రంగారెడ్డి

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ల అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 9: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ల అనుమతి లేదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మేరిఎనాట్స్ పాఠశాలలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈవీఎంలకు ఉన్న సీల్‌ను ఏజెంట్ల సమక్షంలో తొలగించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల జాబితాపై ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, ఈవీఎం, ప్యాట్లను సీల్ చేసి భద్రపర్చాలని తెలిపారు. సెల్‌ఫోన్‌లు తీసుకువచ్చినవారు పక్కనే ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద డిపాజిట్ చేయాలని చెప్పారు. ప్రతి రౌండు వారీగా ఫలితాల రిపోర్టులపై రిటర్నింగ్ అధికారుల సంతకాలు తీసుకోవాలని కోరారు. లెక్కింపు సిబ్బంది మంగళవారం ఉదయం ఆరు గంటలలోపే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమకు జారీ చేసిన పాస్‌లను వెంట తెచ్చుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా విజయవంతంగా విధులు నిర్వహించాలని వివరించారు. పోలింగ్ ఏజెంట్లతో మంచిగా ప్రవర్తించాలని, ఓట్ల లెక్కింపు కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నిర్వహించాలని తెలిపారు. పోలింగ్‌కు వినియోగించే అదనపు ఈవీఎం మిషన్లను ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు కేంద్రం నుండి కలెక్టర్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంకు తరలించాలని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన కొడంగల్ నియోజకవర్గ లెక్కింపు పరిశీలకుడు సదాశివ ప్రభు మాట్లాడుతూ, ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయని, ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పద్ధతి ప్రకారం లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించాలని సిబ్బందిని కోరారు. ఈవీఎంలలో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురైతే పరిశీలకుల అనుమతితో వీవీప్యాట్‌లో గల ఓట్లను లెక్కించాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు సిబ్బంది ఎవరు కూడా బయటకు వెళ్ళరాదని స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్, కొడంగల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు పరిశీలకులు కలిసి వ్యవసాయ మార్కెట్ గోదాములో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు అరుణకుమారి, మోతీలాల్, విశ్వనాథం, వేణుమాధవ్, ఎన్నికల ఓఎస్‌డీ సురేష్ పొద్దార్ పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు
*ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
వికారాబాద్, డిసెంబర్ 9: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో ఏర్పాటుచేసిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ అవినాశ్ మహంతి పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు మంగళవారం 220 మందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, 120 మంది పోలీసు కానిస్టేబుళ్ళు, 15 మంది హోంగార్డులతోపాటు సీఎస్‌ఎఫ్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందినజవాన్లు బందోబస్తును నిర్వహించనున్నారు.
గాజులరామారంలో భూ కబ్జాలు.. ప్రభుత్వ స్థలాలు మాయం
*పట్టించుకోని రెవెన్యూ అధికారులు

జీడిమెట్ల, డిసెంబర్ 9: గాజులరామారంలో భూ కబ్జాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే చిన్నపాటి గదులను నిర్మించి యథేచ్ఛగా అమాయక ప్రజలకు విక్రయిస్తూ బకాసురులు పబ్బం గడుపుకుంటున్నారు. ఖాళీగా ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు భూ కబ్జాదారులు కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, దేవెందర్‌నగర్ నుంచి కైసర్‌నగర్‌కు వెళ్లే రహదారిలో సర్వేనంబరు 342లోని ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే నిర్మాణాలను చేస్తున్నారు. ప్రధాన రోడ్డుకు ఉండడంతో భూ కబ్జాదారుల కన్ను ఈ స్థలంపై పడింది. సుమారు నెలరోజుల నుంచి రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో పడిపోయారు. కింది స్థాయి సిబ్బంది నుంచి తహశీల్దార్ వరకు ఎన్నికల విధుల్లో ఉడడంతో భూ బకాసురులకు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. 60 గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలను చేపట్టి అమాయక ప్రజలకు లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రతినిత్యం భూకబ్జాలు పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖాళీ స్థలాలు మరికొన్ని రోజులకు కనిపించకుండా పోవడం ఖాయమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలను ప్రజావసరాల నిమిత్తం కేటాయించి ఫెన్సింగ్‌ను వేస్తే కబ్జాలకు గురికాకుండా ఆగుతాయని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను వదిలేస్తే భూ బకాసురుల కబంద హస్తాల్లో మాయం కాకతప్పదు. రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఖాళీ స్థలాలను కాపాడి ప్రజావసరాలకు కేటాయించాలని, భూ కబ్జాదారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.