రంగారెడ్డి

లోతట్టు ప్రాంతాలు జలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 23: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నియోజకవర్గంలోని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, దుందిగల్, గాగిల్లాపూర్, దొమ్మర పోచంపల్లి, కొంపల్లి, దూలపల్లి, జగద్గిరిగుట్ట, గాజులరామారం, చింతల్, సూరారం, సుభాష్‌నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ డివిజన్‌లలో భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్‌లలోని పలు కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. రోడ్ల పై వరద నీటితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండి మురుగునీరు రోడ్లపైకి చేరింది. నిజాంపేట్ గ్రామం, బండారి లే ఔట్ కాలనీలో అపార్ట్‌మెంట్‌ల సెల్లార్‌లకు వరద నీరు చేరింది. అపార్ట్‌మెంట్ వాసులు మోటార్ల సహాయంతో నీటిని తోడేసుకున్నారు. భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సూరారం డివిజన్ రాజీవ్ గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్ల పైకి మురుగునీరు, వరద నీరు చేరిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్, కార్పొరేటర్ సత్యనారాయణలు అధికారులతో కలిసి పర్యావేక్షించారు. వివేక్ మాట్లాడుతూ మరోసారి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ ఆదేశించారు. నిజాంపేట్ గ్రామం, బండారి లే ఔట్ కాలనీ, బాచుపల్లి గ్రామం, రాజీవ్ గాంధీనగర్, జయదీపికా అపార్ట్‌మెంట్‌లలో భారీ వర్షానికి ఇళ్ల మధ్య వరద నీరు నిలిచింది. బండారి లే ఔట్ కాలనీ రోడ్ నంబరు 8లో భారీ వర్షానికి ప్రహారీ గోడ కూలింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్ కాలనీలలో పర్యటించారు. వివేక్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రమాదానికి గురయ్యే ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. భూగర్భ డ్రైనేజీని శుభ్రం చేస్తూ జామ్ కాకుండా, కాలనీల్లో వరద నీరు, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆగం పాండు, నేతలు ధన్‌రాజ్, పాల్గొన్నారు.
నాలాపై కల్వర్టు పనుల పరిశీలన
జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామం నుంచి సుచిత్ర వరకు వెళ్లే దారిలో నిర్మిస్తున్న నాలా పై కల్వర్టు పనులను ఎమ్మెల్యే కేపీ వివేక్ పరిశీలించారు. వివేక్ మాట్లాడుతూ కల్వర్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో ఏ మాత్రం నాణ్యతా లోపం ఉండకూడదని హెచ్చరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమీషనర్ శంకరయ్య, ఉపకమీషనర్‌లు సుదాంశ్, విజయ్‌కుమార్, ఈఈ మహేశ్వర్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
విరిగిపడిన చెట్లు, రోడ్లపై నిలిచిపోయిన నీరు
కేపీహెచ్‌బీకాలనీ: గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కూకట్‌పల్లి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు భయాందోళనల మధ్య రాత్రంతా గడిపారు. పలు ప్రాంతాలలో డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ నిండి వరద నీటితో పాటు మురుగునీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు. మరి కొన్ని ప్రాంతాలలో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
బాలాజీనగర్‌లో...
బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్ ఐజీలోని కనకదుర్గా దేవాలయం వద్ద రహదారికి అడ్డంగా చెట్టు విరిగిపడడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ పన్నాల కావ్య హరిష్‌రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ రిస్క్‌టీం, పారిశుధ్య విభాగం కార్మికులతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లీయర్ చేయించారు. హెచ్ ఐజీ 62, 70 వద్ద వర్షపు నీటి కాలువలో వరద నీరు ప్రవహించడంతో ఉప్పోంగి నీరుతో పాటు బురద రోడ్లపైకి చేరడంతో వెంటనే శుభ్రం చేయించారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు అంజిరెడ్డి, డి.ఆర్. వెంకట్రావు, శంకర్, నగేష్, రత్తయ్య, చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
ఆల్వీన్‌కాలనీలో ...
కురిసిన భారీ వర్షానికి ఆల్వీన్‌కాలనీ డివిజన్ పరిధిలోని పరికి చెరువులకి పై నుంచి నాలాల విషవాయువులు కలవడంతో చెరువులో కలిసి ధరణినగర్ నాలాలో నురగలు వచ్చి నాలా పక్కన గల ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్ళడంతో పరికి చెరువు నాలాను పరిశీలించారు. వారు నీటి నమునాలను తీసుకుని వెళ్ళారని తెలిపారు. అనంతరం సిక్కుల బస్తీలో డిసి మంగతాయరుతో కలిసి ఆయన పర్యటించారు.
చినుకు పడింది.. చింత తీరింది
షాద్‌నగర్ రూరల్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి వర్షాలు లేకపోవడం.. ఎండల తీవ్రతతో అన్నదాతలు విలవిలలాడి పోయారు. శుక్రవారం రాత్రి జోరుగా వర్షం కురవడంతో అన్నదాతల మొహాల్లో వెలుగులు విరజిమ్మాయి. శనివారం ఉదయం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వైపు పరుగులు తీశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు ఆగ్రో సేవా కేంద్రం, ఫర్టిలైజర్ షాపుల వైపు పరుగులు తీసి విత్తనాలు కొనుగోలు చేయడంలో బీజీబీజీ అయ్యారు. ముందుగానే కొనుగోలు చేసి రైతులు ఏకంగా శనివారం ఉదయం వ్యవసాయ పొలాల్లో విత్తనాలు విత్తారు. వ్యవసాయ కూలీల కోసం గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి వర్షాలు లేకపోవడం.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం.. పంటల సాగుకోసం తెచ్చుకున్న విత్తనాల పరిస్థితి ఏమిటంటూ వేసి చూసిన అన్నదాతలకు శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో అన్నదాతలు పనుల్లో నిమగ్నమైయ్యారు. పత్తి, మొక్కజొన్న, కందులు, జొన్నలు వంటి విత్తనాలు విత్తే పనిలో ఉండిపోయారు. వ్యవసాయ పొలాల్లో ఎటు చూసినా అన్నదాతలు బీజీబీజీగా ఉండిపోయారని చెప్పవచ్చు. ఒకవైపు ఎరువులు, విత్తనాల దుకాణాలు రైతులతో కిక్కిరిసి పోవడం..పొలాల్లో సందడి నెలకొంది. ఏది ఎమైనప్పటికి కురిసిన వర్షానికి అన్నదాలు పనుల్లో నిమగ్నమైపోయారని చెప్పవచ్చు.
అమనగల్లు: గత నెల రోజులుగా వర్షాభావ పరిస్థితుల వల్ల సాగైన పంట మెక్కలు నేల వాలుతున్న దశలో శనివారం మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షం వల్ల రైతులు కొంత ఊరట చెందారు.
వరదనీటిని తొలగించేందుకు చర్యలు
బాలానగర్ : బాలానగర్ డివిజన్ పరిధిలోని ఫిరోజ్‌గూడ ఫూల్‌బాగ్ కాలనీలో నిర్మించిన రైల్వే అండర్ బ్రీడ్జి కింద శుక్రవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా నిలిచిపోయిన వరదనీటిని సర్కిల్ అధికారులఅతో తొలగించారు. రైల్వే అధికారులు నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలో వర్షం నీరు వెళ్లేందుకు సరైన మార్గాలను ఏర్పాటు చేయక పోవడంవల్ల స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సర్కిల్ అధికారులతో చర్చించి వరదనీటి తొలబింపునకు మార్గాలను సూచించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కాలనీ అధ్యక్షుడు సభాపతి రెడ్డి పాల్గొన్నారు.
కోతకు గురైన రోడ్లు.. చెరువు కట్టలు
మేడ్చల్: మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా ఊరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు అవస్థలు పడ్డారు. పలు ప్రదేశాల్లో రోడ్లు, చెరువు కట్టలు కోతలకు గురయ్యాయి. మురుగు కాలువల డ్రైనేజీలు వర్షాకాలం దృష్ట్యా శుభ్రం చేయకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి చెరువులను తలపించాయి. ఇటీవల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం పైపులైన్ మార్గం ఏర్పాటు చేయగా భారీ వర్షం కారణంగా పూర్తిగా కుంగిపోయి వాహనాలు ఇరుక్కుపోయాయి. రోడ్లుకూడా కొట్టుకుపోయాయి. నాణ్యత ప్రామణాలకు తిలోదకాలు ఇవ్వడంతో చాలవరకు అభివృద్ధి పనులు వర్షంధాటికి ఎందుకు పనికిరాకుండా పోయాయని ప్రజలు పేర్కొన్నారు. కొన్ని కుంటలు, చెరువులో వరద నీరు చేరింది. భారీ వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఆశించిన స్థాయిలో వరుణుడు కరుణించడంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైయ్యారు.
నవాబ్‌పేట మండలంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని 17మండలాల్లో వర్షపాతం నమోదవగా, అత్యధికంగా నవాబ్‌పేట మండలంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో నాలుగు, మోమిన్‌పేటలో ఒకటి, వికారాబాద్‌లో 5.8,పూడూర్‌లో 0.5,పరిగిలో 1.6,కులకచర్లలో సెంటీమీటరు, దోమలో మూడు, బొంరాస్‌పేటలో 1.8, ధారూర్‌లో, బంట్వారంలలో మూడు, ఎద్దెముల్‌లో ఐదు, తాండూర్‌లో మూడు, బషీరాబాద్‌లో 4.2, యాలాల్‌లో 2.5, కొడంగల్‌లో ఐదు, దౌల్తాబాద్‌లో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విస్తారంగా వర్షాలు కురియడంతో శనివారం రైతులు జిల్లా కేంద్రం, సమీప పట్టణాలు, మండల కేంద్రాలకు ఎరువులు, విత్తనాల కొనుగోలుకు తరలివచ్చారు.