రాజమండ్రి

మానవత్వం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామారావు ఖుషీగా ఉన్నాడు... ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతగాడు ఆమ్యామ్యాలతో బాగానే వెనకేశాడు.
ఇంతకీ ఆ రోజు ఖుషీకి కారణం... మరో 15 రోజులపాటు తాను డ్యూటీ చేయబోయేది ‘మాంఛి’ సెంటరు..
సిటీలోనే వర్తక వాణిజ్యాలకు పేరున్న సెంటర్ కావడంతో ఎగుమతి, దిగుమతులకు వచ్చే లారీలు, వ్యాన్లు, ఆటోలు.. అబ్బో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది.
ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే సెంటర్ అంటే ఒళ్లు వంచి పనిచేయవచ్చనేది రామారావు ఖుషీకి కారణమనుకోకండి.
ట్రాఫిక్ వాళ్ల దృష్టిలో మాంఛి అంటే అందరికీ తెలిసిందే... ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే లారీలు, వ్యాన్లు, ఆటోల నుండి రోజువారీ, ఆయా దుకాణాల యజమానుల నుండి నెలవారీ మామూళ్లకు కొదవుండదు..
తనకు సహాయకులుగా ఉండే ఓ కానిస్టేబుల్, మరో ఇద్దరు హోంగార్డులతో కలిసి 15 రోజుల పాటు సెంటర్‌ను దునే్నసుకోవచ్చు.
ఎంతలేదన్నా రోజూ సాయంత్రానికి తన వాటాగా ఓ మూడు నాలుగువేలు కళ్లజూడవచ్చు... ఇదే రామారావు ఖుషీకి కారణం.
ఊహల్లో తేలిపోతూ... ఇంటి నుండి బైక్‌పై బయలుదేరాడు.
దారిలో దుర్గమ్మ గుడి... పోలీసులకు ఉండే సెంటిమెంటు ప్రకారం అక్కడ ఆగి, అమ్మవారికి దణ్ణం పెట్టుకుని ముందుకు కదిలాడు.
తన అడ్డాకు చేరుకున్నాడు... అప్పటికే డ్యూటీలోకి దిగిపోయారు తన సహాయకులైన కానిస్టేబుల్, హోంగార్డులు.
బైక్‌ను సెంటర్ స్టాండు వేసి, దానిపై కూర్చుని చుట్టుపక్కల దుకాణాల వద్ద అగుతున్న భారీ లారీలను చిద్విలాసంగా చూస్తున్నాడు...
మధ్య మధ్యలో విజిల్ ఊదుతూ కేకలు వేస్తున్నాడు...
అన్‌లోడింగ్‌కు వస్తున్న సరుకుల లారీల నుండి అందినకాడికి దండేస్తున్నారు కానిస్టేబుల్, హోంగార్డులు... మధ్యమధ్యలో హేడ్డుగారున్నారు... అంటూ రామారావును చూపిస్తూ, మరింత గుంజేస్తున్నారు...
ఈ రోజు కలెక్షన్ బాగానే వచ్చేట్టుంది మనసులో అనుకుంటూ రోడ్డువైపు చూస్తున్నాడు రామారావు.
ఇంతలో రయ్‌మంటూ బైక్‌పై దూసుకొస్తున్నాడు ఓ ఇరవైయ్యేళ్ల కుర్రాడు.
క్యాజువల్ టీషర్టు, జీన్స్‌లో ఉన్న ఆ కుర్రాడి వద్ద కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సు, సి-బుక్ తదితరాలు ఉండే ప్రసక్తే లేదు... ఆపై తలపై హెల్మెట్ లేదు... ఇంకేముంది కాస్త ఖరీదైన బైక్ కావడంతో బాగానే గుంజవచ్చంటూ మనసులోనే లెక్కలు వేసేశాడు రామారావు.
తన అసిస్టెంట్లంతా బిజీగా ఉండటంతో అందులోని ఓ కుర్ర హోంగార్డును విజిలేసి పిలిచి, వస్తున్న బైక్‌ను ఆపమని సైగచేశాడు.
హెడ్డుగారి సైగను అర్ధంచేసుకున్న ఆ హోంగార్డు రోడ్డుపై దూసుకొస్తున్న బైక్‌కు అడ్డంగా నిల్చున్నాడు... బైక్‌పై ఉన్న యువకుడు ఒక్కసారిగా సడన్‌బ్రేకు వేశాడు.
వెంటనే బైక్ స్టాండు వేయించి, ఆ యువకుడిని హెడ్డుగారి వద్దకు తీసుకెళ్లాడు హోంగార్డు.
ఆ యువకుడి మొహం చాలా ఆదుర్దాగా ఉంది...
లైసెన్సు, సి-బుక్, హెల్మెట్... ఇలా వరసగా చూపించాల్సినవన్నీ చదివేస్తున్నాడు రామారావు.
‘సార్... ఇప్పుడు నా దగ్గర అవేమీ లేవు... కానీ అన్నీ ఇంటివద్ద ఉన్నాయి... మీకు తర్వాత తీసుకొచ్చి చూపిస్తాను... ప్రస్తుతం నేను చాలా అర్జంటుగా వెళ్లాలి, వదిలేయండి...’ గుక్కతిప్పుకోకుండా చదివేశాడు సదరు యువకుడు.
‘ఏమిటో అంత అర్జంటు... మేమేం పనీపాటా లేకుండా ఇక్కడున్నామా...’ వెటకారంగా అన్నాడు రామారావు
‘అదికాదు సార్... ఈ ముందు సెంటర్‌లో ఒక యాక్సిడెంటు అయ్యింది.. ఎవరో కుర్రాడికి బాగా దెబ్బలు తగిలాయి... అర్జంటుగా బి పాజిటివ్ రక్తం కావాలన్నారు... అందుకని నేను బ్లడ్ బ్యాంకుకు వెళ్తున్నాను’ మరింత ఆదుర్దాగా అన్నాడు యువకుడు
‘ఆ కుర్రాడు నీకేమవుతాడు...’ అడిగాడు రామారావు
‘నాకేమీ కాడు సార్... నేనూ అదే దారిలో వస్తున్నాను... ఆ కుర్రాడు తన వివరాలు చెప్పే పరిస్థితిలో లేడు... నేను మానవతా దృక్పథంతో సాయం చేస్తున్నాను’
అతని మాటల్లో నిజాయితీకి కరిగిపోయాడు యువకుడిని ఆపిన కుర్ర హోంగార్డు.
‘పోనీలే సార్ వదిలేద్దామా...’ అన్నాడు..
ఒక్కసారిగా గయ్‌మన్నాడు రామారావు... ఇలాంటి కహానీలకు లొంగిపోతే ఎలా... గీతోపదేశం చేశాడు కుర్ర హోంగార్డుకు.
‘ఎంతుంది నీ జేబులో’ అడిగాడు యువకుడిని
రూ.500 ఉంది... ఆన్నాడు
‘అయితే అదిచ్చేసి... వెళ్లిపో’ ఖంగుమంది రామారావు గొంతు.
‘సార్...బ్లడ్ బ్యాంకులో నేను రక్తం ఇచ్చి, దానికి బదులుగా టెస్టులు చేసి, స్టోర్‌చేసిన రక్తం ప్యాకెట్ తీసుకురావాలి... దానికి రూ.500 వరకు కావాలి’
‘కథలు చెప్పబాకు... కేసు రాశానంటే బండి స్టేషన్‌కు వెళ్తుంది... కోర్టుకు పెట్టానంటే లాక్కోలేక, పీక్కోలేక ఛస్తావ్...’ బెదిరించాడు రామారావు
‘సార్... నా మాట వినండి సార్’ యువకుడు ఎంత చెబుతున్నా వినకుండా టీషర్టు పై జేబులో ఉన్న రూ.500 నోటు లాగేశాడు రామారావు.
చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగాడు ఆ యువకుడు.
తొలి రోజే కలెక్షన్ బాగా ఉండటంతో రామారావు ఆనందంలో తేలిపోతున్నాడు.... సాయంత్రం కావడంతో దందాకు ఇక ఫుల్‌స్టాప్ పెట్టారు... కానిస్టేబుల్, హోంగార్డులకు వాటాలు పంచేసి, తనకు వచ్చిన సింహభాగాన్ని జేబులో వేసుకుని విజిల్ వేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు...
ఇంటికెళ్లి బైక్ స్టాండు వేస్తుంటే భార్య ఆదుర్దాగా ఎదురొచ్చింది...
‘బాబీగాడు ఉదయమనగా బైక్ వేసుకుని వెళ్లాడు... ఇంకా రాలేదు.. సెల్ కూడా తీసుకెళ్లలేదు... నాకేదో భయంగా ఉంది.
బాబీ అంటే రామారావు దంపతుల ముద్దుల కొడుకు.
లేకలేక పుట్టిన కొడుకు కావడంతో గారానికి కొదవలేదు.
వారం క్రితమే కొడుకు అడిగాడని లక్ష రూపాయల విలువైన బైక్ కొనిచ్చాడు... ఇంకా నెంబరు కూడా రాలేదు.
భార్య మాటలతో రామారావు మనసెందుకో కీడు శంకించింది.
గబగబా తనకు తెలిసున్న బాబీ స్నేహితులకు ఫోన్లు చేశాడు.. అయినా ఫలితం లేకపోయింది...
ఎక్కడికి వెళ్లాడు... రామారావులో టెన్షన్ పెరిగిపోతోంది.
గబగబా బైక్ తీసుకుని రోడ్డెక్కాడు... టౌన్‌లోని ఆసుపత్రుల్లో ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టాడు.
ఎందుకైనా మంచిదని ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు ఫోన్‌చేశాడు... ఏవైనా యాక్సిడెంట్ కేసులు నమోదయ్యాయా అని.
బైక్ యాక్సిడెంట్ కేసు నమోదయ్యింది... డివైడర్‌ను గుద్ది, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఓ కుర్రాడు.. వివరాలేమీ లేవు... సమాధానం వచ్చింది అట్నుంచి.
ఏ ఆసుపత్రిలో చేర్చారు.
సుమిత్ర నర్సింగ్ హోం... అట్నుంచి సమాధానం.
వెంటనే బైక్‌ను సుమిత్ర నర్సింగ్ హోంవైపు పోనిచ్చాడు.
బైక్ ఎలా స్టాండు వేశాడో, ఎలా ఆసుపత్రిలోకి వెళ్లాడో...
అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తున్నాడు డాక్టర్ రఘు.
‘డాక్టర్...ఉదయం యాక్సిడెంట్ కేసు కుర్రాణ్ణి తీసుకొచ్చారట ఎలావుంది’ అడిగాడు రామారావు...
‘ఇప్పుడే సర్జరీ చేశాం...మరో 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము’ అన్నాడు డాక్టర్.
‘ఒకసారి చూడవచ్చా...’ నూతిలోనుంచి వస్తున్నట్టుంది రామారావు మాట.
‘ఐసియులో ఉన్నాడు... వెళ్లి చూడవచ్చు’
అదుర్దాగా ఐసియు డోర్ తీసుకుని లోనికి వెళ్లాడు...
లోనికి వెళ్లిన రామారావు కొయ్యబారిపోయాడు... బెడ్‌పై ఉన్నది తన గారాలపట్టి ‘బాబీ’...
ఒక్కసారిగా కళ్లుబైర్లు కమ్ముతుంటే అక్కడ నిల్చోలేక బయటకు వచ్చేశాడు... బయట కుర్చీలో కూలబడిపోయాడు.
కొద్దిసేపటికి తేరుకుని డాక్టర్ రూంలోకి వెళ్లాడు... డాక్టర్ ఆ కుర్రాడు నా కొడుకే... ఎలాగైనా మీరే కాపాడాలి... ఎంత ఖర్చయినా ఫర్వాలేదు... రామారావు కంఠం జీరబోతోంది...
‘ఉదయమే యాక్సిడెంట్ అయినా రక్తం లభించడం ఆలస్యం కావడంతో సర్జరీ చేయడం ఆలస్యమయ్యింది... వెంటనే సర్జరీ జరిగివుంటే రిజల్ట్ ఇంకా బాగుండేది... అయినా మేం చేయగలిగిన ప్రయత్నం మేం చేశాం.. ఇక అంతా మీ అదృష్టం...’
డాక్టర్ రఘు అలా చెబుతుండగానే అప్పుడే లోపలికి వచ్చాడు ఒక యువకుడు.
డాక్టర్ ఆ కుర్రాడి వివరాలేమైనా తెలిశాయా అడుగుతున్నాడు...
తన కొడుకు గురించి అంత శ్రద్ధ తీసుకుంటున్నది ఎవరా అని తల వెనక్కి తిప్పి చూశాడు రామారావు...‘ఉదయం ట్రాఫిక్‌లో రక్తం కోసం వెళుతూ తన దోపిడికీ గురైన జీన్స్, టీషర్టు యువకుడు...’
-ఎం.్భగ్యలక్ష్మి,
కొవ్వూరు, ప.గో.జిల్లా,

పుస్తక పరిచయం

శాకాహారమా? మాంసాహారమా?
ప్రతులకు
మైత్రేయ బుద్ధ విహార్
వేమగిరి, (వయా) ధవళేశ్వరం
రాజమండ్రి - 533125
సెల్: 94412 65845

మనిషికి ఆహార ప్రియత్వం ఎక్కువ. దాంతో రుచుల వెంపర్లాట అదొక అనంతమైన విషయంగామారింది. ఆహార స్వేచ్ఛ మీద ఇప్పుడు ఓ పెద్ద దుమారం విపరీతమైన చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే మనిషి ఉభయ ఆహార జీవి. ఆ స్వేచ్ఛా ప్రయత్నంలో అటు మాంసం, ఇటు శాకాహారం అవసరాన్ని బట్టి అటు ఇటు మస్తుగా లాగించేస్తాడు. ఇదే జిహ్వ చాపల్యం. మాంసానికి మసాల కోట్ తగిలిందా మరో నాల్గుముద్దలు ఎక్కువ లాగిస్తాడు. ఇక వట్టి కూరగాయల భోజనం అయితే ఏదో అయిందిలే అని ముగించేస్తాడు. ఇదో సాధారణరీతి భోజనపు వ్యవహారం. మాంసం తినే వాళ్ల మీద ఓ నిఘా ఒక ఆంక్ష నియంత్రణ చేయాలనే వత్తిడి తదితర విషయాలపై ఒక రగడ జరుగుతున్న క్రమంలో ‘శాకాహారమా? మాంసాహారమా?’ అనే పుస్తకం వెలువడటం మంచి పరిణామం. బోధనలో రాటు తేలిపోయిన వ్యక్తి, మంచి రచయిత అయిన బొర్రా గోవర్ధన్ గారి కలం నుంచి ఈ పుస్తకం రావడం మరో ముఖ్య విషయం. ప్రచురణను వేమగిరిలోని మైత్రేయ బుద్ధ విహార్ నిర్వాహకులు మహోదయ చేపట్టడం శుభప్రదం.
‘శాకాహారమా మాంసాహారమా’ అనే అంశంపై ఒక వాదాన్ని సమర్ధిస్తూ మరొక వాదాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పుస్తకం కాదు. చారిత్రకమైన దృష్టిలో పరిశీలన చేసి, శాస్ర్తియ దృష్టితో పరీక్షించి, నైతిక దృష్టితో విశదీకరిస్తూ ధార్మిక దృష్టి నుంచి చివరగా మానవీయ దృష్టితో విశిష్టమైన పుస్తకంగా వచ్చింది. ప్రతి జీవి తన మనుగడకోసం జీవ పదార్థాల్నే భుజిస్తాయి. ఆ పదార్థాలే శక్తినిస్తాయి. అవే జీవుల్ని బతికిస్తాయి. మొక్కలు, జంతువులు ఇవి రెండూ జీవులే. అంటే ఈ రెండూ జీవ పదార్థాలతో నిర్మించినవే. అంచేత మొక్కలు జంతువుల్ని తిన్నా, జంతువులు మొక్కల్ని తిన్నా అవి వీటిని ఇవి, వాటిని ఎలా తిన్నా ఏమి తిన్నా జీవ పదార్థాలేనన్న మాట. ఈ విషయాన్ని బాగా స్పష్ట పరిచారు రచయిత బొర్రా. జీవ పదార్థాల్లోని తేడాను విశదపరిచారు. వృక్ష జీవ కణాలు గట్టిగా ఉంటే జంతు జీవ కణాలు మెత్తగా ఉంటాయన్నమాట. స్పందన విషయంలో కూడా వృక్షాల్లో మందంగా, జంతువుల్లో సునిశితంగా ఉంటుంది. ఆహార నియమాల్లో జంతు జాతుల్లోని కొన్ని వృక్ష జీవ కణాల్ని తినే జంతువులున్నాయి. వాటిని శాకాహారులని, జంతు జీవకణాల్ని తినే వాటిని మాంసాహారులని అంటారు. శాకాహారం మాంసాహారం తినే వాటిని ఉభయ హారులంటారు. చాలా వివరణాత్మకంగా ఇంకొంచెం సరళాత్మకంగా రచయత రాయడం వల్ల, చదవడం చాలా సులభతరం అయ్యింది. ఏయే జీవులకు ఎనె్నన్ని జీర్ణాశయాలుంటాయో చెప్పారు. నెమరు వేసే జంతువులకు నాలుగు జీర్ణాశయాలుంటే మనుషులకు ఒక జీర్ణాశయమే ఉంటుంది. అలాగే మాంసాహార జీవులన్నింటికీ ఒకే జీర్ణాశయం ఉంటుందంటారు. ఏది తింటే బాగుంటుందంటే బద్ధకం శాకాహారం వల్ల, హుషారు మాంసాహారం వల్ల అంటూ చెప్పుకొచ్చేరు. శాకాహారం మందబుద్ధుల్ని, మాంసాహారం తెలివి గల వారిని తయారు చేస్తుందంటారు. జంతువుల్నుంచి వచ్చే పాలు పదార్థాలు కూడా మాంస ఉత్పత్తులంటారు. కనుక మాంసం అంటే కేవలం జంతువుల శరీరమే కాదు అంటారు. విషయాన్ని పరిశీలనాత్మకంగాను, వివరణాత్మకంగా శాస్ర్తియంగా చెప్పడం వల్ల గందరగోళ పరిస్థితి కనిపించదు.
మనం తినే ఆహారం శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏవి ఎలా పనిచేస్తాయి, ఏవి ఎలా ఉపయోగ పడతాయో వివరించారు. మనం పని చేయడానికి శక్తి అవసరం. ఆ శక్తి మనం తినే ఆహారంలో లభిస్తుంది. శక్తిని కేలరీల్లో కొలుస్తారు. అయితే ఏది ఎక్కువ కేలరీల్లో దొరుకుతుందంటే మాంసంలోనే అంటారు. శాకాహర జంతువులు అందుకే ఎప్పుడూ మేస్తూనే ఉంటాయంటారు. వెయ్యి గ్రాముల వంకాయ కూర ఇచ్చే శక్తి వంద గ్రాముల మాంసం కూర ఇస్తుందంటారు. కూరగాయల్లో ప్రతి వంద గ్రాముల్లో ఎన్ని ప్రోటీన్లు దొరుకుతాయో కోడి, మేక, బీఫ్ మాంసంలో దొరికే వాటిని పట్టిక రూపంలో పొందుపరిచారు. అలాగే ప్రతి వంద గ్రాముల్లో వివిధ కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు నుండి కేలరీల రూపంలో శక్తి లభిస్తుందో పట్టిక ఇచ్చారు.
ఇంతకీ రచయిత చెప్పొచ్చేదేమిటంటే మనిషి ఉభయ ఆహారి. మాంసం, శాకాహారం తినే వాడని. పూర్తి శాకాహారి అనే వాడు ప్రపంచంలో ఎవడూ ఉండరంటారు. మాంసం తిననంత మాత్రాన వారు శాకాహారులు కాదంటారు. జంతువులిచ్చే పాలు, గుడ్లు, జంతు ఉత్పత్తులైన మాంస పదార్థాలంటారు. ప్రోటీన్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసేవి. జంతు సంబంధమైన ఆహారంలోంచేనని గ్రహించాలంటారు. అంటే మాంసకృత్తులు శరీర నిర్మాణానికి సహకరిస్తాయన్న మాట. మనం భుజించడానికి గల దంత వ్యవస్థను శాకాహారులైన జంతువుల దంత వ్యవస్థ తేడాలను తెలియజెప్పారు. అంటే ప్రకృతి మనకు కల్పించిన దంత సౌకర్యంతో ఆయా ఆహారాల్ని భుజించే వీలు ఇచ్చిందన్నమాట. ఏతావాతా చెప్పేదేమిటంటే ప్రత్యేకించి మంచి ఆహారం విడమరచి చెడ్డ ఆహారం అయితే లేదు కాని, అని చెబుతూనే శాకాహారం కన్నా మాంసాహారం త్వరగా జీర్ణం అవుతుందంటారు.
ప్రకృతి దృష్ట్యా మనిషి ఉభయ జీవి. కనుకనే బుద్ధుడు ఉభయాహారాలు తీసుకోవచ్చన్నాడు. బుద్ధుడు భిక్షు నియమాల్ని ఆచరించిన వాడు. భిక్షు సంఘస్థులందరూ ఆ నియమాన్ని ఆచరించాలని ఉద్బోధించాడు. భిక్షువుల కోసం కొన్ని ఆంక్షలుపెట్టారు. అయితే ఏది హింస కిందకు వస్తుందో ఆ హింసను చెయ్యొద్దని, యజ్ఞాల్లో చేసే జంతువధను వద్దన్నాడు. అలాగే యుద్ధాన్ని వ్యతిరేకించాడు. రాజ్యాధికారం కోసం ప్రాణాలు తీయడం హింస కిందే పరిగణించాడు. వేట పేరుతో జంతువుల్ని చంపటాన్ని వ్యతిరేకించాడు. ప్రజల ఆహారంపై ఆంక్షలు విధించలేదు. అలానే ఫలానాది తినాలనో, మరొకటి తినకూడదనో చెప్పలేదు. మంచి పుస్తకం. శాకాహారులు, మాంసాహారులు తప్పక చదవాల్సిన పుస్తకం. ఎవరెవరి వాదాలు కరెక్టో, ఏది మానవీయ వాదమో తెలుసుకోడానికి ఈ పుస్తక అవసరత ఉంది.

- రవికాంత్,
సెల్: 96424 89244

మనోగీతికలు

వీడని అద్దేపల్లి పరిమళం
అద్దేపల్లి వారు సభకు వస్తే
ఒక గ్రంథాలయం నడచి వచ్చినట్టే
ఒక సాహితీ కెరటం కళ్లెదుట ఎగసినట్టే
ఒక సాహిత్య మేరువు మనముందు మెరిసినట్టే!

అందరికీ ఆత్మీయ పరిమళం పంచు
పూలవనం అద్దేపల్లి,
కవులెందరికో గర్వించ దగిన
గురువుగ మన్ననలొందిన సాహిత్య శ్రేష్ఠ!

కరచాలనం చేస్తే చాలు ఒక్కసారి
సాహిత్య గుబాళింపులు
సంవృతమవుతాయి!
నిరంతర సాహితీ సేద్యంలో అక్షరమణులను
పండించిన కృషీవలుడు!
హాయ్! అంటూ పలకరిస్తూ స్నేహసుమ
సురభిళాన్ని పంచడం ఆయన నైజం!
అమ్మభాషంటే అంతులేని అభిమాని
అన్నభావం మనసుల్లో వెల్లివిరిస్తుంది!

అవిశ్రాంత సాహితీ విశారదుడు
విరామమెరుగని ప్రజాభ్యుదయ కవి
వందల పుస్తకాలకు ముందుమాట వెలిగించి
ప్రోత్సహించిన సాహితీ తేజస్వి!
కవిగ విమర్శకునిగ రచయితగ
గజల్ గాయకునిగ
సాహిత్యాభిమానుల హృదయాలలో
పదిలమయ్యాడు!
ఆయన ప్రసంగాలకు సాహిత్యాభిమానులు
ప్రసన్నవౌతారన్న
విషయానికి తార్కాణం నిశ్శబ్దం ఆవహించిన
ప్రాంగణమే ప్రామాణ్యం!

ఉవ్వెత్తున ఉబుకే ఆయన మాటల తరంగాలకు
కరతాళ ధ్వనులే ప్రతిభకు నిదర్శనాలు!
ఆయనొక సాహితీ విహారి
సంచార కవితా సారథి
ఎన్ని ప్రసంగాలు, ఎన్నో రచనలు చేసిన ఆయనొక
జ్ఞాన నిధి ఎంత ప్రాజ్ఞుడైన ఆయన
సాహిత్య దాహం తీరనిది!

పేరెంత కలవాడైన పేరిమితో వీడని
చెలిమి సుగంధాన్ని వెదచల్లుతాడు
సాహిత్య ప్రపంచంలో మనమందరం సోదరులం
స్నేహితులం చిన్న పెద్ద భేదం లేదని వెరపు పోగొట్టి
అందర్నీ ఆదరించి, నిర్మల మనసరి!
సాహిత్యమున్నంత కాలం
సాహితీ మిత్రుల హృదయాలలో
అద్దేపల్లి చిరస్మరణీయుడై శోభిల్లుతాడు అజస్రం

- మల్లెమొగ్గల గోపాలరావు
సెల్: 9885743834

ప్రగతికి
నీరే ఆధారం
నీరుంటే చెట్టు
చెట్టుంటే నీరు
నీరు లేని దేశం
నీరే లేని దేహం
ఊహించు నేస్తం
పాడి పంటలకు నీరు
పల్లె ప్రగతికి నీరు
పరిశ్రమలకు నీరు
కరెంటుకు నీరు
మనిషి శుభ్రతకు నీరు
జీవకోటి భద్రతకు నీరు
ప్రాణం లేని నీరు
ఎంతటి మురికినైనా
కడుతుగుంది భారంగా
జలయజ్ఞాలు
మేఘ మధనాలు అన్నీ
నీటి అవసరాన్ని చెబుతున్నాయి
ప్రగతికి నీరే ఆధారం
నీరు కోసం ఆరాటం
నీరు కోసం పోరాటం

- పంపన సాయిబాబు,
తోలేరు, వీరవాసరం, 9652801014

హైకూలు
కాయ రుచి చూస్తూ
రామచిలుక
శబరిలా ఫోజు

మాటలన్నీ పాపాయిలే
పెద్దల కొచ్చేసాయ్
ముద్దు మాటలు

వంటింట్లో ఘుమ ఘుమలు
కడుపులో ఎలుకలు
ఒకటే హడావుడి

అబ్రక దబ్ర
రైల్లో టాయ్‌లెట్లు మాయం
ముదిరిన ప్రజాసేవ

చీకటి పడింది
ఆనందంతో ఎగురుతూ
మిణుగురులు

భయమేసి దాక్కున్నాడు
చంద్రుడు
అమావాస్య రాత్రి

ప్రలోభాల వల్ల
ఎక్కువ ‘లాభం’ ఎర
కుచ్చుటోపీ రెడీ

నక్కను చూసి
పులి చెరుపుకోదు చారలు

చూస్తావేం
ఎత్తుకో
బోసినవ్వు

- శంకర వెంకట
నారాయణరావు
ఆచంట
email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.

email: merupurjy@andhrabhoomi.net

-ఎం.భాగ్యలక్ష్మి