రాజమండ్రి

జోరుగా హుషారుగా... ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏమండీ! వాషింగ్ మెషీన్ కొనండి.. రూ.28వేలు అవుతుందట.. ఊర్మిళ చెబుతోంది.. అదయితే మనం అస్సలు కష్టపడక్కర్లేదట.. ఎంచక్కా సుఖపడవచ్చును..’ అంది సురేష్మ.
‘నిజం చెప్పు.. ఊర్మిళ చెప్పిందనా? లేక నీకు అవసమా?!’
‘అంటే ఏంటి మీ ఉద్దేశ్యం.. అవసరమైతేనే కదా.. నేను కొనమనేది’ రోషంగా అంది.
సురేష్మను తదేక దృష్టితో చూస్తున్నాడు. పెళ్లప్పుడు సన్నజాజి మొగ్గలాగా ఉండేది. ఇప్పుడు ఎంత సుఖపడుతోందంటే బట్టలు పిండితే బకెట్ పైకి తెచ్చివ్వమని డాబా మీద నుండి కేక వేస్తుంది. ఆల్రెడీ నాలుగైదు టైరులు నడుసుస్థానంలో ఉన్నాయ్. పిండి రుబ్బటానికి గ్రైండర్, పప్పుకడగకుండా ఛాయ మినపప్పు.., కూరలు తరక్కునేవి..ఇలా ఇల్లండా సామానుల షాపులా చేసింది. నిజంగా కొన్నాళ్లకు నమల్లేక ఆహారం టాబ్లెట్స్, లిక్విడ్స్ రూపంలో తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు..అనుకున్నాడు సురేందర్.
‘ఏంటాలోచిస్తున్నారు..కొనకుండా ఏం ప్లాన్ వేద్దామా..అనేగా’
‘ప్లాన్ వేస్తున్నానంటూ నీకు భయపడుతున్నానేగా అర్థం..్భర్యా విధేయుడిని కదా!’
‘మీరు నవ్వుల్లో పెట్టి అసలు విషయం దాటేయవద్దు’
‘ఒకసారి పేపర్ చదువు..తల్లీకొడుకులు వాషింగ్ మెషీన్ స్విచ్ వేస్తూ షాక్ కొట్టి పోయారట’
‘అక్కడక్కడా అలా పోతూనే ఉంటారు..గ్యాస్ సిలెండర్ పేలి, ఫ్లైట్ కూలి, రైలు పట్టాలు తప్పి..అవేం పట్టించుకోకూడదు..’జ్ఞానోదయం చేస్తున్న దానిలా ఫోజు పెట్టింది.
ఈసారి ఈ పేపర్ న్యూస్ కూడా వర్కవుట్ కానందుకు బాధ పడ్డాడు సురేందర్. ఏం చేయాలో తోచడం లేదు.
తనింట్లో ఇద్దరు పిల్లలు, తను, సురేష్మ ఉంటారు. ఆ మాత్రం పనిచేయకపోవడానికేం లేదు. తాను ప్రతి విషయంలో సాయం చేస్తాడు. స్నానం చేయిస్తే ఒళ్లు తుడిచి బట్టలు వేస్తాడు. కూరలు కట్ చేస్తాడు. కానీ..ఆమె ప్రతి వస్తువుపై మోజు పడుతూనే ఉంటుంది. ఇదే విషయం ఫ్రెండ్‌తో ప్రస్తావిస్తే ‘ఇది కామన్..ప్రతి గృహిణికీ అవసరం’ అన్నాడు వాషింగ్ మెషిన్ ప్రచారకునిలా..వీల్లేదు..తానేదో ఒకటి చేయాలి. ఏం చేయాలి?!, వాకింగ్‌కు వెళ్లదు..రొప్పుతూ ఆపసోపాలు పడుతుంది. ఆయిల్ ఫుడ్ మానదు. అదేమంటే పిసినారి అని సంఘంలో పేరు వచ్చేలా చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి.
‘ఏమండోయ్.. మనకు డబ్బుకేం లోటు లేదుకదా!’ సురేష్మ
‘సో..వాట్?’
‘అదేనండీ, మీరు ఏం కొనమన్నా క్లాస్ తీసుకుంటారు.
‘మన పెళ్లి ఆల్బం తీసుకురా.. సురేందర్’
‘నేనేం మాట్లాడుతున్నాను.. మీరేం అడుగుతున్నారు?’ సురేష్మ
‘పోనీ వీడియో తెస్తావా!’
‘ఏంటండీ హఠాత్తుగా ఇలా మాట్లాడుతున్నారు’ ఆమెకూ సంతోషంగానే ఉంది. ఏడేళ్ల క్రితం జరిగిన పెళ్లి. తనకూ చూడాలనే ఉంది. కాసెట్ వేసింది. ఆమె తన పెళ్లి ముస్తాబులో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది..ఎంతో ముచ్చటగా ఉంది.
‘ఆ అమ్మాయి నీ సిస్టర్ కదూ!’ కొంటెగా అన్నాడు.
‘అదేంటి నేనే కదా!’ చిరాకుగా అంది సురేష్మ
‘అప్పుడెందుకిలా ఉన్నావ్.. ఇప్పుడెందుకిలా అయ్యావ్’
‘డెలివరీలు, మందులు, మార్పు రాదేంటీ?’
‘కాదుకాదు.. నీకు సిజేరియన్ పడలేదు కదా!.. నార్మల్ డెలివరీనే కదా!’
‘అప్పుడు స్కూల్, కాలేజీ చాలా దూరంగా ఉండేవి.
ఆటోలు కూడా ఉండేవి కాదు..ఎర్లీగా లేచి తయారై ఫ్రెండ్స్, నేను మాటలు చెప్పుకుంటూ నడిచి వెళ్లేవాళ్లం.’
‘గుడ్ నడిచే వాళ్లు నడవకపోయినా, డాన్స్‌చేసే వాళ్లు ఆపేసినా.. ఇలా టైర్లు వస్తాయి. ఒబెసిటీ వస్తుంది. అప్పుడు ఆయాసం.. హార్ట్ ప్రాబ్లెమ్స్ అన్నీ వస్తాయన్నమాట..’ నాటకీయంగా అన్నాడు సురేందర్.
‘మరి మీకెందుకు రావడం లేదు వళ్లు?.. మీరేం పని చేయరుగా.. ఒంటి తీరు అంతే’ సమాధానం తానే చెప్పేసుకుంది.
‘లేదులేదు.. యూ ఆర్ మిస్టేకెన్.. నేను ఆఫీసు దగ్గర షటిల్ ఆడతాను. దానితోపాటు కొంత దూరం నడుస్తాను కూడా..’
‘ఆ ఆడేదేదో ఇక్కడే ఆడవచ్చు కదా!..నేను కూడా ఆడతాను’ అంది సురేష్మ
‘దట్స్‌గుడ్! రేపటి నుండే ఆడదాం.. నీక్కూడా బ్యాట్ కొంటాను..’ తన దారిలోకొస్తున్నందుకు ఆనందంగా ఉంది తనే మరలా అన్నాడు.
‘సురేష్మా!.. నీవు ఆ తలంబ్రాలు పోస్తుంటే చేతులు చూడా తామరతూడుల్లా.. వావ్! ఎంత అందంగా ఉన్నావ్.. ఆ ముఖం ఎంత కోలగా ఉంది.. డబుల్ చిన్ లేకుండా.’
ఈ మాటలకు తను ఉలిక్కిపడింది. ఏంటి తనను భర్త ఇంతగా అబ్జర్వ్ చేస్తున్నాడా?.. డబుల్ చిన్.. వెళ్లి అద్దంలో చూసుకుంది. నిండా ముప్ఫై ఏళ్లు లేవు.. నిజంగానే తనకు డబుల్ చిన్ వచ్చేసింది. అవును తను నాల్గు బట్టలు ఉత్తుక్కోవడానికి వాషింగ్ మెషీన్ అడిగింది, సుఖపడాలనుకుంటోంది.
ఇప్పుడు నిజంగా తను సుఖపడాలనుకుంటుందా! అందరికీ ఉన్నవి కాబట్టి ఉండాలనుకుంటోందా!.. ఇన్నాళ్లు భర్తను ఒక పిసినారిగా తాను భావించింది. అంతే కాదు..చాలాసార్లు దెప్పిపొడిచింది. ‘పెళ్లయ్యాక కలెక్టరైనా చప్రాసీలాగానే కనిపిస్తుంది అని’ కానీ అతను తన అందాన్ని గురించి, ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాడు.
‘నిజంగానే రేపటి నుండి షటిల్ ఆడదాం.. పార్కుకెళ్లి అక్కడ వాకింగ్ చేద్దాం.. అప్పుడు మీరు నన్నిక ఏ కామెంట్ చేయరు గదా!’
‘అదేంటి అలా అన్నావ్.. నేనేమన్నా ఎవరితోనన్నా పోల్చానా.. నీతోనే కదా!’
నిజమే తను ఎప్పుడూ అతని నోటి వెంట ఎవరినీ పోల్చి తనను అవమానించటం ఎరుగదు. వేళాకోళానికి కూడా ఏమీ అనడు. తనంటే అంత ప్రాణం.
‘సరే రెడీ అవ్వు.. బయటకు వెళదాం’
‘ఎందుకు!.. అనుమానంగా’ అడిగింది.
‘అలా సరదాగా తిరిగొద్దామోయ్’
‘అంటే ఈవాల్టినుండేనా ప్రారంభం’
‘మరి పోస్ట్‌పోన్ నచ్చదు’
బండి తీసుకెళ్లి సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దగ్గర ఆపాడు. ‘దిగు సురేష్మా’
‘ఏంటండి?’
‘ప్రశ్నలు వేయక పద.. వాషింగ్ మెషీన్ కావాలన్నావుగదా’
‘ఇప్పుడేం అక్కర్లేదు.. నేనే ఉతుక్కుంటాను.’
భర్త తన అందం గురించి అంత ఆలోచిస్తున్నాడని తెలిసి అంది.
‘అదేంటోయ్.. కావాలన్నావు గదా! నీక్కూడా సమయం కలిసొస్తుంది కదా’
‘సమయం కలిసొచ్చి ఏం చేయాలి.. మరో రెండు సీరియల్స్ చూడాలి.. నేను హోంమేకర్‌నే కదా! ఆరోగ్యంగానే ఉన్నాను కదా’
‘అయితే ఏమంటావ్.. ఈ ఆడాళ్లు మనసులు ‘క్షణక్షణముల్ మారు జవరాండ్ర చిత్తముల్’ అన్నట్లుంటాయ్.
‘మరి మీరు మాత్రం ఇందాక వాషింగ్ మెషిన్ కొననని.. ఇప్పుడు కొనడానికి సిద్ధపడలేదా?’
‘నా ప్రాబ్లెం సాల్వ్ అయంది.. నీవు నడుస్తానన్నావ్.. షటిల్ ఆడతానన్నావ్.. ఇంకేమిటీ.. నీ అందం, ఆరోగ్యం నాకు ముఖ్యం కదా!’
‘అలాగే మీ గౌరవం, అభిప్రాయాలు నాకు ముఖ్యం..’ గోముగా అంది అతని చేతుల్లో చేతులు కలుపుతూ..
‘అయితే పద..’ ఒక జ్యూయలరీ షాపు దగ్గర ఆపాడు.
‘ఓ మంచి సింపుల్ నల్లపూసలు కొనుక్కో’
‘ఏంటండీ ఇలా... పదండి.. ఈ ఖర్చంతా ఎందుకు?’
‘ఊర్మిళగారి ముందు నీ భర్త పిసినారి కాదని చెప్పుకోవచ్చు..’ కన్నుగీటుతూ అన్నాడు.
‘ఏమక్కర్లేదు.. మన జీవితం మన ఇష్టం.. ఇన్నాళ్లు అపార్థం చేసుకున్నాను.. మన్నించండి’
‘నోవే నీకు నచ్చిందా.. నాకు నచ్చిందా అనేది పాయింట్’
‘సరే మీకు నచ్చిందే తీసుకోండి’
‘అయ్యబాబోయ్.. సురేష్మాగారు నాకిన్ని ఆఫర్లిస్తున్నారేంటి’
‘మరి అబ్బాయి గారు ఇలా ఆభరణాలు కానుకగా ఇస్తుంటే.. సంతోషం తట్టుకోలేక..’ మళ్లీ తానే అంది.
‘ఏమో బాబు.. జోరుగా హుషారుగా షికారుపోదామంటే ఏమిటో అనుకున్నాను గానీ.. మీలో ఇంత తెగింపా’ అని ఇప్పుడే ఆశ్చర్యపోతున్నాను.
‘మరి... అవసరానికి, ఆనందానికి మాత్రమే ఖర్చుపెడతాడీ సురేందర్ గాడు!’
‘వోయ్.. చంటిగాడు లోకల్ అన్నట్లు రవితేజాలా మాట్లాడుతున్నారే’
‘సరే అది బాగుంది చూడు.. నీకు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే..’
‘తెలుసు నేను ఛామనఛాయగా ఉంటాను కాబట్టి.. చామనఛాయ’ అని వత్తి పలుకుతూ అంది.
సురేందర్ చాలాసార్లు చెబుతాడు.. తెల్లగా ఉండాలనే భావజాలం నుండి మనుషులు బైటకు రావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని.. వాళ్ల అమ్మ చెబుతుంది కలర్ కాదు.. కళ కావాలి. గుణం కావాలి.. అని.
‘బంగారానికే అందం నీ ఛాయ బంగారం..’ అన్నాడు.
ఇద్దరూ డబ్బుకట్టి ఆనందంగా బయటకు వచ్చారు.
‘ఇది ఏ అకేషన్ గిఫ్ట్?’
‘అకేషన్‌కి ఇస్తే ప్రతి అకేషన్‌కీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అనిపించినప్పుడు అనిపించినట్లుగా..’ పకపకా నవ్వుతూ అన్నాడు.
‘పోండి తెలివి!’ నెమ్మదిగా మొట్టింది
‘ఇలా అని తెలిస్తే కొనేవాడినినే కాదు’
‘అంత గట్టిగా ఏం నేను కొట్టలేదు’
‘సత్యభామ మొగుడి తలను తన్ని లెంపలేసుకున్నట్లుగా..’ సురేందర్ ఉడికిస్తున్నాడు.
ఆమెకు భర్త ఎంతో అద్భుతంగా, ఆనందంగా కనబడుతున్నాడు. అవును తన శరీరం పర్మిట్ చేయనప్పుడు మాత్రమే.. సమయం అలా అవ్వడానికే అయితేనే కొనుక్కోవాలి. అవసరమైనవే ఉంచాలి.
మిగిలిన సామాను తాను రేపే ఆడపడుచులకు, చెల్లెళ్లకు, కొన్ని వాడనివి పనివాళ్లకు ఇచ్చేయాలని నిర్ణయంచుకుంది. ఇల్లుని నందనవనంలా చేయాలి. ఆ ఇత్తడివి ప్రతి సంక్రాంతికి తోమకుండా.. అవసరమైనవి ఉంచి, మిగిలినవి అమ్మేసి బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి అని అలోచిస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది. అంతే తృప్తిగా ఊపిరి పీల్చుకుంది సురేష్మ.

పుస్తక సమీక్ష

భౌతిక రసాయన శాస్త్రంలో
విద్యార్థుల కరదీపిక

పదవ తరగతి పబ్లిక్ పరీక్ష-2017
భౌతిక రసాయన శాస్తమ్రు
మూడు టెస్టు పేపర్లు
రచన: సి.వి.సర్వేశ్వరశర్మ
వెల: రూ.70/-

ప్రతులకు:
శ్రీవాగ్దేవి ప్రచురణలు,
కృష్ణమూర్తివీధి,
అమలాపురం - 533201
మొబైల్: 9866843982

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఇప్పుడు సంగ్రహణ మూల్యాంకన విధానంలో మన రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్నాయి. విద్యార్థులు ఈ విధానంలో ప్రతి ప్రశ్నకు జవాబులు సొంతంగా ఆలోచించి రాయాలి. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశం ఏ మేరకు అవగాహన అయ్యిందో తెలుసుకునేందుకు ఈపద్ధతిలో ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రశ్నలన్నీ ఓపెన్ ఎండెడ్‌గా ఉంటాయి.
ముఖ్యంగా విద్యార్థులు భౌతిక రసాయన శాస్తమ్రు విషయంలో ప్రశ్నలు ఏవిధంగా ఉంటాయోనని కొంత ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు తగిన ఆత్మస్థైర్యం, పరీక్షలో అత్యుత్తమ విజయం సాధించేందుకు కావలసిన స్వయం శిక్షణ పొందేందుకు అనుకూలంగా ఉండే విధంగా రచయిత ఈమూడు నమూనా ప్రశ్నాపత్రాలు-జవాబులతో సహా రాసి ముద్రించారు. విద్యార్థులకు ఏపద్ధతిలో కృషిచేయాలో తగిన మార్గదర్శకం లభించకపోవచ్చు. అటువంటి సందర్భాలలో వారు కఠినంగా శ్రమపడాల్సి వస్తుంది. సాధారణంగా విద్యార్థులు అందుబాటులో ఉన్న వనరులతో నైపుణ్యాలు అలవరచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే సరైన వనరులు ఇచ్చే శక్తి సామర్థ్యాలు ముందు ఇటువంటి వనరులు ఇచ్చేవి చాలా తీసికట్టుగా ఉంటాయని రచయిత తన ముందుమాటలో చెప్పారు.
ప్రస్తుతం అమలులోకి వచ్చిన సిసిఇ నమూనాను దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా ప్రశ్నలు-జవాబులు రచయిత రాశారు. ఈ పుస్తకం విద్యార్థులకు మంచిమార్కులు తెచ్చిపెట్టే కల్పతరువుగా ఉంటుంది. పైగా ఇటీవల ఎస్‌సిఇఆర్‌టి వారు విడుదల చేసిన నమూనా ప్రశ్నాపత్రానికి అనుగుణంగా ప్రశ్నాపత్రాలు-జవాబులు రూపొందించారు.
పరీక్ష రాయడం అనేది ఒక కళ. చదివిన చదువుకు ఫలితంగా ఎంత ఉన్నతి పొందారు అనే దానికి ఇదొక మదింపు సాధనం. అందుకే ప్రతి విద్యార్థి జాగ్రత్తగా ప్రణాళికతో చదవాలి. అటువంటి ప్రణాళికతో కూడిన ప్రశ్నలు-జవాబులు ఈ పుస్తకం. రచయితగా 58 సంవత్సరాల అనుభవంగల రచయిత రూపొందించిన ఈ పుస్తకం ప్రతి విద్యార్థికి కొంత భరోసా, ధైర్యం భౌతిక రసాయన శాస్తమ్రు విషయంలో కలిగిస్తాయని ఈ సమీక్షకుని అభిప్రాయం.
ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులందరూ విద్యలో బాగా రాణించాలనే తీవ్రమైన కోరికతో కృషిచేస్తూ ఉంటారు. ఈ పుస్తకం విద్యార్థులు పరీక్షను ధైర్యంగా, తెలివిగా రాసేందుకు కావలసిన శిక్షణను వారి మనసులకు సమకూర్చి వారిని సబ్జెక్టు విషయంలో సుసంపన్నం చేస్తుంది. విద్యార్థుల్లోని అంతర్గత ప్రతిభలు, తగిన దిశలో వారి కృషి కేంద్రీకృతమైన నాడు, వాటి సామర్థ్యాన్ని సులువుగా ప్రదర్శించగలుగుతాయి. ఈ పుస్తకం తప్పక విజయం సాధించేందుకు విద్యార్థుల కృషి వేగాన్ని పెంచేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
తెలుగులో రాసిన పుస్తకానికి అచ్చం ఇంగ్లీషులో అనువదించి తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో చదివే విద్యార్థుల అభ్యున్నతి కోసం రచయిత రాసిన పుస్తకాలు ఎవరికి వారే హీరోలు, ఎవరి కృషి వారిదే, ఎవరి ప్రతిభ వారిదే. సరైన దిశలో కృషిచేసిన వారికే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అన్నితరహాల విద్యార్థుల కోసం రాసిన పుస్తకం ఇది అంటారు రచయిత.
పుస్తక సమీక్ష విషయానికి వస్తే ఒక మార్కు ప్రశ్నలకు సరిగా రెండు వాక్యాలలోనే జవాబులు ఇచ్చారు. అదేవిధంగా రెండుమార్కుల ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో అర్ధవంతంగా సులువుగా చదువుకునే విధంగా సమాధానాలు పొందుపరిచారు. నాలుగు మార్కుల ప్రశ్నలకు ఎనిమిది, పది వాక్యాలలో జవాబులు పూర్తిచేశారు. పార్టు-బిలో ఇచ్చిన 20 ప్రశ్నలు దేనికవే ప్రత్యేకం. ఇటువంటి పేపరుకు జవాబులు రాయడానికి విద్యార్థులు సంసిద్ధులు కావడానికి ఈ పుస్తకం ప్రతి విద్యార్థికి గొప్ప నేస్తంగా ఉంటుంది.

- మట్టపర్తి సత్యనారాయణ
తూర్పు గోదావరి జిల్లా, సెల్: 7032661253

మనోగీతికలు

మహాత్ముడి మార్గం

గాడ్సేల రాజ్యంలో గాంధీజీ జీవించగలరా?
అవసరానికో అబద్ధం ఆడే ప్రబుద్ధుల మధ్య
‘సత్యవాక్కులు’ సన్మానం పొందగలవా?
హింసకు హింసే సమాధానమని
గర్జించే ఆవేశపరుల మధ్య
‘అహింస’ అందలం ఎక్కగలదా?
అలంకరణలు ఆడంబరాల గంగిరెద్దుల మధ్య
‘నిరాడంబరత’ నీరాజనాలు అందుకోగలదా?
ఏ ఎండకాగొడుగు పట్టే
గోముఖ వ్యాఘ్రాల మధ్య
‘నిక్కచ్చి వ్యక్తిత్వం’
నిలువెత్తు నిదర్శనం కాగలదా?
పైసల కోసం పదిమందిని పణంగా పెట్టే
నాయకుల మధ్య
ప్రాణాల్ని పణంగా పెట్టే
‘పోరాటం’ ఆదర్శ కెరటం అవుతుందా?
అధికార దుర్వినియోగం,
అవినీతి, ఆశ్రీత పక్షపాత జాడ్యాల మధ్య
నీతి నిజాయితీ నిబద్ధత
నిప్పులా నిలబడగలవా?
గాంధీ అంటే ఒక సిద్ధాంతం, కాదది అంతం
గాంధీ అంటే ఒక స్ఫూర్తి, అఖండ కీర్తి
గాంధీ అంటే ఒక నమ్మకం, సుగుణాల వల్మీకం
గాంధీ అంటే ఒక ఆదర్శం, అనితర సాధ్యం
కాలం మారినా ప్రపంచం మారినా
రంగులు మారినా రాజకీయం మారినా
సూర్యచంద్రుల్లా కాలదోషం లేనిది ‘గాంధీ’మార్గం2
అంతరిక్షాన్ని అధిరోహిస్తున్నా
అనుసరణీయం
‘మహాత్ముడి మార్గం’!
ఇలాంటి నరుడొకడు
ఇలాతలంలో నడయాడిన
ఆనాటి అద్భుతాల్ని భావితరాలకు
చెప్పాల్సింది నేటి తరమే!!

- మామిడిశెట్టి శ్రీనివాసరావు
దొడ్డిపట్ల, పశ్చిమగోదావరి జిల్లా
సెల్: 9573347744

స్వాతంత్య్రం
ఎందరో మహానుభావుల ఆశ,
ఇంకొందరు మహాత్ముల ఆకాంక్ష,
కొందరు మహనీయుల ప్రాణబిక్ష,
కొందరు మహాతల్లుల వౌన బిక్ష,

దశాబ్దాల నిరీక్షణ,
అంతులేని ఆక్రందన,
ఉవ్వెత్తున ఎగిసిన విప్లవం,
అందరూ ఒక్కటై చేసిన పోరాటం,
తెచ్చింది నా దేశానికి స్వాతంత్య్రం2
కొందరు నాయకుల ఆశ,
మరికొందరు నాయకుల అత్యాశ,
అవినీతిపరుల ఆకాంక్ష,
స్వాముల ఊబిలో కూరుకుంది నా దేశ భవిత
పేదవాడి కడుపుకొట్టి, మేడమీద మేడ కట్టి,
ఎదురుప్రశ్నించిన వాడి చెంపమీద కొట్టి

విదేశాల్లో మూలుగుతుంది నల్లధనం,
ఆమడదూరంలో ఆగింది అభివృద్థి పథం
మహానుభావులే వచ్చిన, మహాత్ములే దిగివచ్చిన
మరొక్కసారి తేగలరా నా దేశానికి స్వాతంత్య్రం

- పిల్లా రమణబాబు
ఏలూరు, సెల్: 9652659027

విద్యా విపణి
నిన్న అమ్మానాన్నలు చదువుసంధ్యలు లేకున్నా
విచక్షణాజ్ఞానంతో సుశిక్షణా గానంలో
సుఖసంతోష లహరిలో ఓలలాడారు
నేడవి మృగ్యమై, సౌఖ్యాన్ని ద్రవ్యంతో కొనుక్కుంటూ
సంతోషం ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాము
రేపటి సృజనరహిత ‘రోబో’2తత్వ వారసులు
సుఖసంతసాలంటె తెలియని ‘మర’దాసులు
మీటనొక్కితేనే స్పందించే అరసిక విశేషులు
మణుగుల పుస్తక జ్ఞానంతో మస్తిష్కం లావై
వ్యక్తిత్వం కుచించుకుపోయిన భౌతిక అవశేషులు
ధనార్జనే పరమావధి చేసుకున్న చెల్లని కాసులు
సంస్కృతీ సాంప్రదాయ పథమును మరచి
రాంకుల రేటింగుల రేసుగుర్రాలుగా మలచి
విజ్ఞత, స్థితప్రజ్ఞత బోధించని డాంబిక నేపథ్యంలో
హృదయ వికాసం సాధించని చదువులు నిరర్ధకం
విచక్షణ సుశిక్షణ బోధించని విద్యా విపణి వ్యవస్థలో
యువత భవితవ్యం సార్థకమా - ప్రశ్నార్థకమా?

- చాగంటి సుబ్రహ్మణ్యం, అనపర్తి
సంచారవాణి: 9573386124

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

email: merupurjy@andhrabhoomi.net

- సుధా శశిరేఖ 94415 99321