రివ్యూ

ఔరా! చిరంజీవ!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరా *** బాగుంది
***
తారాగణం: చిరంజీవి, అమితాభ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, రవికిషన్, నిహారిక, బ్రహ్మాజీ, రఘుబాబు, మాథ్యూస్టిర్లింగ్ తదితరులు
కథ: పరుచూరి బ్రదర్స్
సంగీతం: అమిత్‌త్రివేదీ
నేపథ్య సంగీతం: జూలియస్ ఫ్యాకియం
ఎడిటర్: ఏ శ్రీకర్‌ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు
నిర్మాత: రామ్‌చరణ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
***
సినిమాను సినిమాలాగే చూడాలి -అంటున్నాయి న్యాయస్థానాలు.
ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కాదు -అంటూ ముక్తాయింపు ఇచ్చేశాడు దర్శకుడు సురేందర్‌రెడ్డి.
గొప్ప యోధుడి కథకు కాల్పానిక భావుకతే తప్ప... భాష, వేషం, కాలమానంలాంటి వేటితోనూ యథార్థ పోలికల్లేవు -అంటూ ప్రారంభానికి ముందే స్క్రీన్‌మీద నోట్ పడేసింది చిత్రబృందం. ఇవి చాలు -సినిమా ఫ్రేమ్‌ను అతిక్రమించి చారిత్రక కోణంలో సైరాను సమీక్షించకూడదన్న సృహకు రావడానికి.
**
బాలమిత్ర కథను బాహుబలిని చేసిన అనుభవం తెలుగు సినిమాది. ఊహా పాత్రలకు ఊహించలేనంత స్కేల్‌ఫిక్స్ చేసి -కమర్షియల్ కోటింగ్ ఎలా ఇవ్వొచ్చో కళ్లకుకట్టి చూపించాడు రాజవౌళి. అలాంటి చిత్రాలు తీయాలనుకున్న దర్శకులకు ఒకవిధంగా ఇప్పుడతను మెంటార్.
కల్పిత కథలనే లార్జన్ దేన్ స్కేల్‌గా చూపించగలిగినప్పుడు -చరిత్రలో కొన్ని పేజీల పౌరుషాన్ని ప్రోదిచేసుకున్న పాలెగాడు కథా వస్తువైతే.. ఇంకెంత చెలరేగిపోవచ్చో కంటిముందుకు తెచ్చాడు దర్శకుడు సురేందర్‌రెడ్డి. అదే -సైరా. బ్రిటీషర్లపై కనె్నర్ర చేసిన పౌరుష పాత్రధారి చిరంజీవి కావడం, బాహుబలి బ్లూప్రింట్ కళ్లముందుండటం.. ఈ రెండూ కలిసొచ్చిన విషయాలు.
భరతమాతకు బానిస సంకెళ్లు వేసిన బ్రిటీష్ ముష్కరులపై కత్తిదూసిన రేనాటి సూరీడు నరసింహారెడ్డి. ఇదే కథ. ఇదిచాలు -కావాల్సినంత హీరోయిజం మండించటానికి. ఇదే చాలు -ఆడియన్స్‌ని థియేటర్లకు తీసుకొచ్చేంత కమర్షియల్ పేట్రియాటిక్‌ని వండించటానికి. ఈ రెండూ సరిగ్గా పండాలంటే మాత్రం -చిరంజీవిలాంటి హీరోవుండాలి. అందుకే -పదేళ్ల క్రితంనాటి స్క్రిప్ట్.. చిరు రీఎంట్రీ వరకూ షెల్ఫ్‌లోనే ఉండిపోయింది. చిరంజీవి యస్ అనగానే -కోటద్వారాలు బద్దలుకొట్టుకుని నరసింహారెడ్డి కదిలాడు. తెరమీద కదంతొక్కాడు. తెలుగు సినిమా స్థాయి, హోదా, పెట్టుబడికి బాహుబలి వేసిన బాటలోనే -బ్రిటీషర్లను తమిరికొట్టే తిరుగుబాటుకు ఊపిరిపోశాడు.
పెద్ద బాలశిక్ష చేతిలోవుంటే -తెలుగక్షరాలు తిప్పిరాయడం కష్టమైన పనేం కాదు. పాన్ ఇండియా సినిమాలకు టాలీవుడ్ ఎప్పుడో డోర్లు తెరిచింది కనుక -ఆ ఫార్మాట్‌లోనే సురేందర్ రెడ్డి సులువుగానే ‘సైరా’ చేసేశాడు. మేకర్‌గా ఫ్రూవ్డ్ కనుక, సైరాతో స్కేల్‌ని పెంచుకున్నాడంతే. అందుకే -్భరించిన బడ్జెట్ మొత్తం స్క్రీన్‌పై కనిపించింది.
ఇక ‘సైరా’కు సంపూర్ణ బలం -చిరంజీవి. ఉయ్యాలవాడ పాత్రలో కనిపించాలన్నది పదేళ్లనాటి కల. తరుణమాసన్నమైంది కనుక -వయోభారాన్ని మర్చిపోయాడు. నరాల్లోని శక్తి కూడగట్టి.. 150 సినిమాల నటనానుభవాన్ని రంగరించి.. -ఉయ్యాలవాడ ఇప్పుడుంటే ఇలాగే ఉంటాడేమోనన్నంతగా చెలరేగిపోయాడు. అరవైయేళ్ల సంపూర్ణ జీవితం తరువాత -‘పునరుజ్జీవ చిరంజీవ’ అన్నంతగా కనిపించి.. ఒప్పించి.. మెప్పించటం కృషికొద్దీ సాధ్యమైనదే.
చారిత్రక వీరుడిని స్క్రీన్‌పై చూస్తామన్న గొప్ప ఫీలింగ్‌తో థియేటర్‌లోకి అడుగుపెట్టిన ఆడియన్స్‌కి.. నరసింహారెడ్డి ‘కమర్షియల్ లవ్’ కంట్లో నలుసనిపించినా -పాలెగాడి పౌరుష కథ మొదలయ్యాక చిరంజీవి చెలరేగిపోయాడు. ‘ఎందుకు కట్టాలిరా శిస్తు..’ అని బ్రిటీషర్లను నిగ్గదీసే చాప్టర్ మొదలైనపుడు -ఒకప్పటి యన్టీఆర్ ఇప్పుడు చిరంజీవిలా మారి డైలాగ్ చెప్తున్నట్టే అనిపిస్తుంది. ‘దేశం విడిచి వెళ్లిపోండి’ అంటూ రెబలిజం చాప్టర్‌ని పీక్స్‌కి చేర్చేసరికి -చిరంజీవి తనను తను మర్చిపోయాడనే అనిపిస్తుంది. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ -చిరు కంట్లో కనిపించిన ఎర్రని జీర.. ఖైదీ సినిమానాటి స్టామినాను గుర్తుచేసింది.
సీమ గడ్డమీద -ఉయ్యాలవాడ చరిత్ర భిన్నమైన కథలుగా వినిపిస్తుంది. అతని పౌరుష గొప్పతనం పాటల్లోనూ వినిపిస్తుంటుంది. మొత్తం సారాంశం మాత్రం -బ్రిటీషర్లపై కత్తి దూసాడన్నదే కథ. ఈ సింగల్ లైన్ మెటీరియల్‌ను సినిమాటిక్ కథగా తయారు చేయటంలో కాల్పానికత ఎక్కువైందన్న విషయం స్క్రీన్‌పై కనిపించింది. వాస్తవ ఘట్టాలకు ఇది యథాతథం కాదు అన్న మన్నింపు విజ్ఞప్తి ముందే పడింది కనుక -చిరంజీవి సినిమాగానే దీన్ని చూడాలి. ఆ కోణంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రస్తావన వచ్చిన ప్రతిచోటా -చిరంజీవి స్క్రీన్ రూపాన్ని మస్తిష్కంపై ఆవిష్కరించుకోక తప్పదు. చరిత్రకు దూరంగా ఉండేవాళ్లంతా -ఇదే అసలు కథని నమ్మించగలదు సైరా.
కమర్షియల్ సినిమా.. అందులోనూ చిరంజీవి హీరో కనుక -సినిమాటిక్ లిబర్టీ శ్రృతిమించిపోయింది. పాలెగాళ్లే రాజులన్నట్టు.. జానపద కథేదో కళ్లముందు సాగుతుందన్న భ్రమకు కొన్ని సన్నివేశాలు దగ్గర చేశాయి. హీరోయిజం.. మాస్ అట్రాక్షన్.. లవ్ ట్రాక్.. యాక్షన్ ఎపిసోడ్స్.. కొంత ఓవర్ అనడానికి సందేహించాల్సిన పని లేదు. క్లైమాక్స్ సన్నివేశాలైతే -కురుక్షేత్ర సంగ్రామమేదో చూస్తున్నామా? బాహుబలి కంటిన్యుటీ సీన్లు చూపిస్తున్నారా? అన్నంతగా ఉన్నాయి. ఓ పాలెగాడి కథను చూస్తున్న భావనకు ఇక్కడే దూరమవుతాం.
బహుభాషా చిత్రం కనుక, కమర్షియల్ అప్పీల్ కోసమే -పరభాషా భారీ తారగణానికి సినిమాలో చొటిచ్చారన్న విషయం అర్థమవుతోంది. నరసింహారెడ్డి హీరోయిజాన్ని పెంచే మెలోడ్రామా కోసం -బ్రిటీష్ దురాగతాలను అతిగా చూపించినా -కథను రక్తికట్టించేందుకు ఉపయోగపడ్డాయి. పిడికెడు అన్నం తీసుకున్న పిల్లాడిని బ్రిటీష్ ఆఫీసర్ నిప్పుల్లో విసిరేయడం.. సామూహిక పెళ్లిళ్ల సమయంలో.. తొలిరాత్రి తనతోనే జరగలని కండిషన్ పెట్టడంలాంటి సన్నివేశాలు.. నరసింహారెడ్డి విశ్వరూపం చూపించేందుకు పనికొచ్చాయి. గోసాయి వెంకన్నగా అమితాభ్, లక్ష్మీగా తమన్నా, సిద్దమ్మగా నయనతార, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి పాత్రల్ని ఎలివేట్ చేసిన విధానం బ్యాలెన్స్‌డ్‌గా కుదరటంతో -సైరానుంచి ఎక్కడా డీవియేట్ కాము, కాలేం.
కథని మొదలెట్టిన విధానంలోనే -స్క్రీన్‌ప్లే చమక్కు చూపించాడు దర్శకుడు. సిపాయి తిరుగుబాటు నుంచి కథను ఎత్తుకుని.. ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రను ఇంట్రొడ్యూస్ చేస్తూ.. ఆమెతో ‘సైరా నరసింహారెడ్డి’ కథను చెప్పించిన టెక్నిక్ సినిమాలో వర్కౌటైంది. ఆ మూడ్‌నుంచే సినిమా చూడటం మొదలెడతాం కనుక -సైరా పేట్రియాటిక్ మూడ్‌లోనే చివరి వరకూ ట్రావెలవుతాం. సినిమా ముగింపులోనూ ఫీల్ మిస్సవకుండా -దేశానికి స్వాతంత్య్ర తెచ్చిన మహనీయుల క్లిప్సింగ్స్ చూపిస్తూ శుభంకార్డు వేయడం పర్ఫెక్ట్ ల్యాండింగ్.
టెక్నికల్‌గా -సైరా టైటిల్ ట్రాక్ వినా సంగీతం నిరాశపర్చింది. నేపథ్య సంగీతం సినిమాకి హైప్ తేలేకపోయింది. కీలక ఎమోషనల్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్లాటైపోయింది. నరసింహారెడ్డి వాస్తవ కథకు దూరంగావున్నా -సంభాషణల్లో సాయిమాధవ్ షార్ప్‌నెస్ వినిపిస్తుంది. సినిమాకు రత్నవేలు ఛాయాగ్రహణం బిగ్ అస్సెట్. సీన్‌పరంగా మూడ్‌ని ఎలివేట్ చేయగల కలరింగ్ ఫెంటాస్టిక్‌గా వర్కౌటైంది. కళా దర్శకత్వం ఆ కాలపు వాతావరణాన్ని ప్రతిబింబించింది. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ -సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది వీఎఫ్‌ఎక్స్. నిర్మాత రామ్‌చరణ్ సాహసానికి సైరా నిలువెత్తు పతాక. మొత్తంగా సైరా అద్భుతం అనలేంగానీ, ఎక్కడా నిరాశపర్చలేదని గట్టిగా చెప్పొచ్చు.

-మహాదేవ