రంగారెడ్డి

పత్తి రైతుకు కలిసిరాని ఖరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 17: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అన్నదాతలకు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పవచ్చు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంటలు ఆశించిన స్థాయిలో ఉండటం.. దిగుబడి రాకపోవడం..వంటి పరిస్థితుల నేపథ్యంలో సాగుకోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 2018 ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న వంటి పంటలు సాగుచేసినప్పటికి వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో అన్నదాతలు ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాలేదని అంటున్నారు. పంటల సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా దిగుబడి సైతం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పంటల సాగుకోసం చేసిన వేల రూపాయల అప్పులను ఎలా తీర్చాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న పంటలను సాగుచేశారు. ఏ-గ్రేడ్ క్వింటాల్ పత్తికి రూ.5450, బి గ్రేడ్ క్వింటాల్ పత్తికి రూ.5150 చొప్పున కొనుగోలు చేసేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రం ముందుకు వచ్చింది. ప్రభుత్వమే క్వింటాల్ పత్తికి ఐదు వేల రూపాయలకు పైగా ఇస్తుంటే ప్రైవేట్ వ్యాపారులు మాత్రం క్వింటాల్ పత్తికి ఆరువేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తూ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంటలు ఆశించిన స్థాయిలో లేకపోవడం.. దిగుబడి సైతం తగ్గిపోయిన నేపథ్యంలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని రైతులు అంటున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి ప్రైవేట్ వ్యాపారస్తులు 68111 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే, సీసీఐ అధికారులు మాత్రం 4015.35 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసారు. ధర ఎక్కువగా ఉన్న ప్రైవేట్ వ్యాపారుల వైపే అన్నదాతలు మొగ్గు చూపిస్తున్నారు. షాద్‌నగర్ డివిజన్‌లో సీసీఐ అధికారులు తొమ్మిది జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు విక్రయించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర పెంచి సాగు ఖర్చులను దూరం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ధర పెరిగినా దిగుబడి లేదు
పత్తి పంటకు ధర పెరిగినప్పటికి దిగుబడి లేకపోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదని నందిగామ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ప్రైవేట్‌గా అప్పులు తెచ్చి నాలుగున్నర ఎకరాల్లో పత్తిపంటను సాగుచేస్తే ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర చేతికి రాలేదని వివరించారు. పంట సాగుకు మాత్రం ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయని, వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
కష్టం వృథాగా పోయింది
ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తే వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంటలు చేతికి రాక కష్టం వృథాగా పోయిందని మామిడిపల్లి గ్రామ రైతు బొద్ద అశోక్ అన్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో వచ్చి పంటలు పుష్కలంగా పండుతాయని ఎన్నో ఆశలు పెట్టకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సీజన్‌లో రెండున్నర ఎకరాల్లో పత్తిపంట సాగుచేస్తే గిట్టుబాటు రాలేదని, అప్పులపాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.