రివ్యూ

శృంగారభరిత ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్డీఎక్స్ లవ్ * బాగోలేదు
*
తారాగణం: పాయల్ రాజ్‌పుత్, తేజుస్ కంచర్ల, సీనియర్ నరేష్, ఆదిత్యమీనన్, ముమైత్‌ఖాన్, తులసి, ఆమని, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు
సంగీతం: రథన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్
నిర్మాత: సి కల్యాణ్
బ్యానర్: హ్యాపీ మూవీస్, సికె సినిమాస్
కథ, కథనం, దర్శకత్వం: శంకర్ భాను
*
కాలమానమేదైనా -కథాబీజం గొప్పది కనుక మహావృక్షాన్ని ఆశించటంలో తప్పులేదు. కాకపోతే -ఆలోచనలు పక్కదారిపట్టి.. కమర్షియల్ కోణంలో ‘వల్గారిటీ’ని ముడిసరుకు చేయటంతో ఆదర్శం ఆవిరై.. శృంగారం శృతిమీరింది. ‘హీరోయినిజం’ కథలో అసలు లక్ష్యానికి అందాల దొంతర్లు అడ్డుపడటంతో.. ‘అదోలాంటి’ సినిమాల స్థాయికి ఆర్డీఎక్స్ లవ్ దిగిపోయింది.
కథ: గోదావరి అంచున విసిరేసినట్టుండే కుగ్రామం -చంద్రన్న పేట. కనీస అవసరాల కోసం రెండొందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఊరి జనానిది. నాలుగు కిలోమీటర్ల వంతెన నిర్మిస్తే -నది చుట్టూ తిరిగొచ్చే దూరాభారం తగ్గి ఊరు బాగుపడుతుందన్న ఆశ వాళ్లది. సీఎం బాపినీడు (నాగినీడు)కు మొరపెట్టుకున్నా ఫలితముండదు. పసితనం నుంచే సమస్యను చూస్తూ పెద్దదైన అలివేలు (పాయర్ రాజ్‌పుత్).. -ఊరు బాగుపడే ‘మార్గాన్ని’ అనే్వషిస్తుంటుంది. ఈ టైంలో అలివేలు అందాలకు పడిపోయిన గొప్పింటి కుర్రాడు సిద్ధూ (తేజస్) ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. ఈ విషయం నచ్చని సిద్ధూ తండ్రి గిరిప్రకాశ్ నారాయణ్ (ఆదిత్యమీనన్) -అలివేలును టార్గెట్ చేస్తాడు. ఎవరి లక్ష్యాలు ఎమయ్యాయన్నది -మిగతా కథ.
ఆదర్శాన్ని ఆధునికంగా చెప్పివుంటే -ఆర్డీఎక్స్ కథ మరోలా ఉండేది. అమ్ముకోదగ్గ శృంగారంగా చెప్పే ప్రయత్నం చేయటం పూర్తిగా బెడిసికొట్టింది. పల్లెలు, పురోభివృద్ధిలాంటి ఉదాత్తత మాటున -అమలిన శృంగారాన్ని చూపే ప్రయత్నం జరిగింది. ఇదోక రొమాంటిక్ లవ్ స్టోరీ అన్న నిజాయితీ చూపించినా.. ఆసక్తికలిగిన వర్గం ఆదరణకు నోచుకుని ఉండేది. నమ్మించడానికి ఒకటి.. అమ్ముకోడానికి మరొకటి అన్నట్టు -ఆదర్శం, శృంగారమనే సమాంతర రేఖల్ని కలిపే దర్శకుడి ప్రయత్నం మాత్రం విఫలమైంది.
‘నాకు తెలీకుండా ఫిగర్‌ని తెచ్చుకుంటార్రా. ఇప్పటికే నాలుగైదుసార్లు తెచ్చుకున్నారు’ అన్న డైలాగ్‌తో హీరో.. సేఫ్టీలు పట్టుకుని సేఫ్ సెక్స్‌ని ప్రభోదిస్తూ, సోషల్ సర్వీస్‌లో స్థితిని మర్చిపోయే సంఘ సేవికగా హీరోయిన్‌ను ఇంట్రొడ్యూస్ చేసినపుడే -కథలోని ఆదర్శం కంచికెళ్లింది. (ఆదర్శాలు వల్లెవేస్తే వినేవాళ్లెవరూ లేరన్న పిచ్చి భ్రమ ఇండస్ట్రీలో పాతుకుపోవడం.. శృంగారాన్ని స్క్రీన్‌కెక్కిస్తే ఎగబడి చూసేస్తారన్న వెర్రి బలపడటం.. ఈ రెండూ ఇలాంటి సినిమాలకు పురుడు పొస్తుండొచ్చు).
అలివేలుతో పరిచయం కోసం అర్థరాత్రి హాస్టల్‌కెళ్లి హీరో -సేఫ్టీలడగటం.. అడిగిందే తడవు ఇచ్చేస్తానన్నట్టు హీరోయిన్ బైక్‌పై హీరోని ఎక్కించుకుని బాస్ దగ్గరికి తీసుకెళ్లి సేఫ్టీలు ఇప్పించటం.. పైగా అతని గాళ్‌ఫ్రెండ్‌కీ ‘సేఫ్ సెక్స్’ సూచనలతో కండోమ్స్ ఇవ్వడంలాంటి సాగదీత ఎపిసోడ్ కళ్లారా చూశాక -పోనీ రొమాంటిక్ స్టోరీకైనా దర్శకుడు తెరలేపాడేమో అనుకుంటాం. కాకపోతే అక్కడా భంగపడతాం. సో, నీతి- బూతు మధ్య ప్రేక్షకుడిని నలిపేస్తూ రాసుకున్న సన్నివేశాలను జీర్ణించుకోలేక, అసహనాన్ని ఎవరిమీద వ్యక్తం చేయాలో అర్థంకాక స్క్రీన్‌కి కళ్లప్పగించి కూర్చోవడే చేయగలిగేది. కమర్షియాలిటీ కోసం -అలివేలు పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీస్తూ రాసుకున్న సన్నివేశాలు పూర్తి ఇబ్బందికరం. ‘నేను హీరోని కాదు, ఆర్టిస్టుని మాత్రమే’నంటూ ప్రమోషన్స్ టైంలో తేజుస్ ఎందుకు చెప్పాడో, సినిమాలో సిద్ధూ పాత్ర చూశాక పూర్తిగా అర్థమవుతుంది. హీరోయినిజం సినిమా కనుక -హీరో అలాగే ఉంటాడులే అని సరిపెట్టుకోవాలంతే. ఆమనిలాంటి సీనియర్ ఆర్టిస్టువున్నా, కీలక సన్నివేశంలో ఆమె చెప్పే నాలుగు డైలాగులూ ఆడియన్స్‌ని మెప్పించవు. పైగా వంతెన కోసం సీతారాముల విగ్రహాలను వేరు చేసే సన్నివేశం -ఎమోషనల్‌గా ఆడియన్స్‌ని డిస్ట్రర్బ్ చేసింది. హాస్టల్ గే వార్డెన్‌గా చమ్మక్ చంద్ర, లేడీ కానిస్టేబుల్ విద్యుల్లేఖ కామెడీ పేలలేదు. ప్రతినాయక పాత్రలో ఆదిత్యమీనన్, పోలీస్ ఆఫీసర్‌గా ముమైత్‌ఖాన్ ఓవరాక్షన్‌తో విసిగించారు. పాయల్ తల్లిగా తులసి కనిపించింది కొద్దిసేపే అయినా -తన మార్క్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. సీనియర్ నరేశ్, నాగినీడు పాత్రలకు ప్రాధాన్యత కనిపించదు. ఇక ప్రధాన సినిమా ముడి సరుకు -పాయల్ రాజ్‌పుత్ గ్లామర్. ఎక్స్‌పోజింగే తన ప్రధాన కర్తవ్యమన్నట్టు -అలివేలు పాత్రలో అదరగొట్టేసింది. ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్‌లో గట్టుతెగిన గోదావరినేనన్న భావన కలిగించింది. హీరోయిన్ స్నేహితురాళ్లు సంభాషణల గురించి చెప్పుకోకపోవడమే మంచిది.
రథన్ బాణీల్లో.. ‘ఓరబ్మీ కొంగేజారిందంటే’, ‘నీ నఖ శిఖలే’ పరవాలేదనిపిస్తాయి. రామ్‌ప్రసాద్ ఫొటోగ్రఫీ మొత్తం పాయల్‌పైనే ఫోకస్ చేసి -అందంగా చూపించగలిగాడు. ‘నీ నఖ శిఖలే’ పాట అందుకు ఎగ్జాంపుల్. రొమాంటిక్ సీన్స్, రెయిన్ ఎఫెక్ట్‌లోని ఎమోషనల్ సీన్ చిత్రీకరణలో సినిమాటోగ్రఫీ పనితనం కనిపిస్తుంది. ప్రవీణ్‌పూరి ఎడిటింగ్ వెరీ పూర్. సాహసించి చాలా సన్నివేశాలకు కోత వేసివుంటే -సినిమాకు అర్థం, పరమార్థం దక్కివుండేది. శృతిమించిన రొమాన్ కనుక -్ఫ్యమిలీ ఆడియన్స్‌కి ఎక్కదు. రొమాన్స్‌ను ఆశించే యూత్‌కి -కనెక్ట్‌కాని ఆదర్శం పంటికింద రాయి అవుతుంది. అట్టుకీ ముక్కకీ చెడిందని చెప్పడానికి -అనవసర సన్నివేశాలు ఎలానూ ఉన్నాయి. ఇదీ సినిమా -అనే విషయంలో స్పష్టత లేకపోవడం.. ఏం సినిమా? అనే సందేహానికి ప్రాణం పోసినట్టయ్యింది.

-ప్రవవి