రివ్యూ

ఆనందాల నిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** అంగ్రేజీ మీడియం
***
తారాగణం: ఇర్ఫాన్‌ఖాన్, కరీనాకఫూర్ ఖాన్, రాధికా మదాన్, దీపక్, డోబ్రియల్, డింపుల్ కపాడియా, పంజక్ త్రిపాఠి, జాకీర్ హుస్సేన్ తదితరులు
సంగీతం: సచిన్ జిగర్, తనిష్క్ బాగ్జి
సినిమాటోగ్రఫీ: అనిల్ మెహతా
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే
దర్శకత్వం: హోమి అదజానియా
***
ఈ సమస్త సృష్టి ప్రేమతో నింపబడి ఉంది. ఈ ప్రేమ బంధాలు శాశ్వతంగా నిలబడాలంటే దాని పునాదే త్యాగం! ఈ త్యాగానికే కొంతమంది బాధ్యత అని ప్రేమ అని పేర్లుపెట్టారు.
ఈ సంపూర్ణ, విశ్వంలో మానవ ప్రేమ అపురూపం. అదే తండ్రి- కూతురి మధ్య వెల్లివిరిసే మమతానురాగాలు మరీ ప్రత్యేకం. తమ సంతానంకోసం, వాళ్ళ వికాసంకోసం తమ సర్వస్వాన్ని అర్పిస్తారు తల్లిదండ్రులు. తల్లి లేని, ఓ కూతురుకు తల్లీతండ్రి తానే అయి పెంచి పెద్ద చేసి, తను కోరే ఓ కోరిక ఆ తండ్రి శక్తికి మించినదైతే, ప్రాణంగా పెరిగిన కూతురు తన నుండి దూరంగా వెళతానంటే ఆ తండ్రి ఏం చేస్తాడు? తన లక్ష్యం ముందు ఊరు, తండ్రి, బంధువులు అందరు చిన్నవారే అని భావించే ఓ కూతురు కోరిన ఆ కోరికను తండ్రి తీర్చాడా? లేదా? అసలు కూతురు ఏం కోరింది? అనేదే- అంగ్రేజీ మీడియం.
దినేష్ విజాన్ నిర్మాణ పర్యవేక్షణలో హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం - అంగ్రేజీ మీడియం.
రాజస్థాన్‌లో నివసించే చంపక్ బన్సల్ (ఇర్ఫాన్‌ఖాన్) ఓ మిఠాయి దుకాణం యజమాని. ఇతని తాత తోడర్‌మల్ ఘాంసీరామ్ బన్సల్ ఆస్తులు, అతని బ్రాండ్ నేమ్ కోసం ఇంకో సోదరుడు గోపి (దీపక్)తో పోట్లాడుతూ కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు. బాబాయి కొడుకులు, పెదనాన్న కొడుకులు ఇలా పదుల సంఖ్యలో ఉండి అందరు స్వీట్స్ వ్యాపారం చేస్తూ ఘాంసీరాం బ్రాండ్ స్వీట్‌కు చాలా పేరు కాబట్టి దానికోసం పోరాడుతుంటారు. ‘‘ఇతని బాబాయి కొడుకు గోపి జడ్జికి 9 లక్షల రోలెక్స్ వాచీ ఇంకొన్ని బహుమతులు ఇచ్చి (లంచం) బ్రాండ్‌నేమ్‌ని తన పేరుమీద వచ్చెట్లు చేసుకుంటాడు. కోర్టులో గోపి గెలుస్తాడు కాని.. తన అన్న చంపక్ అంటె అతనికి ప్రాణం కన్నా ఎక్కువ. వ్యాపారము వ్యాపారమే ప్రేమ ప్రేమే అన్నట్లుగా ఉంటాడు. చంపక్ కూడా తమ్ముడి వరసైన గోపిని అదే ప్రేమతో చూస్తాడు.
చంపక్ భార్య ఓ కూతుర్ని కని చనిపోతుంది. చిన్నప్పట్నుంచి ఆ కూతుర్ని (రాధికామదాన్) తల్లితండ్రి తానై అల్లారుముద్దుగా పెంచుతు తను అడిగిన ప్రతిది కాదనకుండా ఇస్తుంటాడు. కూతురే తన లోకం. తనని వదిలి ఉండలేని స్థితికి చేరుకుంటాడు. అతని కూతురు తారకా బన్సల్ మాత్రం తండ్రికి దూరంగా లండన్‌లో చదవాలని, ఫాస్ట్ లైఫ్‌ని అనుభవిస్తూ హాయిగా, ఉండాలని కోరుకుంటుంది. పైగా లండన్ వెళితే ఎలా బ్రతకాలో కూడా ఇండియాలోనే నేర్చుకునే క్రమంలో మందు తాగటం, చిన్న దుస్తులు వేసుకోవటం లాంటివి చేస్తుంటుంది.
లండన్‌లో చదువుకోడానికి తండ్రిని ఒప్పిస్తుంది. కాని తండ్రి ఆమె చేసే ప్రతి ప్రయత్నాన్ని చెడగొట్టి తన దగ్గరే ఉంచుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. లండన్ వెళ్ళడానికి కోటి రూపాయలు ఫీజు, ఆ తర్వాత ఇంకో మూడు కోట్లు అవసరమవుతాయి. ఓ సాధారణ మిఠాయిలు అమ్ముకునే ఓ వ్యాపారి అన్ని కోట్లు కూతురి కోసం ఎలా సమకూర్చాడు? చివరికి కూతురు ఏం చేసింది? అనేది తెరపై చూడాల్సిందే.
ఇర్ఫాన్ కూతురుగా నటించిన తారకా (రాధికా మదాన్) అద్భుతంగా నటించింది. విదేశాలలో చదివితేనే చదువు. విదేశీ కల్చరే అద్భుతం అనే ఓ భ్రమలో బ్రతికే అమ్మాయిగా తన నటన చాలా బావుంది. మందు తాగటం, లండన్ ఇంగ్లీషును ప్రాక్టీసు చేయటం. బాయ్ ఫ్రెండ్‌ని ఆకర్షించటంకోసం పొట్టి దుస్తులు ధరించటం చివరికి ఫాస్ట్ కల్చర్ పేరుతో ‘ఆ’కాస్త కానిచ్చెయ్‌డానికి సిద్ధపడే అమ్మాయిగా చాలా బాగా నటించింది. చివరికి తన తండ్రి ప్రేమ ముందు ఇవన్నీ చిన్న విషయాలు అని తెలుసుకొని తను మారే సీన్స్‌లోని నటన శిఖరాగ్రానికి చేరింది. ఇర్ఫాన్‌కి, వరుసకి తమ్ముడిగా నటించిన గోపి (దీపక్) నటన నవ్వులలో ముంచెత్తింది. దొంగ పాస్‌పోర్టులతో జనాలను విదేశాలకు పంపె (పంకజ్) ఉన్నది కొద్దిసేపే అయినా హాస్యపు జల్లులతో తడిసిపోయేలా చేశాడు. లండన్ పోలీసు ఆఫీసర్‌గా కరీనా నటన ఓహా అనేలా ఉంది. కరీనా తల్లిగా నటించిన డింపుల్ కపాడియా ఉన్నది కొద్దిసేపే అయినా పరిపూర్ణంగా నటించారు. చంపక్‌గా నటించిన ఇర్ఫాన్ మంచి పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రాణమయ్యారు. ఎన్నో భావోద్వేగాలను అలవోకగా రక్తికట్టించాడు. తన కూతురుని అతిగా ప్రేమించే తండ్రిగా, తనని లండన్ వెళ్ళకుండా ఆపే ప్రయత్నంలో చేసే అల్లరి, కోర్టులో పరాచికాలు, లండన్, దుబాయిలో అతని అమాయకత్వం, వచ్చిరాని ఇంగ్లీషు భాష పద ప్రయోగాలు, ఎయిర్‌పోర్టులో మందులని ఏమంటాతో తెలీక.. నెట్‌లో వెదకి డ్రగ్స్ బిజినెస్ అని చెప్పటం.. థియేటర్ నవ్వుల తోటై మురిసింది.
కూతురు ఏమైపోతుందోనని తలుస్తూ ఏడ్చే సీన్స్‌లో ప్రేక్షకులు లీనమై ఏడ్చినంత పని చేశారు. అసలు సినిమా చూస్తున్నామనే విషయం చాలా తక్కువసార్లు జ్ఞప్తికొస్తుంది. ఏవో సంఘటనలు మన కళ్ళముందే జరిగినట్లుగా నవ్వుతాం. మురిసిపోతాం, బాధపడతాం...ఇలా ఎన్నో!
ఇందులో ప్రతి మాటా ఆణిముత్యమే! నేను చాలా తప్పు చేశాను నన్ను బాగా తిట్టు నాన్నా అని కూతురంటే ఆ తండ్రి అంటాడు ‘తిడితే పిల్లలు చెడిపోతారమ్మా’ అని. మరోచోట స్వేచ్ఛ అంత త్వరగా దొరకదమ్మా. ఎన్నో త్యాగాలు చేయాలి అంటాడు. ఇంకోచోట నేను ఓడిపోయినా సరే నా కూతురు గెలవాలి అంటూ ఓ తండ్రి మనసుని ఆవిష్కరించాడు. ఇంకోచోట కలలు తీరకపోతే మనిషి చనిపోవాలనుకుంటాడు. ఇలా ఎన్నో!
ఇక దర్శకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే! నేటి సమాజంలో విదేశాలలోనే చదవాలి! అదే అసలు చదువు! తాగి తందనాలాడటమే నిజమైన జీవనం అని భ్రమించే వాళ్లు, కన్నతండ్రి ప్రేమను గుర్తించలేని వాళ్ళు ఎలా ఉంటారో చాలా చక్కగా చూపించి దీనికో చక్కటి మార్గాన్ని చూపే ప్రయత్నం చేశాడు. కథని ఎన్నుకోవటంలోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. ప్రతి ఫ్రేముని ఎంతో పరిణితితో చెక్కాడు. ప్రతి అంగుళం అతని మార్కు స్పష్టంగా కనబడింది. నిర్మాణ విలువలు బావున్నాయి. సీన్లు సినిమాటిక్‌గా ఉన్నా అందమైన జడివానలో కొట్టుకుపోయాయి. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. అన్ని అద్భుతంగా కుదిరి ఓ మహాద్భుతం మనముందు ఆవిష్కృతం అవుతుంది. అది అచ్ఛంగా అంగ్రేజీ మీడియంలా ఉంటుంది.

-మధుర మురళి