రివ్యూ

రారండోయ్.. వేడుక చూద్దాం.. (ఆకట్టుకున్న అల్లరి ప్రేమ) * * *

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్, జగపతిబాబు, సంపత్‌రాజ్, కౌసల్య, వెనె్నల కిషోర్, పోసాని, పృథ్వీ తదితరులు
కథనం: సత్యానంద్
ఎడిటింగ్: గౌతంరాజు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: ఎస్.వి.విశే్వశ్వర్
నిర్మాత: నాగార్జున అక్కినేని
దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల

సోగ్గాడే చిన్నినాయన లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలపై ఉన్న నమ్మకంతో తనయుడు నాగచైతన్య కోసం మంచి కుటుంబ కథతో సినిమాకు ప్లాన్ చేసాడు నాగార్జున. అక్కినేని నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. వరుసగా రెండు విజయాలను అందుకున్న చైతు నటించిన ఈ సినిమాపై ముందునుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయ. పైగా కళ్యాణ్ కృష్ణ సినిమా కావడం, రకుల్‌తో చైతూ తొలి సినిమా కావడం ప్రేక్షకులకు మరింత క్రేజ్ అయ్యంది.
తండ్రి చాటు బిడ్డలా, కుటుంబ సభ్యుల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి భ్రమరాంబ (రకుల్‌ప్రీత్‌సింగ్). భ్రమరాంబ అంటే తండ్రి ఆది (సంపత్)కి పంచప్రాణాలు. ఆమెకోసం ఏమైనా చేస్తాడు. నీకోసం అచ్చంగా రాజకుమారుడే వరుడుగా వస్తాడు. ఆకాశంనుంచి దిగొస్తాడు అంటూ బామ్మ నూరిపోసే మాటలకూ అలాగే ఫిక్స్ అవుతుంది. అలాంటి రాజకుమారుడు ఎక్కడో ఆకాశంలోంచి దిగివస్తాడని ఎదురు చూస్తుంటుంది. అలా మహారాణిలా ఉండే భ్రమరాంబను తన కజిన్ పెళ్లి వేడుకలో చూసి ప్రేమిస్తాడు శివ (నాగచైతన్య). ఇంతలో భ్రమరాంబ కూడా శివ ఉండే వైజాగ్‌కు చదువుకోడానికి వచ్చి ఆ తరువాత క్రమంలో శివకు దగ్గరవుతుంది. ఆ ఇద్దరి ప్రేమను భ్రమరాంబ తండ్రి తనకు, శివ వాళ్ల నాన్న (జగపతిబాబు)కు ఉన్న పాత వైరం గుర్తొచ్చి ఒప్పుకోడు. అసలు భ్రమరాంబ తండ్రికి, శివ తండ్రికి మధ్య ఉన్న పగేమిటి? ఈ పగల మధ్య శివ, భ్రమరాంబల ప్రేమ ఏమైంది? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు? అనేది మిగతా సినిమా.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ హీరోయిన్ భ్రమరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంది. నాగచైతన్య నటుడిగా ఎంత ఓపెన్ అయ్యాడో, ఎంత ఈజ్ వచ్చిందో చెప్పడానికి బ్రేక్‌అప్ సీన్ చక్కని ఉదాహరణ. ఇది చైతన్య కెరీర్‌లోనే బెస్ట్ సీన్ అని చెప్పవచ్చు. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో, ఏమాత్రం తడబాటు లేకుండా సీన్‌ని రక్తికట్టించాడు. ఈ సినిమా పూర్తిగా భ్రమరాంబ పాత్ర చేసిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ది. ఇంతవరకు హీరో పక్కన పాత్రలకి, గ్లామర్‌కి మాత్రమే పరిమితమైన రకుల్ తనలో మంచి నటి వుందని ఇందులో చూపించింది. భ్రమరాంబగా ఆమె మెప్పించడమే కాదు, ఇకపై భ్రమరాంబ అనే పేరు వింటే తనే గుర్తొచ్చేలా ఆకట్టుకుంది. ఇక జగపతిబాబు, సంపత్‌రాజ్, వెనె్నలకిషోర్ కామెడీ ట్రాక్ ఫర్వాలేదు.
భావోద్వేగాలు సరిగ్గా పండితే ఎంత పాత కథ అయినా రసవత్తరంగా మారుతుంది. భావోద్వేగాలని సరిగ్గా పండించడంలో, తెరపై కదిలే పాత్రలతో చూసే ప్రేక్షకులు రిలేట్ అయ్యేట్టు చేయడంలోనే దర్శకుడి విజయం దాగి వుంటుంది. పెళ్లి నేపథ్యంలో మొదలయ్యే కథ చాలా నీరసంగా ముందుకి కదులుతుంది. పెళ్లి బ్యాక్‌డ్రాప్ పేరుతో చాలా పాత్రలని ప్రవేశపెట్టినా ఆ కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
భ్రమరాంబ సిటీకి షిఫ్ట్‌అయిన తర్వాతే కథలో వేగం వస్తుంది. ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటే ఇప్పుడే చెప్పేయ్. నిన్ను మళ్లీ కలవను, మాట్లాడను’ అని ఖచ్చితంగా చెప్పేసిన అమ్మాయి మనసుని హీరో ఎలా గెలుచుకుంటాడనేది అసలు కథ. ఆధునిక భావాలంటూ ప్రేమకథలని ఆర్ట్ఫిషియల్‌గా మార్చేస్తోన్న ఈరోజుల్లో ఇలాంటి ప్యూర్ ప్రేమను చూపించే సన్నివేశాలను బాగా అల్లుకున్నాడు దర్శకుడు. నేపథ్య సంగీతం, పాటలపరంగా దేవి తన స్థాయికి తగ్గ అవుట్‌పుట్ ఇవ్వలేదు. ఒక ప్రేమకథకి వుండాల్సిన విజువల్స్‌తో విశే్వశ్వర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సత్యానంద్ స్క్రీన్‌ప్లే పాత పద్ధతుల్లో సాగింది. కళ్యాణ్‌కృష్ణ రాసిన మాటలు కీలక సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ వేసాయి. చక్కని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ వేడుక కుటుంబ సమేతంగా చూసేట్టుగా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మలిచాడు.
ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చేదిగానే ఉన్నా భారీస్థాయి అంచనాలు పెట్టుకున్న అభిమానుల్ని మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేదు. రకుల్‌ప్రీత్ పాత్ర చిత్రీకరణ, హీరో హీరోయిన్ల ఎమోషనల్ లవ్‌ట్రాక్, కొన్ని పాటలు, డైలాగులు, కాస్త సెకండాఫ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా నిదానంగా సాగే మొదటి అర్థ భాగం, పెద్దగా కొత్తదనమేమీ కనిపించని రొటీన్ కథా కథనాలు ఇందులో నిరుత్సాహపరిచే అంశాలు.

- త్రివేది