రివ్యూ

ఆగం జేసిండు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్దలకొండ గణేష్ ** ఫర్వాలేదు
**
తారాగణం: వరుణ్‌తేజ్, పూజాహెగ్దె, అధర్వ మురళి, మృణాళిని, రవి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, రచ్చరవి, ఫిష్ వెంకట్, రాజారవీంద్ర, డింపుల్ హయత్, అన్నపూర్ణ, సుప్రియాపాఠక్, నాగినీడు, అశోక్‌కుమార్, గౌతంరాజు
సంగీతం: మిక్కీ జె మేయర్
కెమేరా: అయినాంకా బోస్
కూర్పు: ఛోటా కె ప్రసాద్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
దర్శకత్వం: హరీష్ శంకర్
**
ప్రతి నాయకుడిని ప్రధాన పాత్రగా తీసుకునో లేదా విలనే్న హీరోగా ప్రొజెక్ట్ చేసి చిత్రం తీయడమనే ప్రక్రియ సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటివరకూ అడపాదడపా తెలుగు తెరపై దర్శనమిస్తోన్న సంగతి తెలిసిందే. మరి గద్దలకొండ గణేష్ ప్రత్యేకతేమిటంటే ఇప్పటివరకూ నాయక పాత్రల్ని, అందులోనూ ఓ తరహా నాజూకు పాత్రల్ని నాణ్యమైన తీరులో పోషించిన వరుణ్ తేజ్‌ను పక్కా ఫ్యాక్షనిస్టుగా చూపడానికి ప్రయత్నించడం. ఆ ప్రయత్నం అటూ ఇటూ అవుతుందేమోనన్న చిన్నపాటి భావనతో మూల చిత్రం తమిళ జిగర్తాండలో లేని లవ్‌ట్రాక్‌ను వరుణ్‌తేజ్‌కు కల్పించడం జరిగింది. దానికితోడు మోటుగావున్నా కామెడీ కోటింగ్‌ను హరీష్‌శంకర్ స్టైల్లో ఇచ్చారు. ఇన్నిచేసినా మూడు గంటల నిడివి సినిమాలో కొన్నిచోట్ల స్పష్టంగా సాగిన అసంగతాలూ, సెకండాఫ్‌లోని స్లాగ్‌నెస్.. చిత్రం ఫర్వాలేదన్న స్థాయికి మించనివ్వలేదు.
షాట్ గ్యాప్‌లో షార్ట్ ఫిల్మ్ తీస్తూ దర్శకుడి కోపానికి బలైన అభిలాష్ (అధర్వ మురళి), అనంతరం తనకొచ్చిన పెద్దతెర చిత్ర దర్శక అవకాశాన్ని వైవిధ్యవంతంగా మలచాలనుకుంటాడు. ఓ గ్యాంగ్‌స్టర్ జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నంలో గద్దలకొండ వస్తాడు. అక్కడ తారసపడిన గ్యాంగ్‌స్టర్ గణేష్ బయోపిక్ తీద్దామని ఫిక్సవుతాడు. అలా ఆత్మకథ మలచడంలో అతనెదుర్కొన్న చిక్కులు, గణేష్ అంతరంగం సంగతులూ, అతను మారిన విధానంతో చిత్రం సుదీర్ఘపయనం సాగిస్తుంది. కానీ చూపే పోకడలో కనిపించిన అపసవ్యాల్ని డైరెక్టర్ ఖాతరు చేయలేదు.
ఓ బజారులో నడిరోడ్డుపై ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని చంపేస్తే, అది చూసిన తల్లి మూగదన్న కారణంగా సాక్ష్యం చెప్పలేనంత మాత్రాన గణేష్ తప్పించుకోడమన్నది న్యాయవ్యవస్థ పనితీరుపై ఏమాత్రం అవగాహన లేకుండా తీసినదనిపించింది. పోనీ తాను తప్పించుకోడానికి గణేష్, తన తల్లిని మూగదని చెప్పినా ఆమెతోపాటు ఆ సంఘటన చూసిన వాళ్లనేకులున్నారు. వాళ్లను తప్పనిసరిగా కోర్టులో ఎవిడెన్సులుగా ప్రొడ్యూస్ చెయ్యొచ్చు. ఇలాంటి వాటిపై హరీష్ శంకర్ ఫోకస్సే చెయ్యలేదు.
అలాగే చిత్ర ఆరంభంలో సినిమా అన్నది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప, మెసేజిలివ్వడానికి కాదు. ఆటెన్‌బరో గాంధీ చూసి ఎంతమంది గాంధీలుగా మారారు? ‘్భరతీయుడు’, ‘్ఠగూర్’ చిత్రాలు చూసినా ఎంతమంది లంచం తీసుకోడం మానేశారు? అని అభిలాష్‌తో చెప్పిస్తారు. తిరిగి పతాక సన్నివేశం వచ్చేటప్పటికి కరకు రాతి గణేష్, సినిమా చూసి తనపై ఆత్మీయతను కురిపించిన తుపాకీ రాజు కూతురు, ఎంతోకాలం మాటవున్నా మూగగా బ్రతికిన అతని తల్లి (సుప్రియాపాఠక్) మాట్లాడటం చూసి మారిపోయిన సంగతినీ చూపారు. ఇవి పరస్పర విరుద్ధ్భావనలు. వాస్తవానికి సినిమాలోనే మరోచోట చెప్పినట్టు సినిమా మాధ్యమం ప్రభావం సమాజంపై అపారం. కాలాలుమారి సినిమా రూపంమారినా దృశ్యమాధ్యమం విలువ ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఎవరు ఏయే మాధ్యమాల్లో ఉన్నా అత్యధిక శాతం దృశ్య మాధ్యమంవైపే మొగ్గుచూపేది. ఒకసారి రౌడీషీట్ తెరిచిన తర్వాత అతను జైలునుంచి వచ్చేసినా, వారి కదలికలపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది. వారి సరళిపై నియమిత కాలంలో రిపోర్టులు పై అధికారులకీ పంపాల్సి ఉంటుంది. ఇన్ని బంధనాల్లో ఉండే గణేష్‌లాంటి రౌడీషీటర్, ఈ చిత్రంలో సాగిన ‘హవా’లాంటిది సాధ్యపడదు. అది 1982లోనైనా, మరెప్పుడైనా. ఇక సినిమాలో ప్రతీ చిన్న పాయింట్‌కీ సుదీర్ఘ వివరణ సన్నివేశాలు చిత్రంపై ఆసక్తి సన్నగిల్లేలా చేశాయి. గణేష్ గ్రూపులోవున్న బలి (ప్రభాస్ శ్రీను)నుంచి వివరాలు రాబట్టడానికి అతనికుండే అసభ్య చిత్రాల వీక్షణ తదితరాలూ లాంటివి ఇందుకుదాహరణగా చెప్పచ్చు. సినిమా యాక్టింగ్ ట్రైనింగ్ పేరిట మునిమాణిక్యం.. (బ్రహ్మాజీ)తో నడిపించిన సన్నివేశాలూ కుదిస్తే బావుండేది. అంతకుబదులుగా అంతటి ఠఫ్ నేచర్డ్ గణేష్, సినిమా ప్రపోజల్‌కు వెంటనే పడిపోయినట్లుగాకాక కొంత ప్రాతిపదికతో కూడిన సన్నివేశాలకు అవకాశం కల్గిస్తే బావుండేది. ఇలా చూపకపోవడంవల్ల సినిమాకు ప్రాణమైన ఎమోషన్స్ కొన్ని మిస్సయ్యాయి. గతం వర్తమాన సన్నివేశాలు చూపడంలోనూ కొంత గందరగోళమేర్పడింది. దానిపై క్లారిటీ ఇస్తే బావుండేది. వరుణ్‌తేజ్ విశ్వరూపానికీ చిత్రం రూటేసింది అని చెప్పచ్చు. వీలైనంతవరకూ పాత్రకు న్యాయం చెయ్యడానికి ఆయన ప్రయత్నించారు. అయితే గణేష్ పాత్రలో పలికిన తెలంగాణ యాస కొన్నిచోట్ల కృతకంగా ఉంది. దానిపై ఇంకాస్త సాధన చెయ్యాల్సిన అవసరం కన్పడింది. ఒకచోట ‘మోకా’ (అవకాశం) అన్న పదాన్ని ‘మేకా’ అని పల్కారు. కొన్నిచోట్ల యాసనే వదిలేశారు. చాన్నాళ్ల తర్వాత తల్లి గొంతు విన్న సందర్భంలో వరుణ్ చూపిన భావోద్వేగం సీను బాగా పండింది. 1982లో వచ్చిన ‘దేవత’ చిత్రంలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’... పాటకు శోభన్‌లా వరుణ్ అభినయించిన తీరు బావున్నా, అందులో నటుడు చిరంజీవి తాలూకు ముఖ కవళికలు ఎక్కువ కనిపించాయి. అది అతని తప్పుకాదు. ఇన్‌బిల్ట్‌గా వరుణ్‌లోని జీన్స్ సహజ లక్షణాలు. ఈ పాటలోనే కాకుండా, చాలాచోట్ల ఎయిటీ, నైంటీస్‌లోని చిరంజీవి వేరియేషన్స్ చాలా వరుణ్‌లో ఇందులో కన్పడ్డాయి. ఇదే పాటలో పూజాహెగ్డే దాదాపు శ్రీదేవి స్థాయిలోనే నటించింది. పూజ పాత్ర పరిధి తక్కువైనా ఉన్నంతలో ఉనికి చూపింది. అభిగా అధర్వ బాగా నటించినా, అతనికిచ్చిన డబ్బింగ్ వాయిస్ సరిగా మ్యాచ్‌కాలేదు. బుజ్జమ్మగా మృణాళినీ రవి ముద్దుగా నటించింది. చింతపండు మల్లికార్జున్‌గా సత్యకీచిత్రం పెద్ద బ్రేకు. ‘నువ్వే సెకండ్ హీరో’ అన్నప్పుడు అతను చూపిన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. ప్రభాస్‌శ్రీను, రచ్చరవి, ఫిష్ వెంకట్ తదితర కామెడీ బ్యాచ్‌లో తుపాకీరాజు పాత్రధారి నటనకు బాగా రెస్పాన్స్ వచ్చింది. కానీ అతను నటుడు వేణుమాధవ్‌ని అనుకరించడం మానేయాలి. ‘జరాజరా’ పాటలో శక్తివంచన లేకుండా డింపుల్ హయత్ స్కిన్‌షో చేసినా, ఆ పాట కొరియోగ్రఫీ బావుంది. పాట ట్యూన్ కూడా బావుంది. పాటలోని మాటల్లో గణేష్ పాత్రధారినుద్దేశించి, ‘సూపర్‌హిట్టూ నీ హైటూ’, సూపర్‌హిట్టూ మీసంకట్టూ, బొమ్మే హిట్టూ’ అన్నవి బావున్నాయి. అలాగే ఇంకోచోట ‘గుడుగుడు గుంచం చుట్టూ గలాటలోనే మంచిచెడ్డా మూలకు నెట్టేయి’ అన్న పదప్రయోగం తమాషాగా వుంది. అనురాగ్ కులకర్ణి, ఉమానేహా పాట పాడిన విధానమూ బావుంది. గగనవీధిలో ఘననిశీధిలో పాటనుకూడా మిక్కీజెమేయర్ బాగా కంపోజ్ చేశారు. సినిమాలో ఓ పాటలో ‘నీ దమ్మే నీకున్నా బందోబస్త్’ అన్న మాట ఒకటుంది. అది సరిగ్గా ఈ చిత్ర మాటలు-మార్పులు- దర్శకత్వ విభాగాలకు కర్త అయిన హరీష్ శంకర్‌కు వర్తిస్తుంది. రీమేక్‌లోనూ అనుకూల మార్పులు (అనుకోకుండా ఆఖరిక్షణంలో చిత్రం పేరులో మార్పులూ వచ్చాయి) చేసే తన పంధాలో తాను ఈ చిత్రాన్ని మలిచారు. హరీష్ గత చిత్రం ‘గబ్బర్‌సింగ్’లో అంత్యాక్షరి పెడితే ఇందులో చిత్రలహరి పేరిట పాత పాటల్ని వినే అవకాశం కల్పించారు. అదేవిధంగా మాటల్లో తనదైన శైలినీ కనపర్చారు. దాపూద్ ఇబ్రహీం దగ్గరుంచి దారిన పొయ్యే దానయ్య వరకూ అందర్నీ ఈయన టచ్ చేసేశారు. సినిమామీదున్న ధ్యాస ఎలాగైతే పోదో వివరిస్తూ ‘ఎంచుకున్న పనినుంచి వేరే పనిలోకి వెళితే కాంప్రమైజ్, అందులోనే వుండిచేస్తే ఎడ్జస్ట్‌మెంట్’ అంటూ తనికెళ్ల భరణి పాత్రచేత పలికించిన మాటలూ గుండెను హత్తుకున్నాయి. ‘బతికున్నంత కాలం మనమంటే భయపడినవాళ్లు, మన చావుని కోరుకుంటారు తప్ప మనం బతకాలని కోరుకోరు’ అన్న వాక్యమూ అర్ధవంతంగా ఉంది. అయితే ప్రభాస్‌శ్రీను పాత్ర ద్వారా ‘ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్’ అంటూ కాల్‌గరల్స్ ఎదుట చెప్పించిన డైలాగ్, ప్రభాకర్ పాత్ర చేసే శృంగార సన్నివేశంలో అక్కడున్న స్ర్తిపాత్ర ద్వారా ‘పీక్‌లో వెళ్లిపోతావేమిటి?’ అన్న మాటలూ తొలగించినా చిత్రానికొచ్చిన నష్టమేం లేదు. ‘ఎక్కువ ఆగం చేసేవాడు, ఏనాడో ఒకనాడు ఆగమైపోతాడు’ అన్న డైలాగూ బాగా పేలింది. అయినాంకా బోస్ కెమెరా ఆర్టిస్టులను బాగా ప్రెజంట్ చేసింది. ప్రత్యేకించి వరుణ్‌తేజ్ పాత్ర ఎలివేట్ అవడానికి బోస్ కెమెరా బాగా సహకరించింది. అన్నట్లు చిత్రం మొత్తంలో దాదాపు ప్రతి ఫ్రేములోనూ ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అన్న టైటిల్‌కార్డు కొనసాగింది. దాంతోపాటు ఒకచోట ‘ర్యాగింగ్ ఈజ్ పనిష్‌బుల్ అఫెన్స్’ అన్న క్యాప్షనూ కన్పడింది. ఏతావాతా పరిశీలిస్తే ఛోటా కె ప్రసాద్ (ఎడిటర్) కత్తెరకు ఓ ముప్ఫై నిమిషాలు పనిపెట్టి ఉంటే సినిమా ఇంకా పకడ్బందీగా ఉండేది. చిత్రం విడుదలకు ముందస్తు చేసే ప్రచారంలో భాగంగా చిత్ర నాయకుడు వరుణ్‌తేజ్ చెప్తూ సినిమాలో చూపే అంశం బావుంటే పెద్దవ్యవధి సినిమాలైనా ప్రేక్షకులు ఓకే అంటారన్నారు. అయితే చూపే కంటెంట్ ఎంతబావున్నా దాని సారం డైల్యూట్ అవకుండా ఉండాలంటే బ్రిలిటీ (క్లుప్తత) ఎంతో అవసరం. ఇది గ్రహిస్తే బావుంటుంది.

-అన్వేషి