన్నీ మోసే శక్తిని స్ర్తికే ఇచ్చాడు. కానీ ఆ శక్తి కొందరికి లేకపోవడంతో వంధత్వాన్ని జయించడానికి వచ్చిన వరం సరోగసీ. అయితే ఇప్పుడు అమ్మతనం వ్యాపారమైంది. ఆ వ్యాపారాన్ని ఎంత నిక్కచ్చిగా చేయాలనే అంశాన్ని తీసుకొని పరిశోధన చేసిన డాక్టర్ కథనమే -మార్షల్.
అభి (అభయ్ అడక) సినీ హీరో శివాజీ (శ్రీకాంత్)కి వీరాభిమాని. ఒక్కసారి అతనితో సెల్ఫీ దిగాలన్న కోరికవున్నా తన నిరంతర కార్యకలాపాలతో మునిగిపోతాడు. నగరంలో కోహిమ ఆస్పత్రిలో కొత్త పద్ధతుల్లో సంతానం లేని దంపతులకు పిల్లలు పుట్టేలా ట్రీట్‌మెంట్ చేస్తున్నారని అభి అక్క (శరణ్యప్రదీప్), బావ (రవిప్రకాష్) వెళ్తారు. అక్కడ చేసిన ట్రీట్‌మెంట్లో అభి అక్క కోమాలోకి వెళ్తుంది. అనుకోకుండా అభి, తన తండ్రి (ప్రియదర్శిని రామ్)తో కలిసి కోహిమ ఆసుపత్రిలో జరుగుతున్న ఫెర్టిలిటీ సిస్టమ్‌ను గమనిస్తాడు. అక్కడంతా మోసపూరితంగా మానవ శరీరాలపై ప్రయోగాలు జరుగుతున్నాయని అర్థం చేసుకుంటారు. ఈ విషయాన్ని నలుగురికీ చెప్పాలనుకునే సమయానికి దీనికి ప్రధాన కర్త డాక్టర్, ఉరఫ్ సినీ హీరో శివాజీ అని తెలుస్తుంది. నలుగురికీ చెబితే అభిమానులు దండెత్తుతారు. అందుకని ఆధారాలతో సినీనటుడు, వైద్యుడైన శివాజీని చట్టానికి పట్టించాలని, తన సోదరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న నిశ్చయంతో అభి ప్రయత్నాలు మొదలెడతాడు. ఈ ప్రయత్నంలో చివరికి అభి గెలిచాడా? లేక వంధత్వం నుంచి స్ర్తిత్వాన్ని గట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తున్న శివాజీ గెలిచాడా? అన్నది పతాక సన్నివేశం.
రియాలిటీ షోలో భాగంగా రోడ్డు సిగ్నల్స్ వద్ద ఓ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే దాన్ని పట్టించుకోని జనం ఉదాసీనత, వైద్యం పేరుతో ఏంచేసినా అడగలేని నిస్సహాయత వున్న ప్రజల మధ్య నిజాలను నిర్భయంగా చెప్పి ఒప్పించడం కూడా సాహసమే. ఆ సాహసాన్ని ఈ చిత్రంలో దర్శకుడు సరికొత్తగానే ప్రయత్నించాడు. బ్యూటీ పిల్స్ పేరిట ఆడపిల్లలకు సరఫరా చేసిన టాబ్లెట్‌లలో నిజంగానే డ్రగ్స్ వున్నదా? అనేది తెలియకుండానే అభిని పోలీసులు అరెస్టు చేస్తారా? కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన అమ్మాయిలపై ఎటువంటి ప్రయోగాలు చేశారు? అనేది కూడా ఎక్కడా క్లారిటీలేదు. పోనీ సరోగసీ కోసం అండాలు దొంగతనం చేశారా? అంటే మెచూరిటీ లేని పిల్లల వద్ద కూడా అండాలుంటాయా? ఆ విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పలేదు. ఒకచోట మాత్రం మెచ్యూరిటీ లేని అండాలు ప్రయోగించడంవల్ల స్ర్తి గర్భాశయం తట్టుకోవడంలేదని చెబుతారు. స్క్రీన్‌పై ఇలాంటి విషయాలు చూడడానికి బాగానే ఉంటాయి కానీ ఆలోచనలోకెళితే అనేక ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఒక్కసారిగా గర్భాశయంలో అండాలన్నీ బయటికి వచ్చేస్తే ఏం జరుగుతుంది? అనేది కూడా క్లారిటీగా చెప్పలేకపోయాడు. ఇదంతా ఒక ఎత్తయితే డాక్టర్ శివాజీ కూడా సరోగసీ బేబినే అని తేల్చడం అక్కడికక్కడికే ముడిపెట్టడంలా తోస్తుంది. శివాజీని గర్భంలో పెట్టుకొని మోసింది ఓ ఫారిన్ డాక్టర్. సరోగసీకి ఒప్పుకునే మహిళలకు 50వేలకన్నా ఎక్కువ ఇవ్వరు. దానికితోడు పేదింటి మహిళలను తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తారు. అదే ప్రయోగాన్ని ఓ 30 ఏళ్ల క్రితం ఓ డాక్టర్ ఒప్పుకుంటుందా? సరే ఒప్పుకోవాలని డాక్టర్ శివాజీ తన భార్యమీదే తాను ప్రయోగం చేసిన సన్నివేశాన్ని బట్టి సరే అనవచ్చు. కానీ సరోగసీ బేబీగా పుట్టినంత మాత్రాన వారు సమాజానికి దూరంగా ఉండాలా? తప్పుచేసినట్టుగా భయపడాలా? ఈ విషయం డాక్టర్ శివాజీ పాత్రలో చెప్పడంతో ఆ పాత్రకున్న ప్రాముఖ్యత దెబ్బతింది. నేను కూడా సరోగసీ బేబీనా అని బాధలోకి వెళ్లిపోయిన శివాజీ పాత్ర సింపతీకి పనికిరాదు. దీనివల్ల ఆ పాత్రను మొదటినుంచీ తీర్చిదిద్దిన విధానం, వ్యక్తిత్వం దెబ్బతింది. గతంలో టిక్ టిక్ టిక్ చిత్రంలోనూ అందమైన ఆడవాళ్లమీద జరిగిన ప్రయోగాల కథనంతో చిత్రాన్ని వైవిధ్యంగా తీర్చిదిద్దారు. కానీ అక్కడ వజ్రాల వ్యాపారం కనిపిస్తే ఇక్కడ అండాల దొంగతనం చర్చించారు. అక్కడ క్లారిటీ వుంది, ఇక్కడ క్లారిటీ మిస్ అయింది. లైన్ బాగున్నా దాన్ని తెరపై ఆవిష్కరించడంలో మరింత కసరత్తు చేస్తే బావుండేది.
ఇక శ్రీకాంత్‌కు ఇలాంటి పాత్రలే కావాలి. తన స్టామినా, ఫేమ్ ఈ సినిమా పాత్రకోసం ఖచ్చితంగా సూటయ్యాయి. అభిగా నటించిన అభయ్‌లో కొంత మెచ్యూరిటీ వున్నా మరికొంత సాధన అవసరం. మేఘాచౌదరికి నటించే అవకాశంవున్న సన్నివేశాలు కొనే్న అయినా అందంతో ఆకట్టుకుంది. ఫ్లాష్‌బ్యాక్ కథనం చెప్పడంలో పృధ్వీరాజ్ వాయిస్ అర్థంకానివిధంగా మారింది. మాటలు సూటిగా తగిలాయి. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా బాగున్నాయి. ‘కల యిలా కళ్లముందుకు వచ్చిందా’ పాట ట్యూన్ ఆకట్టుకునేలా వుండి లొకేషన్ సరికొత్తగా కన్పించింది. ‘ఒక్క అమ్మ అయితే సరిపోదని’, ‘నా అందం చూస్తే నా ప్రాణం పూమాలై విరిసింది’, ‘ఎర్రా పిల్ల వెంటబడి వస్తే...’ పాటల బాణీలు వినేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకె. దర్శకత్వపరంగా ఓ సరికొత్త పాయింట్‌ను తీసుకుని ఎక్కడెక్కడ ముడులు వున్నాయో అవన్నీటికీ ముందే విప్పడంతో క్లైమాక్స్‌లో కథ ఆకట్టుకునేలా ఉంది. కొత్త దర్శకుడైనా సన్నివేశాలలో తీర్చిదిద్దిన విధానం, నటీనటులనుంచి ఇన్‌పుట్ తీసుకున్న పద్ధతి ఆకట్టుకుంటాయి.

-ఎస్‌ఎస్