రాజమండ్రి

పింఛను ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయాణంలో చల్లగాలి ఎక్కువగా ఉంది. పూర్ణ సిటీలో హెల్పర్‌గా పనిచేస్తోంది. తిండి, బట్ట ఖర్చు ఉండదు. కొంత జీతం ఇస్తారు. వృద్ధాప్యపు పింఛను వెయ్యి వస్తుంది. ప్రతినెలా 2,3 తారీఖుల్లో బయలుదేరి పక్కనే ఉన్న పల్లెటూరికి వెళ్లి పింఛను తెచ్చుకునేది. ఈసారి నగదు రహితంలో వెళ్తే వేలిముద్రలు పడలేదు. పింఛను ఇవ్వలేదు. తిరిగి మళ్లీ పండుగ రేషన్‌కి రమ్మన్నారు. పల్లె వెళ్లినప్పుడల్లా... వంద కాగితం ఖర్చు. చలిగాలికి దగ్గు వస్తోంది. టానిక్ సీసా వంద రూపాయలు. అలాంటివి మూడు సీసాలు తాగింది. దగ్గు తగ్గలేదు. మళ్లీ బిళ్లలు అడిగి వేసుకుంది. మందుల కొట్టువాడే వైద్యం. పెద్ద డాక్టర్లకి ఫీజు ఇవ్వలేదు. పింఛన్‌లో సగం డబ్బు మందులకే సరిపోతుంది. ఇంటి వాళ్లు మంచి వాళ్లు కనుక బట్టకి లోటు లేదు. తిండి నాలుగు పూటలా ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రెండు పూటలా ఉంటుంది. అన్నంలోకి పప్పు, కూర, పులుసు అన్నీ ఉండాలి. పచ్చి పచ్చడి, నిల్వ పచ్చడి రెండూ ఉండాలి. మంచి ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. సర్వ జనులు సుఖంగా ఉండాలని ఎన్నో పథకాలు, అవకాశాలు కల్పించారు.
‘నారు పోసినవాడు నీరు పోస్తాడన్నట్టు’2 పింఛను కూడా వస్తోంది. కనుక లోటు లేదు. కూతురు ఏడాదికి ఒకసారి తీసుకెళ్లి ఓ వంద రూపాయలు ఇస్తుంది. చీర కొంటుంది. దానికి ఇల్లు వాకిలి ఉంది. అన్నీ ఉన్నా పిల్లలు లేరు. దానికి దిగులు. ఆ కోపం తల్లిమీద చూపిస్తుంది. ఆర్థిక స్థోమతలేని కుటుంబం. అత్తగారు గయ్యాళి. భర్త నోరు విప్పకుండా చిత్రాలు గీసి సంపాదించేవాడు. అతని అనంతరం పదివేలు మిగిలితే బ్యాంకులో వేసుకుని దేశంలో బతకడానికి ఒక వృద్ధాప్యపు ఆశ్రమానికి వచ్చింది. అక్కడ ఉండలేక వారి ద్వారా తెలుసున్న ఇంటిలో హెల్పర్‌గా కుదిరింది. జీవితంలో ఉన్నోరకాల ప్రయాణాలు, మార్పులు, చేర్పులు. కాలగమనంలో ఎన్నో సమస్యలు. సర్దుబాటు లేందే జీవితం లేదు. జీవన సమరంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఆనందాలు అంతంత మాత్రమే. ఆటో బ్రేక్‌తో ఆలోచనల్లోంచి బయటపడింది. లారీ ఎదురొచ్చి ఢీకొట్టేలోపే తప్పించాడు. టర్నింగ్‌లలో పల్లెటూళ్లలో, ఇరుకు రోడ్లు. పక్కకు తప్పుకోడానికి చోటు లేకుండా ఉంటాయి. కొన్ని చోట్ల పెద్ద చెట్ల మానులు అడ్డంగా ఉంటాయి. ఇంకా పది నిమిషాల్లో మండల ఆఫీసు వచ్చేస్తుంది. ఈలోగా ఈ హడావుడి. ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకు జీవుడా అనుకున్నారు. ఆటో ఎక్కిన వాళ్లు ఇంటికి చేరేదాకా స్థిమితం ఉండదు. నమ్మకం ఉండదు. బతుకు బండిలో ప్రయాణాలు తప్పవు. మండల కార్యాలయం దగ్గర ఆటో ఆపాడు. ఓ ఫర్లాంగు నడవాలి. ఆఫీసు లోపలికి వెళ్లాలంటేనే ముందు చాలా దూరం నడవాలి. పక్కన ఉన్న బడ్డీ కొట్లో టీ తాగితేగాని ప్రాణం లేచి రాలేదు. ఓ గ్లాసు టీ చాలలేదు. ఇంకో గ్లాసు కొనుక్కుని తాగింది. అప్పటికే క్యూలో ఓ పాతిక మంది వరకు నిలబడి ఉన్నారు. కొందరైతే వాళ్ల పిల్లల్ని నించోబెట్టి అరుగు మీద కూర్చున్నారు. వారి పేరు టైముకి క్యూలోకి వెళ్లి నిల్చుంటారు. రకరకాల వయసు సమస్యలు. మనుషుల్లో మానవత్వం మరుగున పడ్డది. పాత నోటుకి ఐదు వందలికి యాభై తగ్గించినట్టు వందలు యాభై పుచ్చుకుంది. తన దగ్గరున్న నాలుగు నోట్లూ అదే పద్ధతిలో మార్చుకుంది. అంతెందుకు దాచావు అన్నారు కొందరు. పూర్ణ వెళ్లి క్యూలో నిలబడింది. నల్లగా లావుగా పొట్టిగా ఉంటుంది. కొద్దిగా కీళ్ల నొప్పులు, అలసట అయినా నిలబడక తప్పదు. పింఛను మిషన్‌లో వేలిముద్ర పడటం లేదు. సరిగ్గా పడని వాళ్లకి డబ్బులు ఇవ్వరు. మళ్లీ రమ్మంటారు. అలా పది మందిని పంపేశారు. క్యూ పలచన అయ్యింది. పూర్ణ పేరు వచ్చింది. బ్రతుకు దేవుడా అని వేలిముద్ర నొక్కింది. కొంచెం సరిగ్గా రాలేదు. పనికి రాదు పొమ్మన్నాడు. బలం చాలడం లేదు. నీరసంగా ఉంది. హోటల్లో అన్నం తిని వస్తాను. మధ్యాహ్నం ఇచ్చెయ్యి బాబు అంది. చూస్తాను. గట్టిగా తినిరా అన్నాడు. క్యూలోంచి బయటపడి పక్కనే ఉన్న పాక హోటల్‌కి వెళ్లి భోజనం తింది. సాంబారు, కూర, మజ్జిగ, పచ్చడి వేసి పళ్లెం ఇచ్చాడు. యాభై రూపాయలు తీసుకున్నాడు. మళ్లీ అన్నం వెయ్యమంటే మొఖం అదోలా పెట్టి వడ్డించాడు. ఓ అరగంట అరుగుమీద కూర్చుని ఆఫీసు వాళ్లు లంచ్ అవర్ తర్వాత బయటపడ్డాక ఆఫీసుకి వెళ్లి క్యూలో నిలబడింది. అప్పటికే పదిమంది ఉన్నారు. వేలిముద్ర సరిగ్గా వెయ్యకపోతే డబ్బు రాదు. రాత్రికి ఇంటికి వెళ్లిపోవాలి. ఆ ఆఫీసర్ని బ్రతిమాలి బామాలి ఎలాగో ముద్ర బాగా రాకపోతే డబ్బు రాదు. బలం లేకపోయినా ఈ ముద్రలు సరిగ్గా రావని చెప్పారు. ముద్ర బాగా వచ్చేలా చూసుకుని డబ్బు తీసుకుని బయటపడింది. కొందరికి 2 వేల కాయితం ఇచ్చి ఇద్దర్ని పంచుకోమన్నారు. చిల్లర సమస్య. అసలు డబ్బు ఇచ్చినందుకు సంతోషించి క్యూలోంచి బయటపడుతున్నారు కొందరు. పూర్ణకి మాత్రం అయిదు వందల నోట్లు కొత్తవి రెండు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుని హతోస్మి అనుకుంటూ బయటకు వచ్చింది. ఇదు వందల నోటు మార్చాలి. మందులు కొట్టు దగ్గరికి వెళ్లి మందు కొని మార్చింది. ఈ నెలలో పండుగ రేషన్ మళ్లీ రావాలి. అవి పట్టుకెళ్లి తన స్నేహితురాలికి ఇవ్వాలి అనుకుంది. ఆ ఊళ్లో దూరపు బంధువు ఉంది. ఆమెకు ఇస్తూ ఉంటుంది. తన రేషన్ కార్డు ఆమెకు ఇచ్చింది. అత్తింటి దూరపు బంధువు. ఎప్పుడైనా ఓ రోజు ఉండాలి అంటే ఆమె దగ్గరికి వెడుతుంది. వాళ్లు అంతంత మాత్రం మనుష్యులే. అప్పుడప్పుడు ఏవైనా కొని ఇస్తుంది. వంట వార్పు కోసం ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి పశ్చిమ గోదావరి వచ్చింది. గూడెంలో ఓ వృద్ధాశ్రమంలో 50 మందికి వండి వార్చేది. అక్కడ చెయ్యలేక తన స్నేహితురాలి ద్వారా సిటీకి వచ్చి హెల్పర్‌గా చేరింది. ఆ ఇంట్లో ఇంటామె చాలా బాగా చూస్తుంది. కాని కోడలికి కొంచెం కోపం ఎక్కువ. మొగుడు దుబాయ్‌లో ఉంటాడు. పిల్లలు హాస్టల్లో ఉంటారు. అత్త, ఆమె ఉంటారు. అన్నిరకాల సమస్యలకు పరిష్కారంగా ఎదుటి వాళ్ల మీద రుసరుసలు. వేలిముద్ర మిషన్లు వచ్చాక తనకి డబ్బు గురించి బెంగ పట్టుకుంది. రెండు నెలలు రేషన్ అందలేదని స్నేహితురాలు చెప్పింది. పండుగ సరుకులు ఇస్తే బూర్లు వండుకోవచ్చని ఆశపడింది. స్నేహితురాలు పండుగకి రావే పూర్ణా అని ఫోన్‌లో చెప్పింది. నాకెక్కడ కుదురుతుంది. మొన్న పింఛనుకి వచ్చాను. అన్నం తినడానికి నీ ఇంటికి రాలేక, అక్కడే హోటల్‌లో తిన్నాను. పడుకోవాలంటే రావడం తప్పదు. మన జీవితాల్లోకి తాయిలం చేతిలోపెట్టి ఆనక పిల్ల లాగేసుకున్నట్టు ఈ మిషన్లు వచ్చాక ఏ నెల డబ్బు ఇస్తారో ఇవ్వరో తెలీక బాధపడుతున్నాను. ఆర్థిక ఇబ్బంది నగదు రహిత భారతంలో. డబ్బు రహితంగా మారింది. కార్డులు పని చెయ్యడం లేదు. బట్టల కొట్టులో చీరకొని కార్డు ఇస్తే డబ్బు రాలేదు. చీర కొట్లో పెట్టి కొంత డబ్బు పర్సులో ఉంది కట్టి వచ్చానని కోడలు అత్తకి చెప్పింది. ఎక్కడికి వెళ్లినా అంతా ఆర్థిక భారమే. ఈ పింఛన్లు ఇలా ఎంతకాలం? ఈ రోజూ, లేకపోతే రేపు అని తిప్పి తిప్పి ఇస్తారు. ఆర్థిక మాంద్యం ఎంతకాలం. ఇలా ఎంత కాలం గడుస్తుందో?
‘సర్వేజనా సుఖినోభవంతు’ ఇదీ పాలకుల ధ్యేయం.

- ఎన్ వాణిప్రభాకరి,
తణుకు, ప.గో.జిల్లా

మనోగీతికలు

అనే్వషించు

చెయ్యెత్తి జే కొట్టమంటూ
నినదించిన దేశ భక్తులతో
తరియించిన పవిత్ర నేల
మదరాసీలంటూ వెక్కిరింతలతో
కుంగిపోతున్న తెలుగు తల్లి
సగర్వంగా తలెత్తి నిలబడాలని
అమరజీవి సల్పిన త్యాగధన్యత
పొందిన పుణ్యభూమి!
టంగుటూరి ప్రకాశంగారి, అసమాన
అకుంఠిత సేవతో ప్రత్యేక రాష్ట్రంగా
ఏర్పడిన ధన్యసీమ తెలుగు సీమ!
యువతే దేశానికి వెనె్నముకలన్న
వివేకానందుని స్మరణ సందేశాలు!
మరుగునపరస్తూ త్యాగాలను, సుగుణాలను
జారవిడుస్తూ,
ఎక్కడికి నీ పయనం?
తమ కష్టాలు, కన్నీళ్లను దిగమింగి
నీ చదువుకై తాము పస్తులుంటే
ఫీజులకై అప్పుల పాలవుతూ
అనుక్షణం నీ ఉన్నతికై తపించే పెద్దల
కష్టాన్ని గమనించక
నీ చదువు నీవు చదవక
వెర్రిమొర్రి ఆలోచనలు,
కుళ్లిన రాజకీయ చదరంగాన
బలిపశువుగా మారావెందుకు?
కుల, మత, జాతి, వర్ణ బేధాల కొలిమికి
సమిధగా మారావెందుకు?
వెయ్యి మాటల కన్నా ఒక్క చేతమిన్న
ఉద్యమాలెందుకు? నీ ఊపిరి కోల్పోడానికి
ఆవేశాలెందుకు?
ఆత్మాభిమానం మంటగలవడానికా
ఓ రైలు ఇంజన్‌ను దహించి
మరో ఇంజన్ సృష్టించగలవా?
లక్షల మందిలో ఒక్కడిగా
మన రాష్ట్రానికో
మోక్షగుండం విశే్వశ్వరయ్యవి కాగలవా?
ఓ సుందరయ్యలా పేదల పెన్నిధి కాగలవా?
లక్ష్యం, గమ్యం, ఆశయం,
ఏకాగ్రత, సుగుణాలతో
నీలో మనిషిని అనే్వషించు!
అన్యాయాలనెదిరించు!
ప్రేమ వర్షాన్ని కురిపించు!

- ఉప్పులూరి శైలజ
సెల్: 9440247596

సన్మార్గం వైపు నడిపే
‘ప.వి.కృతములు’
చరిత్రాత్మకమైన బొబ్బిలి గడ్డకు చెందిన దివంగత పంతుల విశ్వనాథరావు ప.వి.గా, కవిగా, విశే్లషకునిగా, బొబ్బిలి కళాభారతి కన్వీనర్‌గా సాహితీమిత్రులకు సుపరిచితుడే. ఈయన ఉపాధ్యాయ పురస్కారం గ్రహీత, విశాఖ వాసి పంతుల సీతాపతిరావుకు సోదరుడు. విశ్వనాథరావు కలం నుంచి జాలువారిన రచనలు ఆనాటి వివిధ పత్రికల్లో వెలువడి బహుమతులను పొందాయి. అయితే, సమాజశ్రేయస్సు దృష్ట్యా ఈ రచనలన్నింటినీ ఒక సంపుటిగా పంతుల సీతాపతిరావు తీసుకురావడం ప్రశంసనీయం. మొత్తం 34 పేజీల్లో ఉన్న వివిధ పద్యాలు ‘నేటి వ్యక్తి’ని సన్మార్గంవైపు నడిపిస్తాయి. విశ్వనాథరావు మొదటిపేజీనే ‘దైవస్తుతి-ప్రార్థన’తో ప్రారంభించడం భగవంతునిపై ఆయనకు ఉన్న భక్తిని వెల్లడిస్తుంది. పరుల పట్ల దయచూపితే నిన్ను దైవం కూడా కష్టాల్లో ఆదుకుంటుందని తన ‘కర్తవ్యం’లో చెప్పారు రచయిత. అలాగే, చులకనగా చూదొద్దని, విద్యకు విలువ పెంచమని, తెలిసినదంతా బోధించి, అందరి చేత మంచిమాటలు పలికించుము అని కోరారు. పచ్చని భూమలు, పాడి పంటలు వెలకట్టలేని సంపదలని, అప్పటి పల్లె వాసి తనకు నచ్చిన వృత్తిని చేపట్టి, నిస్వార్థునిగా పేరుతెచ్చుకున్నాడని విశ్వనాథరావు ‘పల్లెటూరు’లో వర్ణించారు. కట్నాలు, కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి, బాధపడడం కంటే, ఆ కార్యం లేకుండానే వివాహాలు చేస్తే ఇరువైపులా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ‘పెండ్లిసందడి’లో లోకానికి చాటారు. మంచిదారిని మరిచిపోతే నట్టింట వచ్చి, నర్తించి లక్ష్మీదేవి వెళ్ళిపోయి, చివరకు ఉన్నదంతా ఊడ్చిపెడుతుందని ‘అవినీతి’లో బోధించారు. సంపుటి చదివాక విశ్వనాథరావు పద్యరచనలో మంచిపట్టుగలవారని అవగతమవుతుంది.
- గున్న కృష్ణమూర్తి

ప్రకృతి ఘోష

నేను కదలకపోతే మీకు ఊపిరాడదు
నా స్పర్శ మీకు హాయినిస్తుంది
అజ్ఞానంలో కలుషితం చేశారు నన్ను
మీ అనారోగ్యానికి నేనే కారణమన్నారు
నేను స్తంభించానా మీ ప్రాణం పోతుంది
నేను లేకుంటే మీ దప్పిక తీరదు
మీ అవసరాలు తీర్చేది నేనే
ఆలోచన లేక వ్యర్థ పదార్థాలు నాలో కుమ్మరించారు
పదిలంగ, పవిత్రంగ చూడాలి నన్ను
వృథా చేస్తే మిగిలేది తీరని వ్యథ
సకల చరాచర జగత్తుకి ఆధారం నేనే
మీ మనుగడ సాఫీగా సాగాలంటే
నన్ను ప్రాణసమానంగా చూసుకోవాలి
మీ భారాన్ని మోసేది నేనే
మీ స్వార్ధానికి నన్ను ఛిద్రం చేస్తున్నారు
మీ పాపాలతో నన్ను పంకిలం చేస్తున్నారు
భూమీద కాలుష్యం పెంచారు
నన్నంటి ఉండే ఓజోన్‌కి ముప్పు తెచ్చారు
ఇసుమంతైనా ఇంగితం లేదా మీకు
విజ్ఞానమంటూ వింత ప్రయోగాలు చేశారు
అంతరిక్షాన్ని కొల్లగొట్టి మసి చేశారు

- విఎస్‌ఆర్ వౌళి,
పాలకొండ రోడ్డు, శ్రీకాకుళం-532001.
సెల్ : 7093693268.

సాహితీ సమాలోచన

‘మెరుపు’ ప్రయోగం
ఓ సాహసం!

తెలుగు సాహిత్యాభివృద్ధికి తొలి మెట్టు ఔత్సాహిక రచయతలకు సరైన వేదిక
ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ

ఒక తరానికే పరిమితమైన తెలుగు సాహిత్యాన్ని యువతరానికి స్ఫూర్తి నిచ్చేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రభూమి చేస్తున్న ప్రయోగమే ‘మెరుపు’ ప్రత్యేక శీర్షిక. తెలుగు పత్రికా రంగంలో మెరుపు శీర్షిక నిర్వహణ ఒక పెద్ద సాహసం అని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మెరుపు రచయితలు, కవులు, కాలమిస్టులు, కార్టూనిస్టులతో విశాఖ ఆంధ్రభూమి కార్యాలయంలో గత బుధవారం (మార్చి 1వ తేదీ) ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంవిఆర్ శాస్ర్తి తన అభిప్రాయాలను, మనోభావాలను రచయితలు, కవులతో పంచుకున్నారు. ప్రస్తుతం జనజీవనానికి దూరమైన తెలుగు సాహిత్యాన్ని బతికించు కునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పాతతరం యువతపై నాటి సాహిత్యం కలిగించిన ప్రభావాన్ని ఈ కాలపు యువతపై నేటి తెలుగు సాహిత్యం తీసుకురాలేక పోయిందని అన్నారు. యువతరంలో సాహిత్యాలాభిషను పెంపొందించేందుకు నాటి తరం సాహిత్యాభిమానులు కృషి చేయాలని, అందుకు ఆంధ్రభూమి ‘మెరుపు’ వేదికగా నిలుస్తుందని అన్నారు. ఎన్నో కష్టానష్టాలకోర్చి సాహిత్యాభిమానుల కోసం ‘మెరుపు’ను నిర్వహిస్తున్నామని అన్నారు. రచయితలకు ప్రోత్సాహం ఇచ్చి వారి నుండి కొత్త రచనలు వచ్చే విధంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.
మూస కథలకు, కవితలకు పరిమితం కాకుండా ‘మెరుపు’ను సరికొత్త రీతిలో నిర్వహించేందుకు కూడా ఔత్సాహిక రచయితలు సహకరించాలని ఎంవిఆర్ శాస్ర్తి కోరారు. ముఖ్యంగా రచనల్లో కొత్తదనంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా కథలు, కథానికలు, సమీక్షలు తదితర అంశాలను పంపాలని సూచించారు.
‘మెరుపు’ ద్వారా సాహిత్యం పట్ల మక్కువ పెంపొందించడం, ఔత్సాహిక యువ రచయతలకు అవకాశం కల్పించి వారి ప్రతిభను సానబెట్టడం, వివిధ సాహితీ ప్రక్రియల్లో కొత్తతరం రచయితలను తయారు చేయడం ‘మెరుపు’ లక్ష్యమని శాస్ర్తీ పేర్కొన్నారు. రచయితలు వినూత్న ప్రక్రియలు, పోకడలను ఎంచుకుని తమలోని ప్రతిభా వ్యుత్పత్తులను చూపించాలన్నారు.
స్థానిక రచయతల సాహితీ వ్యాసంగాలు, జిల్లాస్థాయి సాహితీ సంస్థల కార్యకలాపాలకు ప్రాచుర్యం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా, ప్రాంతీయ స్థాయి రచయితలకు సమన్వయ వేదికగా ‘మెరుపు’ పేజీని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ‘మెరుపు’ ప్రయోగం విజయవంతం అయిం దని, ఉత్తరాంధ్ర రచయితల నుండి దీనికి మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ అభిమానులతో ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రొఫెసర్ డి విశే్వశ్వరం మాట్లాడుతూ భాష పట్ల మక్కువ తగ్గుతోందనీ, భాషను బతికించుకోవడం ద్వారా సాహిత్యాన్ని పదిలం చేసుకోవాలని సూచించారు. అందుకు ఆంధ్రభూమి వంటి పత్రికలు తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. కేవలం భాషా దినోత్సవం రోజునో, గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు వేడుకల్లోనో భాష ఔన్నత్యంపై ప్రసంగించి మర్చిపోయే సంప్రదాయం పోవాలన్నారు.
సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ మాట్లాడుతూ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న రీతిలోనే నాటక రచనలకూ ప్రోత్సాహం అందించాలని సూచించారు. బాలల సాహిత్యం, హాస్య రచనలు పాఠకులను ఆకర్షిస్తాయని, వీటికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఈ తరం పిల్లలను సాహిత్యం వైపు మళ్లించవచ్చని సూచించారు.
రచయిత ఎ సీతారామారావు మాట్లాడుతూ రచనా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆంధ్రభూమి మెరుపు శీర్షిక ద్వారా రచనాభిమానులకు ప్రోత్సాహం లభిస్తోందని, ఇది శుభ పరిణామంగా పేర్కొన్నారు. సాహితీ అభిమానులు తరచు సమావేశమై ప్రస్తుత రచనా సరళిపై చర్చిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు.
శేషాద్రి సోమయాజులు మాట్లాడుతూ పాఠకుల అభిరుచులు మారుతున్నాయని, వారి అభిరుచులకు అనుగుణంగా రచనా శైలిని మార్చుకుని చేరువ కావాల్సి ఉందన్నారు.
మాధవీ సనారా (సత్యనారాయణ) మాట్లాడుతూ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధాన్ని టాబ్లాయిడ్ రూపంలో కాకుండా పుస్తక రూపంలో అందిస్తే అపురూపంగా భద్రపరచుకునేందుకు వీలవుతుందని సూచించారు.
రచయిత అనురాధ మాట్లాడుతూ కథలు, కవితలు రాసే ఔత్సాహికులకు మెరుపు ఒక వారధిగా పని చేస్తోందని కొనియాడారు. మిగిలిన పత్రికల్లో సాహితీ అంశాలు కనుమరుగవుతున్న తరుణంలో భాష, సాహిత్యానికి ఆంధ్రభూమి పెద్దపీట వేయడం హర్షించతగ్గ పరిణామమన్నారు.
‘మెరుపు’లో ప్రచుఠణకు స్వీకరించే కవితలు, కథలు, వ్యాసాలకు సంబంధించి ఆయా రచయతలకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలన్న రచయతల విజ్ఞప్తికి ఎంవిఆర్ శాస్ర్తి సానుకూలంగా స్పందించారు.
ఉత్తరాంధ్ర ‘మెరుపు’ సమన్వయకర్తలు బులుసు సరోజినీదేవి, దుర్గాప్రసాద్ సర్కార్ మాట్లాడుతూ రచనల నిడివికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా రచయతలకు కొన్ని సూచనలను అందించారు. కథలు వ్రాతప్రతిలో రెండు ఎ4 సైజు పేజీలకు మించరాదనీ, కవితలు పదిహేను నుండి ఇరవై పంక్తులలోపు ఉండాలని సూచించారు. అనంతరం మెరుపు శీర్షికకు రచనలు పంపే రచయితలు, కవులను ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రభూమి రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు కూడా పాల్గొన్నారు.
- ఆంధ్రభూమి బ్యూరో,
విశాఖపట్టణం

1. విశాఖపట్టణంలో జరిగిన మెరుపు రచయతల ఆత్మీయ సమావేశం సందర్భంగా రచయిత్రి రాయవరపు సరస్వతితో మాట్లాడుతున్న
ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ. పక్కన వ్యంగ్య చిత్రకారిణి ఉప్పులూరి శ్రీదేవి వేసిన చిత్రాలను పరిశీలిస్తున్న దృశ్యం.

2. కార్యక్రమానికి హాజరైన ‘మెరుపు’ కవులు, రచయితలు

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- ఎన్ వాణిప్రభాకరి