రంగారెడ్డి

ధాన్యం విక్రయించినా.. చేతికందని డబ్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 21: ధాన్యం విక్రయించి పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ చేతికి డబ్బులు అందక అన్నదాతలు కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. అరుగాలం కష్టపడి పంటలు సాగుచేయడం ఒక ఎత్తయితే.. ధాన్యం విక్రయించడం రైతుకు మరో ఎత్తయిందని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ధాన్యం విక్రయించిన రైతుకు రెండు రోజుల్లో బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమ కాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారస్థులకు ధాన్యం విక్రయిస్తే గిట్టుబాటు కావడం లేదని ప్రభుత్వ రంగ సంస్థల్లో విక్రయిస్తే నేటి వరకు డబ్బులు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 29న షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో డీసీంఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే హమాలీలు రాకపోవడం.. రైతులే నేరుగా తుకాలు చేసుకోవడం, లిఫ్టింగ్ చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక సమస్యలు తలెత్తాయి. ఏప్రిల్ 29వ తేది నుంచి మే 21వ తేదీ వరకు డీసీఎంఎస్ అధికారులు 107మంది రైతుల నుంచి 10వేల బ్యాగులు, నాలుగువేల క్వింటాల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించిన 107మంది రైతుల్లో ఏ ఒక్కరికీ బిల్లులు చెల్లించలేదు. దాంతో రూ.70లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. డీసీఎంఎస్ అధికారుల నిర్లక్ష్యం వహించడంతో జిల్లా ఉన్నతాధికారులు స్థానిక ఐకేపీ అధికారులకు రెండవ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అప్పగించారు. మే 13వ తేది నుంచి 20వ తేది వరకు 40మంది రైతుల నుంచి 3015బస్తాలు, 48క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. 40మంది రైతుల్లో ఏ ఒక్క రైతుకు బిల్లులు చెల్లించలేదని ఐకేపీ అధికారులు తెలిపారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో త్వరగా చేయలేకపోతున్నామని వివరించారు. సకాలంలో డబ్బులు అందకపోవడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు. మద్దతు ధర అందుతుందనే ఆశతో విక్రయించిన వరిధాన్యం డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి రాకపోవడంతో అన్నదాతలు ఖంగుతింటున్నారు.
ధాన్యం కొనుగోలు మొదలు డబ్బులను అందించే విషయంలో జరుగుతున్న జాప్యం అంతా ఇంతా కాదు. పట్టించుకోవాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అలసత్వం వహించడంతో రైతు బ్యాంక్ ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ కావడం లేదని, డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు వాపోతున్నారు.
సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించాలి
* రైతు గోపాల్ రెడ్డి
ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతు గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం విక్రయించి 15రోజులు గడుస్తున్నా నేటి వరకు డబ్బులు బ్యాంక్ ఖాతాలో వేయలేదని, కూలీలకు డబ్బులు ఇవ్వలేక అనేక అవస్థలు పడుతున్నట్లు వివరించారు. కార్యాలయానికి వస్తే ఇదిగో వేస్తాం.. అదిగో వేస్తామంటూ మాటలు చెప్పి పంపిస్తున్నారని, ఖాతాలో వేయడం లేదని తెలిపారు.
ఆన్‌లైన్ నమోదు ఆలస్యం
* డీసీఎంఎస్ అధికారి పాండురంగం
ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ఆలస్యం అవుతుందని డీసీఎంఎస్ అధికారి పాండురంగం వివరించారు. షాద్‌నగర్ డీసీఎంఎస్ ద్వారా 107మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని, వారిలో 40మంది రైతులకు రెండు రోజుల్లో బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమచేయనున్నట్లు వివరించారు. మిగతా 67మంది రైతులకు మరో రెండు రోజుల్లో పెండింగ్ బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి డబ్బులు వేయనున్నట్లు తెలిపారు.