రాజమండ్రి

పండగొచ్చెనమ్మొ... (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాశాల రంగురంగుల తోరణాలతో రమణీయంగా ఉంది. ఎన్‌ఎస్‌ఎస్ యూత్ ఫెస్ట్ జరుగుతుంది. రకరకాల కళాశాలల విద్యార్థులు యూనిఫామ్స్‌తో ఐడి కార్డ్స్‌తో ముచ్చటగొలుపుతున్నారు. హోస్ట్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో వేదిక మీద డిపిఒ సూచనలిస్తూ ఉపన్యాసమిస్తుంది. ఏయే పోటీలు ఏయే గదుల్లో జరుగుతాయో ఎనౌన్స్‌మెంటు జరుగుతుంది. పిల్లలంతా అధ్యక్షుని ఉపన్యాసానికి ఎన్‌ఎస్‌ఎస్ క్లాప్స్ కొడుతున్నారు. నాట్ మి బట్ యు అంటూ దేశ్‌కి తాకత్, దేశ్‌కి ఇజ్జత్ నౌజవాన్, నౌజవాన్ వంటి నినాదాలతో సెమినార్ హాల్ మారుమ్రోగింది. ఉఠే హమారే దేశ్‌కీ ఉఠే అంటూ విద్యార్థుల ప్రార్థన అలరించింది. సెమినార్ హాల్‌లో క్లాసికల్ డాన్స్, క్లాసికల్ లైట్ మ్యూజిక్, ఫోక్ వంటి సింగింగ్ కాంపిటీషన్స్, ఫోక్ డానె్సస్, మోనోయాక్షన్, మిమిక్రీలు జరగనున్నట్టు, రంగోలి ఆరుబయట గీసిన బాక్స్‌స్‌లో వేయాలని మిగిలిన కార్యక్రమాలు సంబంధిత గదుల్లో ఎనౌన్స్‌మెంట్ జరిగింది. సూర్యా కళాశాలలే అన్ని ప్రైజులు అని కొందరు వ్యాఖ్యానించటం జరుగుతుంది. సింగింగ్, డాన్సింగ్ (క్లాసికల్) వాళ్లవే అనుకున్నారు. జోనల్ లెవెల్‌లో ప్రథమ బహుమతి వస్తే డిస్ట్రిక్ట్ లెవెల్, అక్కడ వస్తే యూనివర్శిటీ లెవెల్‌లో వస్తుంది. పిల్లలంతా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. శాస్ర్తియ నృత్యంలో ఆరు కళాశాలలు చేశారు. అందులో సూర్యా కళాశాల అబ్బాయి అతడు కూచిపూడిలో మద్రాసు, ఢిల్లీలో ఎన్నో అవార్డులు పొందిన వాడు. ప్రేక్షకులు ఇతనికి గ్యారంటీగా ఫస్ట్‌ప్రైజ్ వస్తుంది అని కేకలు. అదేవిధంగా క్లాసికల్. ఈరెండు ప్రైజులు తప్పవు అనుకుంటున్నారు. ఓ లైట్‌మ్యూజిక్, ఓ ఫోక్ పాడాలన్నారు. అలాగే పాడి రక్తికట్టించాడు ఒక అబ్బాయి. తదుపరి ఇన్‌స్ట్రుమెంటు. అందులో ముగ్గురే ఉండటం వలన మొదటి ప్రైజు ఇది కూడా సూర్యా కళాశాలకే అనుకున్నారు. అక్కడ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రంగోలీ, వక్తృత్వం, చిత్రలేఖనం, వ్యాసరచన, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, క్విజ్ అన్ని ఫలితాలొచ్చాయి. ప్రిన్సిపాల్ రూమ్‌లో డిస్కషన్ మొదలయ్యింది.
‘ఏమమ్మా డిపిఒ ప్రైజుల విషయం ఏమిటి? మా హోస్ట్ కాలేజీకేమి రావా! ఈ విషయం ముందే చెప్పొచ్చుగా అన్నీ సూర్యా కాలేజీకే ఇస్తామని’ మండిపడుతున్నాడు.
‘నేను ఇంకా ఏమీ ఎనౌన్స్ చేయలేదులెండి, నేనేదోకటి చేస్తాగా, మీరూరుకోండి’.
నిజానికి వాళ్లంతా ఆరితేరి ఉన్నారు. ఏం ట్రైనింగ్ ఇస్తారు తెలియదు. ఫోక్ డ్యాన్స్‌లో మనదేగదా. మిమిక్రీ, మోనోయాక్షన్ మన కాలేజీకే కదా వచ్చింది.
‘అందులో వాళ్లకెందుకు రాలేదు’ ప్రిన్సిపాల్
‘వాళ్లు పార్టిసిపేట్ చెయ్యలేదండి’
‘ఇదన్న మాట కారణం. అంటే వాళ్లు పార్టిసిపేషన్ ఉంటే ఇవి కూడా రావన్నమాట’
ఏవమ్మా మా కాలేజీని అవమానించడానికి మా కాలేజీలోనే పెట్టారన్న మాట. ఇంత కన్నా పరువు తక్కువ మరొకటి ఉండదు.
నువ్వేంజేస్తావో నాకు తెలియదు. ఫలితాలెలా ఉండాలో నువ్వే చూడు. విసురుగా కుర్చీ తన్ని లేచి వెళ్లిపోయాడు.
డిపిఒ ఊర్మిళ ఆలోచనలో పడింది. ఎన్‌ఎస్‌ఎస్ అంటే మన జేబులో ఖర్చుపెట్టే వ్యవహారమే. అక్కడికీ పిల్లలెవరికీ బిస్కెట్ తప్ప భోజనం లంచ్ ఏం కూడా ఏర్పాటుచేయలేదు. హోస్ట కాలేజ్ అయ్యుండి పార్టిసిపేషన్ కాదు కదా! ప్రైజ్ విన్నర్స్‌క్కూడా సర్ట్ఫికెట్ కూడా లేదు. తనకీ జాబ్ ఎంత కష్టతరంగా ఉందో.
అధికారం వదులుకోవడానికి సిద్ధంగా లేక, ఇందులో తనకు తృప్తి అప్పుడప్పుడూ వచ్చే మెగా క్యాంపుల ప్రోఫిట్స్ వదలలేక తమ ప్రిన్సిపాల్ అభ్యంతరం పెట్టినా సెలవుపెట్టి మరీ నిర్వహిస్తుంది. ఇప్పుడు తనకు మాత్రం ఆ కాలేజీ అంటే కడుపు మంట లేకపోలేదు. తాము ఏ ఈవెంట్‌కి పిలిచినా పరీక్షలని, ప్రాక్టికల్స్ అని ఏదో నామ్‌కేవాస్తే అన్నట్టు పిల్లల్ని పంపుతారు. ప్రతీ ఆదివారం బస్సులేసుకుని మరీ ర్యాలీలు, మెడికల్ క్యాంపులు బ్లడ్ డొనేషన్స్ వంటివి విరివిగా ఇండివిడ్యువల్‌గా చేస్తారు. స్పెషల్ క్యాంపులు చేస్తారు. ఇంక ఏవిధంగా వాళ్లని తొక్కయ్యాలి. కానీ ఇక్కక జడ్జెస్‌తో సహా వారి ప్రతిభా పాటవాలన్నీ అందరూ గమనించారు. క్విజ్‌లో మోసం జరిగే అవకాశం లేక ఫస్ట్ ఎలాగూ ఇవ్వక తప్పలేదు. కొంచెం ముందు మా పిల్లలకు క్వశ్చన్స్ రిలీజ్ చేయొచ్చు కదా అంటాడు ఈ ప్రిన్సిపాల్. ఇప్పటికే తనకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎన్‌ఎస్‌ఎస్ పోటీలకు కొన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్ పిల్లల్ని పంపమంటున్నారు. వారు డిస్కరేజ్ అవుతున్నారంట. ఎన్నిసార్లు రాజకీయాలు నడిచినా పార్టిసిపేషన్ ఉండాలని పంపే ఏకైక కళాశాల ఈ సూర్యా కళాశాల. సరే ఏదో ఒకటి చెయ్యాలి. ఇతనితో ముందు ముందు చాలా పనులున్నాయి. ఆవిడ జడ్జస్ వేసిన పేపర్స్ అందుకుంది. వక్తృత్వం రిజల్ట్ మార్చేసి ఫస్ట్ ప్రైజ్‌ని ద్వితీయ బహుమతిగా మార్చింది. చిత్రలేఖనం తృతీయ బహుమతిగా, అలాగే మిగిలినవన్నీ మార్చింది. క్విజ్ తప్ప అన్నీ పై పోటీకి అర్హతలేనివే. ఎన్నో పత్రికలలో పడే ప్రైజ్‌లు తెచ్చుకున్న ఒరిజినల్ పోయట్‌కి కవిత్వంలో థర్డ్‌ప్రైజ్ వచ్చింది. కేవలం సూర్యా కాలేజ్ కావడమే వాళ్లు అనర్హులుగా అయ్యారన్న విషయం తెలిసింది.
వేదికపైన ప్రైజెస్ ఎనౌన్స్‌మెంట్ జరుగుతుంది. క్విజ్ తప్ప అన్నీ హోస్ట్ కాలేజీకే. రంగోలి గవర్నమెంట్ కాలేజీకి. నిజానికి చాలా ఆ ముగ్గు బాగుండి చూపరులను కట్టిపడేసేలా ఉంది. కడుపు మండిన సూర్యా కాలేజ్ స్టూడెంట్స్ డిపిఒ ఊర్మిళ దగ్గరకు నడిచారు.
‘నన్ను జడ్జస్ కూడా మెచ్చుకుని ఫస్ట్ ప్రైజ్ నీదేనమ్మా అన్నారు ఏడుస్తుంది అంది షర్మిల.
‘అయితే మరి ఇలా ఎందుకు వేశారు అంటూ వెర్రినవ్వు నవ్వింది ఊర్మిళ’
వాళ్లను పిలవండి ఆవేశంగా అంది పువ్వులా ఏ కల్మషం లేని షర్మిల.
‘చిత్రలేఖనం బొమ్మ నాది బాగుంటే ఏదో నాలుగు గీతలు గీసిన వాడికిచ్చారు’ క్రోధంగా అన్నాడు రాజ్‌కుమార్ జైన్.
మోడరన్ ఆర్ట్ అని దీనినే ఫస్ట్ అని చెప్పారు జడ్జస్ మరలా ఓ వెర్రినవ్వు.
‘నేను సంగీతం మాస్టారు కొడుకుని, ఎన్నో పరిషత్‌లలో ప్రైజులు పొందాను’ నాకిలా అన్యాయం చేశారు, జడ్జస్ నాది చాలా కమ్మని గొంతని సంగతులు పలుకుతున్నాయన్నారు తీవ్రంగా అన్నాడు రవి.
‘సంగీతం మాష్టారు కొడుకైతే బాగా పాడాలనే ఉంది’ అదే వెర్రి నవ్వు ఊర్మిళది.
‘నా పద్యాలు నచ్చలేదా? ఇప్పటికిప్పుడు ఆశువుగా చెప్పగలను, భావం, భాష ఎక్కడ తప్పుందో చెప్పండి’
‘అందులో నలుగురిని మెప్పించే ఫీల్ లేదు, అందుకే మీకు థర్డ్ ప్రైజ్’ అదే వెర్రినవ్వు.
‘నాకు నాట్యంలో ఎన్నో ప్రైజ్‌లు వచ్చాయి. మూడేళ్ల నుండీ చేస్తున్నాను. ప్రైజ్ రానివ్వకుండా శాస్తప్రరిజ్ఞానం లేని వాళ్లకిస్తున్నారు’
‘అసలు ఫైనల్ జడ్జ్‌మెంట్ జడ్జెస్‌దే కదా’
‘వ్యాసరచన పేపర్ తెప్పించండి, ఎవరికైనా చూపించండి, నాకు ప్రైజ్ రాకపోతే నేను జీవితంలోనే పార్టిసిపేట్ చేయను. కాని వాళ్లు న్యాయంగా, ధర్మంగా ఉండే వాళ్లై ఉండాలి అంది గంగాభవాని
‘మీ కాలేజీ వాళ్లే ఇలా గొడవ చేస్తారు. మిగిలిన వాళ్లెవరైనా ఇలా మాట్లాడుతున్నారేమో చూడండి’ మరలా వెర్రినవ్వుతో అంది ఊర్మిళ.
‘ఏం మేడమ్ సుమగారు మీరు పిఒ అయి ఉండి పిల్లలకామాత్రం సర్దిచెప్పలేరా! చూడండి, వీళ్లెలా మాట్లాడుతున్నారో, లేక మీరే వాళ్లని రెచ్చగొట్టి పంపిస్తున్నారా! అలా అయితే క్విజ్‌లో మీకు రానిచ్చే వాళ్లం కాదు కదా! కోపంగా అంది ఊర్మిళ’
‘అంటే ఆ టెక్నిక్ మీకు ఇంకా తెలియలేదేమో మొన్నీ మధ్య మా పిల్లలకు ఆ సన్మానం కూడా జరిగిపోయింది. ఎవరి కళాశాల పిల్లలు పాల్గొంటున్నారో వాళ్లే క్వశ్చన్స్ ముందే రిలీజ్ చేసి మాకు థర్డ్‌ప్రైజ్ వచ్చేలా చేశారు. కాని ఆ రోజు ఆ థర్డ్‌ప్రైజ్‌ని మేం ఫస్ట్ ప్రైజ్ కంటే చాలాచాలా గొప్పగా భావించాం.
ఊర్మిళ గారు! కారణాలేమైనా ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ బహుమతులు రావాలి, లేకపోతే ఆ పాపం అన్యాయం చేసిన వాళ్లని వదలదు. పిల్లలు గాయపడిన గుండెలతో ఆత్మఘోషతో మరలుతున్నారు. అది మంచిదికాదు. ధర్మం గెలుస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఇవన్నీ తాత్కాలికం. నాకు ఈ దెబ్బలు అలవాటయ్యాయి. నేను పార్టిసిపేషన్ ఉండటం కోసమే తీసుకొచ్చాను. రాబోయే రిజల్ట్స్ నాకు తెలుసు. ముఖ్యంగా నా పిల్లలకు చెప్పేదేమిటంటే జడ్జస్ నీతిగానే వేస్తారు. తరువాత మార్చేవారే సీతాకోకచిలుకలను గొంగళి పురుగులు చేయగల సమర్థులు అంటూ చిద్విలాసంగా జడ వెనక్కి వేసుకుని ఠీవిగా నడిచింది సుమ.

- బి.హెచ్.వి.రమాదేవి
సెల్: 9441599321

పుస్తక పరిచయం

వృత్తికి పట్టం కట్టిన
‘పాత్రికేయం’
ప్రతులకు:
పద్మాంజలి
సూరజ్ హోమ్
స్టేట్ బ్యాంక్ దగ్గర
కోరుకొండ - 533289
సెల్: 9642489244
రాజకీయవేత్తల దగ్గర నుంచి రాజకీయంగా ఎదగాలనుకున్న ఔత్సాహికులు అందరూ మహానటులే. వారి నటనను అంచనా వేయడం బహుశా ఆస్కార్ అవార్డుల నిర్వహణ కమిటీకి కూడా అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే వారంతా బాగా నటిస్తారు. కాదు కాదు బాగా జీవిస్తారు.
ఎక్కడ ఏ చిన్న వేదిక దొరికినా ఊకదంపుడు వాగ్దానాలే ప్రవాహాలవుతాయి. అందరూ చెప్పేది ఒకటే సమ సమాజ నిర్మాణం, ఆర్థికంగా అందరికీ పరిపుష్ఠి, కుల రహిత సమాజ నిర్మాణం, అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ వసతి మొదలైనవి. కుల హత్యలు, వర్గ దోపిడీలు ఆగలేదు ఎక్కడా. కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రజాపక్షాన, న్యాయం తరఫున కొమ్ము కాసేది పత్రికారంగం అనడం ముమ్మాటికీ నిజం. ఇక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే ఏదైనా అన్యాయం జరిగినపుడు, పాత్రికేయులందరూ కుల, మతాలకు అతీతంగా ఒక తాటిపై ఉండి, దోషులను చెండాడం, ఆశ్రీతుల పక్షాన నిలవడం, వారికి న్యాయం జరిగేలా చూడడం, తద్వారా దోషుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించడం.
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా మహాసభ సందర్భంగా మిత్రులు రవికాంత్‌చే రచించబడ్డ నానీలు రాజకీయంగా, సామాజికంగా పత్రికల పాత్రను విలేఖరుల విధి, విధానాలను చాలా చక్కగా తెలియజేస్తాయి. రవికాంత్ అక్షరాన్ని శ్వాసిస్తాడు, ప్రేమిస్తాడు, శాసిస్తాడు. అందుకే అతని చేతిలో అక్షరం బుజ్జి పాపాయిలా కల్మషంలేని బోసి నవ్వులు విరబూస్తుంది. విశృంఖల పైశాచికత్వంపై పిడిబాకులా మారుతుంది. అమ్మతనంలోని మాధుర్యాన్ని రుచిచూపిస్తుంది. ముఖంలేని మనిషి యొక్క నైజాన్ని తనకత్యంత ఇష్టమైన గోదారి సిరాతో అక్షరబద్ధం చేయాలనుకున్న అక్షర శిల్పి రవికాంత్. రవికాంత్ చెప్తాడు, ‘చాన్నాళ్లుగా అక్షరమే నా స్నేహం. ప్రేమించే అక్షరమంటే ఇపుడు వ్యామోహం’ అని. ఇది ముమ్మాటికీ నిజం. రవికాంత్ అక్షరాలకు సొబగులద్ది అందమైన కవిత్వం రాయగలడు. అక్షరాలకు డైనమిజం జోడించి ఆయుధాలుగా మార్చగలడు.
రవికాంత్ తనకిష్టమైన కవితా ప్రక్రియ నానీల ద్వారా విలేఖరి యొక్క నైజాన్ని, బాధ్యతల నుంచి తప్పుకోని స్వభావాన్ని, అన్యాయాన్ని ఎదిరించి ప్రజల పక్షాన నిలబడే ధైర్యాన్ని అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడే ధీరత్వం కలిగిన సైనిక స్ఫూర్తిని చక్కగా చెప్పాడు. అతను ఒక చోట అంటాడు పత్రికలకు అక్షర సైనికులు విలేఖరులు అని. ఇది నూటికి నూరుపాళ్లు ఖచ్ఛితమైన పోలిక. ప్రకృతి వైపరీత్యాలు లేదా విద్రోహ చర్యలు జరిగినపుడు వార్తను సేకరించడం అనేది కత్తిమీద సాము లాంటిది. వార్తను సేకరించే దాకా నిద్రాహారాలు కూడా మానేస్తారు. అడిగిన వెంటనే నానీలను రాసిచ్చిన రవికాంత్‌ది స్నేహధర్మం. ‘నానీ‘ల ద్వారా విలేఖరుల జీవితాలు వర్ణించడం అతని ‘అక్షర ధర్మం’. మనం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రించడానికి రేయి పగలు నిద్రలేకుండా సరిహద్దును రక్షిస్తున్న వీరజవానుకి సెల్యూట్. సమాజంలో హెచ్చుతగ్గులు పోగొట్టి సమసమాజ నిర్మాణానికి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న పాత్రికేయ మిత్రులకు జై.
‘పాత్రికేయం’ పాత్రికేయులలో ఉన్న తమకు తెలియని కొన్ని విషయాలను సైతం తెలియజేసింది అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. పత్రికలు, పాత్రికేయులు సంఘ సంస్కర్తలు. సగటు సంఘ జీవి కోరుకున్న సమాజం రావాలి. ఈ చిన్న పుస్తకం ద్వారా పాత్రికేయుల జీవితాలను ఆవిష్కరించిన మిత్రులు రవికాంత్ గారు అభినందనీయులు.
తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు కథ, నవల, పద్యం రుబాయిలు, రెక్కలు, నానీలు రాజ్యమేలుతున్నాయి. నానీల ప్రక్రియకు ఆధ్యుడైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వాధ్యక్షులు (వైస్-్ఛన్సలర్) ఆచార్య ఎన్ గోపి రూపొందించిన ఈ నానీలు తెలుగు నాట బాగా ప్రాచుర్యమయ్యాయి. నానీల ప్రక్రియ ప్రారంభమై రెండు దశాబ్దాలు పూర్తి కావస్తున్న తరుణంలో ‘పాత్రికేయం’ రావడం తెలుగు పత్రికారంగం తెలుగు సాహిత్యానికి నూతన అధ్యాయానికి తెరతీసినట్టవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ వ్యాప్తి చెందిన ‘నానీల’పై నానీల సంపుటలపై పరిశోధన చేసి డాక్టరేటును సైతం పొందడం విశేషం.
పాత్రికేయం పుస్తకానికి ముందుమాట రాసిన యస్సార్ పృధ్వి ‘ప్రజలకు, ప్రభుత్వానికి నడుమ కిలకపాత్ర వహించేది పత్రికలు విలేఖరులు... పాలకుల అభిప్రాయాలు ప్రజలకి, ప్రజల స్పందన పాలకులకు చేర్చేది పత్రికలు’ అంటారు.
ఆ పత్రికలకు అక్షర సైనికులే విలేఖరులు. వారే పాత్రికేయులు. వారి వృత్తి, ప్రవృత్తుల గురించి చర్చించిన వాస్తవిక సత్యాలే పాత్రికేయం నానీలు. సుమారు పాతికేళ్లుగా విలేఖరత్వంతో అనుభవ సారాన్ని రంగరించి రాసిన వ్యాఖ్యానాలు పాఠకుల్ని రంజింప చేయడమేగాక తప్పక అలరిస్తాయి. ఆయన కలం నుంచి మరిన్ని చైతన్యపరిచే రచనలు రావాలని ఆకాంక్షిద్దాం.

- ఈతకొట్టు వీర్రాజు, సెల్: 8500507304

మనోగీతికలు

వసంతం కోసం...
మట్టి హృదయంలో
విత్తు స్పందన
మొక్కగా తల ఎత్తాలని
ఆకాశంలోని
రంగుల హరివిల్లు నవ్వుకు
అమ్మ వెచ్చని స్పర్శ
కనురెప్పల కింద చిగురిస్తోంది
వికసించే పువ్వులా
వేళ్లను మోస్తున్న
మట్టి గుండె
ఉదయించే చైతన్యం
కొత్త ఆనందాన్ని
నింపుతోంది
చిగురుకు సరికొత్త స్వాగతం
పలుకుతోంది
చినుకు తడికి తనువెల్లా
తనివితీరా తడిసిపోవాలని
నిరీక్షణ
ఎదలోతుల్లోనే
క్షణక్షణం సంతోషం
జీవిత గుమ్మానికి తోరణం కావాలి
హృదయం ఆకాశం కావాలి
ఆశల వాకిలిముందు
కాలం ముగ్గు వేస్తోంది
జ్ఞాపకాల కిరణాల చైతన్యంతో
కొత్త శక్తితో
మళ్లీ మళ్లీ చిగురిస్తుంది
నిరంతర శ్వాసగా
‘వసంతం’ కోసం..

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, సెల్: 9247577501

భారతదేశ మానస పుత్రిక

తే.గీ.॥ అసలు మార్గరేటే నోబెలు ఆమె పేరు
స్వామి శిష్యురాలిగా మారి సాదరముగ
ఇండియాకేగుదెంచె నైర్లాండు వనిత
నుతులు బడసే సోదరి నివేదితగ జగతి

తే.గీ.॥ ధరణిబ్రోజు సనాతన ధర్మమిలను
భారతీయత యందున వరలు ననెడి
స్వామిజీ వివేకానందు ప్రవచనాల
కామెయెంతో ప్రభావితమయ్యెనాత్మ

సీ.॥ అన్నపానాదులకలమటించుచునుండు
వేదనామయమైన బీదరికము
అంటువ్యాధిగమారి అసలు మానవతకే
హానిగూర్చెడి అంటరానితము
మిడిమిడి చదువులు మెయినహంకారము
ద్వేషమసహనాలు భేజజాలు
పరపాలనములోని పరిపీడనములును
బానిసతనములు పగులు వగలు

తే.గీ.॥ భారతావనికివి ప్రతిబంధకములు
వీటిని తోలగించవలయు వేగిరముగ
ఆర్షధర్మమపుడె అభివ్యాప్తమగును
విశ్వమంతయు సకల సుభిక్షమగును

తే.గీ.॥ స్వామిజీ వాక్యుధల గ్రోలి ఆమె భార
తీయ సంస్కృతీవిభవమ్ము తెలిసికొనెను
చేరి శారదామాత ఆశీస్సులంది
దేశ సేవకు తానివేదించుకొనెను
సీ॥ చిన్నారులతోబాటు కన్నవారికి కూడ
చదువుసందెలు చెప్పి చక్కదిద్దె,
ప్లేగుమహమ్మారి పీడితులకు వైద్య
సేవలనందించి సేదదీర్చె;
కరవువల్ల బ్రతుకు తెరువుకోల్పోయిన
ప్రజలను కాపాడు భారమూనె;
స్వాతంత్య్రమే మన సంస్కృతి రక్షించు
సాధనమని నమ్మి సహకరించె

తే.గీ॥ అంతిమ శ్వాసను విడుచునంతవరకు
స్వామి బోధనల్ స్ఫూర్తిగా ఆమె నడచె
ధాత్రి భారత మానస పుత్రికయయి
సిస్టరు నివేదిత నిలుచు స్థిరముగాను.

- తటవర్తి రాఘవరాజు
9963610243, రామచంద్రపురం,
తూర్పు గోదావరి జిల్లా

‘బ్లాక్’ మేజిక్
నాకు తెలీకడుగుతున్నా?
ఆవుపాలు దూడకా?..మనకా?..
మూతి బిగించి పితికేస్తున్నాం!
పట్టుతేనె ఈగలదా?, మనదా?
పొగబెట్టి మరీ పిండేస్తున్నాం!
మొదటి నుండీ దోపిడీ
మనకలవాడేనా?
గాలి పీల్చినంత స్వేచ్ఛగా
నీరు తాగినంత సులువుగా
‘దోచెయ్ దాచెయ్’
ఏమి నినాదం!
ఎంత దురంతం!
పది మంది బొక్కాల్సింది
ఒక్కడే నొక్కేస్తున్నాడు
ఎంత తింటున్నా
ఆశ తీరటం లేదు!
అజీర్తి చేయటం లేదు
గురివిందకు ఒకటే నలుపు
ఖలునికి ఒడలంతా నలుపేనా?
ఆహారం దొరికితే..
కాకి సమూహాన్ని పిలుస్తుంది
చీమ సమాజానికి పెడుతుంది
అల్ప జీవుల్లో పంచుకునే గుణం!
మనలో లేదు ఎంత దారుణం!
దండాలు నల్లబాబుల్లారా!
దండుకోవడం ఇకనైనా ఆపండి!
దండుని కూడా కొంచెం
తిననీయండి!
సర్వే జనా సుఖినోభవంతు..

- కౌలూరి ప్రసాదరావు,
వేళ్లచింతలగూడెం (పోస్టు)
ప.గో.జిల్లా - 534316,
సెల్: 7382907677

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- బి.హెచ్.వి.రమాదేవి సెల్: 9441599321