రివ్యూ

దారితప్పేశాడు! ( ప్రేమికుడు)... బాగోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
మానస్ ఎన్ సనమ్‌షెట్టి, భానుచందర్, సన, అనితాచౌదరి, షకలక శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు.
సంగీతం: విజయ బాలాజీ
నిర్మాతలు: లక్ష్మీనారాయణరెడ్డి కె,
ఇసనాక సునీల్‌రెడ్డి
కథ, కథనం, దర్శకత్వం:
కళాసందీప్.

‘పని’ ఎలర్జీ, ‘సుఖం’ ఎనర్జీ అన్న అజెండాతో కాలాన్ని చాలా జాలీగా గడిపేసే కథానాయకుడు శ్రీ (మానస్ ఎన్). తన అత్తయ్య (సన) ప్రోద్బలంతో హైదరాబాద్ వచ్చి జీవితంలో కుదురు పొందాలనుకుంటాడు. ఆ ప్రక్రియలో అతనుండే పక్క ఫ్లాట్‌లోని కృష్ణ (సనమ్‌షెట్టి) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడం, అనంతరం ఏమైందీ అన్నది మిగతా స్టోరీ. ‘పని’ ఎలర్జీ, సుఖం ‘ఎనర్జీ’ అన్న పోకడే ప్రోత్సహించతగ్గ అంశం కాదు. అయినా సినిమాలో మొట్టమొదటి దశలో హీరో ఆ దారిన ఉన్నా, రానురాను సక్రమ పంథాలోకి వచ్చిన ఉదంతాలతోనే కథ నడిచి కాస్తంత పురోగమన పరిస్థితికి చేరేది. ఇందులోనూ ఓ స్టేజిలో హీరో శ్రీ, ‘నా కృష్ణకోసం గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేసైనా జీవిస్తాను’ అంటాడు. కానీ ఇంతలోనే కళాసందీప్ (చిత్ర దర్శకులు) ఈ తీరు సినిమాకు అంతగా సమర్ధనీయం కాదనుకున్నాడో ఏమో, హీరోయిన్‌ని సతాయించిన విలన్ చేసే అకృత్యాలను ఎదుర్కోడంలాంటి వాటిపై దృష్టి పెట్టేశారు. దీంతో సినిమా థీమ్ నీరుగారిపోయింది. ఇదంతా ఓకే అని అసంతృప్తితో అంగీకరించినా పక్క ఫ్లాట్‌లో సైలంట్‌గా మర్డర్‌లు జరిగినా ఎక్కడా ఉలిక్కిపడే జాడలు లేకపోవడం విడ్డూరం.
అలా హత్యలు జరగడానికీ, తదనంతరం సంభవించిన సంగతులకీ వ్యవధి ఉన్నా ఏమాత్రం పోలీసుల ప్రవేశం లేకపోవడం అసలు ‘మనం ఏ కాలంలో ఉన్నామన్న’ ఉలికిపాటు చిత్రాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులవంతైంది. అన్నిటికన్నా పరాకాష్ట, చిత్రహింసలు పెట్టిన హీరోయిన్ తల్లిదండ్రుల్ని చంపిన ప్రతి నాయకుడు సత్యను సునాయాసంగా శ్రీ చంపేయడం, ఆ డెడ్‌బాడీని ఓ బ్రిడ్జ్‌క్రింద నీళ్లలో పడేసిన తర్వాత, ఏమీ జరగనట్టు నాయకీ నాయకులు వేసుకున్న యుగళ గీతంతో చిత్రం ముగియడం. అంటే ‘లా ఆఫ్ లాండ్’ అన్న ప్రాథమిక సూత్రం (జరిగే అంశాలపై ఉన్న చట్టాల ప్రభావం- ఆయా ప్రాంతాల్లో) ఈ సినిమాలో పట్టించుకున్నట్టు కనిపించలేదు. కౌసల్య పాత్ర ద్వారా సృష్టించిన ద్వంద్వార్థాలు ప్రేక్షకులు పట్టించుకోలేదు. హీరో మానస్ ‘ఎనర్జీ’ బావుంది. పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ చక్కటి ఈజ్ చూపాడు. తలాతోకా లేని కథ హీరో ‘ఎనర్జీ’కి కావాల్సిన సపోర్ట్ ఇవ్వలేదు. హీరోయిన్‌గా సనమ్‌షెట్టి యుగళగీతాల్లో హీరోకి కావాల్సిన శక్తిని సరఫరాచేయడంలో సక్సెస్ అయ్యారు. ఫ్లాట్ల వాచ్‌మెన్ రాంబాబు పాత్రలో షకలక శంకర్ తన బ్రాండ్ యాసతో హాస్యాన్ని ఒలికించేశారు. అయితే ఇలాంటి ‘యాస’ పైనే పూర్తిగా ఆధారపడితే రానురాను ఇది మొహంమొత్తేసే ప్రమాదం ఉంది. ఇది ఆ నటుడు గమనించాలి. డాన్ హెడ్ కెపిగా భానుచందర్, అతని న్యాయ సలహాదారుగా పరుచూరి వెంకటేశ్వరరావు పాత్రల పరిధి చూస్తే ఇందాకా అన్నపూర్ణ వెలిబుచ్చిన అభిప్రాయానికి (ఇలావచ్చి అలా వెళ్లిపోయే...) తాజా ఉదాహరణలుగా అనిపించాయి. ‘కలలు కనేవాడు పగలు నిద్రపోతాడు. కష్టపడి పనిచేసేవాడు రాత్రి నిద్రపోతాడు’ అన్న మంచి సంభాషణలు అక్కడక్కడ వినపడ్డాయి. అలాగే ఇప్పుడు మన ‘తక్షణ కర్తవ్యం’ అన్న ప్రశ్నకు ప్రతిగా ‘విజయశాంతిని అడిగి చెప్తాను’ అన్న పంచ్ బాగా పేలింది. గతంలో వచ్చిన ‘ప్రేమికుడు’ (1994లో ప్రభుదేవా, నగ్మా తారాగణంగా వచ్చినది) పెద్ద మ్యూజికల్ హిట్. దాంతో పోలిస్తే ఇందులోని పాటలు పెద్దగా ఆనవు. అయితే జానపద వాతావరణ నేపథ్యంలో చిత్రీకరించిన పిల్లడో.. పిల్లడో... బాగుంది. ఇంకో పాటలో ‘సరసయాగాల ఆవాహన’ అన్న పదం కూడా అలరించింది. చిత్రీకరణపరంగా కూడా కెమేరా చాలా చురుగ్గా ఈ పాటలో పనిచేసింది. కొత్తతరం చిత్రాల్లో, కథాగమనంలో నవ్యత్వం ఉండటం కోసం పడే తపన స్వాగతించతగ్గదైనా, అలాంటి సదరు నవ్యత్వానికి ఎంతవరకూ ‘నవ్యత’ ఉన్నదన్నది పరీక్షించుకుని ముందుకెళ్తేనే ‘ప్రేమికుడి’ ప్రేమ ప్రేక్షకుల హృదయాలకు చేరువవుతుంది.

-అనే్వషి