శ్రీకాకుళం

నదుల అనుసంధానంతో.. ఒడిశా వేషాలకు బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: 1962 ఒప్పందం-నేరడి బ్యారేజీ నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేసివుంటే వంశధార జల వివాదం ఉండేది కాదు. జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల వల్ల ప్రాజెక్టును రెండు దశలుగా విభజించి, డిజైన్‌లో మార్పులు, చేర్పులు చేసి 1970-99 మధ్య గొట్టా బ్యారేజీ నిర్మాణంతో జిల్లా అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి కనుమరుగైంది. కేవలం 13కిలో మీటర్ల ఒడిశా ముంపునకు మూల్యంగా శ్రీకాకుళం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు ఎడారిగా మారుతోంది. నిన్న రుషికుల్య వద్ద ఒడిశా ఇంజనీర్లు బ్యారేజీ నిర్మిస్తే - నేడు నేరడి ఎగువభాగంలో సరా-బడిగాం వద్ద రిజర్వాయర్‌కు సన్నద్ధం అవుతున్నారు. ఒడిశా నియంతపోకడలకు బ్రేక్ వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నదుల అనుసంధానం ఫార్ములాతో వంశధార జలవివాదాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు అధికారికంగా తెలిసింది. వంశధార నదిని కటక్-్భవనేశ్వర్ మార్గంతరంలో అస్కా వద్ద మహానదితో అనుసంధానం చేసి వంశధార జలవివాదానికి తెర దించాలన్న రాష్ట్ర ముఖ్య ఇంజనీర్ల ఆలోచనకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సాధ్యసాధ్యాలు, వందల కిలోమీటర్ల దూరం, కొండలు, గుట్టలు మధ్య వంశధారను అనుసంధానం చేసేందుకు ఇరుగుపొరుగు రాష్ట్రాల సరికొత్త ఆలోచనలకు తెరలేచింది. ఇదే జరిగితే ఒడిశా ముంపు-ఆంధ్రా ఎడారి అనే ప్రశ్నలు తలెత్తవంటూ ఇంజనీర్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చకపోతే 54 ఏళ్ళుగా సాగుతున్న జలవివాదంలో సిక్కోల్ అన్నదాతలు కష్టాలు తప్పవు.
వంశధార ట్రిబ్యునల్ తిప్పికొట్టినప్పటికీ, ఒడిశా ప్రభుత్వం బరితెగించి నేరడీ ఎగువ భాగంలో ఎత్తుపెంచి రిజర్వాయర్ నిర్మాణానికి సరికొత్త వివాదానికి తెరలేపింది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా ఉండదనే చెప్పాలి. న్యాయవ్యవస్థను గౌరవించకుండా, ముఖ్యమంత్రుల ఒప్పందాలు బేఖాతరు చేస్తూ నేరడి ఎత్తుపెంచే పనులకు అక్కడ ఇంజనీరింగ్ అధికారులు మూహూర్తం ఖరారు చేశారు. ఈ నెల పదోతేదీన సరా-బడిగాం ప్రాంతాల మధ్య రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు అధికారికంగా తెలిసింది. అందుకే - నదుల అనుసంధానం ఫార్ములాను ఎ.పి. సర్కార్ తెరమీదకు తెచ్చి తాత్కలికంగా నేరడి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఉభయ రాష్ట్రాలతో ముడిపడివున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా రాజకీయంగా లబ్ధిపొందేందుకు ఒడిశా ముఖ్యమంత్రుల వ్యూహమన్నది నేరడి ఎగువ పనుల వల్ల స్పష్టమవుతోంది. ట్రిబ్యునల్ వల్ల సకాలంలో పరిష్కారం రాదని, ఈలోగా వంశధార - రుషికాల్య అనుసంధానం, తన భూభాగంలో వంశధారపై ప్రాజెక్టులు నిర్మించుకునే పనులు ఒడిశా చేసుకునే అవకాశం ఉండడంతో రుషికుల్య వద్ద ఎతె్తైన జల ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. జల వివాదంపై ఒడిశా ముఖ్యమంత్రితో అవసరమైతే మాట్లాడుతానన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తాజా పరిణామాలతో నదుల అనుసంధానం అన్న ఫార్ములాను తెరపైకి తీసుకువచ్చినట్టు ఉంది. ఇరుగుపొరుగు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్ల సమావేశానికి ఆహ్వానం పంపడమే ఇందుకు నిదర్శనం.
పల్లెల్లో తమ్ముళ్ళు... పొలాల్లో రైతులు
ఎచ్చెర్ల, డిసెంబర్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 18నెలల పాలనలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించేలా తెలుగుదేశం కేంద్ర కమిటీ జనచైతన్య యాత్రలకు దళాన్ని సిద్ధంచేసింది. ఈ పిలుపునందుకున్న తెలుగుతమ్ముళ్లు గ్రామాల్లో జెండాలు ఆవిష్కరించి సభలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఖరీఫ్ వరికోతలు, మోతలువంటి వ్యవసాయ పనులు తీరికలేకుండా ఉండటం వల్ల రైతు కుటుంబాలు ఇంటిళ్లపాది పొలాల్లోనే ఉంటున్నారు. ఈ కారణంగా చైతన్య యాత్రలకు జనం హాజరు అంతంతమాత్రంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అరకొర జనానికి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఉపన్యాసాలను దంచుతున్నారు. అధికార పార్టీ నేతలు ఇచ్చిన ప్రసంగాలను వినేందుకు జనం హాజరు శాతం అంతంతమాత్రంగా ఉంటుంది. ప్రతీ రెండు గ్రామాల్లో ఈ యాత్రను ఓ రోజు నిర్వహించాలని మండల పార్టీ నిర్ణయం తీసుకున్నప్పటికీ పొలం పనులుకారణంగా జనచైతన్య యాత్రలకు ఆదరణ కరవైంది. అయితే, తమ్ముళ్లు మాత్రం సర్దుకుపోయే ధోరణిలో వారి అజెండాను ముందుకు నడిపిస్తూ పసుపు జెండాలను రెపరెపలాడిస్తున్నారు. జనంలో చైతన్యం తీసుకురాని ఈయాత్రలు కనీసం పసుపుదళంలోనైనా చైతన్యం ఇకనైనా తీసుకువస్తాయా అన్న సందేహం పలువురులో వ్యక్తమవుతోంది.
సామాన్యుడి కష్టాలు తీర్చే...
‘అన్న సంజీవని’
శ్రీకాకుళం, డిసెంబర్ 4: ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులను బహిరంగ మార్కెట్‌లో లభించే ధరలకన్నా 80 నుండి 90 శాతం తక్కువకు లభించేలా అన్న సంజీవని మందులను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు రాష్ట్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసుల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆధ్వర్యంలోని పట్టణ సాయి మహిళా సమాఖ్య నేతృత్వంలో ఈ మందులు దుకాణాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ కూడలివద్దనున్న ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల రోడ్డులోను, అరసవిల్లి ఆదిత్యనగర్ వద్ద ప్రధాన రహదారిలో ఈ దుకాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్‌ను ప్రజలు అప్యాయంగా పిలుచుకున్న అన్న అనే పదంతో సంజీవని మందుల దుకాణాలను ఏర్పాటు చేయడమైందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2.50 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, 2.92 లక్షల మందికి పింఛన్లుగా 32 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. జనవరి ఒకటో తేదీ నుండి జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. రేషన్ కార్డు లేనివారు వారి వివరాలు డిసెంబర్ 31వ తేదీ వరకు అందజేయాలని, ఇందుకు అందరి తహశీల్దార్లకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. ఆ మేరకు అందిన దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే వచ్చే మార్చి 31వ తేదీలోగా జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలు ఉండరాదన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 34 లక్షల గ్యాస్ కనెక్షన్లు అందించారని పేర్కొన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో గ్యాస్ కనెక్షన్లు లేని వారి వివరాలు తీసుకుని కనెక్షన్లు పంపిణీచేయనున్నట్టు
పేర్కొన్నారు. అనంతరం సంజీవిని మందుల షాపుల ఏర్పాటు వివరాలు తెలిపారు. ఆమదాలవలస మెయిన్ రోడ్డు రైతుబజారు వద్ద, మెట్టక్కివలస ఎ.జి.యం రహదారి, రాజాం ఆర్టీసీ కాంప్లెక్సు గేటు పక్కన, పలాస-కాశీబుగ్గ ప్రభుత్వ ఆసుపత్రి రహదారి, పాలకొండలో నాగవంశపు వీధి, ఎస్.వి.క్లాత్ షాపు ఎదురుగా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ వైద్యం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్న సంజీవిని మందుల షాపులు ప్రజలకు ఎంతో ఉపయోగపడగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, మున్సిపల్ కమిషనర్ పి.ఎస్.ఎస్.ఎన్.జి.శ్రీనివాస్, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ దవళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

దేవాలయాల్లోని నగదు చోరీ!
వీరఘట్టం, డిసెంబర్ 4: మండలంలోని చలివేంద్రి గ్రామంలో నాలుగు దేవాలయాల్లో శుక్రవారం దొంగలు పడి నగదు పట్టుకుపోయారు. ఈ మేరకు ఎస్‌ఐ రామారావు తెలిపారు. తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు మేరిమాత, సత్యసాయి, అంజనేయస్వామి, దుర్గాలయాల్లో ఈ చోరీలకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. అలాగే దేవాలయాల్లో సుమారు 70 తులాలు వెండిని ఉన్నప్పటికీ కేవలం నగదు చోరీ చేసినట్టు తెలిపారు. దీనిపై స్థానిక సర్పంచ్ శశికుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
శ్రీకాకుళం(రూరల్)/పోలాకి, డిసెంబర్ 4: జాతీయ రహదారిపై సింగుపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం గొల్లవానిపేట గ్రామానికి చెందిన కొమర జ్యోతి(35) మృతి చెందింది. శుక్రవారం శ్రీకాకుళం వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా సింగుపురం వద్ద వాహనాన్ని వెనుకనుండి లారీ ఢీకొంది. దీంతో జ్యోతి తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. జ్యోతికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామాల అభివృద్ధికే స్మార్ట్ విలేజ్
జలుమూరు, డిసెంబర్ 4: గ్రామీణ ప్రాంతాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడానికే ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఎంపిడివో వాసుదేవరావు తెలిపారు. మండలంలోని కొండపోలవలస, బొడ్డపాడు సురవరం, కొమనాపల్లి గ్రామాల్లో శుక్రవారం జరిగిన స్మార్ట్‌విలేజ్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా గ్రామాల్లో చూసేసరికి అనుకున్నంత అభివృద్ధి లేదని గ్రామాలు అభివృద్ధిగా కనిపించాలంటే స్థానికుల్లో ఒకరు గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి కాళీప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టి ఒక డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాన నాగమణి, కార్యదర్శి విజయబాబు, రైతులు పలువురు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన అభివృద్ధికి ప్రతిబంధకం
ఎచ్చెర్ల, డిసెంబర్ 4: రాష్ట్ర విభజన అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిందని విశ్రాంతి ఆచార్యుడు పి.రామకృష్ణారావు అభిప్రా యం వ్యక్తం చేశారు. శుక్రవారం అంబేద్కర్ విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో ఎంబిఏ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన రాష్ట్ర విభజన వల్ల ఎదురైన సమస్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13జిల్లాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాళ్లలో ఐ.టి.రంగం నుండి 15శాతం, ఫార్మానుండి 33శాతం ఆదాయం లభించగా హైదరాబాద్ నగరం నుండి 22శాతం ఆదాయం వచ్చేదని తెలిపారు. ఇటువంటి ఆదాయాన్ని కోల్పోవలసి వచ్చిందన్నారు.
భవిష్యత్ అభివృద్దికి కూడా విఘాతం ఏర్పడిందన్నారు. అంధకారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నత చదువులు సాగిస్తున్న విద్యార్థులు ముందు చూపుతో సాగి సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యను అందిపుచ్చుకొని ఉపాధి ఉద్యోగావకాశాలు పొందడంలో పోటీ పడాలని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంబిఎ విద్యార్థులు, ఫేకల్టీ పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చి, సుపరిపాలన: అచ్చెన్న
గార, డిసెంబర్ 4: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సగానికి పైగా పూర్తి చేసి, రాష్ట్రంలో సుపరిపాలన సాగించడం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమని రాష్ట్ర కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జన చైతన్య యాత్ర నేపథ్యంలో శుక్రవారం మండలం మత్స్యలేశం పంచాయతీలో నిర్వహించే గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం నిర్థిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 24వేల కోట్లు రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదే అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, మీ ఇంటికే.. మీ భూమి వంటి కార్యక్రమాలుతో పాటు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నదులు అనుసంధాన కార్యక్రమం చేపడుతుండడం ముఖ్యమంత్రి దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అందించే దిశగా ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ఎంతో ఉన్నత ఆశయంతో నిర్వహిస్తోందని 2019నాటికి పూర్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపకల్పన చేశారన్నారు. డ్రైవర్లకు ప్రమాద బీమా, డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత, ఎన్టీఆర్ భరోసా వంటి జనరంజక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం సంక్షేమ విజయాలను సాధించిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. గుండ అమ్మలు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, మండల ఉపాధ్యక్షురాలు యల్లాయమ్మ, స్థానిక సర్పంచు మైలపల్లి లక్ష్మీజనార్దన్, పార్టీ శ్రేణులు ఉన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి జన చైతన్య యాత్రలో భాగంగా ఈ నెల 7న రానున్న నేపథ్యంలో సభాస్థలి నిర్మాణ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం మండల కాంప్లెక్స్ ఆవరణలో అల్లుకుపోయిన ముళ్ల చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా మూడు ప్రొక్లైన్‌లు పని చేస్తున్నాయి. సభా ప్రాంగణంలో ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా చదును చేస్తున్నారు.
ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రానున్న దృష్ట్యా హెలిపాడ్ నిర్మాణం త్వరితగతిన ఆర్ అండ్ బి అధికారులు చేపడుతున్నారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా పోలీసు బలగాలను నియమించి భద్రతా చర్యలను చేపడుతున్నారు. సభా ప్రాంగణం నుంచి వజ్రపుకొత్తూరు వరకు సైకిల్ ర్యాలీ చేపట్టనుండడంతో మండల కాంప్లెక్స్ నుంచి వజ్రపుకొత్తూరు వరకు రోడ్డుకి ఇరువైపుల ఉన్న ముళ్ల పొదలు, చెత్తను తొలగించారు. సభా ప్రాంగణం నిర్మాణ ఏర్పాట్లను మండల ప్రత్యేకాధికారి, ఐసిడిఎస్ పిడి జి.చక్రధరరావు పర్యవేక్షించారు. అలాగే, పనులు జరుగుతున్న తీరును పివో రాజరాజేశ్వరి, ఎంపిడివో వి.తిరుమలరావుతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో ఎంపిపి జి.వసంతస్వామి, మండల టిడిపి అధ్యక్షుడు బి.శశిభూషణ్ దగ్గర ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

భారతీయ కళలకు ప్రపంచ దేశాల్లో ఆదరణ

శ్రీకాకుళం(కల్చరల్), డిసెంబర్ 4: భారతీయ సంస్కృతి, సంప్రదాయ, కళలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రసిద్ధ నర్తకి, పద్మశ్రీ శోభానాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోగల బాపూజీ కళామందిర్ వేదికగా మూడు రోజులపాటు నిర్వహించనున్న కార్తీక మహోత్సవంలో ప్రదర్శన నిమిత్తం విచ్చేసిన ఆమె శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. దేశవిదేశాల్లో కూచిపూడి నృత్యకళకు విశేష ఆదరణ ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆశించినంతగా ప్రోత్సాహం లభించడం లేదని విచారం వ్యక్తంచేశారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్థానిక కళలకు ఎంతో సహకారం ఉందన్నారు.
బాల్యదశలోనే పాఠ్యాంశాల్లో నృత్య, సంగీత కళలను పొందుపరచడం ద్వారా కళలకు సజీవం చేయవచ్చునన్నారు. తెలుగుప్రజల గుండెల్లో నేటికాలపు అగ్రశ్రేణి కూచిపూడి నర్తకీ మణిగా స్థానం లభించడం వెనుకగల ప్రయాణాన్ని ఆమె ప్రస్తావించారు. సంప్రదాయ నృత్యరీతులను గౌరవిస్తూవర్తమానంపై దృష్టిసారించి సామాజిక స్పృహను కోల్పోకుండా తన వృత్తి ధర్మాన్ని తగు రీతిలో కృషి చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అంచెలంచెలుగా నృత్య చూడామణి, ఆంధ్రరత్న, ఎన్టీఆర్ ఆవార్డు, గౌరవ డాక్టరేట్, పద్మశ్రీ, ఉమెన్ ఆఫ్ ది ఇయర్ వంటి దేశ విదేశాల నుండి అవార్డులు, పురస్కారాలు పొందే అవకాశం కలిగిందన్నారు.
1973లో తన నాట్య ప్రదర్శనతో సాంస్కృతిక ప్రాతినిధ్యం వహించివలసినదిగా భారత ప్రభుత్వం కోరడంతో అమెరికా, పశ్చిమ ఆసియా దేశాల్లోప్రదర్శనలు ఇచ్చి దేశ ఖ్యాతిని చాటేందుకు అవకాశం కలిగిందన్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో నృత్య శిక్షణాకేంద్రాలను నెలకొల్పి తననుండి శిక్షణ పొందిన నృత్య కళాకారులు నిర్వహించే విధంగా సంస్థలు నడుస్తున్నాయన్నారు. ఇప్పటికే తన శిష్యారికంలో ఐదువేల మంది విద్యార్థినీ, విద్యార్థులు నృత్యం నేర్చుకున్నారన్నారు. ఈ నేపథ్యంలోభారతీయతను చాటే అవకాశం కలిగిందన్నారు. తన నాట్య ప్రతిభను వివరిస్తూ శ్రీకృష్ణపారిజాతం, భామాకలాపంలో సత్యభామపాత్ర, విశ్వామిత్రలో మేనకపాత్ర, కళ్యాణ శ్రీనువాసంలో పద్మావతి, శ్రీకృష్ణశరణంలో శ్రీకృష్ణుని పాత్ర, అదేవిధంగా మోహిని, పార్వతీదేవి, గిరిజా, వివేకానందుడు, సాయిబాబా వంటి పాత్రల్లో వివిధ రూపకాల్లో తనకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. జిల్లాతో తనకు గల అనుబంధాన్ని వివరిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. స్థానిక పి ఎస్ ఎన్ ఎం స్కూల్‌లో ఏడవ తరగతి చదివిన రోజుల్లో పుత్తడి బొమ్మపూర్ణమ్మగా పాత్ర వేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా సాంప్రదాయ, సంగీత, నాట్యకళ లను అభివృద్ధి చేసిన నిమిత్తం రాష్ట్రప్రభుత్వం గురుకులాన్ని స్థాపించడంలో కళలకు నిలయమైన శ్రీకాకుళంను ఎంపిక చేయడం సరియైన ఆలోచన అని అన్నారు.

ఇవి టిడిపిని నిలబెట్టుకునే యాత్రలు రెడ్డి శాంతి
నరసన్నపేట, డిసెంబర్ 4: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేపడుతున్న యాత్రలు జనాన్ని చైతన్య పరిచేందుకు కావని, కేవలం ఆ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రారంభించిన జనచైతన్య యాత్రలని వైసిసి జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆ పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో జనచైతన్య యాత్రలకు ఎక్కడ స్పందన లేదని ఆపార్టీ నాయకులు మాత్రమే గ్రామాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గడిచిన 18 నెలలులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తాను ఇచ్చిన వాగ్దానాలను నెలవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని దుయ్యపెట్టారు. తమ పార్టీ అధినేత వందప్రశ్నలు తయారు చేశారని దానికి దీటుగా దేశం నేతలు సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఈ పార్టీ రాష్ట్ర డిసి సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, అందవరపు సూరిబాబు, రామారావు, కరిమి రాజేశ్వరరావు, ఆరంగి మురళీధర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.