రివ్యూ

పిచ్చెత్తించిన మెంటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..మెంటల్
*
తారాగణం: శ్రీకాంత్, అక్ష, కోట, బ్రహ్మానందం, గిరిబాబు, చలపతిరావు, అజయ్‌ఘోష్, సుమన్, సప్తగిరి, షకలక శంకర్, సుహాసిని తదితరులు
సంగీతం: సాయికార్తీక్
నిర్మాత: ఎస్‌కె కలీమున్నీసా
ఎ ఫిల్మ్ బై: ఎస్‌కె బషీద్
***
కథ, కథనం తదితరాలకు న్యాయం చేకూర్చటం మాటెటున్నా, చిత్రానికిచ్చిన పేరుకు న్యాయం పూర్తిస్థాయిలో జరిగేలా చూసిన చిత్రాలు ఈమధ్యనొచ్చాయి. వాటికి ఉదాహరణలుగా గత నెలలో వచ్చిన ‘తిక్క’ను చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా ఆ వరసలో ‘మెంటల్’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. అలా సినిమా పేరుకి న్యాయం చెయ్యడమన్నది ‘ఓకే’అయినా అలాచేసిన విధం ఔచిత్యవంతంగా ఉంటేనే బావుంటుంది. అలాంటి ఉచితానుచితాల మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా నడిపిన చిత్రం ‘మెంటల్’. వివరాల్లోకి వెళితే... ఎమ్మార్వో అయిన తల్లి (సుహాసిని) దుండగుల చేతిలో బలైపోవడాన్ని చూసిన దుర్గాప్రసాద్ (శ్రీకాంత్) వాళ్లని చంపేసి బాలనేరస్థుల కారాగారంలోకి వెళ్తాడు. అక్కడో పోలీసు ‘నువ్విలా’ ఎంతమందిని చంపి ఇలా ఎన్నిసార్లు జైలుకొస్తావు. అదే ‘నువ్వు ఇలా పోలీసువైతే ఎన్నిసార్లు అయినా అఫీషియల్‌గా అలాంటి దుర్మార్గుల్ని చంపేయచ్చు’ (?) అంటాడు. ఆ ప్రేరణతో ఆ అబ్బాయి పోలీసాఫీసరు అవడం సమాజ కంటకుల్ని కాల్చేయడం జరుగుతుంది. అలా చేయడం ఆ వ్యక్తి మానసిక స్థితి సరిలేని పరిస్థితిలో చేసింది కనుక మానసిక చికిత్సాలయానికి పంపుతారు. అనంతర కాలంలో ఆ కేసుని స్టడీ చేసిన మరో ఆఫీసరు (సుమన్), వారి సేవల్ని పోలీసుశాఖలో వినియోగింపచేయాలనే ఉద్దేశ్యంతో పోలీసు శిక్షణ సంస్థలో శిక్షకుడిగా ఉండేలా (?) సిఫార్సు చేయడంతో సినిమా ముగుస్తుంది. ఏదైనా సరే సహజత్వానికి భిన్నంగా ఉంటే దాన్ని ‘అతి’గా ఉందనో, ఆ అతితనం మరీ ముదిరితే దాన్ని ‘మెంటల్’ అనడం సహజం. కానీ ఇక్కడ మనుషుల్ని కాల్చేయడం, అదీ బాధ్యతాయుతమైన పోలీసు అధికారి పాత్ర ద్వారా జరగడం తీవ్ర క్రూరత్వం లెక్కకు వస్తుంది. పోలీసు డ్రెస్‌లో ఎంతమందినైనా అధికారికంగా చంపేయొచ్చన్న మాట ఒక పోలీసు పాత్రతో అనిపించడం దారుణం.
సాధారణంగా సినిమాకు దర్శకుడు పేరు ప్రముఖంగా చూపడం సహజం. అందుకు విరుద్ధంగా ‘ఎ ఫిల్మ్ బై’’... అని ఓ పేరు వేశారు. ‘ఎ ఫిల్మ్ బై’... అన్న కాప్షన్ సామాన్యంగా దర్శకుడికే వర్తిస్తుంది. కనుక వారినే దర్శకుడు అనుకుంటాం. కానీ చిత్రానికి ముందుగా చేసిన ప్రచారం ప్రకారం తర్వాత వచ్చిన వార్తల ద్వారాను కారణం పి బాబ్జీ దర్శకుడని తెలుస్తోంది. ఇలా దర్శకుని విషయంలో కూడా భిన్నత్వాన్ని ఈ సినిమా విషయంలో గమనించవచ్చు. ఇక చిత్రాంతంలో దుర్గాప్రసాద్‌ని పోలీసు శిక్షణ సంస్థకు శిక్షకుడిగా నియమించడానికి సిఫార్సుచేయడం మరీ విడ్డూరం. ఎందుకంటే అతని భావజాలమే (రివాల్వర్‌తో విచక్షణా రహితంగా కాల్చేయడం) ఎవరూ అంగీకరించేది కాదు. మరి అలాంటిది శిక్షణ ద్వారా వ్యాప్తిచెందితే పరిణామాలు ఊహించలేం. సమాజంలో జరుగుతున్న అరాచకాలు, వాటిని నివారించాలన్న తపన ఉన్న నాయకుని మనోవేదన అర్థంచేసుకోగలం, కానీ అతను చేపట్టిన హింసాయుత పరిష్కారాన్ని మాత్రం హర్షించడం కుదరదు. శ్రీకాంత్ దుర్గాప్రసాద్ పాత్రలో లీనమై నటించాడు. ఒకరకంగా సినిమా భారాన్ని మొత్తం ఆయన తన భుజాలపై పెట్టుకుని మోశారు. కానీ సినిమా వహించిన అసహజ పోకడలవల్ల అది రాణించవలసినంతా రాణించలేదు. పేరుకి చిత్రంలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తదితరులెందరో ఉన్నా ఎవర్నీ సరిగ్గా ఉపయోగించుకోలేదు. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు పేరడీగా దర్శకుడు ‘కర్మ’ అంటూ షకలక శంకర్ చేత చేయించిన హడావుడి పండలేదు. ఉన్నంతలో ప్రధాన ప్రతి నాయకుడిగా నటించిన అజయ్‌ఘోష్ నటన కాస్త నయం. చిత్రంలో పాటలు ఎక్కడ పెట్టాలో అన్నదానికీ సన్నివేశాలు కుదరక ఆఖరికి ఓ ఐటెమ్‌సాంగ్‌ని సినిమా షూటింగ్‌లో భాగంగా చూపారు. అంతకన్నా నేపథ్య గీతంగా వినిపించినదొక్కటే సాయికార్తీక్ స్వరాల్లో బావున్నది. ‘నా ఇల్లు నా వాళ్లు అనుకున్నవాడు స్వార్థపరుడవుతాడు. సొసైటీ అంతా నా ఇల్లు అనుకునే వాడు లీడర్ అవుతాడు’ అన్న సంభాషణ బావుంది. అయితే ‘బూతులు మీరు మాట్లాడచ్చు, కానీ పోలీసులు మాట్లాడకూడదా’? అని అనిపించడం బావులేదు. అంతకన్నా అలాంటి పదాలు ఎవరూ మాట్లాడకూడదన్న హితవు చేస్తే బావుండేది. చిత్రానికి నెగిటివ్ టైటిల్ పెడితే ‘పాజిటివ్’ రిజల్ట్స్ వస్తాయన్న ఆలోచనలపై దృష్టిమాని సినిమా కథ, సన్నివేశాల పరిపుష్టిత తదితర విషయాలపై ఫోకస్ ఎక్కువ చేస్తేనే అనుకూల ఫలితాలు వస్తాయన్నది ఈ తరహా చిత్ర రూపకర్తలు గ్రహిస్తే మంచిది.

-అనే్వషి