రివ్యూ

మథించని కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మధ
*
తారాగణం: త్రిష్ణా ముఖర్జీ, వెంకట్ రాహుల్, అనిష్ కురువిల్లా, బిక్రమ్‌జిత్ కన్వర్‌పాల్
సంగీతం: నరేష్ కుమరన్
కెమెరా: అభిరాజ్ నాయర్
నిర్మాత: ఇందిరా బస్వ
దర్శకత్వం: శ్రీవిద్య బస్వ
*
మానవదేహమే పెద్ద రహస్యాల గని. ఎప్పటికప్పుడు ఎన్ని కొత్త రహస్యాలు తెలుసుకున్నా, మరెన్నో ప్రశ్నార్థకంగానే ఉంటుంటాయి. వీటన్నింటినీ తన మేధస్సుతో తెలుసునే ప్రయత్నం మనిషి చేస్తూనే వున్నాడు, చేస్తూనే వుంటాడు కూడా. మనిషికి ఎదురయ్యే రోగాలకు చెక్ పెట్టేందుకైనా ఈ నిరంతర ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ఒక విషయంలో విజయం సాధిస్తే, మరో కొత్త సవాల్ మనకి ఎదురవుతూనే ఉంటుంది. రోగాలంటని దేహం ఎక్కడైనా ఉంటుందా? అలాంటి శరీరానికి విలువెంత? అసలు మనిషి పుట్టినప్పటినుండి పెరిగిన దేహం వజ్ర సమానంగా మారితే ఎంత బాగుంటుంది? అదే విషయాన్ని దర్శకురాలు శ్రీవిద్య బస్వ ఊహించారు. దానికి చిలువలు పలువలు కథలో చేర్చి యాక్షన్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా కమర్షియల్ సినిమా చేశారు. ఇక్కడివరకూ బాగున్నా, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడింపుల్లో అనేక అవకతవకలు జరిగి ప్రేక్షకుడికి కథా కథనాలు కొరకరాని కొయ్యలా మారి అయోమయం ఎదురైంది.
అనాథాశ్రమంలో పెరిగిన నిషా (త్రిష్ణాముఖర్జీ) దేహం చాలా శక్తివంతం. రోగాలు, వైరస్‌లు ఆమె దేహాన్ని తాకలేవు. వ్యాధినిరోధక శక్తి వందకి వెయ్యిశాతంవున్న యువతి నిషా. ప్రేమికుడిని అంటూ ఆమె జీవితంలోకి అర్జున్ (వెంకట్ రాహుల్) ప్రవేశిస్తాడు. కానీ అతని ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకుడికి అనుమానం రేకెత్తిస్తుంది. చివరికి అర్జున్ ట్రాప్‌లో పడిపోయిన నిషా, పిచ్చిది అన్న ముద్ర వేయించుకుని మెంటల్ ఆసుపత్రికి చేరుతుంది. అది హాస్పిటల్ కాదు. మానవ దేహంపై ప్రయోగాలు జరిపే ల్యాబ్. అక్కడ కనిపెట్టిన ఔషధాలను మనుషులపై ప్రయోగిస్తుంటారు. పోయినోళ్లు పోగా, నిషా మాతమే బ్రతికి బట్టకడుతుంది. ఆ ప్రయోగశాలలో ఏం జరుగుతుంది? దాని వెనుక సూత్రధారి ఎవరు? అసలు ప్రయోగాలన్నీ ఎందుకు చేస్తున్నారు? అన్న విషయాలే ముగింపు దృశ్యాలు.
సినిమా మొదటినుంచీ ఏదో చెబుతున్నట్టు ఉంటుందికానీ, ఏం చెబుతున్నారో అర్థంకాని స్థితిలో సాగుతుంది. కళ్ళముందు కదలాడే సన్నివేశాలు వెనుక లాజిక్‌లను పట్టించుకుంటే, అనేక విషయాలు అర్థంకావు. అగ్నిప్రమాదంలో చనిపోయందనుకున్న చిన్ననాటి నిషా అనాథాశ్రమంలో పెరిగిందన్న విషయాన్ని అర్జున్ ఎలా కనిపెట్టగలిగాడు? అందరూ పిచ్చిది అన్నంత మాత్రాన నిషాను డాక్టర్ కూడా పిచ్చిదేనని ఎలా సర్టిఫై చేశాడు? ఐటి రంగంలో అద్భుతంగా రాణిస్తున్న నిషాను గమనిస్తున్న ఇరుగుపొరుగు ఒక్కసారి తప్పు మాట మాట్లాడినంత మాత్రాన పిచ్చిదేనని ముద్ర ఎలా వేస్తారు? టైటిల్స్‌లో ఏదో దెయ్యాల హారర్ సినిమా అనుకునేలా చేసినా, తరువాత మానవ దేహానికి సంబంధించిన జెనెటిక్స్ సబ్జెక్ట్‌లోకి వెళ్లిపోయింది చిత్రం. విలన్లు మానవ శరీరంపై చేసే ప్రయోగాలకు లొంగని ఒక వ్యక్తి కావాలి. అందుకు జెనెటిక్స్ డిజైన్ పర్సన్ అన్న ఓ పాత్రను సృష్టించి దాని వెనుక నానా బీభత్సం చేసి ఇదే గొప్ప సినిమా అనుకోవాలన్నట్టు చూపించారు. తనొక జెనెటిక్ డిజైనర్ అని నిషాకూ తెలీదు. అర్జున్ ఆమెను ఎలా పసిగట్టాడు? కేవలం చిన్ననాటి మెడికల్ రిపోర్ట్స్‌ను బట్టి తప్పిపోయిన అమ్మాయే నిషా అని ఎలా అనుకున్నాడు? అనీష్ కురువిల్లా జెనెటిక్స్ డిజైనర్ అయివుండి -ఓ సెక్యూరిటీ గార్డుగా తన ల్యాబ్‌లోనే పనిచేయాల్సిన అవసరం ఎంత ఆలోచించినా ఊహకందదు. నిషా డిజైనర్ బేబీ అని అతనికీ తెలీదు. అలాంటప్పుడు ఎందుకు సెక్యూరిటీ గార్డు అయ్యాడు? సినిమా అంతా ఎప్పటికప్పుడు ప్రేక్షకుణ్ణి ఆలోచించనీయకుండా కట్స్ కొట్టుకుంటూ వెళ్లిపోవడానికే సినిమా స్క్రిప్ట్‌కు ప్రాధాన్యత లభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రశ్నలు వస్తూనే వుంటాయి. సినిమాలో నచ్చే అంశాలంటే, కెమెరా పనితనం. మారుమూల పాడుబడిన పాత ఇళ్లల్లో సినిమాకు సంబంధించిన వాతావరణాన్ని సరికొత్తగా చిత్రీకరించారు. సన్నివేశాలకు తగిన విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుదిరింది. ఈ రెండు విషయాలు ఓకే అనిపిస్తాయి. మిగతా విషయాలలోకెల్లా మథించని స్క్రిప్ట్‌తో సినిమా దేనికీ కాకుండాపోయింది. నటీనటుల్లో త్రిష్ణాముఖర్జీ నటన హైలెట్‌గా వుంటుంది. అందుకు తగ్గట్టు వెంకట్ రాహుల్ పాత్రలో లీనమయ్యాడు. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప ఆయుధం ఏంటి అంటే, మానవ మేధస్సే. దాన్ని మించిన అస్త్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అన్న విషయాన్ని మరింత అర్థవంతంగా చెప్పివుంటే బావుండేది.

-జిఆర్‌ఆర్