రివ్యూ

భగ్గుమన్న చితుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** పలాస 1978
***
తారాగణం: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్దన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ తదితరులు
కెమెరా: అరుల్ వినె్సంట్
సంగీతం: రఘు కుంచె
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
దర్శకత్వం: కరుణకుమార్
***
ప్రతి మనిషిలోవుండే రాక్షసుడే -స్వార్థం. అదే మనుషుల్ని -కూర్చుని తినేవారు, పనిచేసేవాళ్లుగా విడగొట్టింది. అలా మొదలైన అంతరానికి -కులం, మతం ట్యాగ్‌లైన్ తగులుకున్నాయి. అలా -వర్గాలమధ్య వైషమ్యాలు చెలరేగుతూనే ఉన్నాయి. దీనికి ముగింపెక్కడో ఎవ్వరికీ, ఎప్పటికీ అర్థంకాని విషయం. ప్రపంచంలో కనిపించే విషయమే -పలాసలోనూ ఉంది. అదే చూపించాడు దర్శకుడు.
డబ్బున్నోడు -లేనోడిని దోచుకుంటున్నాడు. బలమున్నోడు -లేనోడిని తక్కువ జాతి చేసి సంఘానికి దూరం పెట్టాయి. కడుపుమండి -వీళ్లలో ఎవ్వడైనా ఉన్నోడి దోపిడీని ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది? అదే దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కించిన పలాసలో చూస్తాం. ధనం, కులము -అనే రెండు పదాలూ ఎంత శక్తివంతమో చెప్పే ప్రయత్నం చేశాడు.
పలాస దగ్గర అంబుసోలి ఓ కుగ్రామం. ఊరికి దూరంగా కాలికి గజ్జె కట్టి దేవాలయాల్లో ఆడుతూ ప్రజలకు ఆనందాన్నిచ్చే జాతిలో పుట్టినోడు మోహనరావు (రక్షిత్). అతని అన్న రంగారావు (తిరువీరు). అంటరానోళ్లంటూ ఊరికి దూరం పెట్టిన మోతుబరులు -పొలాల్లో ఇళ్లలో పని చేయించుకున్నపుడు ‘అంటు’ కనిపించలేదా? అన్న ప్రశ్నలమధ్యే పెరిగారు. ఊళ్లో పెద్ద షావుకారు లింగమూర్తి (జనార్దన్). చిన్న షావుకారు గురుమూర్తి (రఘు కుంచె). అన్నదమ్ములైనా ఒకరి పొడ ఒకరికి పడదు. దీంతో డబ్బున్నోడి రాజకీయాలకు ప్రజలు బలైపోతుంటారు. లింగమూర్తి కొడుకు తారకేసు తన థియేటర్‌కొచ్చిన అంటరాని స్ర్తిలను తన కామానికి వాడుకోవాలని చూస్తుంటాడు. అక్కడినుంచే కథ మొదలవుతుంది. తమ స్ర్తిలను తప్పుగా మాట్లాడినందుకు తారకేసుపై దాడిచేసి అవిటివాణ్ణి చేస్తారు దళితులు. తన కొడుకుపై జరిగిన దాడిని మనసులో పెట్టుకున్న లింగమూర్తి సమయం కోసం చూస్తుంటాడు. లింగమూర్తి ప్రధాన అనుచరుడు బైరాగి. అతను ఊళ్లో చేసిన పెద్ద సాహసం బండరాయిని ఎత్తడమే. ఆ బండరాయిని ఎత్తినోడే బైరాగికన్నా బలవంతుడన్న అభిప్రాయం ఉంటుంది. అందుకే ఆ రాయికి బైరాగి బండ పేరు పెట్టి ఊళ్లోని కుర్రాళ్లంతా బండను ఎత్తే ప్రయత్నం చేస్తూంటారు. తారకేసు విషయంలో -మోహనరావు, రంగారావుల్ని అంతం చేయమని బైరాగికి చెబుతాడు లింగమూర్తి. వాళ్లిద్దరూ రక్షించమని కాళ్లావేళ్లా పడినా బైరాగి ససేమిరా అనడంతో, అన్నదమ్ములిద్దరూ బైరాగిని అంతమొందిస్తారు. తన అన్న కుడిభుజం విరిగిపోయిందన్న ఆనందంతో గురుమూర్తి అన్నదమ్ములిద్దరినీ తన అనుయాయులుగా చేసుకుంటాడు. వారిద్దరినీ ఉపయోగించి తన అన్నపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఎన్నికలలో తనకు టికెట్ కావాలన్న రంగారావును అవమానిస్తాడు గురుమూర్తి. ఇదే ఆసరాగా తీసుకున్న లింగమూర్తి -రంగారావుకి టికెట్ ఇస్తానని తన బంటుగా చేసుకుంటాడు. కానీ ఎన్నికల్లో గురుమూర్తి గెలవడంతో.. అతని దగ్గరున్న మోహనరావును చంపమని రంగారావుకి పురమాయిస్తాడు లింగమూర్తి. కానీ ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటై లింగమూర్తినే అంతమొందిస్తారు. ఈ సమయంలోనే సెబాస్టియన్ అనే ఎస్‌ఐ (రామరాజు) ఆ ఊరికి వస్తాడు. ఊళ్లోని రాజకీయాలను గమనించి అన్నదమ్ములిద్దరూ రిగ్గింగ్ చేస్తారు కనుక, వారిపై కనే్నస్తాడు. అందుకు గురుమూర్తి అన్నదమ్ములిద్దరినీ పలాస దాటిస్తాడు. తండ్రిపోయిన తారకేసు చివరికి బాబాయి దగ్గరికెళ్లి కలిసిపోతాడు. తండ్రీకొడుకులిద్దరూ కలిసి అన్నదమ్ములను చివరికి ఎలా పావులుగా వాడుకుని ఎదిగారు? చివరికి అన్నదమ్ముల ప్రస్థానం ఎలా సాగింది అనేదే మిగతా కథ.
ప్రారంభం నుంచే పలాసలో మాట్లాడే శ్రీకాకుళం మాండలికాన్ని ప్రతి డైలాగులో ఉపయోగించడంవల్ల సినిమాకు ప్రత్యేకత వచ్చింది. దానికితోడు ‘పక్కన పడ్డాది లేదా సూడోరి పిల్ల నాది నక్లిలీసు గొలుసు’, ‘బావొచ్చేడు అప్పా, ఎంత బాగున్నాడో అప్పా’ లాంటి జానపద గీతాలతో సినిమా వైవిధ్యంగా సాగుతుంది. ఊరి చివర గూడెం బాయిలో శవం తేలితే ఊళ్లోని పెద్దవాళ్ల బాయిలో నీళ్లు తోడుకోనివ్వకపోవడం, బలమున్నోడికి కులమంటూ ఉండదని, వాడు ఏ కులంవాడితోనైనా కలిసిపోగలడని చెప్పడం, పక్కలోకి పొలంలోకి పనికొచ్చేవాళ్లు మనుషులు కాదా? అని ప్రశ్నించడం ఈ సినిమాలో కన్పిస్తుంది. పెద్దోళ్లకోసమే రౌడీలమయ్యాం. మనం చెడ్డాం కాబట్టే ఆళ్లు లీడరయ్యారు, రాజకీయం అంటే చిన్న విషయంగాదు.. ఊర్లో చేగోడాలు బీగోడాలు చేసి ఇంటింటింటి తిరిగి అమ్ముకునేవాళ్లం, ఆడికి తెలియకుండా ఆడి చెడ్డీ యిప్పేస్తేనే ఆడు షావుకారు అవుతాడని మా నాన్న చెప్పాడంటూ సాగే లింగమూర్తి కథనం సినిమాలో ప్రధాన పాయింట్. బైరాగి ఎపిసోడ్ కూడా కొత్తగా వుంటుంది. జీడితోట ఒకడిది, పప్పు మనది. కొట్టేవాడొకడు లాభం మనది, కష్టం ఒకడిది డబ్బు మనది. మనింట్లో కత్తి ఉందని పట్టుకుని నరికేయడానికి పరిగెత్తకూడదు. అమాయకుణ్ణి పట్టుకుని కత్తి ఒక చేతిలో పెట్టాల. మరో చేతిలో బెల్లం ముక్క ఎట్టాల. వాడు దాన్ని చప్పరించుకుంటూ నరకేసి వస్తాడు. ఆడు రాగానే మరో బెల్లం ముక్క చేతిలో పెట్టి కత్తి తీసి కడిగెయ్యాల అంటూ చెప్పే నీతి ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. ఎమ్మెల్యేగా నిలబడటానికి మనకు నమ్మకమైన మనిషి కావాలి. నువ్వు నీ తమ్ముణ్ణి సంపెయ్, అవకాశం అన్నిసార్లూ రాదురా. వచ్చినపుడే పరిగెత్తాల, సొంత తమ్ముణ్ణి సంపటానికి ఆలోచన వస్తది. తప్పులేదు. కానీ మనం ఎదగాలంటే ఏ పనిచేసినా తప్పులేదురా అంటూ చెప్పే నీతి చిన్న కులాలపై వేసే వలలాగా ఈ సినిమాలో ప్రతిచోటా కన్పిస్తాయి. భూమీద యుద్ధాలన్నీ పదవికోసం, ముండకోసం జరిగినవే. తమ్ముణ్ణి చంపడం ఎలక్షన్లముందొక లెక్కా అంటూ అన్నదమ్ములమధ్య విభేదాలు పెట్టిన సన్నివేశాలూ ఆకట్టుకుంటాయి. చిన్న కులస్థులపై అగ్రకుల దాష్టీకాలు ఎప్పటికప్పుడు తమ ఆయుధాలుగా మార్చుకొని అదే జాతిపై ఎక్కుపెట్టిన పద్ధతులు ముఖ్యంగా 1978 ప్రాంతంలో జరిగిన పలు మారణకాండల చరిత్రను చిత్రంలో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ అందమైన స్క్రీన్‌ప్లేతో వున్నది ఉన్నట్లుగా చరిత్రను, ముఖ్యంగా తాను రాసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో జరిగిన విషయాలను డాక్యుమెంటరీ రూపంలో కాకుండా కామెడీ, ఎమోషన్స్ జోడించి చెప్పడంతో సినిమా ప్రేక్షకుణ్ణి కుర్చీలోంచి లేవనివ్వదు. అధికారంలో ఎవళ్లెవళ్లనో కూకోబెడతానంటున్నాడు నీ కొడుకు. ఈడు నీ రక్తం. నువ్వు సంపుకుంటావో, వుంచుకుంటావో నీ యిష్టం. కానీ అధికారం మాత్రం మన ఇల్లు దాటి పోకూడదరా అంటూ గురుమూర్తి భార్య చెప్పిన బోధ కూడా సినిమాకు ఆయువుపట్టే. కాలుకు గజ్జెకట్టి దేవుడిముందు ఆడే జాతిలో పుట్టినోళ్లం. మాలాంటోళ్లందరికీ ఆయనే దేవుడు. మా జాతిలో ఒక్క దేవుడూ పుట్టలేదు. అందుకే ఆయన మాకు దేవుడు అని మోహనరావు చెప్పే ప్రతి మాట సినిమా కథనం ప్రకారం అక్షరసత్యంగా తోస్తుంది. ఇంకో నాలుగైదు వందల సంవత్సరాల తరువాత మేము కులమంటూ లేని సమాజం అన్న కలలు నిజమవ్వచ్చు. కానీ అప్పుడు నువ్వు, నేనూ ఉండం. వాళ్లు ఏదైనా చేస్తే అడగడానికి ఓ గొంతుండాల. మన గొంతుండాలంటే మన మనిషుండాల. మనిషిండాలంటే మన భూమి ఉండాల. అందుకే భూమీద అధికారం మాకు కావాల. వినాయకుడి తల అతికించడానికి దేవుడున్నాడని రాసిన పుస్తకాల్లో ఏకలవ్యుడి వేలు అతికించే దేవుణ్ణి ఎందుకు సృష్టించలేదో అర్థమైనపుడు పలాసలాంటి పోరాటాలు ఎక్కడా కనపడవంటూ దర్శకుడు తన భావోద్వేగ కథనాన్ని చిత్రం నిండా ఆవిష్కరించాడు.
సినిమాకు కెమెరా పనితనం ప్రాణంపెట్టింది. నేపథ్య సంగీతం సన్నివేశంలో వున్న గాఢతను హృదయంలోకి చొచ్చుకొనిపోయేలా వినిపించింది. రెండు వర్గాలమధ్య వైషమ్యాలు ఎప్పటికీ ఉండేవే. ఈ నిప్పు ఎప్పటికీ ఆరుతుందో? తెలియని పరిస్థితి. ‘రేయ్! మీ మనుషులెప్పుడైనా మా మీద గెలిసార్రా. ఆళ్లెప్పుడు మా కాళ్లకాడ కుక్కలే. ఆళ్లు బెల్టులేని కుక్కలు. నీలాంటి పోలీసోళ్లు బెల్టువున్న కుక్కలు. అంబుసోలిలో ఊరంతా ఖాళీ చేయించి బట్టీలు పెట్టిస్తున్నా. దానిమీద కేసేసుకో. నువ్వు సచ్చిందాకా టైమ్‌పాసైపోద్ది. రేయ్, మీరు మురికిలో, కళ్లులో, ఎర్రితనంలో వుంటేనే మా జీడిపప్పు కాల్తది’ అంటూ చిన్న షావుకారి చెప్పిన ప్రతిమాట ఈ సినిమా క్లైమాక్స్‌కు అద్దంపట్టింది.
ఓ అరుదైన సినిమా. పాత్రలు సజీవంగా కనిపించే సినిమా. ఎడిటింగ్‌లో ప్రతి సన్నివేశం ఎంత కనపడాలో అంతే కన్పించేలా చేయడంలో విజయం సాధించారు.

-శేఖర్